శ్రీ లలితా త్రిపుర సుందరి
భక్తుడు ధాన్యం చేసుకోవడానికి ఒక రూపం కల్పించబడ్డది. మరి ఆ రూపానికో నామం, ఆ నామ రూపాలకో నివాస స్థానం. ఇవన్నీ ఎందుకంటే భక్తుడు భగవంతున్ని కూడా తనతో పోల్చుకొంటాడు. తనలాగే నామరూపాలు నివాసం ఉంటాయనుకొంటాడు. తన లాగే వేష భాషలుంటాయని తలపోస్తాడు. తన లాగే భగవంతునికి కూడా సంసారం వున్నదని అనుకొంటాడు. తనకు ఇష్టమైన పదార్థాలు అన్నీ భగవంతుడికి కూడా ప్రీతికరమైనవిగా భావిస్తాడు. ప్రతి జీవీ భగవంతుడు తన లాగే వుంటాడని నమ్ముతుంది. ఒక శునకాన్ని భగవంతుడు ఎలా వుంటాడని ప్రశ్నిస్తే, తన లాగే శునక రూపం లో వుంటాడని చెబుతుంది.
మొదట్లో ఒక నామాన్ని, రూపాన్ని, ఒక స్థానాన్ని తన అభీష్టానికి అనుగుణంగా భావించుకొని ధ్యానం చేయవచ్చు. కానీ అదే శాశ్వతంగా చేసుకోకూడదు. భగవానుని పై వున్న భక్తిని అనుసరించి ధ్యానాన్ని అభ్యసించాలి. అంటే చూసే ప్రతి వస్తువు ను భగవత్స్వరూపంగా ధ్యానం చేయాలి. అన్ని రూపాలలో, అన్ని దేవతలలో, అన్ని స్థానాలలో మన ఇష్ట దైవాన్ని చూడగలగాలి. అన్ని రూపాలూ ఒకటేనని గాడంగా నమ్మాలి. తత్వం ఒకటేనని నమ్మిక రావాలి.
ఒకే బంగారం వివిధ ఆభరణాలలో వున్నట్లు, ఒకే పరబ్రహ్మం వివిధ రూపాలలో కొలువై వున్నది. దైవం ఒక్కడేనని, అనేక నామరూపాలు భక్తుల సౌకర్యము కోసమే ధరిస్తాడని, వాటిల్లో ఏ నామరూపాలతో ధ్యానించినా ఆ పరమాత్మ కరుణిస్తాడని తెలుసుకోవాలి. శైవులు లింగాకారాన్ని ప్రార్ధిస్తారు. అదే వైష్ణవులు నవరత్న ఖచితమైన ఆభరణాలతో అలంకరించిన శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. ఇరువురిని ఒక్కటిగా చూచి, కొలిచే వాడే యోగి. ఎందుకంటే ఆ ఇద్దరిలోనూ వున్న నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్నే యోగి చూస్తాడుగనుక. లింగ భేదాలు శబ్దాన్ని బట్టి కలిగాయే గాని, వస్తువును బట్టి గాదు. లింగ భేదం గాని, నామ రూపాలు గాని సగుణ బ్రహ్మనికే గాని నిర్గుణ పరబ్రహ్మానికి కాదు.
కాబట్టి ఎవరికి ఏ రూపం, ఏ నామం ప్రియంగా వుంటుందో, అతడా నామరూపాలలో ఆ పరబ్రహ్మమును కోలుచుకోవచ్చు. ఆ స్థాయికి భక్తుడు ఎదగాలి. తన భక్తి శ్రద్ధలను బట్టి, విశ్వాసమును బట్టి తను కొలిచే రూపములోకి ఆ పరబ్రహ్మ స్వరూపము ఆకర్షించబడును. భక్తి శ్రద్ధలతో ఏ దేవుణ్ణి, ఏ దేవతను కొలిచినా, చివరకు రాయి, రప్ప, చెట్టు, పుట్ట దేనినైనా సరే, భగవంతుడు పలికి తీరుతాడు. నమ్మకం ముఖ్యం.
లలితా త్రిపుర సుందరి - lalita tripura sundari - japanese paint |
నిర్గుణ పర బ్రహ్మం తప్ప మిగిలిన వారంతా మాయాశక్తి అయిన ప్రకృతి చేత సృష్టి౦చబడ్డ వాళ్ళే. కాబట్టి ముందుగా మూల ప్రకృతిని, ఆ పర దేవతను ఉపాసించి, ఆమె అనుగ్రహానికి పాత్రులై, ఆ పరమాత్మ కరుణకు పాత్రులు కావాలన్నదే శ్రీవిద్యోపాసకుల భావం.
మంత్రమంటే శ్రీచక్రమని, శ్రీచక్రములో సర్వ దేవతలుంటారని, ఒక్క పరబ్రహ్మం తప్ప మిగిలిన దేవతలంతా కూడా త్రిమూర్తులతో సహా ఆ దేవిని సేవిస్తూ వుంటారని, త్రిమూర్తులకు కూడా ఆమే తల్లి యని, శ్రీచక్రములో ముక్కోటి దేవతలను భావించుకుంటూ, అందులోని బిందు స్థానాన్ని ఆ పరదేవతగా ధ్యానిస్తూ, శ్రీ శంకరభగవత్పాదుల చే పరిష్కరించబడి వేదోక్త విధి విధానములతో చేయబడే శ్రీ విద్యా తంత్రమును, దక్షిణాచారమని అంటారు. కరచరణాదులతో గూడిన సగుణ బ్రహ్మాన్ని, లేదా తద్దేవతా యంత్రములను, షోడశోపచారములతో, ధూప,దీప,నైవేద్యములతో పూజించడాన్ని బహిర్యాగమందురు.
మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ రూపమైన ఆ శ్రీమాతను, ఆ పరదేవతను ఆరాధించి కొలవడమే శ్రీవిద్యోపాసన. త్రిమూర్తులను త్రిశక్తులను సృష్టించిన శ్రీమాత ఆమె. సర్వ సృష్టికి మూలాధారమైన ఆ ఆదిశక్తి మన తల్లి. ఒకప్పుడు ఆమెను దేవతలందరూ అమ్మా నీవు ఎవరు ? అని అడుగగా, “ నేను బ్రహ్మస్వరూపిణిని, నా వలననే ప్రకృతి పురుషులు పుట్టుచున్నారు, జగమును జనించుచున్నది” ...అని చెప్పినది. అందుకే ఆమె “బ్రహ్మ విష్ణు శివాత్మికా” .. అని, శివ శక్త్యైక్య రూపిణీ లలితాంబికా, .. అని, పిలవబడుచున్నది. మూడు గుణములకు ప్రతి రూపమైన త్రిమూర్తులకు తల్లియై, వారికి కూడా శక్తిని ప్రసాదిస్తూ త్రికోణా౦తర దీపికా గా తన ప్రభలను ప్రభవిస్తూ వున్నది. బ్రహ్మాండము లన్నింటికీ శక్తిని ఇస్తూ, సమస్త గ్రహములను నిర్దిష్ట కక్ష్యలో పరిభ్రమణ చేయుస్తూ, అవి పడిపోకుండా నిలుపుదల చేసిన మహాశక్తి మన తల్లియే. మన పెద్దమ్మే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ.
ప్రకృతితో కలిసి ఉండకపోయినట్లయితే పరమేశ్వరుడు కూడా దేహాన్ని ధరించలేడు. రాగితో కలవనిదే బంగారము ఆభరణము కాదు. కాబట్టి ధర్మ రక్షణ కోసం నిర్గుణ పరబ్రహ్మం, సతితో కలసి సగుణాన్ని స్వీకరిస్తాడు. అప్పడు రూపం ఏర్పడుతుంది. తన మహాత్త్వాన్ని లోకానికి చాటి చెప్తూ అధర్మాన్ని సంపూర్ణంగా నిర్మూలించి అటు పైన ఆ రూపాన్ని వదిలేస్తాడు. ఈ రూపాన్నే మనము అర్చనా పరంగా ఆరాధిస్తాము. అటువంటి రూపాలనే మనము అవతరాలని అంటూవుంటాం.
దేవతల యొక్క శక్తి వాని మంత్రములయందు, మంత్రముల యొక్క శక్తి వాని బీజముల యందు నిక్షిప్తమైయున్నట్లు, ఆయా దేవతల తత్వమంతయు సంక్షిప్తముగా ఇమిడియుండుటచేత ఆయా దేవతల మంత్రములు ఆయా దేవతల సూక్ష్మ రూపమని అందురు. ఇట్టి సూక్ష్మరూపమును జపాది రూపమున మానసికముగా, భావనాపరంగా చేయు క్రియను “అంతర్యాగము అని అందురు.
మానసికంగా చేసే ప్రతి పూజా “అంతర్యాగము అగును. బాహ్యముగా చేసే శ్రీచక్రార్చనను అంతర్ముఖమున షట్చక్ర భేదనముచే, బ్రహ్మగ్రంధి, విష్ణు గ్రంధి, రుద్రగ్రంధిని చేధించి సహస్రారమును చేరే యాగమును “అంతర్యాగము అని అందురు.
శ్రీ శంకర భగవత్పాదులకు గురువైన శ్రీ గౌడపాదాచార్యులు విరచించిన శ్రీ విద్యా సూత్రముల గురించి, మానవ శరీరములోని షట్చక్రములు అందలి దేవతలు, శ్రీచక్రమునకు గల ఐక్యత, సంబంధము గురించి, కుండలినీశక్తిని గురించి, మరో టపాలో తెలుసుకొందాము. మంత్ర, తంత్ర, యంత్ర, శాస్త్రములను, పాఠములను గురు ముఖతః తెలుసుకోవలెను,
గావున ఇచట చర్చించుట లేదు.................. సశేషం.
రచన: భాస్కరానందనాథ (కామరాజుగడ్డ రామచంద్రరావు గారు) - 9959022941 {full_page}