- పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు.
మద్భక్తో శివవిద్వేషీ మద్వేషీ శంకరప్రియః
తావుభౌ నరకం యాన్తి యావచ్చంద్ర దివాకరౌ
- నా భక్తుడై శివుని ద్వేషించేవాడు, శివభక్తుడై నన్ను ద్వేషించేవాడు ఇరువురూ సూర్యచంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారని నారాయణ వచనం.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః
ఏవం విష్ణుమయశ్శివః
యథాన్తరం న పశ్యామి
తథా మే స్వస్తిరాయుషి
- శివరూపుడు విష్ణువు. విష్ణురూపుడు శివుడు. శివహృదయం విష్ణువు. విష్ణుహృదయం శివుడు. శివుడు ఎలా విష్ణుమయుడో, విష్ణువు అలా శివమయుడు. ఇరువురి నడుమ ఎంతవరకు భేదం చూపించమో, అంతవరకు శుభము, ఆయువు ఉంటాయని యజుర్వేదాంతర్గతమైన స్కందోపనిషత్ వాక్యం.
శివప్రస్తావన లేకుండా యజ్ఞం చేసిన రుద్రద్వేషి దక్షుడు దుర్గతి చెందాడు. విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపుడు ఘోరశిక్షను పొందాడు. ఇలా వేదపురాణాలన్నీ ఘోషించాయి. 'విష్ణుసహస్రనామం' ఉద్భవించిన మహాభారత అనుశాసనికపర్వంలోనే 'శివసహస్రనామస్తుతి' ఉంది. విష్ణుసహస్రం భీష్ముడు ఉపదేశిస్తే, శివసహస్రం సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మయే ఉపదేశించారు.
పుత్రార్ధియై కృష్ణుడు హరుని ఆరాధించిన వైనం భారతం వర్ణించింది. అర్జునుడు యుద్ధంలో విజయం కోసం శివుని ఉపాసించాడు. హరిని పెండ్లాడేందుకు రుక్మిణీదేవి "నమ్మితి నా మనమ్మున సనాతనులైన "ఉమామహేశులన్" అని ప్రార్ధించింది. అదే విధంగా శ్రీరామ'నామ జపాన్ని చేసి, గౌరికి ఉపదేశించిన గురువు శివుడు హరినామరసికుడు.
భవానహం చ విశ్వాత్మన్నేక ఏవ హి కారణం
జగతోస్య జగత్యర్ధే భేదేనావాం వ్యవస్థితౌ
త్వయా యదభయం దత్తం తద్దత్తమఖిలం మయా
మత్తో విభిన్నమాత్మానం ద్రష్టుం నార్హసి శంకర!
యోహం సత్వం జగచ్చేదం సదేవాసురమానుషం
అవిద్యామోహితాత్మానః పురుషా భిన్నదర్శినః
- అని విష్ణుపురాణంలో శివుడు విష్ణువుతో అన్న మాటలు.
- విశ్వరూపా! నీవు, నేను జగత్తునకు ఏక కారణమే అయి ఉండి, జగత్తు నిర్వహణ కొరకు మనము భిన్నమువలె రెండు రూపాలతో ఉన్నాము. అలాగే విష్ణువు శివునితో అన్న వచనాలు - నీచే ఇవ్వబడిన అభయం, నాచే ఇవ్వబడినట్లే. నిన్ను నాకంటే భిన్నముగా నీవు భావింపదగదు. నేను, దేవాసుర మనుష్యాదిసహితమైన ఈ జగత్తు నీస్వరూపమే. అవిద్యామోహితులు భిన్నభిన్నముగా భావిస్తారు.
మహాభారతాంతర్గతమైన హరివంశంలో సాక్షాత్తు శివుడు చెప్పిన వచనాలు -
అహం త్వం సర్వగో దేవ త్వమేవాహం జనార్ధన!
ఆవయో రన్తరం నాస్తి శబ్దైః అర్థైః జగత్రయే
నామాని తవ గోవిన్ద యాని లోకే మహాన్తిచ
తాన్యేవ మమ నామాని నాత్రకార్యా విచారణా
త్వదుపాసా జగన్నాథ సైవాస్తు మమ గోపతే
యశ్చత్వాం ద్వేష్టి భో దేవ సమాంద్వేష్టి న సంశయః
- నేను సర్వగతుడవైన నీవే. జనార్దనా! నీవు నేనే. శబ్దములచే గానీ, అర్ధములచే గానీ మనకు ఉభయులకు భేదము లేనే లేదు. గోవిందా! లోకములో నీ నామాలు ఏవి కలవో అవి నా నామాలు. సందేహం లేదు. జగన్నాథా! నీ ఉపాసనయే నా ఉపాసన. నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషించువాడే.
విష్ణోరన్యంతు పశ్యన్తి యే మాం బ్రహ్మాణ మేవవా
కుతర్కమతయో మూఢాః పతన్తి నరకేష్వథః
యే చ మూఢా దురాత్మానో భిన్నం పశ్యన్తి మాం హరేః
బ్రహ్మాణం చ తతః తస్మాత్ బ్రహ్మహత్యాసమం త్వఘమ్
- నన్ను, బ్రహ్మను విష్ణువు కంటె భిన్నులని భావించు కుతర్కమతులకు నరకం ప్రాప్తిస్తుంది. అట్టివారికి బ్రహ్మహత్యాసమపాతకం లభిస్తుందని భవిష్యోత్తర పురాణంలోని మహేశ్వరవచనం. అతివిస్తరభీతిచేత స్థాలీపులాకన్యాయంగా కొన్ని శాస్త్రప్రమాణాలనే ఉట్టంకించడం జరిగింది.
అవిద్యామోహితులైనవారు భిన్నదృష్టితో, శివద్వేషసంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం చాలామందిని తప్పుదారికి మళ్లిస్తున్న కారణంగా ఇంత వివరణ అవసరమౌతోంది.
పైగా - ఇప్పటికీ విష్ణుసహస్రనామాదులకు వారు భాష్యాలను వ్రాస్తూ ఇలాంటి నామాల దగ్గర ప్రత్యేకించి శివుని, ఇతర దేవతలను "అత్యల్పులైన దేవతాంతరములు" అని వ్రాస్తున్నారు. ఆ దేవతలు విష్ణుస్వరూపులేనని వ్యాసదేవుడు స్పష్టంగా చెప్తున్నా, ఇలా ఇతరదేవతానింద చేయడం తగునా..?
శివకేశవులనే కాదు - ఇంద్రాదిదేవతలను కూడా పొరపాటున నిందించరాదు. పరమాత్మస్వరూపాలే వీరంతా! కేవలం భక్తిపారవశ్యంచేత ఒక దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది. అది భావనాపరమైన విషయం. అంతేగానీ జ్ఞానపరమైన సిద్ధాంతం కాదు. అంతపారవశ్యంలోనూ ఇతరదేవతలను నిందించితే ఆ పాపాన్ని అనుభవించక తప్పదు.
వేదమంతా ఒకే పరమాత్మ తత్త్వాన్ని పేర్కొన్నది. సర్వేశ్వర, పరమేశ్వర, మహేశ్వర, శంకర, ఆదిదేవ, మహాదేవ, రుద్ర, జ్యేష్ఠ, శ్రేష్ఠ, ఈశాన, ఈశ్వర, భూతేశ, ప్రాణేశ్వరః - ఇలా అసంఖ్యాక నామాలు శివనామాలుగాను, విష్ణునామాలుగాను వ్యవహరింపబడుతున్నాయి.
శివ పారమ్యాన్ని చెప్పే రుద్రమంత్రాలు, శ్వేతాశ్వతరోపనిషత్తు 'జగతాంపతయే 'నమః' వంటి ఆధిక్యసూచకనామాలను చెప్పాయి. వీటన్నిటినీ సమన్వయించి, పురాణాదులు-అభేదమే వేదమతమని ఉద్ఘోషించాయి. శాఖలుగా ఉన్న శైవవైష్ణవాదులు ఒకే పరతత్త్వమనే వృక్షానికి చెందినవనే స్పృహతో ఉన్నప్పుడు - ఏ తగాదా రాదు. వీటిని ఉపేక్షిస్తే అఖండమైన భారతీయ ఆత్మ దెబ్బతింటుంది.
నామరూపాల ద్వారా తత్త్వాన్ని గ్రహించి, అపారమైన అనంత విష్ణుతత్వంలోకి ఎదగడానికి వ్యాసభగవానుడు ఈ సహస్రనామస్తోత్రాన్ని అనుగ్రహించాడు. అంతేగానీ ఇంకా నామరూపపరిధులలో కుంచించుకుపోయి అఖండ విష్ణుతత్త్వానికి కొరత పెట్టే సంకుచితసంప్రదాయాలలోకి దిగజారడానికి కాదు.
*సమన్వయమే సనాతనం - సామరస్యమే భారతీయం. శివకేశవులు ఏకహృదయులు, ఏకతత్త్వం.*
వివేకవంతులెవరూ భేదాన్ని చూడలేదు. భేదం చూడనివారే ప్రపంచంచేత ఆదరింపబడ్డారు.
చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగనేటికి తల్లుల కడుపు చేటు
- అన్న భాగవతోత్తములు పోతనాదుల మార్గాన్ని మనం అనుసరించినప్పుడే విష్ణుప్రీతి.
మనలను పతనం చేయడానికి ప్రయత్నించే కలిపురుషుడు ఈ శివకేశవ భేదాన్ని మనలో ప్రవేశింపజేస్తాడని పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. కలిదోషనాశకులైన హరిని, హరుని స్మరించి - 'ఏకత్వాన్ని భజించి తరిద్దాం.
ఉదాత్తమైన భారతీయతాత్త్విక చింతనతో విశ్వాన్నంతటినీ విష్ణుమయంగా దర్శించే స్థాయికి ఎదిగేలా చేయమని పరమాత్మను ప్రార్థిద్దాం.