సోమనాధుని సమకాలికుడైన హరిహరుడు బసవరాజ రగళె అనే గ్రంధము రచించాడు. అందులో బసవన్న *‘కమ్మె కుల బ్రాహ్మణుడు’* అని పేర్కొన్నాడు. ఈ కమ్మెనాడు నేటి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి ప్రాంతమే. ఇక బసవన్న ఇంటి పేరు భక్తి భండారివారు. భండారు ధవళేశ్వరరావు, భండారు సదాశివరావు వంటివారు నేటికీ వరంగల్‌లో ఉన్నారు. వీరిని శ్రౌతశైవులు లేక పాశుపత శైవులు, లింగధారి బ్రాహ్మణులు అని పిలుస్తారు. బసవన్న తండ్రి పేరు మాదిరాజు. ఈ ఇంటి పేరుగల మాదిరాజు రంగారావు వంటివారు నేటికీ తెలంగాణములో ఉన్నారు. బసవన్న ధర్మపత్ని పేరు గంగాంబిక. ఈమెకే నీలాంబిక అనే మరొక పేరు ఉన్నట్లు ఇటీవల బెంగుళూరులోని శివయోగిని మాతా మహాదేవి అభిప్రాయపడ్డారు. బసవన్నగారి జన్మస్థలము హింగుళేశ్వర బాగెవాడి కార్యస్థలము కూడల సంగమేశ్వరము. ఈ మూడు కర్ణాటకలో
ఉన్నాయి. బసవన్నగారి జీవితంపై వచ్చిన మొదట్టమొదటి ప్రామాణిక గ్రంథం పాల్కురికి సోమనాథ విరచిత బసవ పురాణమే.. అయినప్పటికీ కర్ణాటకలో ఇంకా చాలా జనశ్రుతులు ఉన్నాయి. (అందులో ఒకటి కనక శాసనకథ.)
బిజ్జలుడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవటానికి ముందు కల్యాణ నగరాన్ని పశ్చిమ చాళుక్యులు పరిపాలిస్తున్నారు. బిజ్జలుడు జైన మతాభిమాని. ఐతే దేశంలో శివ భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందుకని మత సామరస్యం కోసం, రాజకీయ వ్యూహంలో భాగంగా బలదేవుణ్ణి దండనాయకుణ్ణిగా నియోగించుకున్నాడు. బలదేవుడు శివారాధన చేసే సత్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. పైగా కార్యనిర్వహణలో దక్షుడు. ఈ కారణాలచేత జైన- శైవ మత సమన్వయం కోసం బిజ్జలుడు బలదేవుణి దండనాయకునిగా నియమించాడు. బలదేవుడు తన మేనల్లుడైన బసవన్నకు రాజస్థానంలో ఒక చిన్న పదవి ఇచ్చాడు. సహజంగా దైవాంశ సంభూతుడు అపూర్వ మేథాశక్తి సంపన్నుడూ అయిన బసవన్న ఇచ్చిన పని చిన్నదయినా అపూర్వ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాడు.
ఒకనాడు కొందరు కార్మికులు ఒక భవన పునర్నిర్మాణ కార్యక్రమానికి పూనుకున్నారు. పలుగులు పారలు పట్టుకొని వారు ప్రాచీన శిథిల కుడ్యాలను తొలగిస్తున్నారు. ఇంతలో ఆ పైకప్పు భాగం నుండి ఒక రాయి కిందపడింది. నిజానికి అది బండ కాదు. అక్షరాలు చెక్కబడిన ఒక శిలాశాసనము. ఈ విషయము క్షణాలమీద కార్మికులు బిజ్జలునికి చేరవేశారు. బిజ్జలుడు తన ఆస్థాన విద్వాంసులను పిలిచి దానిని పరిశీలించవలసిందిగా కోరాడు ఐతే అందలి భాష గహనమయినది కావటంతో పండితులు శాసనాన్ని చదువలేకపోయారు.
https://chat.whatsapp.com/FfJxCufyCMi3j3H7lerwVR
*‘‘ప్రభూ! మాకీ అక్షరాలు అవగతం కావటంలేదు. పైగా ఇదేదో రహస్య భాషలో ఉన్నట్లు తోస్తున్నది’’* అని పండితులు చెప్పారు.
*‘‘విద్వాంసులారా! అంటే ఏమిటో కొంచెం వివరించండి’’.*
*‘‘ప్రభూ! ఈ శాసనకర్తలు ఏదో ఒక రహస్య విషయాన్ని ఈ సంకేత భాషలో నిక్షిప్తం చేశారు. దానిని అందరూ చదువలేరు’’* అన్నారు విద్వాంసులు.
అప్పుడు బలదేవుడు ఇలా చెప్పాడు.
*‘‘బిజ్జల చక్రవర్తీ! నా మేనల్లుడైన బసవన్న బహుభాషా కోవిదుడు. అతనికి శివానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. మీరు అనుమతిస్తే అతనిని పిలిపిద్దాము’’*.
*‘‘అందుకు అభ్యంతరం ఏముంటుంది? అలాగే పిలిపించండి’’* అన్నాడు బిజ్జలుడు.
బసవన్న బిజ్జలుని సమక్షానికి వచ్చాడు. బిజ్జలుడు బసవన్నతో ఈ శాసన లిపి చదువవలసిందిగా కోరాడు.
బసవన్న అలాగే అని అంగీకరించి శిలాశాసనాల్ని పరిశీలించాడు. అది రహస్య భాషలో రాయబడి ఉంది. బసవన్న ఒక్కసారి మనస్సులో సాంబశివుణ్ణి స్మరించి చేతితో శాసనాన్ని తాకాడు. వెంటనే శాసనంలోని వాక్యాలు ఒక్కొక్కటీ అర్థం అయినాయి. బసవన్న శాసనాన్ని చదివి ప్రభువుతో ఇలా చెప్పాడు.
*‘‘చక్రవర్తీ! తమరు కాలచూరి రాజన్యులు. ఇంతకు పూర్వం ఇక్కడ పశ్చిమ చాళుక్య ప్రభువుల పాలన సాగుతుండేది. వారి కాలంలో ఒక అనంత నిధిని ఒక రహస్య ప్రదేశంలో పాతిపెట్టారు. దాని వివరాలు ఈ శాసనంలో వున్నాయి’’* అన్నాడు బసవన్న.
బిజ్జలుని కన్నులు ఆశ్చర్యంతో మెరిశాయి.
*‘‘బసవన్నా! ఆ నిధి ఎక్కడ ఉందో తెలుపగలరా?’’* అని ఆశతో ప్రశ్నించాడు.
*‘‘తెలుపగలను ప్రభూ! అందుకు సంబంధించిన గుర్తులు ఈ శాసనంలో తెలుపబడ్డాయి. తటాకానికి సమీపంలో వృక్షానికి అవతల కొండ వద్ద త్రవ్వకం జరిపించండి’’* అని చెప్పాడు బసవన్న.
వెంటనే పలుగులు పారలు తీసుకొని పనివారు నిర్దేశిత ప్రదేశానికి వెళ్లారు. అక్కడ త్రవ్వకాలు జరిపారు. కొంతమేరకు మట్టిని తొలగించగానే కన్నులు జిగేలుమని మెరిసే సంపదలు బయటకు వచ్చాయి. బంగారమూ వజ్ర వైఢూర్యాది రత్నమాణిక్యముల నిధి భూగర్భంలో వెలికి వచ్చింది. వెంటనే శివభక్తులు వచ్చి రక్షోహరణ మంత్రాలు పఠించి నిధికి కాపలాగా ఉంచిన నాగులను తరిమివేసి సంపదను ప్రభువుకు సమర్పించారు.
🙏 హర హర మహాదేవ🙏