⚜️ పేరూర్ తోడు ⚜️
కోట్టపడి ఆస్థానము దాటి కొంచెము నడచినచో పేరూర్ తోడు చేరవచ్చును. ఎరుమేలి నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరమున ఈ స్థలము గలదు. ఇప్పుడు ఈ ప్రదేశము వన ప్రదేశముగా కనబడుట లేదు. సమీపకాలము వరకు కూడ ఇచ్చట అడవి ఏనుగులను పట్టి , మచ్చిక చేసుకొనే ఒక మెరుక్కల్ కేంద్రము గాని లేదు. మంచి పునాదులతో కట్టబడిన పలు భవనములు జనవాసమునకు అనువుగా కనబడుచున్నవి. పేరూర్ తోడు అనునది ఒక చిన్న కాలువయగును సాక్షాత్ హరిహర సుతుడైన మణికంఠ స్వామివారు దుష్ట సంహారము కొరకై వనయాత్ర వచ్చిన
సమయాన ఈ కాలువలోని మత్స్యమునకు బొరుగులు చల్లి మత్స్యావతారి యగు శ్రీ మన్నారాయణుని కొలిచినారనియు ఆ చర్యను అనుసరించియే తదుపరి వచ్చిన యాత్రీక భక్తమిత్రులు ఈ కాలువ యందుండు మత్స్యములకు బొరుగులు విసిరే అలవాటును ఏర్పరచుకొని యున్నారనియు తెలియుచున్నది. నేడు ఈ కాలువలో పారేనీరో , మత్స్యములో లేకపోయినను ఈ పేరూర్తోడును దాటే భక్తులు అళుద వరకు నడిచినను దట్టమైన అడవియని చెప్పలేని రీత్యా వనములో మరమ్మత్తులు చేయబడి , జీపురోడ్డు వేయబడి సర్కారువారి కూపులు , ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులు , గిరిజనుల నివాస స్థలముగాను , వాహనాదుల సంచారములతోను ,
దారి పొడగునా దుకాణములతోను నిండి కళ కళలాడుతూ కనబడుచున్నది.
శబరిగిరి కేరళ రాష్ట్రములో మహదారణ్యము మధ్యన ఉన్నది. కనుక అచ్చటి పలుస్థలములను ఆంధ్ర భక్తులు సులువుగా గ్రహించుకొనుట కొరకు ఆయా స్థలముల యందు పిలువబడు లేక వాడబడు నామములను , మాసముల పేర్లను మార్చక ఆ పేర్లనే సూచించుచూ వ్రాయుచున్నాము. కావున భక్తాగ్రేసరులు ఆ స్థలముల యొక్క పేర్ల ఉత్పత్యర్ధములు ఏమిటీ అని బాధపడక , కాలము వృథా చేయక , చెప్పబడిన ఆ వెళ్ళవలసిన మార్గమును గ్రహించి శబరియాత్ర చేసి , హరిహర సుతుని దర్శించి యాత్రా ఫలము పొందగలరు. ఊరిని , అడవిని విభజించి చూపించు ఒక సరిహద్దుగానే పేరూర్ తోడును లెక్కింపవలెను. ఈ స్థలము నుండియే మన అసలైన శబరిగిరి యాత్ర ప్రారంభమగు చున్నది. దారికి ఇరువైపులా గంభీరముగా పెరిగి నిలబడియున్న వృక్షసముదాయము తోనూ , ఆ వృక్షాలను అల్లుకొని పెరిగిన పచ్చని తీగలతోనూ ప్రకృతి
సహజ సిద్ధమైన , ప్రశాంత సుందరమైన ఆ వనశోభ అత్యంత రమణీయము. అచ్చట పేరూర్ తోడు అను కాలువ ప్రవహించుచున్నది. అయ్యప్ప భక్తాదులు దానిని పుణ్యతీర్థముగా భావించి అందులో స్నానము చేసి అచ్చటచ్చట కనబడు బండరాళ్ళపై బొరుగులు చల్లి భక్తితో నమస్కరింతురు. యాత్ర చేయు భక్తులు ఇరువైపులా వరుసగా
నిలబడియున్న బిచ్చగాళ్లకు తమ శక్తికొలది దాన ధర్మములు చేసి యాత్రగావించెదరు. కన్నిస్వాములైన అయ్యప్ప భక్తులు ఈ పేరూర్ తోడు నందు స్నానము చేసి బొరుగులుచల్లి నమస్కరించ వలయునని , పూర్వకాలము నందునూ ఇప్పటికినీ నిబంధన కలదు. అయ్యప్పస్వామి వనవాసియై నడచిన కాలమందు తనయొక్క అనుచరులతో గూడి ఈ పేరూర్ తోడు నందు తీర్ధమాడి దీని పరిసరప్రాంతముల యందు విశ్రాంతి పొందినాడనియూ అలా ఆ దివ్యమూర్తి యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ అచ్చట వెల్లివిరియు చుండుననియూ , దీనివలనే పేరూర్ తోడునకు ఇంతటి మహత్యము కలదనియూ అనేక మంది గురుస్వాములు చెప్పెదరు. అనంతరము స్వామి భక్తులు అచ్చటి నుండి ముక్తకంఠముతో *“స్వామి శరణం.... శరణం అయ్యప్ప" అని వనయాత్రా శరణాలను గట్టిగా పలుకుచూ , గంతులు వేయుచూ “కాళైకట్టి" అను స్థలమునకు చేరుదురు.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏