🙏బసవ పురాణం - 21 వ భాగము🙏

P Madhav Kumar


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


జగదేవుడు ఇంటికివెళ్లి షడ్రసోపేతమైన భోజనాదులు సిద్ధం చేశాడు. పురోహితులను పిలిచి అర్ఘ్య పాద్యాదులిచ్చి పూజించి తర్వాత బసవన్నకు రావచ్చునని కబురు పెట్టాడు. ఇది తెలిసి బసవడు కోపించి విందుకు వెళ్ళడం మానుకున్నాడు. జగదేవుడు పరుగు పరుగున వెళ్లి బసవన్నను కలిసి రమ్మని ప్రార్థింపగా బసవన్న ‘‘జగదేవయ్యా! నీవు చాలా తప్పు చేశావు. మనం కర్మ సంహారులం. ఆగమ ప్రోక్తమైన ధర్మం. అటువంటి కర్మబద్ధులను అర్చించడం తప్పు. శివునికెత్తిన కేలు శివద్వేషికి ఎత్తరాదు. వారితో ‘దర్శనాదీః పాపదా’ అనే వాక్యాన్ని బట్టి దర్శనాలప సంస్పర్శన శయన సంపర్క భోజనాసన దానాదులు నిషిద్ధాలు’’.

అని చెప్పి బసవన్న కొందరు భక్తులు కథలు చెప్పాడు. అది విని జగదేవుడు తన తప్పును మన్నింపుమని బసవన్నను ప్రార్థించాడు. ‘నేను చేసింది తప్పే. ఈ దోషానికి ప్రాయశ్చిత్తంగా ప్రాణాలు విడుస్తాను’ అన్నాడు జగదేవుడు. ‘వద్దు జగదేవా! నేను చెప్పిన మాట విను. త్వరలో ఈ నగరంలో శివద్రోహం జరుగబోతున్నది. అప్పుడే శివాపచారిని అణచివేయవలసిన బాధ్యత నీది. అదే నీ కర్తవ్యం’’ అని ఉపదేశించాడు బసవన్న. జగదేవుడు సరేనని వీరతాంబూలం తీసుకున్నాడు. ఆ తర్వాత బసవన్న అసంఖ్యక భక్తగణంతో జగదేవుని ఇంటికి వెళ్ల విందు ఆరగించాడు.

అల్లయ్య మధుపయ్యల కథ

కల్యాణ నగరంలో అల్లయ్య మధుపయ్య అనే పరమ మహేశ్వరులు ఇద్దరున్నారు. బసవనితో కలిసి వారు శివార్చనాపరులై శివానందాన్ని అనుభవిస్తూ ఉండేవారు. ఇలా వుండగా నిష్కారణంగా బిజ్జలునికి వారిమీద కోపం వచ్చింది. బిజ్జలునికి యమపురి రమ్మని ఆహ్వానం వచ్చిందా అన్నట్లు, బసవని మహిమ, భక్తి అన్నీ తెలిసి కూడా తెలియని అజ్ఞానివలె ప్రవర్తించాడు. దుర్మార్గమని తెలిసి కూడా మధించి బిజ్జలుడు అల్లయ్య మధుపయ్యగార్లను పిలిచి వాళ్ల కళ్లు పీకించాడు.

‘ఓహో! ఎంతటి ఘోరమిది. శివభక్తులాగ్రహిస్తే చెడిపోడా బిజ్జలుడు! ఇంకేమి జీవనమిది’ అని భక్తగణమూ బసవన్నా కోపోద్దీపితులైనారు. బసవడు అల్లయ్యను మధుపయ్యను పిలిచి వాళ్ల కళ్లు మళ్లీ వాళ్లకు ప్రసాదించాడు. అయితే ‘శివద్రోహం జరిగిన నగరంలో ఇంక ఉండరాదని’ శివభక్తులు నిశ్చయించుకొని జగదేవ మంత్రిని పిలిచి ‘నీ బాస నెరవేర్చుకునే సమయం వచ్చిం’దని చెప్పారు.

‘‘బిజ్జలుడు చేసిన అన్యాయానికి కల్యాణ నగరం పాడగుగాక’’ అని శపించారు భక్తులు. మాచయ్యగారు చౌడరాయుడు, ఏకాంత రామయ్య, కిన్నర బ్రహ్మయ్య, కాశిరాజు, కన్నద బ్రహ్మయ్య, కక్కయ్య, మాది రాజయ్య, మసణయ్య మొదలైన భక్తగణమంతా కదలి రాగా కల్యాణనగరం వదలి బసవన్న కప్పడి సంగమేశ్వరానికి వెళ్లిపోయాడు.

ఇంతలో కల్యాణ నగరంలో ఉత్పాతాలు పుట్టాయి. భూకంపం వచ్చి భూమి అటూ ఇటూ ఊగింది. అర్థరాత్రి కాకులు అరవసాగాయి. వంటలు చేసి మూతలు పెడితే పురుగులు పడ్డాయి. తోక చుక్కలు రాలాయి. రాళ్ల వాన కురిసింది. సూర్యచంద్రుల చుట్టూ పరిమేషం వచ్చింది. వేసవిలో మంచు కురిసింది. మధ్యాహ్నం యముడు భయంకరంగా వీధులలో తిరుగుతున్నట్లు కన్పడ్డాడు. రాజుకు తల లేని నీడ కన్పడింది. సూర్యుడుదయించే సమయానికి ఆకాశంలో ఎందరో సూర్యులు ఉదయించినట్లు కన్పడింది. ఇవన్నీ చూచి ప్రజలు భీతిల్లిపోయారు.

ఇలా ఉండగా జగదేవయ్య తన ఇంటికి వెళ్లాడు. అతణ్ణి తల్లి చూచి ఇలా అన్నది. ‘‘శివద్రోహం చెవిని పడ్డప్పుడే వారిని సంహరించాలి. అలాంటిది విని కూడా విననట్లు ఊరుకున్న నీచునికి మోక్షమేమిటి? అతనిది భక్తి ఏమిటి? లోగడ నీకు తాంబూలమిచ్చి ఆ భక్తులుంతా ఏ పని చెప్పారో గుర్తుందా? వారంతా భయస్థులై నీకా పని అప్పగించలేదు. అందులో ఏ ఒక్క భక్తుడలిగినా సమస్త బ్రహ్మాండములూ తల్లకిందులవుతాయి. దక్ష యజ్ఞగాధ నీకు తెలిసిందే కదా! నీకీ అవకాశం ఇచ్చేందుకే భక్తులు నీకు తాంబూలం ఇచ్చారు. అలాంటిది శివభక్త గణనింద విని కూడా ఊరుకొని తిండికోసం ఇంటికి వచ్చావు. ఛీ! కుక్కా’’ అని చిప్పలో ఇంత అన్నం దొడ్డివాకిట పెట్టి ‘జూజూజూ’ అని కొడుకను పిలిచింది. జగదేవుడు కూడా సిగ్గుపడకుండా కుక్కలాగే వచ్చి అన్నాన్ని మూతితో కతికి తిన్నాడు.

ఈ వార్త మల్లయ్య, బ్రహ్మయ్య అన్న భక్తులు విన్నారు. అర్థరాత్రి వేళ వారు వచ్చి జగదేవునితో కలిశారు. ముగ్గురూ కలిసి బిజ్జలుని భవనానికి వెళ్లారు. కత్తులు తీసి బిజ్జలుని పొడిచారు. అతడి తలను కోసి కడుపులో పెట్టారు.

ఆ తర్వాత జగదేవుడు, మల్లయ్య, బ్రహ్మయ్య ముగ్గురూ రాజనగరు వదలి తమ నివాస స్థానాలకు వచ్చారు. జగదేవుడు తల్లి పాదాలకు మొక్కాడు. ఆమె దీవించి ప్రసాదమిచ్చింది. అది స్వీకరించి ‘‘తల్లీ! శివద్రోహిని హతమార్చాను. కాని శివద్రోహం విన్న వెంటనే ఈ పని చేయనందుకు నాకు నేను విధించుకోవలసిన శిక్ష ఇంకా వుంది’’ అని జగదేవుడు తన తలను తాను నరుక్కొని బంధు, మిత్ర పుత్ర కళత్ర పరివారంతో విమానంలో కైలాసం చేరాడు!🙏


🙏 హర హర మహాదేవ 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat