🔱 కోట్టాయం ఏట్రుమానూరప్పన్ 🔱

P Madhav Kumar

ప్రాచీన  కేరళ దేశంలో లో పరమశివుడు

వెలసిన  ప్రతీ క్షేత్రానికి ఆ  ఊరుపేరుతో

అప్పన్ అనే మాటను చేర్చి సంభోదిస్తూ భక్తులు ఆరాధించేవారు.


అలాటి శైవక్షేత్రమే

కోట్టయం జిల్లాలోని  ఏట్రుమానూరు నగరంలోని

పరమేశ్వరుని

' ఏట్రుమానూరప్పన్ '  దేవాలయం.

శివునికి మహాదేవుడనే మరో పేరు కూడా వుంది.

అందువలన  ఈ ఆలయం

ఏట్రుమానూరు మహాదేవ

క్షేత్రంగా ప్రసిధ్ధి పొందింది.


ఈ ఆలయంలో మహేశ్వరుడు

ఉగ్రమూర్తిగా దర్శనమిస్తాడు.


ఈ ఆలయంలో

ఉదయకాలాన 

అఘోరమూర్తిగాను,  మధ్యాహ్నంపూట శరభమూర్తిగాను,  సాయంకాల సమయాలలో అర్ధనారీశ్వరునిగాను భావించి

ఆ నియమానుసారం ఆగమశాస్త్రోక్తంగా యీ ఆలయంలో పూజలు జరుపుతారు. 


ఇక్కడ కొలువైయున్న ఈశ్వరుడి మహిమలు ,   గాధలకు సంబంధించిన  పురాణాలెన్నో వున్నాయి. 

అందులోని ముఖ్యమైన కధ ఒకటి తెలుసుకుందాము. 


ఖరుడనే రాక్షసుడు శివానుగ్రహం కోసం 

తన తాత అయిన మాల్యవంతుని సలహాతో చిదంబరంలో

కఠోర తపస్సు చేశాడు. 

ఆ దానవుని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు  ప్రత్యక్షమై  మూడు

జ్యోతిర్లింగాలను వరాలుగా ఇచ్ఛి ఆశీర్వదించాడు . 


త్రినేత్రుని వద్ద మూడు లింగాలను తీసుకుని, రెండు లింగాలను తన రెండు చేతులలోను,

మూడవ లింగాన్ని నోటితోనూ 

కరిచిపట్టుకుని  ఆకాశ మార్గాన పయనిస్తూ 

మార్గమధ్యాన విశ్రాంతి కోసమై కిందకి దిగిన ఖరుడు  ఆ మూడు లింగాలను  నేలమీద పెట్టాడు.  అలసటతీరిన తరువాత తిరిగి

బయలుదేరుతూ ఆ శివ

లింగాలను చేతిలోనికి తీసుకొనడానికి

ప్రయత్నించాడు. కానీ ఆశ్చర్యకరంగా

ఆ లింగాలను ఏమాత్రం ఉన్నచోటు నుండి కదపలేక పోయాడు. వాటిని కదల్చడానికి ఖరుని శక్తి చాలలేదు.

ఇంతలో అశరీరవాణి గా పరమేశ్వరుడు

" ఖరా! నీవు లింగాలని దీంపిన యీ  స్ధలంలోనే నేను కొలువై వుండదలిచాను. " అని

పలికాడు.

దైవేఛ్ఛను  తెలుసుకున్న ఖరుడు అక్కడే తపస్సు

చేసుకుంటున్న వ్యాఘ్రపాద

మహర్షికి జరిగిన సంఘటనలు తెలిపి ముక్తిని పొందాడు.


ఆ విధంగా ఖరుడు తీసుకువచ్చిన లింగాలలో ఎడమచేతితో తీసుకుని వచ్చిన  లింగం   

" ఏట్రుమానూరు అప్పన్" గా , 

కుడి చేతితో తీసుకువచ్చిన లింగం  వైక్కం అనే

ప్రాంతంలో

" వైక్కతప్పన్" గా పూజించ

బడుతున్నాయి.

నోటితో క‌రచిపట్టి తీసుకు వచ్చిన మూడవలింగం

' కడుతురుత్తి'  అనే ప్రదేశంలో 

'తళి  మహాదేవుడు'

గా భక్తులచే పూజించబడుతున్నది.


ఈ మూడు మహాలింగ క్షేత్రాలను ఒకే రోజున

ఉఛ్ఛికాల పూజకి ముందే ద‌ర్శనం చేసుకోవడం అతి పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు.


ఏట్రుమానూరప్పన్ ఆలయం

రెండు విశేషాలకు

ప్రసిధ్ధి చెందినది. మొదటిది,

ఇక్కడవున్న   అఖండదీపం. ఈ దీపాన్ని శక్తి దీపమని పిలుస్తారు.ఇది ఆలయ బలిపీఠానికి ముందు

వున్నది.  ఈ దీప స్థంభంలో  నాలుగు దిక్కులలో

ఉత్తర తూర్పు ముఖంగా

ఒత్తులు వెలుగుతూ వుంటాయి.


ఈ దీపస్థంభాలకు వెనుకగల చరిత్ర తెలుసుకుందాము. 


పంచలోహాలతో దైవవిగ్రహాలను, దీపపు సెమ్మెలను ,  కుందులను తయారు చేసే ఒక ఆచారి ఈ దీప స్థంభాన్ని అతి భక్తితో తయారు చేసి  ఏట్రుమానూరప్పన్ కు సమర్పించాలని

తీసుకువచ్చాడు.

అంత పెద్ద

దీపస్ధంభాన్ని  ఆలయంలో  పెట్టే స్థలం లేదని ఆలయ అర్చకులు దానిని తిరస్కరించారు. దైవారాధన కోసం తయారు చేసిన ఆ దీపస్థంభాన్ని అర్చకులు తిరస్కరించడంతో

ఆచారి  

చాలా దిగులుచెంది

విచారంతో నిలబడి పోయాడు.  ఆ సమయంలో

గర్భాలయంలో నుండి ఒక వ్యక్తి చురుకుగా ముందుకు వచ్చి ఆచారి

వద్దనుండి ఆ దీప స్ధంభాన్ని

తీసుకుని బలిపీఠం మీద పెట్టాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో ఉరుములు మెరుపులు 

ప్రారంభమై  నూనె, వత్తులు ఏవీ లేకుండానే ఆ దీపం కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ అత్యంత ప్రకాశంతో వెలగసాగింది. 

మరుక్షణంలో ఆలయం లోపల నుండి వచ్చిన అగంతవ్యక్తి , దీపస్థంభాన్ని తయారు చేసిన ఆచారి ఇద్దరూ అంతర్ధానమైపోయారు.  

తన భక్తుని కటాక్షించడానికి ఏట్రుమానూరప్పనే స్వయంగా వచ్ఛాడని వేరే చెప్పనక్కరలేదు. 


ఈ ఆలయానికి చెందినదే మరియొక విశిష్టత ఇక్కడవున్న  ఏడున్నర బంగారు ఏనుగుల ప్రతిమలు.

ఈ ఏనుగుల రాక కేరళదేశ చరిత్రతో

సంబంధం కలిగి వున్నది. 


తిరువిదాంగూరు  రాజ్య

స్థాపకుడు

అనిళం తిరునాళ్  మార్తాండవర్మ

టేకు కలపతో  తయారుచేసి, బంగారుతొడుగు గల

ఎనిమిది బంగారు ఏనుగుల వాహనాన్ని  

వైకతప్పన్ కు భక్తితో సమర్పింపదలిచాడు. ఆ ఎనిమిది లో ఒక్కటి తప్ప ఏడు ఏనుగులు రెండు అడుగుల ఎత్తు కలిగినవి. ఒక ఏనుగు

మాత్రం ఒక అడుగు ఎత్తు కలిగి వున్నందున 

వీటికి ఏడున్నర బంగారు ఏనుగులనే పేరు వచ్చింది. 

దురదృష్టవశాత్తు ఆ ఏనుగుల వాహనాన్ని ఆలయానికి సమర్పించడానికి

ముందే మహారాజు స్వర్గస్తుడయ్యాడు. అందువలన

అతని తరువాత రాజ్యానికి వచ్చిన 

కార్తిక తిరునాళ్ రామవర్మ తమ

మ్రొక్కుబడి చెల్లించడానికి

వైక్కం యాత్ర కి బయలుదేరాడు. వస్తున్న మార్గంలోఏట్రుమానూరు లో విశ్రాంతి కై

ఏనుగులను  దింపారు. 

విశ్రాంతి తీసుకుని తిరిగి ఏనుగులని తీసుకుని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు  అక్కడ కనిపించిన దృశ్యం వారందరికీ విస్మయం కలిగించింది. ఆ ఏనుగుల చుట్టూ

నాగుపాములు బుసలు కొడుతూ కనిపించాయి.

వెంటనే మహారాజు , మంత్రులు కలసి అక్కడ వున్న జ్యోతిష్కుని ద్వారా ప్రసన్న జోస్యం  వేసి చూడగా ఆ

ఏడున్నర బంగారు ఏనుగులను ఏట్రుమానూరప్పన్ కే సమర్పణమని ఉత్తరువు వచ్చింది.  దాని ప్రకారం  ఒక శుభముహూర్తాన మహారాజు ఆ బంగారు ఏనుగులను  ఏట్రుమానూరప్పన్ కే 

సమర్పించి దైవానుగ్రహం పొందాడు.


ఏట్రుమానూరప్పన్  పడమటిముఖంగా దర్శనమిస్తాడు.

వాహనం నిలబడిన ప్రాంతాన్నే

దీపస్ధంభం వున్నది. 

బలి పీఠం దాటుకుని వెళ్ళగానే , గోడలికి రెండుప్రక్కలా బ్రహ్మాండమైన

చిత్రాలు చిత్రీకరించబడి వుంటాయి. ఉత్తరపు గోడమీద అనంత శయన భంగిమలో మహావిష్ణువు, 

దక్షిణపు గోడ మీద అఘోర మూర్తి,  ఎనిమిది చేతులతో నటరాజస్వామి అత్యంత

ఆకర్షణీయంగా దర్శనమిస్తారు.


కేరళ ఆలయ నిర్మాణ శిల్పశైలిలో వలయాకార 

శ్రీ కోవిల్  లో

ఏట్రుమానూరప్పన్ లింగ రూపంలో దర్శనం అనుగ్రహిస్తాడు.

ఈశ్వరునికి ప్రియమైన 

బిల్వ,తుమ్మి, రుద్రాక్ష మాలలతో

శివ లింగం మూడు వంతుల భాగం అలంకరించి వుంటుంది.  దీపాల కాంతులలో ఏట్రుమానూరప్పనుని దర్శనం  భక్తులను పులకింప చేస్తుంది.

నేలమట్టం నుండి బాగా ఎత్తుగా గర్భగృహం వున్నందున దర్శకులు

తల బాగా ఎత్తి  ఈశ్వరుని దర్శించ వలసివస్తుంది. 

శ్రీ కోవిల్ ని ప్రదక్షిణం చేసేటప్పుడు పడమటి వైపు ధర్మశాస్తా దర్శనం లభిస్తుంది.


శబరిమలై  వెళ్ళేవారికి

ఏట్రుమానూరు మధ్యమార్గంలోవున్నది.

వేలాది  ఇత్తడి దీపు సెమ్మెలు

శ్రీ కోవిల్ చుట్టూ అలంకరించి వుంటాయి.  సాయంకాల

దీపారాధన సమయంలో

అన్ని దీపాల వెలుగులో

స్వామిని  దర్శించడం

మహాభాగ్యంగా భక్తులు ఎదురుచూస్తారు. 

ఆలయ ఉత్తర పడమట దిక్కుగా శ్రీకృష్ణునికి ప్రత్యేక

ఆలయం వున్నది. 

ఇక్కడ తూర్పు ముఖంగా దర్శనమిస్తున్న కృష్ణుడు

అఘోరమూర్తి అయిన పరమశివుని  శాంతపరచడానికి  ప్రతిష్టింపబడినట్లు భక్తుల నమ్మకం. దుర్గాదేవి కి , యక్షి దేవతకి

నాగ దేవతలకి ప్రత్యేక సన్నిధులు వున్నవి. 


నిత్యం ఐదుకాలాల పూజలు

మూడు శీవేలిపూజలు జరిగే మహా క్షేత్రమిది. మాఘమాసంలో

పది రోజులు  ఉత్సవం

వైభవంగా జరుగుతుంది. దీనిని

"తిరువాదిరై  ఆరాట్టు"

ఉత్సవమని పిలుస్తారు.

శివరాత్రి నాడు  అభ్యంగస్నానం చేసి తడిబట్టలతో అంగ ప్రదక్షిణంచేయడం  యీ ఆలయంలోని ఒక

ముఖ్యమైన

మ్రొక్కుబడి .

శివరాత్రి నాడు 18 విధములైన పూజలు

జరుగుతాయి. 

ఆనాడు ఆలయం పూర్తిగా తెరిచేవుంటుంది.


ఏట్రుమానూరప్పనుని

భక్తి శ్రధ్ధలతో పూజించిన

వారి జీవితం మహోన్నతంగా ప్రకాశిస్తుంది.  ఇది నిజం

అనిపించే విధంగా , ఏనాటికానాడు స్వామి 

దర్శనానికి వచ్చే భక్తుల

సంఖ్య పెరుగుతున్నది. 


కేరళలోని  కోట్టాయం నగరం  ఎమ్ సి రోడ్ సమీపాన ఏట్రుమానూరు 

వున్నది.


🐘🌳🐘

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat