" గోత్రము" శాస్త్రము - Gothram History - గోత్రం నిర్వచనం, వివరణం

P Madhav Kumar

 గోత్రం' అనే పదం మన శాస్త్రాలలో మొదటిసారిగా సత్యకామ జాబాలి కథా సందర్భంగా కనిపిస్తుంది. ఈ కథ 'ఛాందోగ్యోపనిషత్‌' నాలుగో అధ్యాయంలో, నాలుగో ఖండంలో ఉంది. 

'సత్యకామో హ జాబాలో జబాలాం మాతరమామ స్త్రయాంచక్రే బ్రహ్మచర్యం భవతి వివత్సామి కింగోత్రో న్వహమస్మీతి..' అని ఉంది. తెలియవచ్చినంత వరకూ ఇదే తొలి గోత్రప్రసక్తి.


ఆ కథ:

సత్యకామ జాబాలి కథ:

గౌతమ మహాముని అప్పట్లో సప్తసింధు ప్రాంతంలోని శతద్రూ నది (ఇప్పటి సట్లెజ్‌ నది) తీరంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, బ్రహ్మవిద్యను ఉపదేశిస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆయన తన శిష్యులకు విద్యాబోధ చేస్తున్న సమయంలో ఎనిమిదేళ్ల కుర్రాడు వచ్చి, తనకు విద్యాదానం చేయవలసిందిగా కోరతాడు. అప్పటి సమాజనియమాల ప్రకారం ఉపనయనం అయిన వారికే విద్యాభ్యాస అర్హత ఉండేది. ఆ కుర్రాడికి యజ్ఞోపవీతం లేని కారణంగా ఉపనయనం కాలేదన్నది స్పష్టం. దీనికితోడు వేదాధ్యయనం చేయడానికి వచ్చేవాడు, చేతిలో సమిధలతో రావాలి. ఆ కుర్రాడు అదీ చేయలేదు. సంప్రదాయం తెలియని కుర్రాడిని తన శిష్యునిగా చేర్చుకునేముందు గౌతముడు ఆ బాలుణ్ణి 'నీ వంశం ఏమిటి? నీ గోత్రం ఏమిటి?' అని ప్రశ్నించాడు. ఆ బాలునికి అవీ తెలియదు. అయితే, వెళ్ళి తెలుసుకుని రమ్మని చెప్పాడు గౌతముడు. తండ్రి ఎవరో ఎరుగని ఆ కుర్రాడు తన తల్లిని ఆ ప్రశ్నలే అడుగుతాడు. తల్లి వెంటనే 'నేను చాలాకాలంపాటు చాలా ఇళ్లలో దాసిగా పనిచేశాను. ఆ ఇంటివారికీ, ఆ ఇంటికి వచ్చేవారికీ అన్నిరకాల సేవలు అందిస్తూ వారిని సంతృప్తి పరచేదాన్ని. ఆ సమయంలో పుట్టినవాడివి నువ్వు, నీ తండ్రి ఎవరో నాకే తెలియదు! నా పేరు జబాల. నీ పేరు సత్యకామ. కాబట్టి నువ్వు వెళ్లి నీ గురువుతో నీ పేరు సత్యకామ జాబాలి అని చెప్పు' అంటుంది. సత్యకామ జాబాలి వెళ్లి గౌతముడికి అదే చెప్తాడు. సత్యకాముడి నిజాయితీని హర్షిస్తూ, గౌతముడు అతడిని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఇదీ ఆ కథ. ఈ కథలోనే తొలిసారిగా గోత్రం ప్రసక్తి కనిపిస్తుంది. గోత్రం గురించిన అతి ప్రాచీనమైన మొట్టమొదటి ప్రస్తావన ఇదే!!


గోత్రం నిర్వచనం, వివరణం:

గోత్రం అనే పదం వేదాలకు వ్యాఖ్యానాలవంటివైన బ్రాహ్మణాలలో ఎక్కడా కానరాదు. అయితే, పాళీ భాషలోని కొన్ని శాసనాలలో మనకు 'గొట్ట' అనే మాట కనిపిస్తోంది. ఉదాహరణకు చెప్పాలంటే, 'భగవా గొతమో గొట్టెన కకుసంధో కశ్శపో గొట్టెన' అన్న ఒక శాసనం ఉంది. ఇందులో గౌతమ, కశ్యప గోత్రాల ప్రసక్తి కనిపిస్తోంది. భౌద్దవం సుస్థిరం అయిన కాలంనాటికే గోత్రం అనేది మన సమాజంలో స్థానం సంపాదించుకుంది. జైనులలోకూడా 'గోత్రం' గురించిన ప్రసక్తి ఉంది. తమతమ 'గోత్రకర్మ'లనుబట్టే తదుపరి జన్మలు ఉంటాయని వారు విశ్వసిస్తారని దాస్‌గుప్తా, తమ 'History of Indian Philosophy' Vol. 1, page 191లో వివరించారు. 

'మునిభేస్యాపత్యాది వంశే గోత్రాకారశ్చాష్ఠా' అని వాచస్పత్యకారుడు నిర్వచించాడు.

'సంతతిర్గోత్రా జననకులాన్యభిజనాన్వయౌ వంశోన్వవాయః సంతానః' అని నరసింహుడు తన 'నామలింగానుశాసనం'లో పేర్కొన్నాడు.

'అపత్యమ్‌ పౌత్ర ప్రభృతి గోత్రమ్‌' అన్నాడు పాణిని తన సూత్రాలలో (v.1.162). 

'స్మృతిసారవాళేధర్మశాస్త్రే యదపత్యంతు సంప్రాప్తం తద్గోత్ర మాభిధీయతే' అంటే, 'ఒక ఋషియొక్క మగసంతాన క్రమావళే గోత్రం' అని అర్థం. 

పైన పేర్కొన్న నిర్వచనాలు చూస్తే, 'గోత్రం' అంటే 'సంతానం' అన్న అర్థం స్పష్టమవుతోందని వ్యాఖ్యానకారుల అభిప్రాయం.


'గోత్రం' అంటే అనేక అర్థాలు ఉన్నాయని శ్రీ సూర్యాయాంధ్ర నిఘంటువు (పేజీ. 734) వివరిస్తోంది. 

వాటిలో:

1. వంశం, 

2. గుంపు, సమూహం, 

3. పేరు, 

4. గొడుగు, 

5. బాట అనేవి ఇక్కడ పేర్కొవచ్చు. 

వీటిలో ఏదైనా ఇక్కడి సందర్భానికి సరిపోతుంది. 



గోపూజ

'గోత్రం' అనే పదం 'గౌః' అనే సంస్కృతపదం నుంచి ఆవిర్భవించింది. 'గౌః' అంటే గోవులు, ఆవులు అని అర్థం. 

'గోత్ర' అనే సంస్కృత పదానికి: 1. భూమి, 2 గోవుల సమూహం అని రెండు అర్థాలు ఉన్నాయి. ఒక సంస్కృతపదం తెలుగు పదం అవుతున్నప్పుడు విభక్తి ప్రత్యయాలను చేర్చుతారు. ఆ విధంగా 'గోత్ర' పదం, 'గోత్రము' అవుతుంది. 


ఒకప్పుడు మనందరిదీ వ్యావసాయిక సమాజం. అప్పుడు సమాజంలో అందరికీ తమతమ గోవుల మందలు ఉండేవి. గోవులు అనే మాటను ఆవులు, ఎద్దులకు కలిపి వాడతారనేది తెలిసిందే. ఒకే మందలోని గోవులు గనుక కలసినట్లయితే, ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉన్న కారణంగా, వేర్వేరు మందలలోని గోవులను కలిపేవారు. దీనివల్ల జన్యుపరంగా కూడా ఆ జాతి వృద్ధి పొందేది. కనుక, ఏ గోవు ఏ మందలోదో తెలుసుకోవటం అవసరంగా ఉండేది. అందుకే, ఒక్కొక్క గోవుల మందకు, ఒక్కొక్క పేరుండేది. సాధారణంగా, ఆ మందకు నాయకత్వం వహించే వారి పేరుమీదుగా ఆ మందను వ్యవహరించటం పరిపాటి. అలా, ఏ గోవును చూసినా, అది ఏ మందకు చెందిందో తెలుసుకోవటం సులభంగా ఉండేది. ఆ పద్ధతిలోని ప్రయోజనాలను గుర్తించి, వాటిని క్రమంగా మనుషులకూ వర్తింపజేయటంతో, మనుషులు సైతం 'ఫలానా గుంపు'లోకి చెందినవారని గుర్తించటం ఆరంభమయింది. ఆ 'ఫలానా గుంపు' క్రమంగా 'గోత్రం' అయి ఉండవచ్చు. 


వేర్వేరు మందలకు చెందిన గోవులు కలిసిపోవటం వల్ల తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించడానికి, అవసరమైన సందర్భాలలో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దలు ఉండేవారు. వీరిని వారి వారి నైతిక, ఆధ్యాత్మిక విలువల ఆధారంగా 'పర్యవేక్షకులు'గా ఎంచుకునేవారు. ఒక మందకు లేదా 'గోత్రాని'కి ఇలా అధినాయకత్వం వహించేవారిని 'గోత్రపతులు' అనేవారని, ఇటువంటి వారిలో సుప్రసిద్ధులైన వారిలో భరద్వాజుడు, శాండిల్యుడు, కాశ్యపుడు వంటి వారు ఉండేవారనీ, వారే క్రమంగా 'ఋషులు'గా గౌరవం పొందారనీ స్వామి భాస్కరానంద తమ 'Essentials of Hinduism' అనే పుస్తకంలో వివరించారు. (Pub. Sri Ramakrishna Mutt, Mylapore, Chennai, 1998, p.22)


ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి, వారంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల వంటి వారే కాబట్టి, సరైన జన్యువులతో వంశం సరిగ్గా వృద్ధి చెందేందుకు 'సగోత్రీకుల'ను వివాహం చేసుకోరాదన్న నిబంధన సమాజంలో ఏర్పడింది. వివాహసంబంధాల కోసం మన గోత్రం కాని ఇతర గోత్రీకులకై అన్వేషించడం వెనుక ఇంత సశాస్త్రీయమైన కారణం ఉందన్నమాట!


జన్యుశాస్త్రం అనేది ఒకటి ఉంటుందనీ, దానివెనుక ఇంత కథ ఉంటుందనీ పశ్చిమ దేశాల శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే మన వాళ్లు గ్రహించిన శాస్త్రీయమైన అంశాలివి!!


పురుషోత్తమ్‌ పండిట్‌ తను రాసిన 'గోత్రప్రవర మంజరి'లో మొత్తం 3 కోట్ల గోత్రాలు ఉన్నాయని అంచనా వేశారు. ఒక్క శుక్ల యజుర్వేద మధ్యందిన మహారాష్ట్ర బ్రాహ్మణులలోనే 188 గోత్రాలు ఉన్నట్లు విశ్వనాథ్‌ త్య్రంబక్‌ సేఠ్‌ తమ 'గోత్రావళి' పుస్తకంలో పేర్కొన్నారు. (ప్రచురణ : యాజ్ఞవల్క్య ఆశ్రమం, పూనా). 


అసలు ఈ గోత్రాల గొడవ అంతా మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశాలకే పరిమితమై ఉండేదనీ, బ్రాహ్మణులను అనుసరించే ఇతర కులాలూ గోత్రాలను పట్టించుకోవడం ఆరంభమయిందనీ కొందరు అంటారు. భౌద్దవం సంబంధమైన సాహిత్యంలో ఒక క్షత్రియుడు తమ పురోహితుల గోత్రాన్ని స్వీకరించాలన్న సాక్ష్యాలు అనేకం కానవస్తాయని కరందికర్‌ తమ 'Hindu Exogamies' (page 229)లో పేర్కొన్నారు. అంటే, ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై, తర్వాత క్రమంగా ఇతరులు వారిని అనుసరించటంతో, ఇతర కులాలకూ గోత్రాలు వ్యాపించాయి. అందుకే, ఇప్పటికీ కొన్ని ఇతర కులాలవారిలోనూ బ్రాహ్మణ గోత్రాలు కానవస్తుంటాయి. 


'గోత్రం అంటే అభిజనం. ఏఏ మహాత్ములు నీ వంశంలో పుట్టారో ఆ వివరాలే - ఆ మహాత్ముల స్మరణే గోత్రం' అంటారు ద్విసహస్రావధాని, అవధాన సహస్రఫణి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మగారు ('పాలకోడేటి వంశవైభవం' పుస్తకం, ముందుమాటలో, ప్రచురణ: శ్రీ అనుపమ సాహితి, హైదరాబాద్‌- 500 055, 2011). 'గూఙ్‌' శబ్దే ధాతువు. గూయతే శబ్దతే- ఎక్కడ తన పూర్వుల కీర్తనం జరుగుతుందో అది గోత్రం' అంటారు శ్రీ మాడుగులవారు. అదే క్రమంలో వారు 'బ్రాహ్మణుల గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి. ఉదా. ఆత్రేయస-భారద్వాజస-కౌశికస- ఇట్లా. ఇతరుల గోత్రాలన్నీ ప్రాయశః ప్రకృతి గోత్రాలు. ఉదా. మద్దిపాల, చెట్లపాల, చెరకుపాల, కుంభాల - ఇట్లా. పురుషుడు (భగవంతుడు), - ప్రకృతీ రెండూ కలిస్తేనే పరమేశ్వరుడు పూర్ణుడు. ఎక్కువతక్కువలకిక్కడ తావు లేదు' అంటారు శ్రీ మాడుగులవారు, అదే ముందుమాటలో.       


బహుశా ఋషులపరంగానే పాణిని 8 గోత్రాలను మాత్రం పేర్కొంటే, బౌధాయనుడు 8 గోత్రాలూ అనేక పక్షాలుగా విభజితం అయ్యాయి అన్నాడు. అసలు ఒక వర్ణంలో గణాలు, పక్షాలు, గోత్రాలు ఉంటాయని ఇంకొందరు అంటారు.


ఋషులు- గోత్రపురుషులు:

బ్రాహ్మణులు తమ మూలాన్ని ఒక ఋషిపరంగా చెప్తారు. 

    'ఋషి' అన్న పదం 'ఋష్‌' అనే గత్యర్థకమైన ధాతువుకు ఔణాదికమైన 'ఇన్‌' అనే ప్రత్యయం చేరటంవల్ల 'ఋషి' శబ్దం పుట్టిందని చెప్పాలి.


'ఋషతి ప్రాప్నోతి సర్వాంగ మంత్రాంగ జ్ఞానేన పశ్యతి సాంగసారఙ్గ పారంగవ' అన్నది ఋషి శబ్దానికి నిర్వచనం. అంటే, పంచ జ్ఞానేంద్రియాలకు, సర్వవిధమైన ఆలోచనలకు సంబంధించిన విషయాలను తాము దర్శించి, లోకానికి నిష్కర్షగా, సూటిగా చెప్పేవారు ఋషులు అని అర్థం. ఆలోచన ముందుగా అంకురరూపంలోనూ, తర్వాత ఉద్భిజ్జరూపంలోనూ (బీజంనుండి మొలకెత్తినరూపంలోనూ, తర్వాత ఆరోహరూపంలోనూ, చివర్న పత్రపుష్పఫలరూపంలోనూ ఉంటుందని భావన. 


ఋషులు 4 విధాలుగా ఉంటారు:

1. శతర్చులు,

2. మాధ్యములు,

3. క్షుద్రసూక్తులు,

4. మహాసూక్తులు. 

ఈ వ్యత్యాసాలన్నీ వారు దర్శించిన వేద సూక్తాల సంఖ్యనుబట్టి వచ్చాయి.


ఋగ్వేదం ప్రథమ మండలంలో మనకు 16మంది శతర్చులు కనిపిస్తారు. అంటే, 100 లేదా అంతకన్నా అధిక సంఖ్యలో ఋక్కులను దర్శించిన వారన్నమాట. వీరిలో -

 1. మధుచ్ఛందుడు,

 2. మేధాతిథి,

 3. హిరణ్యసూక్తుడు,

 4. కణ్వుడు,

 5. శునశ్శేఫుడు,

 6. ప్రస్కణ్వుడు,

 7. నవ్యుడు,

 8. నోధ,

 9. పరాశరుడు,

10. గౌతముడు,

11. కుత్సుడు,

12. కశ్యపుడు, 

13. కక్షీవంతుడు,

14. పరుచ్ఛేపుడు

15. దీర్ఘతముడు,

16. అగస్త్యుడు. 

ఇక, మాధ్యములు : ఋగ్వేదంలోని ప్రథమ మండలం కాక, మధ్య మండలాలలోని సూక్తులు రచించిన లేదా దర్శించిన వారు 'మాధ్యములు'.

ఋషులలో మూడవ వారు క్షుద్రసూక్తులు. ఋగ్వేదంలో 10 కానీ, అంతకన్నా తక్కువకానీ ఋక్కులను రాసినవారిని క్షుద్రసూక్తులని అంటారు.

ఇక ఋషులలలో నాలుగో వర్గంవారు మహాసూక్తులు. ఋగ్వేదంలోని 10వ మండలంలో 10కన్నా ఎక్కువ ఋక్కులను రాసినవారిని మహాసూక్తులని అంటారు.

ఋషులను మరో విధంగా విభజించడమూ ఉంది. ఋషులను బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు అన్నవి ఈ విభజనలు.

వీరు కాకుండా కొందరు శ్రుతర్షులు, కందర్షులు కూడా ఉంటారు. శ్రుతర్షులు అనేవారు శ్రుతులను రాసిన వారు. సుశ్రుతులవంటివారు శ్రుతర్షులు. కందర్షులు అనేవారు కర్మకాండలను రూపొందించి, నిర్దేశించిన వారు. జైమిని వంటివారు ఈ కోవలోకి వస్తారు.     


గోత్రపురుషుడు:  

ఒక గోత్రానికి నాయకత్వం వహించే మహర్షిని 'గోత్రపురుషుడు' అంటారు. బ్రాహ్మణులకు చాలామంది గోత్రపురుషులే ఉన్నారు. ప్రాథమికంగా బ్రాహ్మణుల గోత్రాలు సప్తర్షులపరంగా వస్తాయి. ఈ సప్తర్షులు బ్రహ్మమానస పుత్రులని భావన.

వీరిలో:  

1. భృగువు,

2. ఆంగిరుడు,

3. వశిష్ఠుడు, 

4. అత్రి, 

5. మరీచి,

6. పులస్త్య, 

7. క్రతు

అనే వారు సప్తర్షులని ఒక వాదన. వీరందరి గురించీ అనేక పురాణకథలు ఉన్నాయి. వీరే స్వయంభువు (మొదటి) మన్వంతర కాలంనాటి సప్తర్షులు. అయితే, వీరిలో చివరి ముగ్గురి పేరిట గోత్రాలు ఏవీ ఇప్పుడు కానరావటం లేదు. అంటే, వీరినుంచి బ్రాహ్మణ వంశాలు ఏవీ ఉత్పత్తి కాలేదన్నమాట లేదా, ఒకప్పుడు ఉన్న ఆ వంశాలు ఏవీ ఇప్పుడు కానరావటం లేదన్నమాట. . 


మరొక అభిప్రాయం ప్రకారం, మూల గోత్ర పురుషులు నలుగురు మాత్రమే.

వారు: 

1. ఆంగిరుడు, 

2. కశ్యపుడు, 

3. వశిష్ఠుడు, 

4. భృగువు. 

వీరినుంచే మొత్తం 18 గోత్రశాఖలు ఉద్భవించినట్లు భావించేవారూ ఉన్నారు. అలాకాక, భృగువు నుంచి 5 గణాలు, ఆంగిరుని నుంచి 8 గణాలు, మిగిలిన ఐదుగురునుంచి తలా ఒక్కో గణమూ - ఇలా మొత్తం 18 గణాలు - రూపొందాయనే వారూ ఉన్నారు. 

ఒక ప్రధాన వాదం ప్రకారం - బ్రాహ్మణులందరూ సప్తర్షుల వారసులే.

ఆ ఏడుగురు సప్తర్షులు:

1. భృగు,

2. ఆంగిరస, 

3. కాశ్యప, 

4. అత్రి, 

5. వశిష్ఠ, 

6. అగస్త్య, 

7. విశ్వామిత్ర. 

ఈ సప్తర్షులకు అదనంగా కొందరు గౌతమ మహర్షినికూడా కలుపుతారు. 


ఇక్కడ గుర్తించాల్సిన అంశం మరొకటి ఉంది - 

ఒక గోత్రపురుషుని నుంచి అనేక గణాలు ఉద్భవించాయి. వాటినుంచి అనేక ఉపగణాలు ఉద్భవించాయి. ఈ ఉపగణాలకు సంబంధిత ప్రవరలూ ఉన్నాయి. ఈ వివరాలు రెండో అధ్యాయంలో ఉన్నాయి.

ప్రస్తుత వైవస్వత మన్వంతరంలోని సప్తర్షులు:

1. విశ్వామిత్ర,

2. జమదగ్ని,

3. భరద్వాజ,

4. గౌతమ,

5. అత్రి

6. వశిష్ఠ,

7. కశ్యప మహర్షులు.  

వీరికి అదనంగా -

 8. అగస్త్య, 

 9. భృగువు

10. ఆంగిరసుడు కూడా కలిసి, మనకు పదిమంది గోత్రపురుషులు కానవస్తున్నారు. 

కొందరి దృష్టిలో ప్రస్తుత వైవస్వత మన్వంతరంలో పది ప్రధాన గోత్రాలు ఉన్నాయి.

ఆ దశగోత్రాలు ఇవి:

✡ ఆత్రేయ, 

✡ భారద్వాజ, 

✡ గౌతమ. 

✡ జామదగ్న్య, 

✡ కాశ్యప, 

✡ కౌండిన్య, 

✡ కౌశిక, 

✡ వాశిష్ఠ, 

✡ వత్స, 

✡ విశ్వామిత్ర.

ఇవికాకుండా మరో ద్వాదశ (14) గోత్రాలు కూడా ఉన్నాయి:

 1. అగస్త్య, 

 2. ఆంగిరస, 

 3. గార్గి, 

 4. హరిత, 

 5. కణ్వ, 

 6. కుత్స, 

 7. మౌద్గల్య, 

 8. నైద్రువ కాశ్యప, 

 9. పరాశర, 

10. శాండిల్య, 

11. సంకృతి, 

12. శతమర్షణ,

13. శ్రీవత్స, 

14. వాధూలస.

వివిధ మన్వంతరాలలో సప్తర్షులు:


సప్తర్షుల గురించి మనకు జైమినీ బ్రాహ్మణం (2.218 - 2.221), బృహదారణ్యక ఉపనిషత్‌ (2.2.6), గోపథ బ్రాహ్మణం (1.2.8) పలు వివరాలను అందిస్తున్నాయి. వీటన్నిటిలోనూ జైమినీ బ్రాహ్మణం మొట్టమొదటిది, అతి పురాతనమైనది.

దీనిప్రకారం సప్తర్షులు:

1. వశిష్ఠుడు,

2. భరద్వాజ, 

3. జమదగ్ని, 

4. గౌతమ, 

5. అత్రి, 

6. విశ్వామిత్ర, 

7. అగస్త్య.

బృహదారణ్యకోపనిషత్‌ ప్రకారం: గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠుడు, కశ్యప, అత్రి. 


గోపథ బ్రాహ్మణం ప్రకారం: వశిష్ఠుడు, విశ్వామిత్ర, జమదగ్ని, గౌతమ, భరద్వాజ, గుంగు, కశ్యప.


ఇప్పుడు మనం ఉన్నది వైవస్వత మన్వంతరం. వివస్వతుడు అంటే సూర్యుడు. సూర్యుని కుమారుడు వివస్వతుడు. (అంటే యముడు అనికూడా అర్థం ఉంది.) ఇది ఏడో మన్వంతరం. ఇంతక్రితం ఆరు మన్వంతరాలు గడిచిపోయాయి. ఒక్కో మన్వంతరంలోనూ సప్తర్షులు, వారి కుమారులూ మారుతుంటారు. 


గడిచిన ఆరు మన్వంతరాలతోబాటుగా, ఇప్పటి మన్వంతరం వరకూ ఎవరెవరు సప్తర్షులుగా ఉన్నారో- విష్ణు పురాణం ప్రకారం- తెలుసుకోవటం ఆసక్తిదాయకంగా ఉంటుంది.


🖝 మొదటి మన్వంతరం: స్వయంభువ మన్వంతరం:

1. మరీచి,

2. అత్రి,

3. ఆంగీరస,

4. పులహ,

5. క్రతు,

6. పౌలస్త్య,

7. వశిష్ఠ.

🖝 రెండవ మన్వంతరం: స్వరోచిష మన్వంతరం:

1. ఉర్జ,

2. స్థంభ,

3. ప్రాణ,

4. దత్తోలి,

5. ఋషభ,

6. నిశ్చర,

7. ఆర్వరివత్‌.

🖝 మూడవ మన్వంతరం: ఉత్తమ మన్వంతరం:

1. కౌకుందుహి, 

2. కురుండి,

3. దాలయ,

4. శాంక్య,

5. ప్రవహిత,

6. మిత,

7. సమ్మిత. 

🖝 నాలుగో మన్వంతరం: తమస మన్వంతరం:

1. జ్యోతిర్ధామ,

2. ప్రితు,

3. కావ్య,

4. చైత్ర,

5. అగ్ని,

6. వనక,

7. పివర. 

🖝 ఐదో మన్వంతరం: రైవత మన్వంతరం:

1. హిరణ్యారోమ,

2. వేదశ్రీ,

3. ఊర్ధ్వబాహు,

4. వేదబాహు,

5. సుధామ,

6. పర్జన్య,

7. మహాముని.

🖝 ఆరో మన్వంతరం: చక్షుస మన్వంతరం:

1. సుమేధస్‌,

2. విరాజస్‌,

3. హవిష్మత్‌,

4. ఉత్తమ,

5. మధు,

6. అభినామ,

7. సహిష్ణు.

🖝 ఏడో మన్వంతరం (ప్రస్తుతకాలం): వైవస్వత మన్వంతరం:

1. కాశ్యప,

2. అత్రి,

3. ఆంగిరస, (లేదా విశ్వామిత్ర)

4. వశిష్ఠ,

5. గౌతమ,

6. జమదగ్ని,

7. భరద్వాజ.

మరో పద్ధతి ప్రకారం:

1. అత్రి, 

2. భృగు, 

3. కుత్స, 

4. వశిష్ఠ, 

5. గౌతమ,  

6. కశ్యప, 

7. ఆంగిరస.

సప్తర్షుల గురించి మరిన్ని వివరాలు:

బృహదారకారణ్యం (2.2.4)లోనూ, ఋగ్వేదం (1.24.10; 10. 82.2)లోనూ సప్తర్షుల గురించి అనేకమైన వివరాలు ఉన్నాయి. 


వీరిని ఉత్తరార్థ నక్షత్రమండలంలోని 'సప్తర్షి మండలం'గా పేర్కొనటమూ ఉంది. ఈ నక్షత్రాలను ఖగోళ శాస్త్రపరంగా 'ఉర్సా మేజర్‌' (Ursae Major Constellation) నక్షత్రమండలంలో ఉన్నట్లుగా చెప్తారు. విశ్వామిత్రుడు 'ఆల్ఫా ఉర్సా మేజర్‌' నక్షత్రం కాగా, జమదగ్ని 'బీటా', భరద్వాజ 'గామా', గౌతముడు 'డెల్టా', అత్రి 'ఎప్సిలాన్‌', వశిష్ఠ 'జీటా', కాశ్యప 'ఏటా' నక్షత్రాలుగా ఖగోళ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. కొందరి దృష్టిలో ఈ 'సప్తర్షి నక్షత్ర మండలం' అటు స్వర్గానికి, ఇటు భూగోళానికీ మధ్య సరిహద్దు. సప్తర్షి మండలంలోని అత్రి నక్షత్రం పక్కనే ఉన్నది అనసూయ. ఈమె ఒక్కతెకు మాత్రమే నక్షత్రమండలంలో తన భర్త పక్కన స్థానం లభిస్తోంది. మిగిలిన ఆరుగురు ఋషుల భార్యలూ 'ప్లైడస్‌' నక్షత్ర మండలం (Pliedes Constallation)లో ఉన్నారు. 


సప్తఋషి మండలం వెనుక ఒక ఆరు నక్షత్రాల సమాహం ఉంటుంది. అదే 'ప్లైడస్‌' నక్షత్రమండలం (Pliedes Constallation). దీన్నే మనం 'కృత్తికలు' అంటాము. కృత్తికలు ఆరు. ఈ ఆరు కృత్తికా నక్షత్రాలూ పెంచిన కారణంగానే కుమారస్వామికి 'కార్తికేయుడు' అన్న పేరు వచ్చింది. ఈ ఆరింటిలో ఒకటి కృత్తికా నక్షత్రం. ఇందులోని మరొకటి అరుంధతి అని, సప్తర్షి నక్షత్రమండలానికి ఇది కొంత వెనుక ఉన్నప్పటికీ, మనకు వశిష్ఠ, అరుంధతీ నక్షత్రాలు కలిసి ఉన్నట్లు కనిపిస్తాయనీ కొందరు అంటారు. 


    (ఇక్కడ మన రాశి చక్రం గురించిన చిన్న వివరణ అవసరం. మనకు అశ్వని, భరణి, కృత్తిక.. వగైరా 27 నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటీ నాలుగేసి పాదాలుగా విభజితం అయ్యాయి. అంటే, (27 x 4= 108) 27 నక్షత్రాలకూ కలిసి 108 పాదాలు. వీటిని 12 రాశులలోకి విభజిస్త్తే, (27 x 4 x 108/12= 9) ఒక్కొక్క రాశికి 9 పాదాలు ఉంటాయి. అశ్వని, భరణి నక్షత్రాలకు రెండేసి చొప్పున 8, అదనంగా కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదం, అంటే మొత్తం 9 పాదాలు మేష రాశిలోకి వస్తాయి. కృత్తికలోని మిగిలిన మూడు పాదాలు, రోహిణిలోని 4 పాదాలు, మృగశిరలోని రెండు పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. ఇలాగే, మిగిలినవీ...) 


సప్తర్షుల స్థానాలు:

ఒక తెల్లని పూల పోగు చుట్టూ వీరు కూర్చున్నట్లు చిత్రాలు ఉన్నాయి. వీటిలో- పైన ఉత్తర దిక్కున జమదగ్ని మహర్షి స్థానం కానవస్తోంది. ఆయన చేతిలో అక్షమాల ఉంటుంది. ఆయన పక్కన కుడిచేతివైపు గౌతమమహర్షి స్థానం ఉంటుంది. ఆయనకు కౌపీనం (గోచీ) మాత్రమే ఉంటుంది. చేతివేళ్లకు పొడవైన గోళ్లు, తలమీద చేతులు ఉంటాయి. 

తర్వాత స్థానం వశిష్ఠులవారిది. వారి ఒక చేతిలో కమండలం. మరో చేతిలోనూ అక్షమాల ఉండగా, మరొక చేయి ఆయన ఎడమ కాలిమీద ఉంటుంది. 

ఒంటిమీద తులసి పూసలు (విత్తనాలు) ఉన్నాయి. తలమీద శిఖ, కింద కూర్చోవటానికి చాప ఉన్నాయి. కుడివైపు తర్వాతి స్థానం అత్రి మహామునిది. ఆయన చేతికి గోముఖం ఆకారంలో తొడుగు, దానికింద అక్షమాల ఉంది. 

తర్వాత మనకు కానవచ్చేది భరద్వాజ ముని. ఆయన తలకిందులుగా శీర్షాసనం వేస్తూ కానవస్తున్నారు. 

తర్వాత స్థానం కశ్యప మునిది. ఆయన చేతిలో కొబ్బరిచిప్ప, దానిలో విభూతి. ఒంటిమీద పులిచర్మం. 

తర్వాత స్థానం విశ్వామిత్రుడిది. ఆయన కృష్ణాజినం (జింకతోలు)మీద కూర్చుని, వేదాలు చదువుతున్నారు. ఏదో వ్రతం ఆచరిస్తున్న దానికి సూచనగా నోటికి గుడ్డ కట్టుకుని మౌనం పాటిస్తున్నారు.

సప్తఋషులకు వేదదర్శనం అయిందని చెప్పే సాక్ష్యాలు మనకు బౌద్ధమత గ్రంథమైన 'వినయ పిటక' (సంపాదకులు: హెర్మన్‌ ఓల్డెన్‌బెర్గ్‌, సంపుటి 1, పే. 245)లో ఉంది. 'అత్థకో వామకో వామదేవో వెసమిత్తో యమతగ్గి, అంగీరసో భరద్వాజో వసిత్తో కశ్శపో భగు' అన్నది వినయ పిటక ఉవాచ.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat