🔰 *శ్రీ గణేశ పురాణం* 🔰 *భాగం 4*

P Madhav Kumar


*ఉపాసనాఖండము*

*మొదటి భాగము*

*సోమకాంత తపశ్చర్య*


సూతుడు తిరిగి యిలా చెప్పసాగాడు!

"ఓ మహర్షులారా! 

ఇలా సోమకాంతమహారాజు తన కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి, సబ్రాహ్మణులకు విలువైన

మణిమాణిక్యాలనూ, ఇతరులందరికి వారివారికి తగినట్లుగా ఏనుగులను,

ఆవులను, జాతిగుఱ్ఱాలనూ, ధనధాన్యాలనూ యిచ్చి భూరిగా సత్కరించాడు. దేశవిదేశాలనుంచి వచ్చిన రాయబారులకు చీని చీనాంబరములనిచ్చీ, జలతారు శాలువలతోనూ సత్కరించాడు. మంత్రులకు సైతం అనేక గ్రామాలను బహూకరించాడు. ఇవన్నీ, ముగించుకుని తరువాత

తన దేహపుబాధ భరించలేనంతగా పెరిగిపోగా ఎంతో బాధతో అరణ్యా

నికి వెళ్ళటానికి ఉద్యుక్తుడైనాడు. ప్రజాభిమానాన్ని చూరగొని, వారికి తలలో నాలికై, కన్నబిడ్డల్లా ప్రేమతో తమను పాలించిన ఆ సోమకాంతమహారాజును విడిచివుండలేక

హాహాకారాలతో ప్రజలంతా ఆతనిని అనుసరించారు. తమ పనులన్నీ విడిచి ప్రజలూ, ఆయననుఅనుసరించడంకోసం మంత్రులు, రాణులూ,

కుమారుడైన హేమకంఠుడూ ఆతని వెనుకే పరుగెత్తారు. అలా రెండు క్రోసులదూరం నడిచాక రాజు అలసి అక్కడ ఒక శీతలోద్యానవనం

లో కూర్చుని ప్రజలతో యిలా అన్నాడు : 

"ఓ నా ప్రియప్రజలారా! రాజ్యపరిపాలన సమయంలో నావలన మీకు జరిగిన అపరాధములనన్నింటినీ క్షమించమని అంజలిఒగ్గి ప్రార్ధి

స్తున్నాను. నాకుమారుడైన హేమకంఠునియెడల కూడా దయతో వ్యవహరించ నాపట్ల మీరు ఎలాంటి స్నేహభావాన్నీ ఆప్యాయతనూ

కలిగివున్నారో అలాగే హేమకంఠునిపట్ల కూడా ఆదరం కలిగివుండండి.

మీరందరూ రాజధానికి తిరిగివెళ్ళి అతని పరిపాలనలో సుఖవంతులై ఉందురుగాక! శాంతస్వస్థచిత్తముతో నాకు అరణ్యానికి వెళ్ళేందుకు

అనుమతినివ్వండి! మీరంతాపురమునకు మరలివెళ్ళాక నేను ప్రశాంత

చిత్తంతో అడవికి వెడతాను. కనుక మీరు నాయందు దయయుంచి ఈ ఉపకారము చేయండి. ఆహా జన్మాంతరీయమైన పాపంవల్లనేకదా!

మీ అందరితోనూ రాజ్యంతోనూ ఈ వియోగం సంభవించింది, రోగ

భూయిష్టమై అసహ్యాన్ని కల్గించే దుర్భరమైన ఈ కుష్టువ్యాధిగ్రస్తుత్తైన

నేనెలాగ పరిపాలించగలను? ఎవరికైనా తమ దేహప్రారబ్ధం అనుభవించక తప్పదుకదా!" అన్నాడు. ఆ రాజుయొక్క వియోగాన్ని సహింపలేని

కొందరు ప్రజలు ధైర్యం తెచ్చుకొని "ఓ మహారాజా! మమ్మల్ని పోషించటంచేతా, పాలించటంచేతా,

రక్షించుటచేత నీవు మాకు తండ్రివైనావు! కన్నబిడ్డల్లా వాత్సల్యంతోచూసుకున్న నిన్ను మేమెలా విడువగలము? చంద్రుడులేని ఆకాశంలా,

నీవులేని రాజ్యం శోభించదు! గనుక మేమూ నిన్ను అనుసరించి వచ్చి

నీతోపాటే కొన్ని పుణ్యతీర్ధములనూ సేవించుకుంటాము. దైవకృపవల్లా, పుణ్యతీర్ధ సంసేవనంవల్ల నీకు శరీర స్వస్థతచిక్కితే తిరిగి మనమంతా రాజధానిని చేరుకుందాము” అన్నారు.

“ఓ ప్రజలారా! మీరిలా మారుపలకటం భావ్యంకాదు! ఇది మీకు తగదు!" అంటూ మూడుసార్లు పలికి వారించిన సోమకాంతుడితో

పుత్రుడైన హేమకంఠుడిలా అంటున్నాడు.

"ఓ తండ్రీ! నీవులేని నాకు ఈ రాజ్యభోగములమీదగాని జీవితేచ్ఛగాని ఎంతమాత్రమూ లేదు! ఇప్పటివరకు ఎన్నడూ నిన్ను వీడి వుండలేదు. ఇప్పుడుమటుకు ఎలా ఉండగలను?" అన్న హేమకంఠుడితో రాజు

“కుమారా! నీవిలా అంటావనే నీకు మొదటగా నీతిశాస్త్రవచనాలనూ, ధర్మాలనూ ఉపదేశించాను. వాటిని వృధాకానీయకు పూర్వం పరశురాముడు తండ్రియాజ్ఞ ననుసరించి మాతృవధ చేశాడు! అలాగే

శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకై రాజ్యంవీడి అరణ్యములకు వెళ్ళాడు.

ఇక లక్ష్మణుడు సరేసరి! భాతృఆజ్ఞానుసారం కారణం అడగకుండానే సీతాదేవిని అరణ్యాలలో విడిచాడు! కనుక ఓ కుమారా! నీవు నా అభీష్టం మేరకు నగరానికి వెళ్ళి ఈ ముగ్గురు మంత్రుల సహాయంతో ధర్మబద్ధంగా, ప్రజారంజకమైన పరిపాలన సాగించు! నేను అరణ్యాలకు

వెళ్ళినా నీవు నా అంతరాత్మ స్వరూపుడవే కనుక నా హృదయంలోనే నాతో కూడా వుంటావు! దైవానుగ్రహంచేత తిరిగి నా శరీరం ఆరోగ్య

వంతమై, కాంతివంతమైతే తిరిగి నేను నగరానికి వస్తాను. కనుక ఇప్పుడు నీవు నన్ను అనుసరించి రావటం అధర్మం! నీవు వెంటనే శీఘ్రముగా పట్టణానికి వెళ్ళు!” అని చెప్పగా రాజాజ్ఞను శిరసావహించిన

పురజనులూ, మంత్రులూ హేమకంఠునితోసహా కలిసి రాజ్యమునకు వెళ్ళటానికి సిద్ధమైనారు.


ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని

'సోమకాంత తపశ్చర్య' అనే నాల్గవ అధ్యాయం.సంపూర్ణం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat