⚜️ తత్త్వమసి ⚜️
సామాన్యముగ వాక్య మనగా సంపూర్ణార్థము నిచ్చు పద సముదాయమని అర్థము. మహావాక్య మనగా పెద్దవాక్యము. గొప్పవాక్యము , జీవబ్రహ్మైక్యమును ప్రత్యక్షముగా అనుభవమునకు దెచ్చువాక్యము మహావాక్యమని వేదాంతవచనము.
ఇది పూర్ణానంద రూప ప్రత్యగ్బోధమున ఉండును. పరమాత్మ పరిపూర్ణమైనను పరోక్షముగానే తోచును. ప్రత్యగాత్మ (జీవాత్మ నిత్యము ప్రత్యక్షమే అయినను పరిచ్ఛిన్నముగానే తోచును. మహావాక్యములవలన ప్రత్యగాత్మ పరమాత్మలకు ఐక్యము బోధింపబడును. ఈ మహావాక్య ప్రబోధముచే ప్రత్యగాత్మయందలి పరిచ్ఛిన్నత్వము , పరమాత్మ యందలి పరోక్షత్వము అనెడి భ్రమలు తొలగి , ఈ రెండింటి ఐక్యముచే ఏర్పడు పరిపూర్ణానందము ప్రకాశించు , అనుభవమునకు వచ్చును. ఇదియే జీవబ్రహ్మైక్యాపరోక్షబోధ ! ఇట్టి బోధను కల్గించుటే మహావాక్య లక్షణమని శ్రీ విద్యారణ్యస్వాములవారు తమ *“వేదాంత పంచదశి"* లో పేర్కొన్నారు.
*“యతో వా ఇమాని భూతాని జాయంతే"* (దేని నుండి ఈ భూతరాశి జనించు చున్నదో) అనెడి తైత్తిరీయాద్యుపనిషత్తుల యందలి వాక్యములు బ్రహ్మమునకు జగజ్జన్మాది కారణరూపమైన తటస్థలక్షణములను చెప్పినవి. *“సత్యం జ్ఞాన మనతం బ్రహ్మ"* మున్నగు వాక్యములు బ్రహ్మ స్వరూప లక్షణములను చెప్పినవి. కాని ఇవన్నియు పరోక్ష బ్రహ్మబోధను కల్గించునవి మాత్రమే ! ఈ వాక్యములకు జీవ బ్రహ్మైక్యమును
వివరించు సామర్థ్యము లేదు. కనుక ఇట్టి వాక్యములు అవాంతర వాక్యములే కాని , మహావాక్యములు కాజాలవు. నాల్గు వేదములలో నాలుగే ఉపదేశ మహావాక్యములని సాంప్రదాయిక ప్రమాణ సిద్ధాంతము. కాని 108 ఉపనిషత్తుల నుండి 1008 సంఖ్యచే “మహావాక్యరత్నావళి"* అను గ్రంథమున మహావాక్యములు పేర్కొనబడినవి. ఈ గ్రంథమునకు *“మహావాక్యరత్నావళి"* అని పేరే కాని ఇందలి వాక్యములన్నియు మహావాక్యములు గావు. ఇందు విధి వాక్యములు , బంధ మోక్షవాక్యములు , ఫల వాక్యములు, విదేహముక్తి వాక్యములు మున్నగు 20 శీర్షికలతో వివిధ వేదాంత వాక్యములున్నవి. ఇందులో *“జీవబ్రహ్మైక్య వాక్యములు"* అనెడి శీర్షికలో 38 వాక్యములున్నవి. వానిలో నాల్గు వేదములనుండి గ్రహించినవి నాలుగే మహా వాక్యములు ! తక్కినవి వాని తాత్పర్యమును వివరించునవి మాత్రమే ! ఆ నాల్గు
మహావాక్యములు ఇవి
1) "ప్రజ్ఞానం బ్రహ్మ" ఇది ఋగ్వేదాంతర్గత 8 ఐతరేయోపనిషత్తులో 3వ
అధ్యాయమున 3వ వాక్యము
2) "అహం బ్రహ్మాసి" ఇది యజుర్వేదాంతర్గత 10 బృహదారణ్య కోపనిషత్తులో 1వ అధ్యాయము - 4వ బ్రాహ్మణములో 10వ వాక్యము.
3)"తత్ త్వ మసి" ఇది సామవేదాంతర్గత 9- ఛాందోగ్యోపనిషత్తులో 6వ
ప్రపాఠకములో -8వ ఖండములో 7వ వాక్యము.
4) " అయ మాత్మా బ్రహ్మ" ఇది అధర్వ వేదాంతర్గత 6 - మాండూక్యోపనిషత్తులో 12వ వాక్యము.
ఈ పై వాక్యములు ఆత్మబోధోపనిషత్తు , తేజోబిందూపనిషత్తు , శాండిల్యోప
నిషత్తు , బృహదారణ్యకోపనిషత్తు , మున్నగువానిలో ఉన్నను , ఆ స్థలములు వానిని వివరించినవే కాని , వాని ఆవిరావ స్థానములు మాత్రము కావు. *"మహావాక్యములు"* అను పేరు మొట్టమొదట శుకరహస్యోప నిషత్తులో కలదు. “అథ మహావాక్యాని - చత్వారి , ఓం ప్రజ్ఞానం బ్రహ్మ ఓమ్ అహం బ్రహ్మాస్మి, ఓం తత్త్వమసి. ఓమ్ అయమాత్మా బ్రహ్మ " - అని. కనుక ఈ నాల్గు వాక్యములకు మహావాక్యములనెడి పేరుతో ఉపదేశ
విధానస్థానము శుకరహస్యో పనిషత్తే
అగుచున్నది. హయగ్రీవోపనిషత్తులోను
బహ్వృచోపనిషత్తులోను ఈ మహా వాక్యోపదేశ విధాన మున్నను అచ్చట అవి సగుణోపాసనకు అంగములుగనే వివరింపబడినవి. ఈ మహావాక్యములు
అద్వైత పరమైనవి. వీనిని ఉపదేశించుటకును. ఉపదేశము నొందుటకును పరమహంసలకే అధికారమున్నదని మొదట నియమించినను , కాలక్రమముగ శ్రద్ధ ,
జ్ఞానము , జిజ్ఞాస , అర్హతగల వారి కెల్లను అధికారముగలదని పెద్దలు కొంత స్వేచ్ఛ నిచ్చినారు. మరికొంత కాలమునకు స్త్రీలు కూడ వీనిని పొందవచ్చునన్నారు.
మహా వాక్య వివరణము
1) ప్రజ్ఞానం బ్రహ్మ-అను వాక్యములో "ప్రజ్ఞాన" మనగా పిండాండ మైన స్థూలదేహమునుండి ఇంద్రియముల ద్వారా శబ్దస్పర్శాదులను ప్రకాశింపజేయు జీవాత్మ సాక్షి చైతన్యము. "బ్రహ్మ" మనగా బ్రహ్మాండ మందలి పిపీలికాది బ్రహ్మ పర్యంతము వివిధములైన ఉపాధులందు ప్రకాశించు పరమాత్మ సాక్షి చైతన్యము.
చైతన్య మనగా జ్ఞానము , చిత్తము , బోధ అనుభూతి అని అర్థములు. ఈ చైతన్య మనుపదముచే చెప్పబడునది సత్యజ్ఞాన స్వరూపమే ! తన వ్యష్టి పిండాండ దేహము కూడ సమష్టిబ్రహ్మాండములోనిదే గనుక బ్రహ్మాండము నిండ నిండియుండి ,బ్రహ్మాండరూపమున ప్రకాశించుచైతన్యమే తన పిండాండదేహరూపమున ప్రకాశించు చున్నదే కాని , ఇది వేరుకాదు. కనుక ప్రజారూపమున అనగా జీవసాక్షి చైతన్య రూపమున ఏది పిండాండదేహమున ప్రకాశించు చున్నదో , అది బ్రహ్మాండరూపమున ప్రకాశించు పరమాత్మసాక్షి చైతన్యమే కాని వేరుగాదు" - అని "ప్రజ్ఞానం బ్రహ్మ "అను వాక్యమునకు అర్థము. ప్రజ్ఞానమే బ్రహ్మ - అను ఈ వాక్యము ఉపదేశరూపవాక్యము , గురువు శిష్యునికి *“శిష్యా ! నీయందున్న జీవచైతన్య రూపమగు ఏ శక్తి యున్నదో , బ్రహ్మాండ మందున్న సర్వ చైతన్య రూపపరమాత్మయే !* - అని బోధించినాడు. దీనిని సమాధి స్థితి ద్వారా అనుభవించిన శిష్యుడు తరువాత గురువుతో “అహం బ్రహ్మాస్మి' అని పలుకును - అనుభవించును. ఈ “నేనే బ్రహ్మమునై యున్నాను" - అనుఅద్వైత స్థితిని మొదట గురువు అనుభవించి , స్వానుభవము ద్వారా శిష్యునికి బోధించును. కాగా *"ప్రజ్ఞానం బ్రహ్మ"* అనునది గుర్తింపు వాక్యము.
రెండవదైన 'అహం బ్రహ్మాస్మి' అనునది అనుభవవాక్యము.
2) అహం బ్రహ్మాస్మి - “నేను బ్రహ్మమునై యున్నాను” “అహమ్" అనగా పిండాండమందలి (శరీర మందలి) అహంకారాత్మకమైన అంతఃకరణమున భాసించు జీవాత్మసాక్షి చైతన్యము. (జీవాత్మ , బ్రహ్మమనగా అనేకములయిన అహంకారములకు
మూలభూతమగును సమష్టి మహత్ తత్త్వమున ప్రకాశించు పరమాత్మ సాక్షి
చైతన్యరూపము (వ్యష్టి = విడివిడిగా నున్నది. సమష్టి = అన్నిటి సమూహరూపము) "అస్మి" = అయి యున్నాను." ఇది ఈ రెంటికిని ఐక్యమును సూచించునది కనుక
జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమును గూర్చిన అనుభూతి వాక్యము "అహం బ్రహ్మాస్మి" అనునది. ఈ రెండు వాక్యములతో ఉపదేశము , అనుభవము , రెండును , పూర్తి
అయినవి. “ప్రజ్ఞానం బ్రహ్మ" - ఉపదేశము "అహం బ్రహ్మాస్మి " - అనుభవము. కాగా ఇంతటితోనే జీవ బ్రహ్మైక్య విషయము పూర్తి అయినది. ఇందు ముందు సమష్టి బ్రహ్మాండ
పరమాత్మ సాక్షి చైతన్యము చెప్పబడి , పిదప అదే చైతన్యము పిండాండమందున్నది. ఈ రెండును ఒక్కటే అని నిర్ధారింపబడినది. ఈ వివరణ బ్రహ్మాండముతో ప్రారంభమై ,
పిండాండముతో సమాప్తమైనది. ఇది ఒక ప్రక్రియ ! అనగా పూర్ణమునుండి అంశకు వచ్చి , పూర్ణము - అంశము రెండును ఒక్కటే అని సూచించుట ఇందలి పద్దతి. ఇది పై నుండి క్రిందికి వచ్చిన ప్రక్రియా పద్ధతి. ఇంకను ఇదే విషయమును మరో పద్ధతిలో స్పష్టము చేయుటకై - అనగా పిండాండము నుండి బ్రహ్మాండమునకు - (వ్యక్తి నుండి సమష్టికి) వచ్చు విధానము చెప్పబడినది. “తనలో నున్నదే సర్వత్ర ఉన్నది"* అనునది ఉపదేశ మాత్రముగా , “అనుభవ దర్శన మాత్రముగా , వివరించునవి తక్కిన రెండు వాక్యములు , *“కంటిముందు కన్పించు బ్రహ్మాండ సాక్షి పరమాత్మయే తన యందున్న జీవాత్మ" యనునది మొదటి ప్రక్రియకాగా , "తత్ త్వమసి" - " "అయ మాత్మా బ్రహ్మ" అనునవి ఉపదేశ - అనుభవ వాక్యములగుటయేగాక , దర్శన వాక్యములుగాను ఉన్నవి. " ఉపదేశము , అనుభవము , దర్శనము" అను త్రిపుటి యున్నపుడే అద్వైత తత్త్వము సంపూర్ణముగా గ్రాహ్యమగును. తనయందున్న జీవాత్మను , బ్రహ్మాండ మందున్న పరమాత్మగా తనలో తాను చూచి , అనుభవించినంతమాత్రాన అనుభవము పూర్తికాదు. ఆ పరమాత్మను సర్వత్ర సర్వదా దర్శించినవుడేకదా స్వానుభవమున రసానందము ఆస్వాద్యమానమగును ! ఇందుకే తర్వాతి రెండు వాక్యములు !
3) తత్త్వమ్ + అసి = "తత్వమసి" ఈ మూడు పదముల కలయికే తత్వమసి అని అందురు. తత్ = అది అనగా జగజ్జన్మాది కారణమగు మాయో పాధకము. సర్వజ్ఞత్వలక్షణము నగు సమష్టియైన ఈశ్వర చైతన్యము - అనగా సర్వవ్యాపకమైన పరమాత్మ *"త్వమ్" = నీవు , అనగా అవిద్యో పాధికము , కించిద్ణ్ణ (కొంచెము తెలిసిన) లక్షణమునగు వ్యక్తి జీవ చైతన్యము - అనగా *“జీవాత్మ" = అసి = అయియున్నావు ఇది ఈ రెంటికిని అనగా పరమాత్మకు , జీవాత్మకు ఐక్యమును బోధించునది. కనుక “బ్రహ్మాండమున నున్న పరమాత్మయే , నీ యందున్న జీవాత్మ అయియున్నది. నీవు ఆ పరమాత్మవే కాని అన్యుడవు కావు" అనెడి ఉపదేశవాక్యమిది. ఈ వాక్యము జ్ఞాన
బోధకము.
4) “అయ మాత్మాబ్రహ్మ" = 'అయమ్' = ఈ యొక్క 'ఆత్మా = వ్యష్టి సమష్టి (పిండాండబ్రహ్మాండ) రూపమున ప్రకాశించు సాక్షి చైతన్యము , 'బ్రహ్మ' = పరమాత్మ యగుచున్నది. అనగా ఏది పిండాండ బ్రహ్మాండములందు సర్వోపాధులలో (ఉపాధి = శరీరము , ఆకారము) సాక్షి చైతన్యమై ప్రకాశించుచున్నదో అది , పరమాత్మ = పరబ్రహ్మ అని - తాత్పర్యము.
మూడవ వాక్యముచే గురువు శిష్యునికి *"తత్ త్వ మసి"* అని ఉపదేశించి ,
(శిష్యుని జ్ఞాన నేత్రమును తెరచగా , శిష్యుడి సాధనవలన , అనుభవము వలన దీనిని అనుభవించుటయే గాక , తనలోపల , తనవెలుపల , సర్వత్ర ఆ పరమాత్మను దర్శించి , తన్మయుడై ఆనందించును. కనుక ఈ నాల్గవ వాక్యము సాక్షాత్కార రూపమైనది. అనగా దర్శనవాక్యము. *"పరబ్రహ్మమే జీవాత్మ అయియున్నదనుట"* మొదటి వాక్యము. *“నేను బ్రహ్మము నైతిని"* అనుట రెండవ వాక్యము ఈ రెంటితో అద్వైతబోధ సంపూర్ణము కాలేదు. ఇందు *"ఉపదేశము - అనుభవము ఉన్నవే కాని , సంపూర్ణదర్శనము లేదు. తనలో తాను దర్శించి , అనుభవించిన దానిని , సర్వత్ర దర్శించి , అనుభవించినపుడే , జ్ఞానము పరిపక్వమై పరిపూర్ణమై , బ్రహ్మానందము చేకూరును. కనుక గురువు "తత్ త్వ మసి" - “నీవు ఆ బ్రహ్మమే అయి యున్నావు"* అని మరల మరల ఉపదేశించిన పిదప , శిష్యుడు గురువాక్యము నందు విశ్వాసము నుంచి , తనలోని పరమాత్మను మొదట దర్శించి , విజ్ఞానవంతుడై , పిదప క్రమక్రమముగా పిండాండమందున్న ఆ జీవాత్మ రూపసాక్షి చైతన్యమును బ్రహ్మాండమందున్న సర్వవ్యాపక పరబ్రహ్మరూప సాక్షి చైతన్యముగా సర్వత్ర దర్శించి , ఆనందించవలెను. ఇదియే బ్రహ్మానందము (బ్రహ్మమే
తానైన ఆనందము) ఈ స్థితికి వచ్చుటయే అద్వైత సాధనలో పరమ చరమదశ. ఇదే గీతలో *“బహునాం జన్మనా మంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ! వాసుదేవస్సర్వమితి స*
*మహాత్మా సదుర్లభః"* అని నొక్కి వక్కాణింపబడినది. ఈ సర్వత్ర వాసుదేవ = పరమాత్మ దర్శనము అనేక జన్మల సాధన విశేషము వలనను , సద్గురు ప్రబోధమువలనను ,
భగవత్కృపవలనను , ఇహజన్మ సాధనసంస్కారము వలనను సిద్ధించును. అన్నిటి కన్నను *“ఈశ్వరానుగ్రహము" మిక్కిలి ముఖ్యము.*
*“ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైత వాసనా"* అనునది శాస్త్రము. కనుక
భగవదనుగ్రహము లేనిదే అద్వైత జ్ఞానము ఫలించదు. ఇందుకు పూజలు , స్తోత్ర పారాయణములు , జపములు , ధ్యానము మున్నగునవి ప్రాథమికముగా ఉపకరించు సాధనములు. వీనిచే చిత్తము పరిపక్వవమగును. ఈ పరిపక్వత పూర్తిగా సిద్ధించుటకు పుణ్యము మూలము. పుణ్యము దానధర్మాది సత్కార్యములచే లభించును (దానము = సంకల్ప పూర్వకముగా చేయునది. ధర్మము కరుణతో తన కర్తవ్యముగా భావించి , నిస్స్వార్థముగా చేయునది) కనుకనే ఆ స్థితిని *"పుణ్యలబ్దా"*
అన్నది *శ్రీ లలితా సహస్ర నామావళి " కథ మకృత పుణ్యః ప్రభవతి"* అన్నారు - శంకరులు సౌందర్యలహరీ ప్రారంభ శ్లోకమున.
కొందరికి ఇహ జన్మకృతదాన ధర్మాదిపుణ్యసంస్కారము లేకున్నను , జన్మాంతర పుణ్య సంస్కారము , భగవదనుగ్రహము పూర్తిగా ఉన్నపుడు గురుబోధలవలన , తీవ్ర
సాధనవలన , నిరంతర జిజ్ఞాసవలన , అదృష్టవశమున ఈ స్థితి లభించును. కాని ఇట్టివారికి సాంసారిక లంపటములు కారణములుగా తీవ్ర వైరాగ్యము లేనందున ఈ అనుభూతి ఏ కొంతసేపు మాత్రమే సిద్ధించి , మరల సామాన్యస్థితియే మిగులును. కనుకనే తీవ్ర వైరాగ్యభావమున్న పరమహంసలకే ఈ *“పరమోద్వైతసిద్ధి"* అని శాస్త్రములు పేర్కొన్నవి. మొట్టమొదట దేహాభిమానము నశించవలెను. స్త్రీ పుం భేదాత్మకమైన ద్వంద్వములకు అతీతముగ (కనీసము మానసికముగానైనను) ఉండవలెను. అరిషడ్వర్గమును (కామ , క్రోధ , లోభ , మోహ , మదమాత్సర్యములను) కూల్చి వేయవలెను. శరీరముతో సంసారము చేయుచున్నను, నిరంతరము మనస్సు
భగవత తత్త్వమునే దర్శించు చుండవలెను. ఎదుటివారియందలి గుణములనే గ్రహించి , దోషముల విషయమున మౌనము దాల్చవలెను. ఇదే *“హంస"* లక్షణము. కనుకనే యతీశ్వరులను *“పరమహంస"* లన్నారు. అట్టి పరమహంస స్థితికి చేరిన వారే ఈ మహావాక్యములను ఉపదేశించుటకును , అనుభవించుటకును అర్హులు , అధికారులు అని శాస్త్రము శాసించినది.
*సారాంశము*
1) "ప్రజ్ఞానం బ్రహ్మ" అనునది బాహ్యేంద్రియ , బాహ్యేంద్రియార్థ వ్యష్టి సమిష్టి స్థూల శరీర వ్యవహారమునుండి తత్త్వప్రబోధము గావించినది. (ఉపదేశము)
2) "అహంబ్రహ్మాస్మి" అనునది అంతరింద్రియ - అంతరింద్రి యార్థ వ్యష్టి సమష్టి సూక్ష్మ శరీరవ్యవహారమునుండి తత్త్వబోధ గావించినది. (శిష్యుని అనుభవము)
3) “తత్ త్వమసి" అనునది మాయా విద్యాత్మకమైన వ్యష్టి సమిష్టి కారణ శరీర వ్యవహారమునుండి తత్త్వబోధ గావించినది (దృఢత్వ సిద్ధికై మరల ఉపదేశము) ఈ త్రివిధ సజాతీయ తత్త్వ బోధలు అయిన తరువాత.
4) “అయ మాత్మా బ్రహ్మ " - అనునది వ్యష్టి సమష్ట్యాత్మకమైన స్థూల సూక్ష్మ కారణ శరీరముల యొక్క త్రివిధ వ్యవహారముల నుండి ఒకే విధమగు ప్రయత్నముతో మహాకారణమై , సర్వవ్యాపకమై వెలుగొందు మహత్ తత్త్వమును బోధించినది.
కాగా "ప్రజ్ఞానం" పదముచే వ్యష్ట్యహంకారోపాధిక చైతన్యమును, “బ్రహ్మ" పదముచే సమష్ట్యహంకారోపాధిక చైతన్యమును, “అహం" పదముచే స్థూలవ్యష్టి పిండాండోపాధిక చైతన్యమును, "బ్రహ్మ" పదముచే స్థూలసమిష్టి
బ్రహ్మాండోపాధిక చైతన్యమును, “త్వం" పదముచే వ్యష్ట్యహంకారోపాధిక చైతన్యము , "తత్" పదముచే సర్వాంతర్యామి బ్రహ్మమును , "అసి" పదముచే అభేదమును గ్రహించి , చివరకు "అయమాత్మా బ్రహ్మ" అను వాక్యార్థముచే *“సర్వం ఖల్విదం బ్రహ్మ"* ఈ విశ్వ మంతయు బ్రహ్మమే - అను అనుభవపూర్వక సాక్షాత్కార దివ్యస్థితి సిద్ధించును. కార్యోపాధి జీవుడు. కారణోపాధి ఈశ్వరుడు. కనుక స్థూల సూక్ష్మ కారణ మహాకారణములందున్న సర్వ చైతన్య శక్తి యేదియో అదియే పరమాత్మ. ఆ
పరమాత్మయే నా యందున్న జీవాత్మ అదియే ఉపాధి భేదములతో ప్రకృతి రూపమున గోచరించుచున్న దనియు , దానికి వాస్తవముగా నామరూప కుల జాతి వయోభేదములు , దేశ కాలాదులచే పరిచ్చిన్నత, లేవనియు- ఏది మనయందు “అహం” (నేను) కారాత్మకమగు మాయా కల్పిత చిదాభాస విశిష్టజీవ స్వరూపయై
యున్నదో - అది యథార్థముగా చిన్మాత్రమగు బ్రహ్మ స్వరూపమే అనునది గ్రహించి , అనుభవించి , దర్శించుటయే ఈ నాల్గు మహా వాక్యముల సారాంశము.
ఈ స్థితి ఒక్కమారుగ వచ్చునది కాదు. తటాలున వచ్చినను భౌతిక సంసార బంధములు దీనిని తప్పింప జూచును. కనుక దృఢజ్ఞానము ఇందుకు ముఖ్యము. దేని కయినను ఈశ్వరానుగ్రహము అతిముఖ్యము. ఈ పరమోద్వైత సారము సంతయు శంకరులవారు *“త్వయి మయి సర్వత్రైకో విష్ణుః"* అను నొక్క వాక్యమున నిక్షేపించినారు. పరమాణువున పరబ్రహ్మ మున్నట్లు ఈ చిన్ని వాక్యమున మహావాక్యార్థ
మంతయు ఇమిడియున్నది. ఇట సామాన్యముగా ఒక సంశయము కల్గును. ఇందు రెండు ఉపదేశ వాక్యములు , రెండు అనుభవవాక్యములు ఉన్నవి కదా ! అపుడు పునరుక్తి కాదా ? అని పైకి పునరుక్తిగా తోచును కాని సూక్ష్మముగా పరిశీలించినచో నాల్గును ఆవశ్యకములే ! మొదటిది స్థూలము . రెండవది సూక్ష్మము. మూడవది కారణము. ఈ మూడును మహాకారణమైన పరమాత్మకు - జీవాత్మతో గల అభేదమును బోధించి ,
అనుభవింపజేయునవే కాని , ఆ అద్వైతానుభవమును సర్వత్ర దర్శించి , ఆనందింప జేయునవి కావు. నాల్గవది ఇట్టి సర్వత్ర దర్శనానందము నిచ్చునది. క్రమసోపాన పద్ధతిలో వివిరించినపుడే అద్వైత వేదాంతము అనుభవమునకు వచ్చును. విషయమును దృఢముగా నిల్పుటకై వేదాంత బోధలందు కొన్ని యెడల పునరుక్తులుండును. కాని వాని వాని స్థాన స్థితి వలన అవి అచ్చట రాణించునవే !
*ఇందు రెండు పద్ధతులలో ప్రబోధానుభవములున్నవి.*
1) పిండాండములోని జీవాత్మయే బ్రహ్మాండములోని బ్రహ్మ మని ఉపదేశము.
2) ఈ ఉపదేశమును గ్రహించి , సాధించి , శిష్యుడు , "అహం బ్రహ్మాస్మి" అని గుర్తించినాడు. ఇక్కడ "నేను" అనగా *"జీవాత్మనైన నేను బ్రహ్మమునై యున్నాను.”* అనుజ్ఞానము , అనుభవము కల్గినదే కాని , *"సర్వత్ర ఉన్నది తనలో నున్న బ్రహ్మమే"* అని అనుభవించి , దర్శించు స్థితికి రాలేదు.
అనగా వ్యక్తిగతమైన అద్వైతమే కాని సర్వగతమైన అద్వైతము సిద్ధించలేదు. ఇప్పటికి స్థూల సూక్ష్మ - జీవాత్మ పరమాత్మల అభేద జ్ఞానము , ఆ అనుభవము మాత్రము సిద్ధించినవి. ఈ బ్రహ్మాండము స్థూలసూక్ష్మ కారణమ మహాకారణ తత్త్వములతో నిండినది కదా !
కనుక మూడవ వాక్యమున *“సూక్ష్మ రూపమయిన బ్రహ్మమే కాక, కారణ రూపమయిన బ్రహ్మము కూడ నీవే అయి యున్నావు"* అని మరల ఉపదేశించ వలసి వచ్చినది. శిష్యుడు దీనిని సాధించి , అనుభవించి , *“అయమత్మా బ్రహ్మ"* - *"ఈ కన్పించు సర్వము బ్రహ్మమే"* అని దర్శించి , ఆనందించినాడు. ఇది అనుభవాత్మక దర్శనము. మొదటి అనుభవము వ్యష్టి. రెండవ అనుభవము సమిష్టి మరియు సాక్షాత్కారము కూడా ! మొదటి ఉపదేశము *“నీలోని ప్రజ్ఞానము (జీవాత్మ చైతన్యము) బ్రహ్మము"* అను నదియే కాని , *“అది నీవే అయి యున్నావు"* అనుదృథోప దేశకము లేదు. కనుక రెండవ ఉపదేశము దృఢత్వ నిశ్చయజ్ఞానోప దేశకము. కాగా మొదటి ఉపదేశము సాధారణము ! రెండవ ఉపదేశము విశేషము ! ఇట్లే మొదటి అను భవము దర్శనములేని కేవలము స్వానుభవము. రెండవ అను భవము - అనుభవమునకు తోడు దర్శనము (సాక్షాత్కారము) కల్గి , పరిపక్వ పరిపూర్ణదశకు చేరిన స్థితి. ఇట్లు గ్రహణ బోధనదశలను బట్టి ఇందు క్రమసోపాన పద్ధతిలో రెండు ప్రబోధ వాక్యములు , రెండు అనుభవవాక్యములు ఉన్నవి.
1,2, వాక్యములు ఒక దశ, 3,4, వాక్యములు మరొక దశ. ఇట్టి క్రమ
దశోపదేశానుభవములు ఉన్నపుడే వేదాంతము మోదాంతము కాగలదు. అద్వైత వేదాంతభవనమునకు ఈ నాల్గు మహావాక్యములు ఆధార మహాస్తంభములు. ఈ స్తంభములపై నిల్చినమేడ *“సర్వ ఖల్విదం బ్రహ్మ"* అనునది. ఈ విశ్వమంతయు
పరమాత్ముని అంశమే అయినపుడు ప్రత్యణువు నందును ఆ పరమాత్మ తత్త్వము నిండియే యుండునుకదా ! అంశి - అంశలకు అభేదనిరూపణమే అద్వైతము ! స్థూల దృష్టికి జీవుడు , దేవుడు , ప్రకృతి , వేరుగా కన్పించినను , సూక్ష్మ దృష్టితో , సమాధి స్థితిలో చూచినపుడు అంతయు ఆ పరమాత్మయే తప్ప అన్యములేదని తెలియుట , అనుభవించుట , దర్శించుట జరుగును. ఇదియే ఈ నాల్గు మహావాక్యములు తాత్పర్యము.
🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏