💠 దేవ భూమి అయిన భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు స్థానికంగా కొలువైన దేవి లేదా దేవతల నామం మీద ఏర్పడటం అందరికీ తెలిసిన విషయమే !
భూలోక వైకుంఠము శ్రీ రంగం, కలియుగ వైకుంఠము తిరుమల, శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువైన తిరువనంతపురం ఇలా ఎన్నో ఉదాహరణలుగా పేర్కొనవచ్చును.
వాటిల్లో గతంలో మన పురాణాలలో, గ్రంధాలలో "మగధ" గా పేర్కొనబడిన నేటి "భీహర్" రాజధాని "పట్నా" పేరు కూడా చేర్చవచ్చును.
💠 "పుత్రక" కునిగా పేర్కొనబడే పాలకుని చేత స్థాపించబడిన "పాటలీ పుత్ర" నేటి "పట్నా".
ఈ పేరు రావడానికి వెనుక విశేష పౌరాణిక మరియు చారిత్రక గాధలు ముడిపడి ఉన్నాయి.
💠 శీతలా మాత మందిర్ లేదా శీతలా దేవి మందిర్ అని పిలవబడే దుర్గా దేవి ఆలయం భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఉన్న పాట్నాలో ఉంది.
ఇది భారతదేశం లోని శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడింది.
⚜ చరిత్ర ⚜
💠 దక్ష ప్రజాపతి గురించి అందరికీ తెలిసన విషయమే !
ఆయన పుత్రిక "సతీ దేవి" తండ్రి మాటను కాదని శ్మశాన వాసి అయిన శంకరుని పరిణయ మాడటం వలన తండ్రి నిరాదరణకు గురి అయినది.
సర్వేశ్వరుని కించపరచడానికి తలపెట్టిన యాగామనీ తమకు పిలుపు లేదనీ తెలిసి దాక్షాయణి వెళ్లి అవమానానికి గురి అయ్యి ఆ అవమాన భారం తట్టుకోలేక హోమ గుండంలో దుమికి ఆత్మ త్యాగం చేసింది.
వార్త తెలిసిన మహేశ్వరుడు వీరభద్ర, కాల భైరవాది గణాలను పంపి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయించడం దక్ష యజ్ఞం వెనక ఉన్న కధ !
💠 సతీ దేవి అస్తమయంతో విచారగ్రస్తుడైన పరమేశ్వరుడు ఆమె దేహాన్ని భుజం మీద వేసుకొని విరాగిగా మారి లోకాలలో సంచరించసాగారు.
అమ్మవారి శరీరం ఆయనకు కనిపించినంత కాలం మామూలుగా మారరని గ్రహించిన శ్రీహరి తన సుదర్శన చక్రంతో సతీ దేవి దేహాన్ని ఖండించారు.
ఆ భాగాలు భువిలో అనేక ప్రాంతాలలో పడినాయి. అవే శక్తి పీఠాలు.
💠 ప్రముఖమైన శరీర భాగాలు పడిన ప్రాంతాలు అష్టాదశ పీఠాలు అయ్యాయి..
ఇతర భాగాలు పడిన 51 ప్రదేశాలను సిద్ద శక్తి పీఠాలు అని పిలుస్తారు.
💠 ఇక్కడికి నవరాత్రుల తొమ్మిది రోజులు విశేష సంఖ్యలో అమ్మవార్లను సేవించుకోడానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. ప్రత్యేక పూజలు, అలంకరణలు అమ్మవార్లకు జరుపుతారు.
💠 ఆలయంలో పూజించబడుతున్న శీతల మాత యొక్క మూర్తి నల్ల గ్రానైట్ రాయితో చెక్కబడింది.
మాత వాహనం గాడిద మరియు దానిపై అమ్మవారు సవారీ చేస్తారు.
తల్లి ఒక చేతిలో చీపురు పట్టుకుంది.
💠 గోరియా దేవత, దేవత యొక్క సేవిక ప్రధాన మూర్తికి ఆమె కుడి వైపున ఉంది, ఎడమ వైపున షీత్లా మాత సోదరి అంగర మాత యొక్క పాలరాతి మూర్తి ఉంది.
💠 విశిష్ట నైవేద్యం - భక్తులు కోరిన కోరికలు తీరడం కోసం పావురాలను వదులుతారు.
💠 ఈ ఆలయం ఆషాడ మాసంలో (జూన్ - జూలై) అత్యధిక భక్తులను ఆకర్షిస్తుంది.
మంగళవారం వారంలో ముఖ్యమైన రోజు.
💠 సప్తమాతృకలు, భైరవుడు మరియు చండీ దేవి యొక్క పిండాలు ఈ ఆలయంలో పూజించబడుతున్న ఉప దేవతలు.
💠 ఈ మందిరాలన్నీ ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ భక్తజన సౌకర్యార్దం తెరిచే ఉంటాయి.
💠 పాట్నాలోని డియోఘర్, టవర్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్ వద్ద ఈ ఆలయం ఉంది.
భక్తులు ఇక్కడికి వచ్చి ప్రశాంతత కోసం గంటల తరబడి ఆవరణలో కూర్చుంటారు.
ఇక్కడ మనస్ఫూర్తిగా పూజిస్తే నయంకాని రోగాలు కూడా నయమవుతాయని భక్తుల విశ్వాసం.
💠 ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో (ఏప్రిల్), శీతలా దేవి పూజ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.
ఇందులో శీతలా దేవి చిత్రం, 'సప్తమాతృకల' (ఏడు రూపాలు) పిండాలు ఉంటాయి.
ఇది మశూచి నివారణకు, అన్ని రకాల కోరికలను నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం.
💠 ఈ మందిరం బీహార్‌లోని పాట్నా సమీపంలోని అగం కువాన్లో ఉంది.
ఈ పుణ్యక్షేత్రం పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
© Santosh Kumar