👉 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం- కరీంనగర్ జిల్లా : ధర్మపురి
💠“భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ ధురిత దూర” అనే మకుటంతో యావత్ ఆంధ్రరాష్ట్ర ప్రజలకు సుపరిచితం.
ధర్మపురికి పోతే యమపురి ఉండదనే నమ్మకంతో భక్తజనం నిత్యం క్షేత్రానికి తరలివస్తుంటారు.
💠 కరీంనగర్ జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో గల ధర్మపురి క్షేత్రం దక్షిణ భారతదేశంలోని దక్షిణ కాశీగా పేరునొంది పవిత్ర గోదావరి నది తీరాన విరాజిల్లుతోన్న ఈ పుణ్యతీర్థానికి పురాణ, ఇతిహాస, సాహిత్య ప్రాధాన్యతతో అధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోంది.
💠 ఇక్కడ శ్రీ నరసింహుడు లక్ష్మీ సమేతంగా వెలసి యోగానంద నారసింహునిగా స్యయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోర మీసాలతో ప్రసన్న వదనంతో దర్శనం ఇస్తాడు.
ఇక్కడే వున్న మరో ఆలయంలో ఉగ్ర రూపుడైన మరో నృసింహస్వామి వారి విగ్రహం కూడవున్నది.
💠 ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దైవమైన నరసింహుడిని క్షేత్రపాలకుడైన ఆజనేయుడు అష్టదిగ్భందన చేసి ఉంటాడు.
అందువల్లే ఈ క్షేత్రం భూత, ప్రేత, పిశాచాల నుంచి బాధింపబడే వారికి ఉపశమనం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం..
💠 సత్యవతి దేవి తన ప్రాతివత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఇసుకను గాలిలోకి విసరడంతో ఆ ఇసుక రేణువులు స్థంభంగా మారి నిలిచిన ఉదంతం కూడా ఈ క్షేత్రంలోనే నేటికి అగుపిస్తుంది.
పూర్వము ధర్మవర్మ మహారాజు ప్రజలందరినీ ధర్మమార్గంలో నడిపించి నాలుగు పాదములా ధర్మముతో ఈ క్షేత్రమును పరిపాలించినందున దీనికి ధర్మపురి అని పేరు వచ్చినట్లు ఇతి హాసాలు తెలుపుతున్నవి.
💠 సాక్ష్యత్తు శ్రీ రాముడు చేసిన ఇసుక లింగాన్ని మనం ఇక్కడ నేటికి చూడవచ్చు.
💠 ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత స్వామి వారి ఆలయం బైట ఉన్న రాయి పైన ఏదైనా సంకల్పం చేసుకొని ఒక్క కాయిన్ ఉంచితే అది అలాగే నిలబడితే మనం అనుకున్న సంకల్పం నెరవేరుతుంది..
పిల్లల కోసం మొక్కుకునే దంపతులు స్వామి వారి దర్శనము చేసుకోవడం ఉత్తమం..
💠 యమధర్మరాజు రోజూ పాపులను చూసీ చూసీ, వారికి శిక్షలు వేసీ వేసీ, తనకి లేనిపోని పాపాలంటుకుంటున్నాయని దీగులుచెంది, ఆ పాప ప్రక్షాళనకు తీర్ధయాత్రలు చేస్తూ, ఇక్కడ గోదావరిలో స్నానం చేశాడుట.
దానితో ఆయనకి మనశ్శాంతి లభించి, నరసింహస్వామి మందిరానికెళ్ళి పూజించాడు. నరసింహస్వామి ప్రసన్నుడై ఇంకముందు నీముందుకెలాంటి పాపాత్ముడు వచ్చినా నీకెలాంటి దోషమూ వుండదనే కాక తన సన్నిధిలో నివసించమని కూడా ఆనతినిచ్చాడు. నరసింహస్వామి ఆలయం వెలుపల వున్న యమధర్మరాజు ఆలయం దర్శించి, అక్కడ గండ దీపంలో నూనె సమర్పించినవారికి అపమృత్యు దోషం వుండదనీ, మృత్యు భయం వుండదనీ ప్రతీతి. యమధర్మరాజు స్నానం చేసిన ప్రదేశానికి యమకుండమని పేరు.
💠 యముడు యమున కవలపిల్లలు కాగా ఏటా దీపావళితదుపరి విదియనాడు యమధర్మరాజు సోదరి చేతి భోజనము తినడానికి భూలోకం వస్తాడని నమ్మకము . అందువలన ఈరోజు భగినీహస్త భోజనము అను అన్నదమ్ములు అక్కా/చెల్లెలు చేతిభోజనం చేసి కానుకలు ఇచ్చు సంప్రదాయం తెలుగువారికి ఏర్పడింది
💠 తమ జాతకాలు బాలేవని, ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని,మానసిక ప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు ఈ ఆలయం లోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం.
💠 ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని తొలగిపోతాయి అని కూడా భక్తుల నమ్మకం.
💠 ప్రతి నెల భరణి నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ .
💠 అంతేకాదు దీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే 'యమ ద్వితీయ' రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిచాడని ప్రతీతి.
💠 ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ది చెందింది. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవవచ్చు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. చూపిస్తుందంటారు.
దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చిస్తే ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.