🔰 శ్రీ గణేశపురాణం🔰 5 వ భాగం

P Madhav Kumar


 భాగం.5 


ఉపాసనాఖండము

మొదటి భాగము

సుధర్మా - చ్యవన సంవాదం


సూతమహర్షి తరువాత కధనిలా కొనసాగించాడు ఓ మహర్షులారా! 

తండ్రి ఆదేశమును మీరలేని హేమకంఠుడు తన తల్లియైన

సుధర్మను ప్రేమగా సమీపించి ఇలా అన్నాడు. “ఓ తల్లీ! నన్ను యిలా ఒంటరిని చేసి వెళ్ళటం మీకేమన్నా న్యాయమా? మీతోపాటూ నన్నూ అరణ్యాలకి వచ్చేలా తండ్రిగారికి చెప్పి నీవు దయతో ఒప్పించు!

వారంగీకరిస్తే మీ ఉభయులకూ సేవచేస్తూ నాజీవితాన్ని సార్ధకం చేసుకుంటాను. మీకు దూరమైనాక ఇక ఈరాజ్యమన్నా, నాకు జీవితమన్నా ఏమాత్రం కాంక్షలేదు!" 

అంటూ బ్రతిమాలాడు. అందుకు మహారాణియైన సుధర్మ తన కుమారుణ్ణి అనునయిస్తూ శిరస్సున ముద్దాడి ఇలా అంది. “నాయనా! తీవ్రమైన శారీరక అస్వస్థతకు గురైవున్న మీతండ్రి ఇందుకు ఏమాత్రం ఒప్పుకొనరు. పైగా అది ధర్మవిరుద్ధం కూడాను!

నేను మాత్రం మీతండ్రిగారిని సుఖాలలో అనుసరించినట్లే, ఈ బాధలలో కూడా తోడుగా వుంటాను. అదే నిజమైన పతివ్రతకు ఆచరణీయం!

కనుక నీవు యిక ఏమాత్రం ఆలస్యంచేయక, మీ తండ్రిగారి ఆదేశానుసారం మన నగరానికి ఈ పరివారంతోపాటు వెనక్కు మరలటం శ్రేయస్కరం!” అంటూ నచ్చచెప్పింది! సూతులవారు ఇలా చెప్పసాగారు."ఓ ఋషులారా! ప్రేమపూర్వకమైన తల్లి అనునయ వాక్యాలను విన్న

హేమకంఠుడు ధర్మబుద్ధితో తన మాతాపితరులకు ప్రదక్షిణ నమస్కారాలుచేసి, తన పరివారంతో తన రాజ్యానికి వెనుతిరిగాడు! తిరిగి తన

రాజభవనంలో ప్రవేశించి దుఃఖంతోనూ,సంతోషంతోనూ, సమ్మిళితమైన అంతరంగంతో తన ప్రజానీకాన్ని పుత్రప్రేమతో తండ్రి బోధించిన రీతిలోనే ఎంతో ధర్మబద్ధంగా, రాజ్యపాలనను చేయసాగాడు.


సోమకాంత మహారాజు అరణ్యానికి వెళ్ళటం :


ఆతరువాత జరిగిన కధావిధానం గురించి ఋషులు ప్రశ్నించగా సూతమహర్షి ఇలా చెప్పాడు.

"ఓ మహా ఋషులారా! అనంతరం సోమకాంత మహారాజు అరణ్యానికి ఎలావెళ్ళిందీ, అక్కడ ఏమేం చేసిందీ అంతా వివరంగా చెబుతాను సావధానచిత్తులై వినండి!"

సుబల, జ్ఞానగమ్యులనే మంత్రులిద్దరూ తనకు ముందు

నడవగా, భార్య సుధర్మ తనను నీడయై అనుసరించగా, రాజు ఘోరారణ్యంలో ప్రవేశించాడు. వారందరూ వానప్రస్థధర్మములైన ఒంటిపూటభోజనం, నేలపైన శయనించుటవంటి నియమాలను పాటిస్తూ,

మార్గమధ్యంలో కలిగే ప్రయాణపు బడలికచేత, ఆకలిదప్పులచేత బాధ

లను అనుభవిస్తూకూడా, సుఖదుఃఖాలను సమదృష్టితో చూసే యోగులవలే, మార్గాయాసాన్ని తొలగించుకుంటూ దీక్షగా తమ ప్రయాణంకొనసాగించారు. ఇలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక

సుందరమైన ప్రదేశంలో తామరపుష్పాలతో నిండిన సరోవరాన్ని చూశారు.

అనేక జలపక్షులతోనూ, జలకాలాడే ఏనుగుల సమూహాలతోనూ, తామర

పుష్పాలతోనూ నిండిన ఆ సరస్సు ఎంతో అందంగా కనిపించింది.అనేక వృక్షాలతో, దట్టమైన తీగలతో చుట్టుకొని ఉండి చూడటానికి ఆహ్లాదం కలిగించేదిగా ఉన్నాయి! అక్కడి చల్లని సుగంధ వాయువులు ఆ సరస్సు మీద నుంచి వీచి ఆ ప్రశాంత పరిసరాలు మనస్సుకు ఒక

అనిర్వచనీయమైన ప్రశాంతతను కలిగిస్తున్నాయి. ఆ సరస్సులోనుండే తమ స్నానపానాలకు అనుష్టానాలకు అవసరమైన నీటిని అక్కడి మునులు, తమ పూజలకై ఫలపుష్పాలను కూడా తీసుకెడుతూంటారు.

అక్కడ రకరకాల పక్షులు తమ కిలకిలారావాలతో అదొ దివ్యలోకమాలేక స్వర్గంలోని- నందనోద్యానమా అనిపించేలా ఉన్నది. ఆ చల్లని గాలి సోకగానే శరీరానికి బడలిక తీరి 'వేరేలోకాల అంచుల్లోకి తీసుకెళుతున్నదా?' అన్నంత విశ్రాంతి కలిగించేలా వున్నది.

"ఓ ఋషివర్యులారా! అలాంటి సుందరమైన మనోజ్ఞమైన సరోవర సమీపంలోకి చేరిన రాజు తన మంత్రులతోనూ భార్యతోకూడా కలిసి

విడిదిచేసి అక్కడ తన స్నానసంధ్యాదికములను నిర్వర్తించుకొని సమీపం లో లభించిన కందమూలాలను భక్షించి ఆనాటికి విశ్రాంతి తీసుకొనసాగాడు. ప్రయాణపు బడలికతో రాజుకు అక్కడి ఇసుకతిన్నెపైననే కంటికి

మంచినిద్ర పట్టింది. భార్య సుధర్మ భర్తయొక్క అలసట తీరేలా పాదములు వత్తసాగింది. మంత్రులిద్దరూ ఆమె ఆదేశంమేరకు కంద

మూలాలు సేకరించడానికి అరణ్యంలోకి వెళ్ళారు. ఇంతలో అక్కడికి వచ్చిన అద్భుతమైన ముఖవర్చస్సుతో బ్రహ్మతేజస్సుతో కుమార స్వామియా అనిపించేలా వెలిగిపోతున్న ఒక ఋషి కుమారుడిని సుధర్మ చూచింది.తనలోతాను ఇలా అనుకున్నది."ఆహా! 

ఈ మునికుమారునివలన నా మనస్సులోగల అభీష్ట

ములు తప్పక నెరవేరగలవనిపిస్తున్నది!" నెమ్మదిగా అతన్ని సమీపించి

యిలా ప్రశ్నించింది.

“ఓ ఋషికుమారా! నీవెవరవు? ఇక్కడికి ఎక్కడినుంచి వస్తున్నావు?

నీ తలిదండ్రులెవరు?" దానికా ఋషికుమారుడిలా బదులిచ్చాడు.


సుధర్మా ఋషికుమారుల సంవాదము:


"ఓతల్లీ! నేను భృగుపుత్రుడను. నాతల్లి పులోమ! నీటికోసం ఈ

తటాకం వద్దకు వచ్చాను. నాపేరు చ్యవనుడు! ఓతల్లీ! నీవెవరవు?ఈ ఘోరమైన అరణ్యములోకి ఎక్కడినుంచి వచ్చారు మీరు? నీవు

సేవిస్తున్న ఈతడెవరు? ఈతని శరీరం ఇలా వర్షాకాలపు మేఘంలా స్రవించటానికి కారణమేమిటి? ఏ పాపకర్మచేత ఇతని శరీరం యిలా దుర్గంధ భూయిష్టమైంది? ఇలా క్రిమికీటకాదులచే పీడింపబడే శరీరంతోవున్న ఇతడిని నీవు సేవించటానికి కారణమేమిటి? నీవా అతిసుకు మారివి! అపురూపమైన సౌందర్యం నీ సొత్తులా కనిపిస్తున్నది! ఇటువంటి రోగిష్టివాడినెలా వరించావు?


నీతల్లిదండ్రులూ, స్నేహితులూ ఇతడిలాంటి

వాడని తెలియక మోసగించబడ్డారా?” అంటూ ప్రశ్నించాడు.అప్పుడు రాణీ, మహాపతివ్రతాయైన సుధర్మ యిలా బదులిచ్చింది.

"ఓ ఋషికుమారా! సౌరాష్ట్రదేశంలో దేవనగరమనే పట్టణానికి రాజైన ఈతడు నాభర్త! సోమకాంతుడితని పేరు. సకల సద్గుణశోభితుడై,

పరాక్రమోపేతుడై ఐశ్వర్యవంతుడై, బలసౌందర్యోపేతుడైనవాడీతడు.నీతిశాస్త్రవిశారదుడు. ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసినవాడు.

అనేక రాజ్యభోగాలను నిరాటంకంగాఅనుభవించాడు. పురాకృత కర్మవశాన ఈతడికి భరింపరానంతటి ఈ దురవస్థ సంప్రాప్తమైంది. అందు

వల్ల తన రాజ్యభారాన్ని కుమారుడైన హేమకంఠుడి భుజస్కందాలపైఉంచి, ఇద్దరు మంత్రులైన సుబల, జ్ఞానగమ్యులతో ఈ ఘోరారణ్యంలోకి నాతోపాటు ప్రవేశించాడు! మంత్రులిరువురూ కందమూలాలను

సేకరించటానికి వెళ్ళారు. నాయనా, ఈ అరణ్యం అనేక కూరజంతువులతో కూడినదికదా! రాక్షసులు భూత ప్రేతపిశాచాలు కూడా సంచరించే ప్రాంతమిది. అయినా ఇక్కడ ఎవ్వరూ మాకెట్టి హానీ తల పెట్టటం

లేదెందుకనో? మాకింకా దుఃఖానుభవము మిగిలివున్నందున ఊరకున్నా

రేమో? మా ఈ దుఃఖానికి అంతే కనబడటంలేదే! షడ్రసోపేతమైన

రాజోచిత భోజనాలెక్కడ? దొరికినంతటితో సరిపుచ్చుకోవాల్సిన ఈ కంద

మూల భక్షణమెక్కడ? ఐనా ఈ కందమూలాలే ప్రస్తుతం అత్యంత

రుచికరములుగా ఉన్నాయిమాకు! దరిద్రులూ, తాపసులూ తినే ఇటు

వంటి ఆహారం శ్రీమంతులకు జీర్ణమవటం కష్టమేకదా! హంసతూలికా తల్పం మీద పరిచారగణం యొక్క సేవలందుకుంటూ నిద్రించే ఈ

ప్రభువు ఈనాడు ఇలా కటికనేలలపైన ఎగుడుదిగుళ్ళుగావుండే

యిసుకతిన్నెలపైన సేదతీరుతున్నాడు. చందనం, పునుగు జవ్వాది మొద

లైన సుగంధద్రవ్యాలచేత పరిమళించే ఈ మహారాజు శరీరం ఇప్పుడు

దుర్గంధపూరితములైన చీము, రసి ఓడుతూ దుర్భరంగా ఉన్నది. ఎప్పుడూ

పండితగోష్టితో కాలంగడిపే రాజు ఇప్పుడు దుఃఖసాగర నిమగ్నుడై ఉన్నాడు. ఓ భృగునందనా! ఈ దుర్భరమైన దుఃఖసాగరాన్ని ఎట్లా

దాటగలము? అగాధమై అంతూ దరీ తెలీని ఈ దుఃఖసముద్రాన్ని

దాటటానికి నీవు మాకు తెప్పలాగ సహకరించి మమ్మల్ని ఈ స్థితినుంచి

రక్షించు!" అంటూ రాణి చ్యవనుడితో గద్గదకంఠియై ప్రార్ధించింది!


ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని

'సుధర్మా- చ్యవన సంవాదం' అనే ఐదవ అధ్యాయం. సంపూర్ణం.


 సశేషం.......

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat