అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉన్కేశ్వర్‌ శివాలయం....!! ఆ లింగాన్ని తాకితే ద్వాదశ జ్యోతిర్లింగాలనూ దర్శించుకున్నంత పుణ్యమట...!

P Madhav Kumar

 


అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉన్కేశ్వర్‌ శివాలయం....!!

రోగాలను నయం చేసే శివుడు

రామచంద్రుడు ప్రతిష్ఠించిన ఆ లింగాన్ని తాకితే ద్వాదశ జ్యోతిర్లింగాలనూ దర్శించుకున్నంత పుణ్యమట. అంతేకాదు ఈ శివుడ్ని ప్రత్యేకంగా రోగనాశకుడిగా చెబుతారు. 

అక్కడి వేడినీళ్ల కుంటలో స్నానమాచరిస్తే శరీరం ఆరోగ్యవంతమవుతుందట. ఆ సుప్రసిద్ధ క్షేత్రమే మహారాష్ట్రలోని ఉన్కేశ్వర్‌! రామచంద్రమూర్తి వనవాస కాలంలో అనేకానేక అడవుల్లో పర్యటించాడంటారు.


🌸 అందులో భాగంగానే ఉన్కేశ్వర్‌ సమీపంలో సీతాలక్ష్మణ సమేతంగా నివాసమున్నాడట. ఆ సమయంలోనే ఓ భక్తుడి వ్యాధుల్ని నయం చేసేందుకు ఆయనే ఈ క్షేత్రాన్ని సృష్టించాడట. 

భక్తుడి మీద అపార కరుణా వాత్సల్యాలు కలిగి ఉండే దశరథనందనుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలోని శివుడూ విశేష మహిమాన్వితుడే. అందుకే త్రేతాయుగం నుంచీ నేటి వరకూ ఈ చోటికి భక్తులు బారులు కడుతూనే ఉన్నారు. ఉన్కేశ్వర్‌ శివాలయం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కిన్వట్‌ తాలూకా మాండ్వి దండకారణ్యం పరిసరాల్లో విరాజిల్లుతోంది. మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ సరిహద్దులో ఉన్న ఈ దేవాలయంలో భక్తులకు ఉచిత ప్రకృతి వైద్యమూ అందిస్తున్నారు. అందులోనూ చర్మవ్యాధులు బాగా నయమవుతాయని భక్తుల నమ్మిక.

స్థల పురాణం... 


🌸ఉన్కేశ్వర్‌ దండకారణ్యంలో శ్రీరామచంద్రుడు పాదం మోపడంతో పరిసర ప్రాంతమంతా పవిత్రమైందని చెబుతుంటారు. వాల్మీకి రామాయణంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. పూర్వం శర్భంగుడు అనే రుషి ఉన్కేశ్వర్‌ పరిసరాల్లోని దట్టమైన అడవుల్లో రామజపం చేస్తుండేవాడట. 

అతనికి చర్మవ్యాధులు సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయినా క్షణం విరామం లేకుండా రామనామాన్ని స్మరిస్తూనే ఉండడాన్ని శ్రీరామచంద్రుడు గ్రహించాడట.


🌸అందుకే ఆయన వనవాస కాలంలో ఉన్కేశ్వర్‌ దండకారణ్యంలోకి వచ్చి శర్భంగుడ్ని కలవాలనుకున్నాడట. అయితే రాముడిని దర్శించుకోవడానికి శర్భంగుడు తనరూపాన్ని అడ్డంకిగా భావించాడు. ఆ విషయాన్ని లక్ష్మణుడు పసిగట్టాడు. ఈ విషయాన్ని రాముడికి వివరించాడు. చలించిపోయిన రాముడు ఉన్కేశ్వర్‌వైపు రెండు బాణాలు సంధించాడట. అందులో ఒకటి వ్యాధులను మటుమాయంచేసే సరోవరస్థాపనకూ, మరొకటి మహాశివ లింగ ప్రతిష్ఠాపనకూ కారణమయ్యాయి. 


🌸అనంతరం శర్భంగరుషికి దర్శనమిచ్చిన శ్రీరామచంద్రుడు తొలుత వేడినీటి సరోవరంలో స్నానమాచరించి, మహా శివలింగాన్ని పూజించమని చెప్పాడు. అలాచేసిన శర్భంగరుషి వ్యాధులన్నీ మటుమాయమయ్యాయి.

అనంతరం అటవీ పరిసరాల్లోని ఎందరికో ప్రకృతి వైద్యం అందజేసిన శర్భంగరుషి జీవసమాధి అయ్యాడట. ప్రస్తుత దేవాలయం ఆయన సమాధి దగ్గరే నిర్మించారట.

రాణి హయాంలో... 


🌸18వ శతాబ్దంలో మాల్వ రాజ్యాన్ని ఏలిన అహల్యాబాయి సాహిబా హోల్కర్‌, తన హయాంలో దేశవ్యాప్తంగా ప్రజల సౌకర్యార్థం నీటి కుంటలూ, బావులూ, పుష్కరఘాట్లూ, విశ్రాంతి భవనాలతోపాటూ, దేవాలయాలను నిర్మించారు. 

వీటితోపాటు దేవతలు కొలువైన కాశీ, గయా, అయోధ్య, ద్వారక, మధుర, జగన్నాధపురి తదితరచోట్ల పలు ఆలయాల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగానే ఉన్కేశ్వర్‌ శివాలయాన్నీ నిర్మింపజేశారట.

రోగవిముక్తి... ఆలయంలోని వేడినీటి సరోవరంలో కొన్నిరోజులపాటు వరుసగా స్నానమాచరిస్తే ఎంతటి చర్మవ్యాధులైనా నయమవుతాయన్నది భక్తుల నమ్మకం. అక్కడి నీళ్లలో ఉండే సల్ఫర్‌ వల్ల ఇది సాధ్యమవుతోందన్నది నిపుణుల మాట. అందుకే దేశం నలుమూలల నుంచి ఎందరో వ్యాధిగ్రస్తులు ఇక్కడికొస్తుంటారు. ఆలయం వారే ఇక్కడ ఒక ప్రకృతి వైద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. 


🌸దాదాజీ అనే ప్రకృతి వైద్యుడు చాలా కాలంగా ఇక్కడ సేవలందిస్తున్నారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆశ్రమంలో రోగులు ఉండేందుకు వసతి సదుపాయం ఉంది. 

ఈ సేవలన్నీ ఉచితమే. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 100 మందికిపైగా రోగులు వైద్యం పొందుతున్నారు. వీరంతా రోజూ ఇక్కడి వేడినీటి సరోవరంలోని నీటితో స్నానమాచరించి, దైవదర్శనం చేసుకున్న తర్వాత దాదాజీ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం, తదితర వ్యాయామాలు చేస్తారు. 


🌸తెల్లమచ్చలు, సొరియాసిస్‌, పక్షవాతం, స్కెలిరోడర్మ తదితర వ్యాధులవారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. నిత్య హారతి... అన్నదానం శైవ సంప్రదాయం ప్రకారం ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తారు. బ్రహ్మముహూర్తంలో హారతితో పూజ మొదలవుతుంది. అనంతరం గాయత్రి మంత్ర జపంతో ఆలయం మార్మోగుతుంది. రోజూ భజనలు జరుగుతాయి. 


🌸ఈ ఆలయంలో దత్తాత్రేయుడి ప్రతిమా ఉంది. మహాశివరాత్రి, దత్తజయంతి, రామనవమి, వినాయక చవితి పండుగలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి, దత్తజయంతులకి జాతర కూడా చేస్తారు. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల మరాఠాలతో పాటు తెలుగు భక్తులూ పెద్ద ఎత్తున ఆలయానికి వస్తారు.

 రోజూ ఇక్కడికి వచ్చే భక్తులతోపాటు, వైద్యం పొందేవారికి అన్నదానం జరుగుతుంది.  అదిలాబాద్ నుంచి 56 కిలోమీటర్ల దూరం ఉన్నా ఈ క్షేత్రానికి బస్సు రైలు సౌకర్యం ఉంది నాందేడ్ నుంచి గంట గంటకు బస్సు సౌకర్యం కలదు..

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat