*గురుగ్రహ జననం - 2*
అంగిరసుడూ , శ్రద్ధా ఆనందంతో ఒకరినొకరు చూసుకున్నారు. శ్రద్ధ ఆనందావేశాలతో పసికందును ముద్దులతో నింపేసింది.
*"మా జన్మలు ధన్యమైనాయి ! దేవదేవులకు మా ధన్యవాద పూర్వక ప్రణామాలు అందజేయి , నారదా !"* అంగిరసుడు అన్నాడు.
*"బృహస్పతిని మేధావంతుడిగా , జ్ఞానసముద్రుడిగా తీర్చిదిద్దే అద్భుతమైన అవకాశమూ , విశిష్టమైన విధీ మీవే , అంగీరస మహర్షీ !"* నారదుడు ప్రోత్సహిస్తూ అన్నాడు.
*"అది నా అదృష్టం నారదా ! జ్ఞాన పరీక్షలో నన్ను అవలీలగా పరాజితుణ్ణి చేసేటంత మేధావిగా తీర్చిదుద్దుతాను నా కుమారుడిని !”* అంగిరసుడు సగర్వంగా అన్నాడు.
*“బాగుంది ! పుత్రాదిచ్చేత్ పరాజయం ! శుభం ! వెళ్ళివస్తాను. త్రిమూర్తులకు బృహస్పతి బాలకుడి గురించి విన్నవించాలి"* నారదుడు నవ్వుతూ అన్నాడు.
తల్లిదండ్రుల పెంపకంలో బృహస్పతి గారాబంగా పెరుగుతూ పెద్దవాడవుతున్నాడు. కుమారుడి బుద్ధికుశలతను గుర్తించిన అంగిరస మహర్షి. అనుకున్న సమయం కన్నా ముందే విద్యాబోధన ప్రారంభించాడు. అన్న ఉతథ్యుడినీ , తల్లితండ్రులనూ ఆశ్చర్యపరుస్తూ , చురుకుగా , వేగంగా వేదశాస్త్రాలు అవగాహన చేసుకుంటూ విద్యాభ్యాసంలో పురోగమిస్తున్నాడు బృహస్పతి.
విద్యార్జనకే అంకితమై పోయిన బృహస్పతి - గురువుకు తీసిపోని శిష్యుడిగా , తండ్రిని మించిన తనయుడుగా తనను తాను నిరూపించుకుని , యువకుడయ్యాడు.
జ్యేష్ట పుత్రుడైన ఉతథ్యుడికి అదివరకే వివాహం జరిపించిన అంగిరస దంపతులు బృహస్పతి వివాహం గురించి ఆలోచనలో పడ్డారు.
తన లోక సంచారంలో భాగంగా నారదుడు స్వర్గ రాజ్యానికి వెళ్ళి ఇంద్రుణ్ణి కలుసుకున్నాడు. ఇంద్రుడి వైభవాన్ని శ్లాఘించాడు.
*“నా పరిపాలనలో మా దేవతలకు అన్నీ ఉన్నాయి. విద్యాబుద్ధులు చెప్పి , మార్గనిర్దేశం చేసే గురువు లేడు ! ఆ లోటు బాగా కనిపిస్తోంది. నారదమునీంద్రా !"* ఇంద్రుడు నారదుడితో అన్నాడు. *"అందరినీ ఎరిగినవాడివి ! దేవ గురువుగా తగిన విజ్ఞానిని సూచించ వచ్చు కదా !"*
*“నారాయణ ! చక్కటి ఆలోచన ! దేవ గురువుగా రాణించే వ్యక్తి ధీశాలి అయి ఉండాలి. నా దృష్టిలో అంతటి మహాజ్ఞాన సంపన్నుడు ఒక్కడే ఉన్నాడు."*
*ఎవరు ? ఎవరా మేధావి ?"* ఇంద్రుడు ఆత్రుతగా అడిగాడు.
*"శ్రద్ధా అంగిరస దంపతుల పుత్రుడు బృహస్పతి ! విద్యాభ్యాసం ముగించి , తగిన అర్హత సముపార్జించి , సర్వసిద్ధంగా ఉన్నాడు. బృహస్పతి గురువుగా లభిస్తే - మహేంద్రుడి పరిపాలన కొత్త పుంతలు తొక్కుతుంది."*
*"మనిద్దరం ఈ క్షణమే అంగిరసుడి ఆశ్రమానికి వెళుతున్నాం. ఆయన మా జనకులకు తోటి మానసపుత్రుడే కదా"* అంటూ ఇంద్రుడు సింహాసనం మీద నుంచి లేచాడు.
అంగిరసుడికీ శ్రద్దకూ పాదాభివందనం చేసి , ఇంద్రుడు తాను వచ్చిన పనిని విన్నవించాడు.
*"మా పుత్రుడి బుద్ధికుశలత దేవతల అభివృద్ధికి ఉపయోగపడితే - అంతకన్నా ఏం కావాలి ?"* అంగీరసుడు సంతోషంగా అన్నాడు. *"బృహస్పతి అభిప్రాయం తెలుసుకుందాం !"*
*"మీ అనతి నా కర్తవ్యం నాన్నగారూ ! అయితే ఒక నిబంధన ! ఒక ఆశ్రమ పాఠశాల స్థాపించి , మీరు అనుగ్రహించిన అపార విద్యాసంపదను విద్యార్థులకు పంచాలని నిర్ణయించుకున్నాను..."*
*"మా గురుదేవుల నిర్ణయం మాకు ఆమోదయోగ్యమే. వారి ఆశ్రమ పాఠశాలలో మా దేవ విద్యార్థులు కూడా విద్యను ఆర్జిస్తారు. చక్కటి ప్రదేశంలో ఆశ్రమం ఏర్పాటు చేసి , గురువు గారికి అర్పించుకుంటాం"* గురుశిష్య సంబంధంతో వరస కలుపుతూ అన్నాడు. ఇంద్రుడు.
*"సంతోషం ! బృహస్పతికి వివాహం చేయాలని తల్లిదండ్రులైన మేం సంకల్పించాం".* అంగిరసుడు అన్నాడు.
*"ఆ శుభకార్యం బాధ్యత కూడా ఈ దేవరాజు భుజస్కంధాల మీద మోపండి ! మా గురుపుంగవులకు తగిన కన్యను సూచించమని ఆ సృష్టికర్తను అర్థిస్తాను !"* ఇంద్రుడు అన్నాడు.
*"మహేంద్రుల ఆలోచన దివ్యంగా ఉంది !"* నారదుడు మెచ్చుకున్నాడు.
*"అలాగే... అంతకంటేనా ! కన్యను మా పితృదేవులే నిర్ణయిస్తే ఇక అభ్యంతరం మేముంటుంది !"* అంగిరసుడు సంతోషంగా అన్నాడు.
*"మహేంద్రా ! దేవసభ 'సుధర్మ'లో మా బృహస్పతిని దేవగురువుగా అభిషేకించేదెప్పుడు ?"* నారదుడు అడిగాడు.