⚜️ సన్నిధానము చేరినచో ఆచరించవలసినది ⚜️
మన దేహమునే నారికేళముగా యెంచి , అహంభావమనే నారను భక్తియనే బండరాయిపై అరగతీసి , నారికేళములోని నీరును మోహజలములా తీసివేసి , అందులో భక్తి , శ్రద్ధా , విశ్వాస , ఆచార , అనుష్ఠానములనే జ్ఞానఘృతమును (నెయ్యిని) నింపి , వైరాగ్యమనే కార్కుతో మూతపెట్టి , ఆత్మయనే లక్కతో ముద్రవేసి , మోసుకొచ్చి సన్నిధానములో పరమాత్మకు అభిషేకము చేసి పునీతులగుటయే ఇందులోని పరమార్ధం. వారి వారి భక్తిని కొలిచే కొలమానముగాగూడ దీనిని కల్పించుకొందురు.
ఆజ్యము గట్టిగా యున్నచో వ్రతము చక్కగా నిర్వహించారనియు , పల్చబడిపోయుంటే , లేక చెడిపోయి వుంటే వ్రతభంగము కలిగియున్నట్లుగాను , తదుపరి సంవత్సరము మరింత శ్రద్ధగా వ్రతానుష్ఠానము పాటించమనియు ఆదేశించేవారు అలనాటి గురుస్వాములు. దీనివలన భగవద్భక్తి పెరిగే అవకాశం కలదన్నది అలనాటి సద్గురువుల అభిప్రాయము. సదుద్దేశ్యముతో ఏర్పరచబడిన ఈ ఆచారము , తదుపరి వచ్చినవారు తమ శిష్యులను బెదిరించ డానికి దొరికిన ఆయుధముగా మార్చడమన్నది శోచనీయం. ఈ చర్య మూలాన గురు శిష్యుల మధ్య అభిప్రాయ బేధములను కల్గించుటయేగాక , పరస్పర గౌరవ మర్యాదలకు గూడ కీడు వాటిల్లుచున్నదంటే మిన్నగాదు. అలాగాక సన్నిధానమునకు తెచ్చిన అందరి నారికేళములలోని ఆజ్యమును పరిశీలించి వారి వారికి తగిన ఫలితములను యొసంగెడివాడు శబరినాధుడు వున్నాడు. మనమా !
ఇతరుల భక్తిని కొలిచేవారము ! అను తలంపుతో అన్ని ఇరుముడులలోని నెయ్యి టెంకాయలను తీసి కుప్పగా వేసి , ఒక్కొక్కటిగా పగలగొట్టి పనికిరాని కాయను వేరుగా తీసిపెట్టి , మిగిలిన ఆజ్యమును అభిషేకమునకు పంపినచో అక్కరలేని మనస్పర్ధలు రావు. ఎవరి భక్తి ఎవరికంటే ఎక్కువయనే పనికిరాని చర్చయు చెలరేగదు. ఏ కారణము చేతనో పల్చబడిన ఆజ్యము తెచ్చిన స్వామి మిగిలిన వారిముందు దోషిగా తలవంచు కొనవలసిన ప్రమాదము కలుగదు. అంతేగాక గురుశిష్యుల అన్యోన్యత మరింత గట్టిపడుతుంది. యాత్ర ఆనంద మయమౌతుంది.
గురుస్వాములు పై విషయములను పరిశీలించ మనవి. నారికేళములో పోసే నెయ్యి పల్చబడి పోవుటకు పలు కారణములుండవచ్చును. మొదట ఆ కాలములాగ స్వచ్ఛమైన ఆవునెయ్యి దొరకడం అరుదుగా యున్నది. నారికేళము సరిగ్గా శుభ్రపరచక పోయినను ఆజ్యము చెడిపోయే
అవకాశము గలదు. కావున సర్వేశ్వరునిపై భారమువేసి అన్ని నెయ్యిటెంకాయలను ఒకటిగ కలిపి పగులగొట్టుట ఉత్తమం.
*తదుపరి పగులగొట్టి నెయ్యి తీసిన నారికేళపు చెక్కలను గణపతి హోమ గుండములో వేయించవలెను. ఆత్మపరమాత్మపై అభిషేకమైనది. ఆత్మవీడిన కళేబరమును దహన సంస్కార మొనర్చేలా దేహమనే నారికేళమును అగ్నికి ఆహుతి చేయవలెను. కొందరు హోమగుండము నుండి సగము కాలిన కొబ్బరి చిప్పలను తెచ్చుకొంటారు. ఇలా చేయరాదు.హోమగుండములో వేసినవి అగ్నికి ఆహుతి కావలసినదే తప్ప ఎవరూ దానికడ్డు తగలరాదు. కొబ్బరి చిప్పలతో పాటు పేలాలను గూడా హోమగుండములో వేయుదురు. ఈ చిప్పను ఎవరిదివారు తీసుకెళ్ళి. హోమగుండములో వేయుట ఉత్తమం. తదుపరి ఇరుముడిలోపడిన కానుకలను ముడుపుగా చేసి శ్రీ అయ్యప్పస్వామి వారి హుండీలో సమర్పించవలెను. ఇలా భక్తులచే వేయబడు కానుకలు అయ్యప్పస్వామి వారి మూలనిధిలో చేరుతుంది. కొందరు ఈ కానుకల నుండి నెయ్యాభిషేకం టికెట్లకని , ప్రసాదము కొనుటకని వాడుతుంటారు. ఇలా చేయరాదు.
ఇరుముడి కట్టునింపేవేళ భక్తులచే సమర్పించబడు కానుకలన్నిటిని ఇతర ఏ ఖర్చుకు వినియోగించక ఆ మొత్తమంతయు శ్రీ స్వామి వారి హుండీ యందే సమర్పించి ,కానుకలు సమర్పించుకొన్న వారి కోర్కెలను తీర్చమని గూడ స్వామివారితో ప్రార్థించుటకొనుటయే ఉత్తమ భక్తుల లక్షణమగును.
ఇరుముడులు విప్పి వేరుపరచగానే విభూతి , పసుపు , కుంకుమలను వేరు వేరు పాత్రలలో వేరు వేరుగా పోసి యుంచుకొన వలెను. విభూతి పళ్ళెములో ఇరుముడిలోని కర్పూరమును వెలిగించి , ఆ కాంతిలో ఇరుముడులను విప్పట పరిపాటి. పన్నీరు సీసాలను తెరచి విభూతి పళ్ళెము చుట్టూ కర్పూరము ఆరిపోని రీత్యా పోయవలెను. ఇంకను కర్పూరము మిగిలియుండినచో వాటిని సన్నిధానమున ధ్వజస్థంబమునకు
కుడి ప్రక్కన యుండు కర్పూర ఆళలో వేయవలెను. అలాగే అగరబత్తులను గూడ ఇరుముడులు విప్పే కార్యక్రమము ముగిసేవరకు వెలిగించి , మిగిలిన వాటిని కర్పూర ఆళిలో వేయవలెను. కొందరు ఈ కర్పూరమును విభూతి పళ్ళెములో అమితజ్వాలగ వెలిగిస్తూ అగరుబత్తులను కట్టలు కట్టలుగా వెలిగించుచూ , పన్నీరును కూడియున్న
భక్తుల మీద వెదజల్లుతూ శబరిమలచుట్టూ ఎరిమేలి డాన్స్ చేస్తూ తిరుగుతుంటారు. ఇది చేజేతులారా ఆపదను కొని తెచ్చుకొనే చర్యయగును. అలనాటి శబరిమల యాత్రీకుల సంఖ్య తక్కువగా యుండేది. వన్యమృగముల సంచారముగూడా సహజముగా
యుండేదట. రాత్రిపూట చలి విపరీతముగా యుంటుంది. అందులకు తోడుగా చీకటి ఈగలు , అందుచే కర్పూర జ్వాలలను వెలిగిస్తూ , అగరు బత్తి ధూపములను వేయుచూ పరిసర ప్రాంతమంతయూ తిరిగేవారట. కానీ నేటి శబరిమల యాత్ర అలాంటిది కాదు. మండల , మకర విళక్కు ఉత్సవాల సమయములో ఊహించలేనంత భక్తజన ప్రవాహము శబరిమలపై చేరుతున్నారంటే మిన్నకాదు. భక్తులకు మలమూత్ర విసర్జనానికి గూడా బహుదూరము వెడలవలసి యున్నది. శబరిమల చుట్టూ ఎచట చూచినను జనావళియే నిండియున్నందు వలన వన్యమృగములు బెదిరి కంటికి కనపడని దూరానికి వెడలిపోవుచున్నది. ఇంతటి రద్దీ నిండినవేళలోగూడా మనవాళ్ళు అలనాటి ఆచారాన్ని వదలక పాటిస్తున్నామంటూ కర్పూర జ్వాలలను మరింత చేసుకొని , గెంతులు వేస్తూ గిరిప్రదక్షిణము చేయుచున్నారు. శబరిమలలో మంచినీటి సరఫరా తక్కువ. అట్టి
స్థలములో ఎవరి అజాగ్రత్త వల్లనైనా సరే నిప్పు అంటుకొంటే దాన్ని ఆపు జేయుట అసాధ్యమై పోవుటయేగాక పలువేల జనులు బాధితులౌతారన్న సంగతిని ప్రతివారు గుర్తుంచుకొని నిప్పుని రగిలించక , అలా రగిలించవలసి వచ్చినచో పనిముగిసిన పిదప పరిపూర్ణముగా దాన్ని ఆర్పివేయుట అను అలవాటును గైకొనవలెను. అలా ఇతరు లెవరైనా ఆర్పక వెళ్ళియుండినను , మనవంతు కర్తవ్యముగా యెంచి బాధ్యతతో వాటిని
ఆర్పుట అందరికి శ్రేయస్కరము.
ఇరుముడిలో పవిత్రముగా తెచ్చిన పన్నీరు , తేనె వీటి ఉపయోగము ముగిసిన పిమ్మట ఆ సీసాలను ఎక్కడ పడితే అక్కడ విసిరివేయుచున్నారు. ఇదియు ఖండించతగిన చర్యయగును. శబరిమలపై గుమిగూడియున్న వారందరు పాదరక్షలు ధరించి శబరి యాత్ర జేయుట ఆచారము కాదు. గనుక ప్రతివారు నగ్నపాదములతోనే
తిరుగులాడు చుంటారు. వీరిలో పసిపిల్లలు , వయసు మళ్ళిన వృద్ధులు , మాళికాపురాలు అందరూ వుంటారు. మనము విసిరిపారవేసే సీసా ముక్కలు నగ్నపాదములతో జరిగే
యాత్రికుల కాళ్ళకు గుచ్చుకొనే ప్రమాదం ఎంతగానో కలదు. కనుక ఈ సీసాలను తగిన స్థలములో , ఎవ్వరికి ఇబ్బంది కలిగించని స్థలములో పారవేయవలెను. అలా పొరబాటుగా ఇంకెవరైనను రహదారిలో పారేసి వెడలిన గాజు ముక్కలను గూడా
మానవతాదృష్ట్యా తీసి అవతల వేయుట ఉత్తమ భక్తుల లక్షణమగును. ప్రస్తుత వైజ్ఞానిక కాలంలో గాజు బాటిల్స్ గాక ప్లాస్టిక్ బాటిల్స్ ధారాళముగా లభిస్తున్నది. పన్నీరు , తేనె సీసాలకు బదులు ప్లాస్టిక్ ను ఉపయోగించిన యెడల పై చెప్పిన ఆపద రావడానికి అవకాశమే లేదు. తరువాత బెల్లము , ఖర్జూరము , ద్రాక్ష , జీడిపప్పు , ఏలకులు , తేనె , పేలాలు వీటిని యొకటిగజేసి పంచామృతాభిషేకమునకు పంపవలెను. రద్దీనిండిన మండల మకర విళక్కు తిరునాళ్ళ సమయములందు నెయ్యభిషేకమునకు ప్రాధాన్యత అయినను దానికొరకై యున్న టికెట్టు తీసి సన్నిధానమునకు వెడలినచో వాటిని అభిషేకము చేయకపోయినా నైవేద్యమైనా చేసి ఇచ్చెదరు. వాటిని ప్రసాదముగా బృందములోని వారందరు సమపాలుగా పంచు కొందురు. తదుపరి పసుపు , కుంకుడు , విభూది , చందనము , పన్నీరు , మిరియాలు , జాకెట్టు గుడ్డలు , నల్లగాజులు వీటిని విడి విడిగా విడదీసి పళ్ళాలలో వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువును చేత తీసుకొని బయలుదేరవలెను. మిగిలిన స్వాములంతా శరణాలు పలుకుతూ బృందముగా వార్లను వెంబడించవలెను. అప్పుడు ప్రతి స్వామివద్ద ఒక్కో కొబ్బరికాయను ఇచ్చి మాళికాపురం
సన్నిధిలో దొర్లించి రమ్మంటారు గురుస్వామి. ఇందులో ఒక పరమార్ధ తత్వముగూడా గలదు. మన ఇరుముడిలో నెయ్యిటెంకాయతో సహా ఆరు కొబ్బరికాయలు వేసి నింపాలి.
దేశవ్యాప్తంగా మాలధరించి ఇరుముడి మోసుకొచ్చేవారు ఎరిమేలి నుండి వనయాత్రగా కానివ్వండి , లేక వాహనాలలో చాలక్కాయం వరకు వచ్చేవారైనను పంపా తీరములో
ఇరుముడులును దింపి , పంబాస్నానము చేసి , పవిత్ర పంబాజలముతో ఇరుముడులపై
ప్రోక్షించి పునీతముగావించి , పిదప ఇరుముడులకు హారతి ఇచ్చి శరణాలు పలుకుతూ ఇరుముడులను విప్పి , పంబా సద్దికి కావలసిన ముడిపదార్థములను అందుండి తీసెదరు. పిదప ప్రతి ఇరుముడి నుండి మూడు కొబ్బరికాయలను తీసిపెట్టు కొందురు.
ఇరుముడులను యధాప్రకారముకట్టి ఒకదానిపై యొకటిగా పెట్టి వాటినే సాక్షాత్ స్వామి అయ్యప్పగా తలచి వండిన పదార్థములను ఇరుముడుల ముందు ఉంచి నైవేద్యము చేసి , భజనలు చేసి , సద్దిభుజించి , భుక్తాయాసం తీర్చుకొని , సన్నిధానమునకు బయలుదేరు వేళ గురుస్వామిగారు ప్రతివారికి మూడేసి కొబ్బరికాయలను ఇస్తారు. మొదటిది పంబా గణపతికి , రెండవది శబరిపీఠమునకు , మూడవది పదినెట్టాం పడిమెట్లకు , సన్నిధానం చేరిన పిమ్మట నెయ్యి టెంకాయ పగల కొడుతారు. ఇంకొకటి మాలిగైపురత్తమ్మ సన్నిధిలో దొర్లించుటకు , మిగిలిన ఆరవకాయ తిరుగు ప్రయాణంలో
పదినెట్టాంపడికని ఆరు కొబ్బరికాయలను ఇరుముడిలో పెడతారు. ఎరిమేలి నుండి బయలుదేరు వారికి మార్గములో అనేక ఘట్టము లందు కొబ్బరి కాయలు కొట్టే అవకాశం కల్గుతుంది. అప్పుడు అక్కడనే అమ్మబడు నారికేళములను తీసుకొని కొట్టవచ్చును. పసుపు , కుంకుమాదులతో బృందముగా బయలుదేరువారు శరణాలు పలుకుతూ వావరుస్వామి సన్నిధి చేరి అచ్చట మిరియాలు , కానుకలు సమర్పించి , కర్పూరము వెలిగించి అచ్చటివారు ప్రసాదముగా యొసంగే విభూతి ధరించి , నవగ్రహముల
ప్రదక్షిణముచేసి , కర్పూరము వెలిగించి నమస్కరించి , స్వామి సన్నిధానమునకు ఉత్తరమెట్ల ద్వారా వెళ్ళుదురు. దారిలో తమ పళ్ళెములో యుండు పసుపును భక్తులందరిమీద వెదజల్లుదురు. అలాగే పన్నీరును గూడ భక్తులమీద వెదజల్లుతూ వెళ్ళుదురు. ఈ సాంప్రదాయము వెనుక సూక్ష్మార్ధము దాగియున్నది. పసుపు ఏంటిసెప్టిక్ పౌడర్ అనునది వైజ్ఞానికులంగీకరించిన విషయం. రాళ్ళు ముళ్ళను లెక్కింపక వనయాత్ర జేసి వచ్చియున్న భక్తులకు చిన్న చిన్న గాయాలు తగలడం సహజం. అట్టివారి గాయాలు సెప్టిక్ కాకుండ పనిచేయగలదు ఈ పసుపుపొడి. అలాగే పన్నీరు ఉష్ణాన్ని తగ్గిస్తుంది. వైద్య సదుపాయం లేని అలనాటి యాత్రికుల దీర్ఘాలోచన నిండిన ఈ చర్య నేటికిని ఆదరణ యోగ్యంగా యుండుట ప్రశంసనీయం.
ఇలాగే బృందముగా శరణాలు పలుకుతూ సన్నిధానముచేరి అచ్చట విబూది , చందన , అభిషేకాదుల కొరకైయున్న టికెట్టుకొని , అభిషేకములు చేయించి (రద్దీనిండిన
సమయమైనచో ముమ్మారు వాటిని ప్రదక్షిణము చేయించి) మాళికైపురత్తమ్మ సన్నిధికి
వెళ్ళవలెను. అచ్చట తాము కొనిపోయిన పసుపు , కుంకుమములను వెదజల్లుతూ
కొచ్చుకొడుత్తస్వామిని దర్శించి , మాళికాపురత్తమ్మ సన్నిధానములో తాము తెచ్చిన జాకెట్టు గుడ్డలు , నల్లగాజులు వీటిని అమ్మవారికి సమర్పించుట కొరకైయున్న టికెట్లుకొని సన్నిధిలో ఇవ్వవలెను. వాటిని త్రిశూలాకారములో యుండే అమ్మవారిపై తొడిగి మరల మనకు ఇచ్చెదరు. పిదప మాళికాపురత్తమ్మ సన్నిధిచుట్టు కొబ్బరికాయలను దొర్లించి వదలి పెట్టిరావలయును. దీని వెనుక ఒక పరమార్థ తత్త్వము దాగియుందని పెద్దలందురు.
ఇంకే దేవాలయములోను లేని విధంగా శబరిమల యాత్రీకులు మాత్రము
నారికేళమునకు నారతీసి నున్నగ అరగదీసి ఇరుముడిలో పెట్టుకొని శబరిమలకు తెచ్చుకొంటుంటారు. నారికేళములో ముక్కంటి దేవుడైన పరమేశ్వరస్వామి సాక్షాత్కారము గలదు. నారతీయగానే త్రినేత్రములు స్పష్టముగా కనిపించును. మిగిలిన అన్ని సన్నిధిలలోను ఆ కొబ్బరికాయలను (పదినెట్టాం పడితో సహా) శూరటెంకాయగా పగులగొట్టినను సాక్షాత్ ఆదిపరాశక్తి యొక్క ఆవాస స్థలమగు మాళిగైపురత్తమ్మ సన్నిధిలో శక్తితో శివుని జత కలుపు రీత్యా నారికేళమును పగులగొట్టక దొర్లించి విడిచిపెట్టుట సాంప్రదాయము. పిదప కర్పూరహారతి చూపించి మిగిలిన పసుపు , కుంకుమలను ప్రసాదముగా తెచ్చుకొని , వెనుక ప్రక్కగా దిగి భస్మకుళము నందు స్నానమాడి తమ తమ స్థావరములకు చేరుకొందురు.
ఇరుముడిలో సుమారు ఒకటిన్నర కిలో బియ్యం వరకు వేసి నింపుతారు. ఇవి దారిపొడుగున , మరియు సన్నిధానంలో ఆహారం తయారుచేసుకొని భుజించుటకు
ఉపయోగపడుతుంది. సన్నిధానంలో ఇరుముడులు విప్పిన పిమ్మట అందులోయుండు బియ్యము నుండి పిడికెడు బియ్యమును అక్షింతలుగా ప్రతివారి ఇరుముడిలోను వేస్తారు. వాటిని మన ఊరికి తీసుకొచ్చి కొంచెం కొంచెముగా చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లకు
వేసి బంధు వర్గాదులకు ప్రసాదముగా ఇచ్చి వాటిని వారి వారి ఇంట్లోయుండే బియ్యం పాత్రలో కవరుతోసహా పడేసి యుంచమని చెప్పెదరు. శబరిమల పుణ్యస్థలమునుండి వచ్చిన బియ్యము ఇంట్లోయుండే బియ్యముతో కలిపి అక్షయముగా (తరగక) యుంటుందన్నది పెద్దల అభిప్రాయము.
మరికొందరు ఇరుముడిలో తెచ్చిన పిడికెడు బియ్యంతో మరింత బియ్యం కలిపి పొంగలిచేసి బంధుమిత్రులకు ప్రసాదముగా పంచి సంతసించెదరు. ఇదియును సాంప్రదాయమే. శబరిగిరి చేరిన ఇరుముడుల బియ్యముతో భక్తులకు ఆహారం తయారుచేసి వినియోగింతురు. అలా వంట చేయుటకు వీలుకాని వారు ఆ
చెయ్యమును దేవస్వం బోర్డు ప్రసాద కౌంటర్లలో ఇస్తే వారు వండిన అన్నం ఇస్తారు. రద్దీనిండిన సమయములలో అలా వీలుకాక పోయినచో విశ్వహిందూ పరిషత్ మరియు అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం వారికి అందించ వచ్చును. ఇలా భక్తులచే యొసంగ బడు బియ్యమును వారు సద్విని యోగంచేసి వీలైనంత మంది
భక్తుల క్షుద్బాద తీరుస్తున్నారు. అలాగాక శబరిమలకు ఇరుముడిలో కొనిపోయిన బియ్యమును సద్వినియోగ పరచక తిరిగి తెచ్చుకొనుట యనునది అపచారమగును. పసుపు , కుంకుమ , అభిషేకము చేసిన నెయ్యి , విభూది , పంచామృతము , చందన ప్రసాదములను గురు స్వామిగా యుండువారు బృందములోని వారందరికి హెచ్చు తగ్గులు లేక సమపాలుగా పంచిపెట్టవలెను. బృందముగా కాక ఒకరిద్దరుగా శబరియాత్ర చేయువారు అభిషేకము చేయుటకు అవకాశం లేనివారు , ఇరుముడులను సన్నిధానంపైకి కొనిపోయి శ్రీ స్వామివారికి చూపించి , నెయ్యి టెంకాయలను సన్నిధానంలో యుండు *“ తోణి "* యనబడు రాతి తొట్టిలో పగులకొట్టి , పోసి , మిగిలిన వస్తువులను శ్రీ స్వామివారి ముంగిట యుండు హుండిలో సమర్పించి , ప్రసాద విక్రయశాలలో విక్రయించే నెయ్యి ప్రసాదములను కొనుగోలు చేసుకొని మరల వచ్చును.
ఇలా భక్తులచే నెయ్యి తోణిలో సమర్పించబడు నెయ్యి తదుపరి శ్రీ స్వామివారికి అభిషేకించబడి ప్రసాదాలు తయారు చేయుటకు వినియోగించ బడుతాయి. భయ , భక్తి , విశ్వాస , ఆచార , అనుష్టానములనబడు ఇరుముడితో మండలకాల బ్రహ్మచర్య నిష్టాగరిష్టులై పావన అష్టాదశ సోపానము అధిరోహించి స్వామి సన్నిధి చేరి పుణ్యపాపములనబడు ఇరుముడి లెక్కను శ్రీ స్వామి అయ్యప్పకు సమర్పించుకొని మరలే ప్రతివారికిని జగన్మోహన సుందర ధర్మశాస్తావారి అనుగ్రహ ఆశీస్సులతో గూడిన
అండదండలు సర్వకాల సర్వావస్థల యందును యుంటుందనుట తథ్యము.
🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏