🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
మాలధరించి దీక్షపూని శబరి యాత్ర చేయదలచిన ప్రతియొక భక్తునికును ఇరుముడి కట్టునింపు వేళ 51 దినముల వ్రతమును , 102 పూటల స్నానమును
ముగిసి యుండవలయునన్నదే అనుచానంగా వస్తున్న కేరళీయుల ఆచారము.
మనము కూడ కేరళలో యుండు స్వామి అయ్యప్ప దర్శనార్ధమే మాలధరించి యున్నాము గనుక ఈ ఆచారమును తప్పని సరిగా ఆచరించుట ఉత్తమము.
*“ఐంబత్తి ఒన్ను నోన్ఫిరున్ను - నూట్రిరెండు కుళియం కయిచ్చు - భగవాన్డే పళ్ళిక్కెట్టుం తాంగి”*
యని ప్రారంభమగు మలయాళ భాషలో యుండు *'వేలన్ పాట్టు'* పై ఆనవాయితిని
ఆధారముగా గొనియే వ్రాయబడినదని యందురు. ఆ తత్త్వమును అనుసరించు
రీతిగనే నేటికిని శబరిమల యాత్ర చేయదలచిన వారు (మలయాళ వృశ్చికము) కార్తెగై
1 వ దినము మాలధరించి , మార్గశిరము (ధనుర్మాసము) 23 తారీఖులలో ఇరుముడి కట్టుకొని వనయాత్ర గావించి , తై 1 న (మకర సంక్రాంతి దినమున) శ్రీస్వామివారిని
జ్యోతిగా దర్శించి మరలే అలవాటు ఆచరణలో యున్నది. కాలక్రమేణ 60 దినములు వ్రతముండలేక దానిని మండల కాలముగా (41) తగ్గించుకొని యాత్రగావించు చున్నారు. ఇది ఒక విధంగా అంగీకరింప దగ్గవిషయమే. కానీ మరి కొందరేమో మేము మండలకాలము వ్రతముండలేము , అర్ధ మండలమో , కాల్ మండలమో కావాలంటే యుంటామనియూ , ఇంకొక వర్గీయులు మేము తిరిగి వచ్చి
వ్రతముంటామనియూ , ఈ యాత్రలోని పరమార్ధతత్వమెరుంగక యాత్రపేరిట ధనవ్యయం , కాలవృథా చేస్తుంటారు. మండల కాలమునకు తక్కువగా వ్రతమాచ
రించు ఇట్టివారికి ఆ యాత్ర వలన ఎట్టి ఫలితము కలుగక పోవడమే గాక ,
దైవాపచారము చేసినామేమో అనెడి భీతి గూడ ఆ సంవత్సరమంతయు వేదిస్తూనే యుండును. కావున ఎట్టి వారైనను శబరిగిరి పైనున్న ఆ పావన పది నెట్టాంబడిని
అధిరోహించే వేళ 41 దినముల వ్రతము పూర్తియై యుండవలయునన్నది విధి. తొలిసారి మాల ధరించిన కన్నిస్వామి యైనను , ముప్పైసంవత్సరములకు పైగా యాత్ర చేసిన పెరియగురుస్వామియైనను ఈ విధిని తప్పక ఆచరించి తీరవలసినదే.
*"ఎరుమేలి పేట్ట తుళ్ళల్"* తర్వాతి వనయాత్ర , *'పాప , పుణ్యాలనే ఇరుముడిగా దాల్చి మోస్తున్న జీవుడికి లౌకిక బంధాలను దాటడానికి చేస్తున్న ఈ యాత్రలో తొలి మజిలీ ఎరుమేలి సింహద్వార"* ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ వ్యాఖ్యానానికి
స్వంతంశైలి నుంచి కాస్త
పక్కకు మరలాల్పొస్తోంది. వేదాంతం నాకు కరతలామలకంకాదు. అందులోని విషయాలకు నేను అద్దం పట్టగల తాహతు కలిగిన వాడనూకాను. కానీ నా బుద్ధికి తోచిన వివరణను ఇవ్వాలన్నదే నా ప్రయత్నం. ప్రతిజీవి పాప , పుణ్యాలను రెండు ముళ్ళుగా పాపం వెనుక వైపు , పుణ్యం ముందువైపు ధరించి యాత్ర చేస్తున్నాడు. ఎవరి పాప , పుణ్యాలను వారే భరించాలి. కానీ వేరే ఎవ్వరూ అది మోయడానికి వీలులేదు. పాప , పుణ్యాలనేవి ఆత్మ దేహ రూపంలో చేస్తున్న కర్మల ఫలమే. సత్ కర్మలతో పుణ్యఫలం ,
దుష్కర్మలతో పాపఫలంకొని తెచ్చుకుంటున్నారు. ఇవి వద్దన్నా వదలవు. వీటిని
వదిలించుకొంటేనే కాని మనిషి (జీవి) మోక్షానికి అర్హుడు కాడు. ఒక శరీరం నుంచి ఆత్మ బయల్వెడలినా శరీర రూపంలోంచి సంక్రమించిన కర్మల ఫలం పాప ,
పుణ్యాలరూపంలో ఆత్మను అంటి పెట్టుకునే వుంటాయి. వీటిని వదిలించుకునే
ప్రయత్నంలోనే ఆత్మ మోక్షం వైపుకు వెళ్ళలేక తిరిగి ఇంకొక శరీరాన్ని ఆవహిస్తుంది.
అనగా ఆత్మ ఇంకొక శరీర నిర్మాణ రూపంతో తిరిగి పాప , పుణ్యాలను
పెంపొందించుకుంటుంది. కాబట్టి *"పునరపి జననం , పునరపి మరణం పునరపి జననీ జరీ శయనం"* అన్నారు పూజ్య శంకరాచార్య. మరి మోక్షం సిద్ధించేదెలా ? పాపకర్మలు చేయక పుణ్యకర్మల ద్వారా వచ్చే ఫలాన్ని భగవదర్పితం చేసి నిర్వికార , నిరామయ జీవితం గడపాలి. సర్వప్రాణుల యందు సమదృష్టి , సహకరణ భావం కలిగి వుండాలి. అహంవదలి , స్వార్థం మరచి ఇతరులకు చేతనైన సేవ చేయాలి. సర్వం పరబ్రహ్మ
మయంగా భావించి నిర్గుణోపాసన చేయాలి.
చైతన్యవంతులై జ్ఞానమును పొంది పరబ్రహ్మను చేరుకోవాలి. అంతవరకు పాప ,
పుణ్యాలను శిరస్సున మోయక తప్పదు. ఇందుకు చక్కటి ఉదాహరణ శ్రీ
కృష్ణావతరంలోని చివరి అంకం నేనే పరబ్రహ్మను. నా సంకల్పంతోనే సమస్తమూ నడుస్తోంది అన్న శ్రీకృష్ణుడు సైతం మునుపటి *“రామావతార సమయంలో చెట్టు
చాటునుంచి వాలిని సంహరించిన కర్మఫలం పరిహారానికి తిరిగి కృష్ణావతారంలో
పొదచాటున పడుకుని యుండగా వాలి యొక్క అంశంగల బోయవాడి చేతి అంబుతో తన్నుతాను బలిచేసుకున్నాడు. అంటే భగవంతుడైనాసరే శరీరరూపంతో
నుండగా చేసిన కర్మల యొక్క ఫలం అనుభవించక తప్పదు. అది పరిహారం
చేయబడ్డప్పుడే ఆ జీవికి మోక్షం. అంతవరకు ఆ కర్మల ఫలం ఆత్మను వెన్నంటే వస్తుంది. వాటిని అలాగే శిరసా మోయక తప్పదు. వనయాత్రను ఆరభించేది ఎరుమేలినుంచే. అలనాడు ఎరుమేలి నుండి జనవాసం వుండేదికాదు. కానీ ఇప్పుడిప్పుడే కాళైకట్టి వరకూ జనవాసం చూడవచ్చు. ఎరుమేలి వరకూ జనవాసంతో పాటు సకల లౌకిక సుఖాలు , వినోదాలు , నాగరికత ప్రయాణ సౌకర్యాలు , ఇలాంటివి అన్నీ చూడవచ్చు. అంటే లౌకిక జీవితం నుంచి మోక్షార్థియై ప్రయాణం సాగిస్తున్న వారికి తొలి మజిలీ ఎరుమేలియే.
ఇందులో సందేహం లేదు. అందుకే ఎరుమేలిలో మొట్టమొదటగా *'అహం'* వదలి
హోదామరచి చేయి చేయి కలిపి గంతులు వేస్తారు. తద్వారా మోక్షార్థియై సాగించే యాత్రలో ప్రారంభ ఘట్టం పూర్తి చేస్తున్నారు. చేసిన తప్పులకు పశ్చాత్తాపం ప్రకటించి గురుస్వామి ఆజ్ఞతో వనయాత్ర ఆరంభిస్తున్నారు. వనయాత్ర అంటే సాధారణ వనయాత్ర కాదు. దుర్ఘమమైన క్లెశాలతో నిండిన వనయాత్ర. ఎత్తైన కొండ శిఖరాలు , లోతైన లోయలు , కాళ్ళను సూదులతో గుచ్చుతున్న భావన కలుగచేసే గులకరాళ్ళు , పాకుడు రాళ్ళు జారుడు మట్టి , ముళ్ళు , భీకరమైన వన్యమృగాలు. గాఢాంధకారం , హఠాత్తుగా కురిసే కుంభవృష్టి. వీటన్నింటా మధ్య అన్యభావన లేకుండా *"స్వామియే అయ్యపో అయ్యప్పో స్వామియే"* అన్న నినాదం ఒక్కటే మారుమ్రోగుతుంటుంది.
ఈ వనయాత్ర జీవిత యాత్రతో పోల్చితే జీవితంలో ఎంతో ఎత్తైన స్థానానికి మనము
చేరుకోవాల్సి వుంటుంది.
అందుకు ఎంత ఓర్పు , సహనం , పట్టుదల , శ్రమను లెక్కచేయక ముందుకు సాగే లక్షస్ఫూర్తి , వన్యమృగాలవంటివి పోలిన ఆపదలనుంచి కూడ బయటపడి
ముందుకు సాగే ధైర్యం ఇవన్నీ వుండాలి. జారుడు మట్టి , పాకుడు రాళ్ళు ఇవ్వన్నీ మనిషిని
వున్నతినుంచి అధోలోకం వైపుకులాగే విషయ వాంచలు. వీటన్నింటా మధ్య శిరస్సుపై
పాప , పుణ్యాల ఇరుముడి మోస్తూ. ఎత్తైన కొండ ఎక్కుతున్నాము. కాళ్ళులాగు తున్నాయి. చెమటలు ధారాపాతంగా కారుతుంటాయి. దాహం , నిస్త్రాణ. అలుపు కానీ
విచిత్రం మనమే మనదగ్గరున్న బట్టతో పైకి ఎక్కి వస్తున్న వారికి గాలి వీస్తున్నట్లు విసురుతుంటాం. మనదగ్గర ఒకగ్లాసు నీళ్ళున్నాయి వాటర్ జగ్గులో మనకే చాలదు. కానీ అందులోంచి ఇద్దరి ముగ్గురికి గుక్కెడు గుక్కెడుగా పంచుతాము. అలసటతో కూర్చున్న మనకు ఆకలితో నీరసంగా వుంటుంది. ఇరుముడిలోని వెనుక ముడిలో నింపేవి ఆహార పదార్థాలు. అవి బైటికి తీసి అందరికి పంచిన తర్వాత మనం తింటాము. మనకే నడక బరువు. కానీ ఎవరైనా నడవలేక వస్తూవుంటే అతని భుజమును పట్టుకొని చేతి ఆసరాతో నడిపిస్తాము. కాలుజార్తు వుంటుంది హెచ్చరికగా దిగాలి. మధ్యన పక్కనున్న ఆస్వామిని హెచ్చరిస్తాము. *"స్వామి మెల్లగా దిగాలి. జాగ్రత్త"* అంటూ చివరికి మనం నడవలేక పోయినా నడవలేని వారిని చూసినా చెప్తాము. "స్వామి శరణం అంటు నడువ్ స్వామీ. స్వామి కొండెక్కిస్తాడు అంటూ ఈ దుర్గమమైన సమయంలో కూడా స్వామి నామస్మరణకే తప్ప లౌకికమైన ఏ విషయాలు ఏ ఒక్కరి
మనస్సులోనూ వుండవు. కాదన్నవారు నాతో వాధించవచ్చు. ఇలా ఈ వనయాత్రను సాగించాలి. *"పతి ప్రాణం కోసమై వెన్నంటి వస్తున్న సావిత్రితో యముడంటాడు"* సావిత్రీ నీవు ఈదారి వెంట నడవలేవు. ఎత్తైన కొండలున్నాయి. లోతైన లోయలున్నాయి. కాళ్ళుకోసుకు పోయే కూసు రాళ్ళున్నాయి. నరాలు , చల్లటి నదుల నీళ్ళున్నాయి. పచ్చివెదుళ్లతో నిండి ఒంటిని గాయపర్చే ముళ్ళున్నాయి.
ఇవన్నీ కాక , పులులు , సింహాలు , ఏనుగులు , ఎలుగుబంటున్నాయి. ఇవన్నీ దాటితే
వైతరిణి వుంది దాన్ని దాటలేవు కనుక వెనుకకు మరలు" అని. పైన చెప్పినవన్నీ
వున్నాయి. శబరిమల వనయాత్రలో. అవన్నీ దాటడానికి సావిత్రికి తోడ్పడింది ఏకాగ్రత.
మనకు కావలస్సింది ఏకాగ్రతే. లక్ష్యం (మోక్షం) చేరాలనే ఏకాగ్రత. ఈ
వనయాత్రను సాగించి పంపా (భూలోక వైతరిణి) నదిని చేరే సరికి వెనుక ముడి (ఆహార పదార్థాలతో నిండినది) ఖాళీ అవుతుంది. ఎలా ఖాళీ అవుతుంది.
ఆహారపదార్థం కనుక పంచగా ఖాళీ అయ్యింది. పారమార్థిక దృష్టితో చూసినప్పుడు,
*'అవంతమైన ఓర్పు , శ్రమ , సహకరణ భావం , త్యాగం , ఏకాగ్రత , లక్ష్యస్ఫూర్తి, మానసిక
నిగ్రహం , లాంటి సత్ కర్మల ద్వారా ఖాళీ అయ్యింది. అనగా భూలోక వైతరణి అయిన
పంబను చేరేటప్పటికి పాప భారం తొలగి (ఖాళీ అయి) పుణ్యఫలం మాత్రం
(ముందుముడి) మిగిలింది. ఈ పుణ్యపలం భగవదర్పితం.
అందుకే ఈ ముందు ముడిలో భగవత్ సేవకై వుద్దేశించన పూజా ద్రవ్యాలు మాత్రమే వున్నాయి. పంపానదిలో స్నానం చేసి , తిరిగి నీలమల ఎక్కి సన్నిధానం
చేరుకుని సంపాదించుకొచ్చిన పుణ్యఫలాన్ని భగవదర్పితం చేస్తే కలిగేది మోక్షం. వైతరిణీ పాపులకు దాటరానిది అంటారు. పాపులకు చీము , నెత్తరుతో నిండినదిగా కన్పిస్తుంది అంటారు. పాప ప్రక్షాళనంతో పునీతులైన వారికే వైతరిణీ దాటడానికి అర్హత. పంబలో స్నానం చేసి , అనగా పాప ప్రక్షాళనగావించుకుని పునీతులై ఆవలి గట్టుకు వెళ్ళాలి. పంబానీరు చాలా శుద్ధమైనది. ఔషధీయుక్తమైనది. దూరం నడచి వచ్చిన వారికి సేద తీర్చి పాలించేది. కాని నవీన భక్తులు కొందరు అంటుండగా విన్నాను. *"అబ్బే పంబ పూర్తిగా అశుద్ధంగా వుందిగదండి"* అది మొదట చెప్పినట్లు దృష్టి దోషమే. మనం చేస్తున్నాము అశుద్ధం. కానీ పంపా ఎప్పుడూ శుద్ధమైందే. ఇలా ఎలా చూసినా మొదట చెప్పినట్లు *“పాప , పుణ్యాలను ఇరుముడిగా దాల్చి యాత్ర సాగిస్తున్న జీవుడికి లక్ష్యం చేరడానికి సాగించే యాత్రలో ఎరుమేలి తొలి మజిలి"*. ఆ తర్వాతనే వనయాత్ర ,
*ఇక వనయాత్రలో ఎదురయ్యేస్థలాలో మొదట వచ్చేది “పేరూర్ తోడు" అన్న చిన్నకాలువ.*
ఇక్కడే స్వామి అయ్యప్ప వనయాత్రలో తన సహచరులతో కలిసి ఫలహారం చేశాడంటారు. అప్పుడు జలచరాలకు తగు ఆహారాలొసంగి ముందుకుసాగే అదే
ఆనవాయితీగా ఇప్పుడు భక్తులు *పేరూర్ తోడు* నందలి చేపలకు బొరుగులు వేస్తుంటారు.
ఆ తర్వాతది కాళైకట్టి , కాళైకట్టి అంటే ఎద్దును కట్టిన స్థలమిది' అని పేరు. పరమశివుడు
మహిషీవధం చేస్తున్న కుమారుని పరాక్రమం చూడడానికై స్వయంగా ఇక్కడికి వచ్చి తన వాహనమైన ఎద్దును ఇక్కడి మర్రి చెట్టుకు కట్టాడని. అదే కాళి కట్టి ఆశ్రమం'గా మారిందని పురాతన కాలం నుంచి వస్తున్న విశ్వాసం. వనయాత్రీకులు చాలా మంది ఇక్కడ మజిలీ చేసి వంటలు వండి , స్వామి పాటలు పాడి రాత్రి అంతా కోలాహలంగా
గడపుతుంటారు. తర్వాత మొదలవుతుంది. అన్నిటికన్నా కఠినమైనది , ఎత్తైనది ఆయిన
కరిమల పర్వతం. భీకరమైన ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం రెట్టింపు కష్టం.
పూర్తిగా జారుడునేల. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా అపాయమే. సరియైన వ్రత విధానం
గానీ , పద్ధతి గానీ ఏకాగ్రత గానీ లక్ష్యస్ఫూర్తి
గానీ లేని వారికి కరిమల భీకర స్వప్నమే.
ఈ కరిమలలోని మట్టి నల్లమట్టి. ఎనుగులు విస్తారంగా తిరుగుతుంటాయి.
ఏనుగులు ఘీంకారాలు మనము ఉదయం పూట వినవచ్చు కూడ. అందుకే ఈ కొండను 'కరి' మల అన్నారు. ఇంతటి కఠినమైన, ఎత్తైన కొండ మీద ఆశ్చర్యంగా ఒక
బావి. ఒక చిన్న నీటిగుంట వున్నాయి. ఇందులోని నీళ్ళు ఏ కాలంలోనూ ఎండిపోవు. అయ్యప్ప తనయాత్రలో తనవెంట వచ్చిన వారి దాహనివృత్తికై తన చేతి పిడిబాకును నేలమీద గుచ్చగా ఈ భావి ఏర్పడిందని అందుకే ఈ బావికింత మహాత్మ్యమని చెప్తారు. ఇది కూడా ఒక ప్రధాన విశ్రమ స్థలమే. తర్వాత మజిలి *'చెరి ఆనవట్టం', 'పెరియాన వట్టమ్'* ఇందులో పెరియానవట్టమ్ ఒక చిన్న గ్రామరూపంలోనే వుంటుంది. వేలాదిమంది అయ్యప్ప భక్తులు ఇక్కడే చిన్న పూరిగుడిసెలు నిర్మించుకుని ,
పంబానదిలో పంబావిందు , పంబాదీపోత్సవం జరుపుకుని తర్వాత నీలిమల ఎక్కడానికి ప్రయత్నిస్తారు. మనుష్య సంచారం లేనప్పుడు ఎనుగులు జలకాలాడేది ఇక్కడే తర్వాత వచ్చేదే లోక ప్రసిద్ధమైన పంబానదీ తీరంలోని గణపతి , శ్రీరామ , పార్వతి , సుబ్రమణ్య స్వామి , హనుమాన్ ఆలయాలతో కూడిన స్థలం. అత్యంత కోలాహలంగా ,
సయనా నందంగా కనిపించే భూతల స్వర్గం. పంబకు ఆవలివైపునున్నది నీలిములు ఇవతల గట్టు నున్నది పురాణ ప్రసిద్ధి పొందిన *'ఋష్యమూకాచలం'* శ్రీరాముడు శబరిని
చూచి పంబదాటి తిన్నగా ఇక్కడే అడుగు పెట్టాడు. హనుమంతుడు , సుగ్రీవుడు , జాంబవంతుడు తది తరాదులు వాలికి వెరచి ఈ పర్వతంలోనే కాలం గడుపు తుండినారు. వారికి రాముడు తటస్థపడింది ఇక్కడే. ఆశుస్రుగానే శ్రీరామ ,
హనుమంతుల ఆలయాలున్నాయి ఇక్కడ. అయ్యప్ప భక్తులంతా స్నానంచేసి
మకరజ్యోతికి ముందు రోజున పంబావిందు చేసేది ఇక్కడే. దీపోత్సవాలతో శబరి గిరీశునికి విందుయని ముఖ్య భక్షాదులతో నైవేద్యం సమర్పించేది ఇక్కడే.
పితృదేవతలకు తర్పణలు వదిలేది ఇక్కడే. కల్లారు - కర్కటారు - పంబ యను మూడు నదుల సంగమించేది ఇక్కడే. ఐహిక , ఆముష్మికులకు మధ్య సన్నటి తెరగా నిలిచే స్థలమే పంబానదీ తీరం. వాల్మీకి
రామాయణంలోని పంపాసరోవరతీరం బహురమ్యము, అని
స్థుతించ బడ్డ తీరమిదే. ఇక్కడితో మన వనయాత్ర పూర్తి అవుతోంది. సత్యమెరిగి , జీవాత్మ పరమాత్మల సంగమంకై ఉవ్విళ్ళూరుతూ చేరే సన్నిధానం దివ్య సన్నిధానం. శబరిగిరీశుని పదమంజీరాలతో పులకించిన ప్రకృతి , శరణం శరణం అని పాడే సన్నిధి..
అదే మన పెన్నిది.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు🙏
🙏స్వామి శరణం అయ్యప్ప 🙏