ఉగాది - ఇంగ్లీష్ క్యాలండర్‌ను అనుసరిస్తున్న ఈ సమయంలో, మనం మన సాంప్రదాయ పంచాంగాన్ని అనుసరించడం అవసరమా? - Ugadi Meaning

P Madhav Kumar

 

ఉగాది 


కొంత నిర్దుష్టమైన కాలం, కొంత నిర్దుష్టమైన శక్తి – ఈ రెంటిని కలిపి మనం జీవితం అంటాం. ఇందులో కాలమనేది మాత్రం మన ప్రమేయం లేకుండానే గడిచిపోతుంది. ముఖ్యంగా కాలమనే ఆలోచన భూమి చుట్టూ జరిగే చంద్ర పరిభ్రమణం వల్ల, సూర్యుని చుట్టూ జరిగే భూ పరిభ్రమణం వల్ల ఏర్పడింది. భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరిగితే ఒక నెల. సూర్యుని చుట్టూ భూమి ఒకసారి తిరిగితే ఒక సంవత్సరం. ఈ సూర్యచంద్రలకు సాపేక్షంగా భూమి ఉండే స్థానం మన వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుంది. మన శరీరం, మనసులపై ఈ సూర్య చంద్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
భూమి ముఖ్యంగా సూర్యశక్తి వల్లే నడుస్తున్నది, మీ శరీరం కూడా ఈ భూమిలో ఒక అంశమే.
సూర్యశక్తిని మీరెంత గ్రహించగలరన్న దానిని బట్టే మీకెంత శక్తి ఉన్నదనేది నిర్ణయించబడుతుంది. అందువల్ల సూర్యుని చుట్టూ జరిగే భూ పరిభ్రమణం కాలాన్నే కాక, మన శక్తిని కూడా నిర్దేశిస్తుంది. అంటే జీవానికి ప్రధాన అంశాలైన కాలమూ, శక్తి అనే ఈ రెండూ కూడా సూర్యుని వల్లనే నిర్దేశింపబడుతున్నాయి. అందువల్ల భూమిపై సూర్యుని ప్రభావం అత్యధికంగా ఉంటుంది.

సూర్యునిలాగా చంద్రుడు శక్తిని ప్రసరించ లేకపోయినా, భూమికి అతి సమీపంలో ఉండడంవల్ల మనపై చంద్రుడి ప్రభావం కూడా ఎక్కువే. అసలు మన పుట్టుకే చంద్ర గమనంపై ఆధారపడి ఉన్నది. ఎందుకంటే స్త్రీ శరీరంలోని ఋతు క్రమానికీ, చంద్రుని గమనానికి నూటికి నూరు శాతం సంబంధం ఉన్నది. చంద్రుని ప్రభావం కాంతి, శక్తి, ఉష్ణాలకు సంబంధించినది కాదు, అది అయస్కాంత పరమైనది. ఈ రోజు ఏదో ఒకదాని భ్రమణ, పరిభ్రమణాల వల్లనే విద్యుత్తు తయారవుతున్నది – అందుకు వేరే మార్గం లేదు. అదే విధంగా చంద్రుడు తన భ్రమణ, పరిభ్రమణాల ద్వారా ఒక శక్తి క్షేత్రాన్ని ఏర్పరుస్తున్నాడు. తద్వారా మనపై ప్రభావం చూపుతున్నాడు.  బయట నుంచి మన జీవితాన్ని ప్రభావితం చేసే వాటిని అర్థం చేసుకోవాలంటే సూర్యడిని పరిగణనలోకి తీసుకోవాలి. అంతరంగంలో జరిగే దానిని అర్థం చేసుకోవాలంటే చంద్రుడిని పరిగణనలోకి తీసుకోవాలి.

మానవుని అంతరంగంలో జరిగే దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే సంస్కృతులు సహజంగానే  ‘చాంద్రమాన క్యాలండర్‌’ను లేక  చాంద్రమాన ప్రభావం ఎక్కువ ఉన్న ‘సౌర-చాంద్రమాన’ క్యాలండర్‌ను అనుసరించాయి. భారతీయ సాంప్రదాయ క్యాలండర్‌ని  పంచాంగం అంటారు. మనకు బాహ్య, అంతర్గత శ్రేయస్సులు రెంటిపైనా ఆసక్తి ఉంది కాబట్టి, మన పంచాంగం ఒక ‘సౌరచాంద్రమాన’ క్యాలండర్. అది భూమి చుట్టూ  జరిగే చంద్రుని గమనాన్ని, సూర్యుని చుట్టూ జరిగే భూమి గమనాన్ని పరిగణనలోనికి తీసుకుంటుంది. ఈ విధంగా క్యాలండర్ తయారుచేసుకోవడం చాలా ఉత్తమం, కానీ దురదృష్టవశాత్తూ అటువంటి క్యాలండర్ ఒకటుందని కూడా ఈ కాలంలో చాలామందికి తెలియదు.

ప్రపంచంలో అతి పురాతనమైన క్యాలండర్లలో ఇది ఒకటి.  ఈ క్యాలండర్ పరంగా ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నాము. భారతీయ క్యాలండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజును ఉగాది అంటాము. ఇప్పడు భూమి సూర్యునికి అతి సమీపంలో ఉన్నది. ఎదగటానికి వేసవి అత్యంత అనుకూలమైనది. వృక్షజాతి అంతా వేసవిలోనే బాగా పెరుగుతుంది. ఎందుకంటే వాటి పెరుగుదలకి అవసరమైన కిరణజన్య సంయోగక్రియ ఈ సమయంలో బాగా జరుగుతుంది. కాని భూమిపై ఉండవలసిన వాటినన్నిటినీ మనం నాశనం చేశాము కాబట్టి, ప్రస్తుతం వేసవి అంటే అత్యంత అసౌకర్యమైన కాలంగా మారింది. అసలు వేసవి అంటే ఎడారులలో మాత్రమే అసౌకర్యంగా ఉండాలి. మిగతా భూమి మీద జీవనం ఎంతో ఉన్నత స్థాయిలో, ఉత్సాహంగా జరగవలసిన సమయమిది. ఎరుక(అవేర్‌నెస్‌)తో ఉంటే ఈ సమయమే మానవులకు కూడా ఎంతో మంచిది. మీ చుట్టూ ఉన్న జీవనం ఉరకలేస్తూ ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు మీకు కావలసిన విధంగా మలచుకోవడానికి కూడా ఇదే ఉత్తమమైన సమయం. ఇది ఉత్తరాయణ కాలం కూడా. అంటే భూమి పరంగా చూస్తే సూర్య గమనం ఉత్తరం వైపు ఉంటుంది. ఉత్తరార్థగోళంలో ఉన్న మనకు ఈ సమయం ఎంతో ముఖ్యమైనది – ఆత్మ సాక్షాత్కారానికి, ఆశయ సాధనకు అనువైన సమయం ఇదే!

నిజానికి ఈ అనంత విశ్వంలో పాత సంవత్సరం, కొత్తసంవత్సరం అంటూ ఏమీలేవు. ఈ ఎల్లలన్నీ మనం మన జీవితం ఎలా సాగుతుందో చూసుకోవడానికి మనం ఏర్పరచుకున్నవే. మనం ముందుకు పోతున్నామో, లేదా వెనక్కు పోతున్నామో తెలుసుకోవడానికి ఏర్పరచుకున్నవే. అందువల్ల క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే ఒక మినిషిగా మనం పురోగమించామా లేదా గమనించాలి. మీ వ్యాపారం అభివృద్ధి చెంది ఉండవచ్చు. మీరు బాగా సంపాదించి ఉండవచ్చు. మీ అమ్మాయికి పెళ్లి చేసి ఉండవచ్చు. కానీ, అది కాదు అసలు విషయం. ఒక మనిషిిిిగా క్రితం సంవత్సరం కన్నా కొద్దిగానైనా మెరుగయ్యామా, లేదా అన్నది చూసుకోవాలి. అలాగే వచ్చే సంవత్సరం కల్లా మీరు ఇప్పటికన్నా చాలా మెరుగైన మనిషిగా  మారాలి – ఇంకా సంతోషంగా, శాంతంగా, ప్రేమగా ఉండే, అంటే అన్నిరకాలుగా ఉత్తమమైన మనిషిగా తయారవ్వాలి. దానికి మీరేం చేయాలో మీరే నిర్ణయించుకోవాలి.
మీరు ఆ విధమైన ఆలోచనతో అడుగులు వేస్తే, మీలో మానవత్వం పొంగిపొర్లుతుంది. అప్పుడు దివ్యత్వం మీకు దానంతటదే సంభవిస్తుంది. అలా మీకు సంభవించు గాక!

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat