అమృత బిందువులు - 4 గురు తత్వం - 2

P Madhav Kumar


*గురు తత్వం - 2*

*గురువు శమంతక మణికన్న మిన్న , శమంతకమణి తాకినిదాన్నెల్లా బంగారం చేయగలదో ఏమోగాని తనలాంటి మరొకమణిని తయారుచేయలేని దగును. కాని గురువు తనలాంటి గురువులనే గాక తనకంటే మించిన గురువులను కూడా తయారుచేయగలడు. కనుక గురువు శమంతకమణి కన్న మిన్న అని అందురు.*


*నవగ్రహాలలో గురుడు చూస్తేనే కోటిపుణ్యం అనిఅంటారు. గురుబలం ఉంటేనే వివాహాది శుభకార్యములు జరుగుతుందంటారు. గురుకటాక్ష ముంటే దైవకటాక్షమున్నట్లే. అందుకే గురువుకన్న మరొక్క దైవము లేదంటారు పెద్దలు. గురువు ఎంతటివాడు అనేది కాదు ప్రశ్న. గురువునందు మనకు గల భక్తిశ్రద్ధలే మిన్న. వారిమీద మనము ఉంచుకొన్న గౌరవ మర్యాదపూరిత విశ్వాసములే మనలను ఉద్దరింపజేయును.*


*గురువు నేర్పరి , శిష్యుడు ఓర్పరి అయినప్పుడే శిష్యుడు సంస్కరింప బడుతాడు. ఆతడు నేర్చుకొన్న విద్య నలుగురికి ఉపయోగపడును.*


*గురుద్రోహం చేయనేకూడదు. అలా పొరబాటుగా ఎవరైనా చేసినచో వారలను కూర్చొండబెట్టి ఊకపోసి నిప్పంటించి నీరు కార్పించినంత శిక్ష విధించాలి లేక ఒక తరువును కూసుగా చెక్కి ఆతని మలద్వారమందున కూర్చొండబట్టి కపాలమోక్షము ఇప్పించాలంటుంది శాస్త్రము. అలా తాను సద్గురువునకు ద్రోహము చేసినట్లు దలచి మాండవ్యుడు ఒకఋషి ఊకపోసి నిప్పంటించుకొని కరిగి నీరై పోవువేల గురుద్రోహం ఎంతటి పాపకృత్యమో “మణీషా పంచకం" అను ఐదు శ్లోకాలలో వివరించి యున్నారు. కావున మనసా కూడా ఎవ్వరును గురుద్రోహమును దలపెట్టకూడదు.*


*'గు'కార స్తన్దకారస్తు 'రు' శబ్ద స్తనిరోధకః అంధకార నిరోధత్వాత్ గురురిత్యభి అన్నారు. అంటే 'గు' అనే అక్షరం చీకటిని సూచించిన దగును. 'రు' శబ్దం దాన్ని తొలగించేటిదగును. అనగా తన దరిచేరినవారి మనసులో గల అజ్ఞానమనే చీకటిని తొలగించి , జ్ఞానమనే ప్రకాశవంతమైన దీపమును వెలిగించువాడు గురువు.*


*బ్రహ్మ మనిషిని సృష్టిస్తాడు. గురువు అతన్ని ఉత్తమమైన మనీషిగా తీర్చిదిద్దుతాడు. కనుక మానవులు తమ తమ గురువులకు సర్వదా విశ్వాసపాత్రులై యుండవలయును.*


గురువు పరమాత్మను చేరుకొనే మార్గములో సోపానములాంటి వాడు. పదునెట్టాంబడి ఎక్కేటప్పుడు మాలవేసి ఇరుముడి కట్టించి పంపిన గురువును స్మరిస్తూ ఎక్కాలి.*


*గురువు లాయరు లాంటి వాడు. పరమాత్మ జడ్జిలాంటి వాడు. భక్తుడు క్లెయింట్ లాంటివాడు. తన దరిచేరిన భక్తుని వద్దగల న్యాయమును చెప్పి మంచి జడ్జిమెంట్ ఇచ్చునట్లు సిఫార్సు చేసేవాడు గురువు.*


*ఆ దేవుడు అలిగితే గురువు మనకొరకు సిఫార్సు చేయగలడు. కాని గురువు అలిగితే మనకొరకు సిఫార్సు చేసేవారే ఉండరు. కావున గురువు మాటలు విని నడచుకొనుట ఉత్తముల లక్షణము.*


*మూలమెరిగినవాడు గురువు. మూల్యము కోరనివాడుగురువు. మూలతత్వమెరిగిన వాడు గురువు. ఆమూలాగ్రం నిన్నెరిగినవాడు గురువు.*


*గురుతత్వమును ఎరిగినవాడు సర్వశాస్త్రములు సాధన చేసినట్లే అని పెద్దలందురు. గనుక నీకు లభించిన గురువే పరమాత్ముడని విశ్వసించు.*


*గురువులలో రెండు రకాల వారున్నారు.*


*1) బోధ గురువు ,* 

*2) బాధ గురువు.*


*బోధ గురువులు మంచిని ప్రబోధిస్తూ మన మంచిని అభిలషిస్తూ ఉంటారు. బాధ గురువులు మనవద్ద ఉన్నదాన్ని అభిలషిస్తూ మనలోని లోపాలను లెక్కించి తమకు సాదరంగా మలచుకొని స్వలబ్దిపొందుతూ ఉంటారు. ఇక అట్టి బోధగురువులు బాధగురువులను గూర్చి విశ్లేషించిచూద్దాము.*


*బోధగురువులు క్షమిస్తారు. బాధగురువులు దండిస్తారు.*


*బోధగురువులు మితాహారులు. బాధగురువులు అమితాహారులు.*


*బోధగురువులు శాంతమూర్తులు. బాధగురువులు ఆవేశపూరితులు.*


*బోధగురువులు నిరాడంబరులు. బాధ గురువులు డంబాచారులు.*


*బోధగురువులు జ్ఞానసంపన్నులు. బాధ గురువులు జ్ఞాన శూన్యులు.*


*బోధగురువులు మూల్యమాశించరు. బాధగురువులు మూల్యమే  గురి.*


*బోధగురువులు ఆశీర్వదిస్తారు. బాధగురువులు ఆగ్రహిస్తారు.*


*బోధగురువులు ధర్మవర్తనులు. బాధ గురువులు దురాచార సంపన్నులు.*


*బోధగురువులు మితభాషులు. బాధ గురువులు వాచాలురు.*


*బోధగురువులు వాంఛా రహితులు. బాధగురువులు ఆశాపరులు.*


*బోధగురువులు యదార్థవాదులు. బాధగురువులు కుయుక్తిపరులు.*


*బోధగురువులు దైవభక్తులు , బాధగురువులు భక్తి వర్తకులు.*


*బోధగురువులు కులమతాతీతులు , బాధగురువులు కులపిచ్చోళ్ళు..*


*బోధగురువులు సహృదయులు. బాధగురువులు కఠినాత్ములు.*


*బోధగురువులు అహింసా తత్పరులు. బాధగురువులు హింసావ తారులు.*


*బోధగురువులు సాత్వికులు. బాధగురువులు క్రోధ సంపన్నులు.* 


*బోధగురువులు సంకల్ప సిద్ధులు. బాధగురువులు సంకల్పరహితులు.* 


*బోధగురువులు లక్ష్యసాధకులు. బాధగురువులు గమ్యం తెలియనివారు.* 


*బోధగురువులు అందరివారు. బాధగురువులు కొందరివారు.*


*బోధగురువులు మంచివక్తలు. బాధగురువులు మాటకారులు.*


*బోధగురువులు మంచివారు. బాధగురువులు అలాంటి వేషధారులు.*


*బోధగురువులు రాగద్వేష రహితులు. బాధగురువులు రాగద్వేష పోషకులు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat