నిత్యజీవితంలో యోగాభ్యసనం

P Madhav Kumar



మానవుని మనస్సు చాలా చంచలమైనది. అనేకమైన విషయవాసనలకు లోనై, సంసారబంధాల వెంట పరుగులు పెడుతూ ఉంటుంది. దానివల్ల రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, బంధనాలు కలుగుతూ ఉంటాయి. ఇవ్వన్నీ సంసారం పట్ల వ్యామోహానికి కారణమై, మనస్సు వ్యాకులపడుతూ ఉంటుంది. అందువల్ల ప్రతీ ఒక్కరూ మనశ్శాంతికి, స్థిరత్వానికి ఆరాటపడుతూనే ఉంటారు. ఎలా సాధించాలో తెలియక మరింత కలవరపడుతూ ఉంటారు. దీనికి పరిష్కారం మన పూర్వీకులైన దార్శనికులు, యోగులు మనకి ఎప్పుడో అందించారు. అందులో పతంజలి మహర్షిచే చెప్పబడిన యోగ శాస్త్ర దర్శనం అన్నింటికన్నా సులువైనది, నిత్యమూ అనుష్ఠానం చేయతగ్గది. దర్శనం అంటే వేదం లో చెప్పబడిన విషయాన్ని నిర్ధారించి చెప్పేది. యోగశాస్త్ర దర్శనం అనగానే నేడు చాలామంది పొరబడుతున్నట్లుగా యోగాసనాలు, ప్రాణాయామము మాత్రమే కాదు, దీనికి అతీతంగా జీవాత్మని పరమాత్మతో అనుసంధానం చేసి, బ్రహ్మానందస్థితిని పొందటమే దాని పరమలక్ష్యం. అదే మోక్షస్థితి. మోక్షము, సాధన అనగానే అదేదో బ్రహ్మపదార్ధమన్నట్లు, కేవలం యోగులు, సిద్ధులు, సాధకులకి మాత్రమే పట్టుబడే విద్య, మనకి కాదు అనుకుని చాలామంది దానికి దూరంగా ఉంటారు. కానీ పతంజలి మహర్షి ప్రతిపాదించిన అష్టాంగ యోగదర్శనం అందరూ నిత్యం ఆచరించదగ్గ, అనుష్ఠానంలోకి తెచ్చుకోదగ్గ దర్శనం. నిత్యమూ ప్రయత్నపూర్వకంగా ఆచరణలోకి తెచ్చుకోవలసినది. అష్టాంగ యోగం(యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి)లో మొదటి రెండు అంగాలైన యమ, నియమములు ఈ భౌతిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ సామాజికంగా, వ్యక్తిగతంగా తాము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి తోడ్పడేవి. ఇవి నిష్ఠతో పాటిస్తే మిగిలినవి వాటంతట అవే దైవానుగ్రహం వల్ల సమకూరతాయి.
యమ, నియమాల గురించి తెలుసుకుందాం-

యమము: యమము అంటే అదుపులో ఉంచవలసినది, నియంత్రించవలసినది. అని అర్ధం. వ్యక్తి సంఘపరమైన నైతికవిలువలు పాటించేలా చేసి, అతణ్ణి సామాజికంగా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. యమములు ఐదు.
1. అహింస
2. సత్యము
3. అస్తేయము
4. బ్రహ్మచర్యం
5. అపరిగ్రహము
అహింస – అహింసను ఒక వ్రతంలా పాటించాలి. భౌతికమైన హింసే కాదు, మానసికంగానూ , వాక్కుపరంగానూ కూడా హింసని నిరోధించాలి. శరీరపోషణ కై ప్రకృతిలోని కొన్ని జీవజాతులలోనూ మరియు ధర్మరక్షణకై కొన్ని పరిస్థితులలో మాత్రమే హింసకు అనుమతి ఉంది.

సత్యము – త్రికరణ శుద్ధియైన ఋజుప్రవర్తన. నీతీ,నిజాయితీ పాటించడం. ఎట్టిపరిస్థితుల్లోనూ సత్యాన్ని విడువకపోవడం.

అస్తేయము – పరుల సొమ్మును ఆశించకుండా ఉండడం, దొంగతనం చేయకుండా ఉండడం. కనీసం అలాంటి తలంపు కూడా మనసులోకి రాకుండా నిరోధించుకోవాలి. దీన్ని పాటించడం వల్ల మనకు అవసరమైనది, అర్హమైనది ఆ భగవానుడే మనకు సమకూరుస్తాడనే నమ్మకం పెంచుకోవాలి. మనకు కావలసింది ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి.

బ్రహ్మచర్యం – వంశాభివృద్ధి కోసమే దాంపత్యం అని త్రికరణశుద్ధిగా నమ్మి, అది ఒక యజ్ఞంలా భావించాలి. ఏకపత్నీవ్రతుడైన గృహస్థు బ్రహ్మచారే అంటోంది శాస్త్రం.

అపరిగ్రహం – ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటం, దురాశ లేకుండా అవసరమైనంత లేదా ఒక్కోసారి తక్కువగా కూడా గ్రహించడం నియమాలు అంటే ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసినవి, ఆచరించవలసినవి. ఇది వ్యక్తిగత

క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తుంది. నియమాలు కూడా ఐదు.
1. శౌచము
2. సంతోషము
3. తపస్సు
4. స్వాధ్యాయము
5. ఈశ్వర ప్రణిధానము.

శౌచము – ఇది ప్రతీ ఒక్కరూ శారీరికంగా, మానసికంగా పాటించవలసినది. దాని వల్ల బాహ్య, అంతఃశుద్ధి జరిగి, ఆరోగ్యం చెంత చేరుతుంది, మనస్సు తేలికగా ఉంటుంది.

సంతోషము – జీవితంలో కష్టసుఖాలు ఎదురైనప్పటికీ, అవి సహజమే అన్న దృష్టితో ఎల్లప్పుడూ సంతోషాన్ని వీడకూడదు. ప్రయత్నపూర్వకంగానైనా సంతోషంగా ఉండాలి. తనకు లభించిన దానితో తృప్తి చెందటమే సంతోషం.

తపస్సు – తపస్సు అంటే జనాలకి దూరంగా ఉండి అడవుల్లో చేసేది కాదు. శారీరిక, వాఙ్మయ , మానసికమని మూడు విధాలైన తపస్సులు. పెద్దలు, గురుజనుల సేవ, ఎల్లప్పుడూ సేవాభావంతో ఉండటం, సేవ చేయటం శారీరిక తపస్సు. మన మాటని మృదువుగా, అర్ధవంతంగా, వినసొంపుగా, తగుమాత్రంగా, వినియోగించుకోవడమే వాక్ తపస్సు. మనసు సదా పవిత్ర భావనలతో, పరిశుద్ధంగా ఉంచుకోవడమే మానసికమైన తపస్సు.

స్వాధ్యాయం – తనకు అధ్యాత్మికోన్నతిని కలిగించే పవిత్ర గ్రంథాలని అధ్యయనం చేస్తూ, ఇష్టదేవతా ప్రార్థన సదా చేస్తూ, తనకు కలిగే సందేహాలను తీర్చుకోవడమే స్వాధ్యాయము.

ఈశ్వర ప్రణిధానము – మనస్సును దైవానికి శరణాగతి చేయడం, ఆ దైవానికి, ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తించడమే ఈశ్వర ప్రణిధానము.

ఈ యమ నియమాలు పదింటినీ నిత్యం అనుష్ఠానంలోకి తెచ్చుకుంటే మానవ జీవితం ఉన్నత పథంలో నిలుస్తుంది. మనస్సు నిర్మలత్వాన్ని, స్థిరత్వాన్ని పొందుతుంది. జీవ, బ్రహ్మ ఏకత్వానికి కావలసిన పునాది పడుతుంది.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat