మన్నార్‌శాల నాగరాజ ఆలయం | Mannarasala Nagaraja Temple - kerala

P Madhav Kumar

 


మన్నార్‌శాల నాగరాజ ఆలయం-అళప్పుజ(కేరళ)

నాగరాజు, నాగదేవత, నాగన్న... ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ భక్తిభావంతో నాగులను పూజించే సంప్రదాయం పురాణకాలం నుంచీ ఉంది. దక్షిణభారతంలో ఎక్కువగా శివార్చనలో భాగంగానో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రూపంలోనో లేదా ఏ చెట్టు కిందో పుట్ట చెంతో నాగదేవతను అర్చిస్తుంటారు. కానీ నాగారాధనకోసం పామురూపంలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించి అందుకోసం ప్రత్యేకంగా గుడులూ గోపురాలూ నిర్మించడం మాత్రం అరుదే. అలాంటివాటిల్లో ఒకటి కేరళలోని మన్నార్‌శాల నాగరాజ ఆలయం. (ఆగస్టు 1న నాగపంచమి)

అళప్పుజకి సమీపంలోని మన్నార్‌శాల నాగరాజ ఆలయంలో పౌరోహిత్యం చేసేవాళ్లంతా స్త్రీలే కావడం విశేషం. ప్రధాన గుడిలో నాగరాజ విగ్రహం కొలువుదీరుతుంది. ఇందులోనే భార్యలైన సర్పయక్షిణి, నాగయక్షిణిలతోపాటు సోదరి నాగచాముండికీ ఆలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోనూ అక్కడ ఉన్న చెట్ల చుట్టూ ఉన్న గట్లుమీదా... సుమారు 30 వేల నాగదేవత శిలావిగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతానం కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. పిల్లలు పుట్టాక ఆ పిల్లలతోసహా వచ్చి స్వామికి సర్పరూపంలోని విగ్రహాన్ని కానుకగా ఇస్తారు.

ఆలయ ప్రాశస్త్యం

ఈ నాగరాజ ఆలయంలోని ప్రధాన దేవతను పరశురాముడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. క్షత్రియుల్ని వధించిన పరశురాముడు, పాపవిముక్తి కోసం రుషులను ఆశ్రయించగా బ్రాహ్మణులకు భూమిని దానం చేయమంటారు. అప్పుడాయన శివుణ్ణి తలచుకుని, ఆయనిచ్చిన గొడ్డలిని సముద్రంలోకి విసరగా ఏర్పడిన భూభాగమే కేరళ. దాన్నే పరశురాముడు బ్రాహ్మణులకు దానం చేయగా, ఆ నేలంతా ఉప్పుమయం కావడంతో అక్కడెవరూ ఉండలేక వెళ్లిపోతుంటారు. అది చూసిన భార్గవరాముడు శివుణ్ని ప్రార్థించగా- విషజ్వాలలు ఆ ప్రాంతమంతా వ్యాపిస్తే ఉప్పు ప్రభావం పోతుందనీ, అందుకోసం నాగదేవతను అర్చించాలని చెబుతాడు. దాంతో పరశురాముడు సముద్రం ఒడ్డునే ఉన్న ఓ ప్రాంతాన్ని గుర్తించి, దానికి 'తీర్థశాల' అని పేరు పెట్టి, అక్కడ నాగదేవతను అర్చిస్తాడు. భార్గవరాముడి పూజలకు నాగరాజు దివ్యమణులతో వెలిగిపోతూ ప్రత్యక్షమై, భయంకరమైన విషసర్పాలను వదలగా, అవన్నీ విషజ్వాలలతో నేలలోని ఉప్పుని పీల్చేస్తాయి. ఆపై పరశురాముడు వేదమంత్రాలతో తీర్థశాలలోని మందార(అగ్నిపూలు)వృక్షాల మధ్యలో నాగరాజ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడన్నది పురాణ కథనం. అదే మందారశాలగా మన్నార్‌శాలగానూ మారింది.

ఐదు తలల నాగరాజు!

చాలాకాలం తరవాత... ఇక్కడి ఆలయంలో వాసుదేవ, శ్రీదేవి దంపతులు సంతానరాహిత్యంతో బాధపడుతూ నాగరాజుని పూజిస్తుండగా, అడవికి నిప్పు అంటుకుంటుంది. ఆ జ్వాలల తాపానికి తట్టుకోలేక విలవిల్లాడిపోతున్న సర్పాలను కాపాడతారా దంపతులు. పంచగవ్యం రాసి, చందనం పూసి, దేవదారు చెట్లకింద విశ్రమింపజేసి, పంచామృతాన్నీ అప్పాలనీ అటుకుల పాయసాన్నీ ప్రసాదంగా పెడతారు. ఆ సేవలకు మెచ్చిన నాగరాజు ప్రత్యక్షమై, 'వారికి కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటాననీ, మన్నార్‌శాలలో విగ్రహం రూపంలో భక్తులకు ఎప్పటికీ తన ఆశీర్వాదం ఉంటుంద'నీ చెప్పి అదృశ్యమవుతాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణ స్త్రీ, ఐదుతలలు ఉన్న బిడ్డతోపాటు సాధారణ రూపంలోని మరో బిడ్డకీ జన్మనిస్తుంది. కొంతకాలానికి ఐదుతలల బాలుడు తన జన్మరహస్యాన్ని గ్రహించి, తమ్ముడికి కుటుంబ బాధ్యతలు అప్పగించి, గుడి ఆవరణలోనే తాను సమాధిలోకి వెళ్లిపోతాననీ, ఆ రోజున ప్రత్యేక పూజలతో అర్చించమనీ చెబుతాడు. అందుకే ఇప్పటికీ నాగరాజు సమాధిలో తపస్సు చేస్తూ భక్తులను కరుణిస్తున్నాడని విశ్వాసం. ఆ కుటుంబీకులు ముతాసన్‌ అనీ, అపూపన్‌(తాత)అనీ ఆయన్ని ఆప్యాయంగా పిలుస్తుంటారు. అందుకే నాగపంచమితోపాటు ఆయన సమాధిలోకి వెళ్లిన రోజున ఐల్యం వేడుకనీ ఆయన చెప్పినట్లే ముగ్గురూపంలో నాగబంధనం వేసి, ఘనంగా జరుపుతారు. అప్పటినుంచీ ఆ కుటుంబానికి చెందిన వృద్ధమహిళే నాగరాజుకి పూజాపునస్కారాలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది.

ఆలయంలో భక్తులు సంపదకోసం బంగారాన్ని నింపిన కుండనీ, విద్యకోసం దేవుడి బొమ్మలతో కూడిన ఆభరణాలనీ; ఆరోగ్యం కోసం ఉప్పునీ; విషప్రభావం నుంచి కాపాడుకునేందుకు పసుపునీ వ్యాధుల నివారణకోసం మిరియాలు, ఆవాలు, పచ్చిబఠాణీలనీ; నష్టనివారణకోసం బంగారంతో చేసిన పాముపుట్టనీ లేదా పాముగుడ్లనీ లేదా చెట్టునీ; దీర్ఘాయుష్షుకోసం నెయ్యినీ సమర్పించుకుంటారు. ప్రత్యేకంగా సంతానానుగ్రహం కోసం అయితే రాగి, ఇత్తడితో చేసిన చిన్నపాత్రను కానుకగా సమర్పించి పూజిస్తారు. నురుంపాలం, కురుతి అనే నైవేద్యాలతో నాగన్నని అర్చించడమే ఈ ఆలయం ప్రత్యేకత.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat