🔱 శబరిమల వనయాత్ర - 21 ⚜️ పంబానదీ తీరము ⚜️

P Madhav Kumar


⚜️ పంబానదీ తీరము ⚜️


ఆహా ! ఎంతటి ఆనందము ? పలువిధ వికారములచే విక్షేపములచే పరిభ్రమించెడి చిత్తము ఆనందము యొక్క శిఖరము చేరినట్లనిపించెను. అందరు అయ్యప్ప భక్తులూ ధనుర్మాసము (మలయాళ మాసము) ఇరవై తొమ్మిదవ తేదీన సంధ్యవేళకు ముందుగానే పంబానదీ తీరము చేరుకొందురు. ఈ పుణ్యస్థల , జల మహత్యమును వర్ణించుట అంత సులభము గాదు. ఎరిమేలి వీడినచో ఇటువంటి ఆనంద ప్రదమైన , సుఖప్రదమైన స్థలము శబరిగిరి యాత్ర యందు మరెచ్చటా కనిపించదు. అనేకమంది అయ్యప్ప భక్తులు

ముందు ముందుగానే పంబానదీ తీరమును చేరి తావళమేర్పర్చుకొని పరమాత్ముని సేవించుకొనుచూ సుఖముగా నుందురు. శబరిగిరి యాత్ర ప్రారంభించు సమయము మొదలు పంబచేరువరకూ కలిగిన కాయక్లేశము సర్వము పంబ చేరిన వెంటనే మాయమగును. మార్గమున కిరుప్రక్కలా అందమైన పద్ధతిలో అమర్చబడి వరుసగా యున్న దుకాణములు చూచుటకు ఎంతో ముచ్చటగా ఉండును. ఆ దుకాణముల

వైభవమును ఎంత చూచిననూ తనవి తీరదు. అచ్చట దొరకని వస్తువు లేదు. కాకపోతే ధరల విషయము ముందే మనవి చేశాను కదా ! పలు దేశములు నుండి వచ్చియున్న వ్యాపారస్తులు పెట్టిన పలు విధములైన వ్యాపారములు అచ్చట గూడియున్న భక్తాదులకు మాత్రమే గాక అక్కడిచేరు ఎవరికైననూ ఆ స్థలము ఎవరో ఒక సృష్టికర్తచే నిర్మించబడిన ఒక అందమైన భూతల స్వర్గమేమో అని అనిపించక మానదు. ఈ స్థలము నుండి ఒక

మైలు విస్తీర్ణము వరకూ లెక్కలేనంత మంది అయ్యప్ప భక్తులు తావళములు ఏర్పర్చుకొని నివసించుదురు. పంబానది యొక్క ఎడమ భాగము పురాణ ప్రసిద్ధమైన ఋష్యమూక పర్వత ప్రాంతము. ఈ పర్వతముపైననే వాలి తమ్ముడైన సుగ్రీవుడు , వాలికి భయపడి ఆ పర్వతముపైకి వాలి వచ్చినచో మరణించగలడన్న శాపము ఉండుటచే నిర్భయముగా నివసించెనని మన రామాయణ గ్రంథము చెప్పుచున్నది. ఈ ఎడమ భాగమునందు సాధారణముగా ఎవరూ తావళములను ఏర్పరచుకొనరు.




అయ్యప్ప భక్తులు సమిష్టిగా వెదురులు , కొమ్మలు , వెదురు ఆకులు మొదలగునవి సేకరించుకొని అత్యుత్సాహభరితులై సౌకర్యముగా నివసించుటకు వీలుగా సపారీలు నిర్మించు దృశ్యము చూడవలసినదియూ , నేర్చుకొనవలసినదియూ అగును. వారి వారి స్వగ్రామములో సుష్ఠుగా భోజనములు చేసి పాటలు పాడుచూ , వృథా కబుర్లుతో కాలము గడుపుచూ , శృంగార వేషధారులై తిరుగు యువకులు ఇచ్చట కొడవళ్ళు ,

మచ్చుకత్తులు మొదలగునవి తీసుకొని అడవులలోనికి దూరి భయరహితులై కట్టెలు మొదలగునవి సేకరించుకొని వచ్చి ఆహారములు తయారుచేసి నియమనిష్ఠలతో ఆచరించు విధానము మనము నిజముగా నేర్చుకొనవలసిన విషయములు. ఆ యువక మిత్రులు (తమ స్వదేశము చేరికొనియూ) ఇలాగే ఉత్సాహవంతులై సంస్కార సంపన్నులై , నిర్మల హృదయులై , స్నేహభావముతో గూడి కార్యశూరులై ప్రపర్తించినచో మనము , మనయొక్క దేశము , ముఖ్యముగా ఇటువంటి తీర్థయాత్రా స్థలములు కూడా

అభివృద్ధి చెందుననుటలో సంశయము లేదు. ఎందుకనగా శారీరక మాలిన్యమునేగాక , మనోమాలిన్యమును గూడా తొలగించగల పవిత్రమైన తీర్థము పంబానది అనియూ అందరికీ నమ్మకము కలుగును. ఇట్టి విషయమును జీవితాంతము ఎవరూ విస్మరించరు. మరుసటి దినము మధ్యాహ్నము వరకూ అచ్చట జరుగు కార్యక్రమ దృశ్యము మిక్కిలి

ఆశ్చర్యము గొలుపుచుండును. స్నానము , పితృకర్మలు , సద్య (సలిది), దీపాల ఆవలి

మొదలగు కార్యక్రమముల యందు భక్తులు నిమగ్నులై అటూ , ఇటూ తిరుగుచుందురు. చూచినచో జీవితమున అటువంటి దృశ్యమే చూడవలయును.


తెల్లవారే సరికి బెడ్ కాఫీ ఒకసారి త్రాగి , బీడియో , సిగరెట్టో ఒకటి పీల్చి మరల దుప్పటిలో దూరి ఎనిమిది లేక పదిగంటల వరకూ కుంభకర్ణుని భజించు కొందరు యువకులు నిద్ర అన్నది లేక ఉరుములు ఉరుముచున్నట్లు గొంతెత్తి *"స్వామియే శరణమయ్యప్పా"* అని పలుకుచూ సూర్యోదయమునకు ముందుగానే మంచును , చలిని లెక్కింపక మంచినీరు వలె చల్లగా పారుచున్న ఆ పుణ్యనదిలో దిగి స్నానము చేసి మరలు చుండుట చూచిన మనకు దుప్పటితో శరీరము నిండా కప్పుకొని చలి వేయకుండా సిగరెట్టు పొగ వెచ్చగా పీల్చుతూ , బద్దకస్తుడిగా యుండిన వాని బద్దకము వాని దుప్పటి కూడా తమకు తామే భయపడి పారిపోయినవేమో అని అనిపించక మానదు.


ఇది ఆ దివ్య చైతన్య శక్తి యొక్క ప్రభావముగాక మరేమై యుండును. అత్యంత రుచి కరములైన పదార్ధములను తయారుచేసి బల్లలపై అనువుగా అతి శుభ్రముగా అమర్చిననూ తృప్తి చెందక , అమర్చిన వారిపై ఏదియో విసుక్కొనుచూ పదార్ధములు అవి బాగా లేవనియూ , ఇవి బాగా లేవనియూ వంకలు పెట్టుచూ తినెడి వారలను ఆ కారాటవిలో ఆ సఫారులయందు రాళ్ళమీద కూర్చుని ఉడికీ - ఉడకని , రుచి ఉండి - లేని ఆ పదార్ధములు తినుచుండగా ఓ స్వాములారా ! ఒకసారి ఈ రుచికర పదార్ధము లను వర్ణించుడు అని అడిగినచో స్వామి శరణం - అయ్యప్ప శరణం - వనవాస సుఖం శరణం అయ్యప్ప అనేటువంటి సమాధానములు తప్ప వారి వద్దనుండి వేరేమీ దొరకవు.


ఇటువంటి ఒక్కొక్క కార్యమును విడివిడిగా తీసికొని ఆలోచించినచో ఈ యాత్రలు మానవులకు సదాచారమును పెంచుటకు , సంయమనము ఏర్పర్చుటకు , శరీరము మనము చెప్పినట్లు వినవలయును అందుకై ఈ కట్టుబాట్లు పెట్టుకొనవలెను అని తెలియజేయుటకై ఏర్పడినవి కాక మరొకటికాదని నిశ్చయముగా చెప్పవచ్చును. “దయ , ధర్మము , సత్యం , నీతి మొదలగునవి ఆచరించి చూపి బోధించుటకు యాత్ర ఒక్కటియే మంచి సాధనము". మహానుభావుడైన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చెప్పినటువంటి ఈ సూత్రాన్ని అక్షరాల ఆచరించి చూపేది శబరిగిరి యాత్ర కాక మరి ఒకటి అగునా ?


🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయప్ప 🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat