*శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః*
నారదుని జోస్యం
ఇలా ఉండగా..నారదుడు హిమవంతుని నగరికి విచ్చేశాడు. నారద మునీంద్రులకు యధోచిత సత్కారాలు చేసినానంతరం, "మహానుభావా! మా పార్వతీదేవి యొక్క భవిష్యత్తును తమవంటి త్రిలోక సంచారులు - త్రికాల వేదులుచెప్పగా విన వేడుక అవుతున్నది " అని ముకుళిత హస్తుడై ప్రాధేయపడ్డాడు.
అందుకు కారణం లేకపోలేదు.
లోకరీతి ప్రకారం - బాల్యమున ఎంతోసంతోషదాయకంగానూ పుట్టింట గడిపే ఆడపిల్లకి, ప్రాయమురాగానే పెళ్లిచేసి అత్తవారింటికి పంపేవేళ, ఆదుర్దగా ఉండడం ఇటు పిల్ల తల్లిదండ్రులకూ - అటు ఆ పిల్లకూ సహజం!
అందున - అపురూప విశ్వమోహన రూపాన అలరారుచున్న పార్వతికి తగిన వరుడెవరో తెలుసుకోవాలన్న కుతూహలం పర్వత రాజదంపతులకు మరీమరీ సహజం!
పార్వతిని ఆపాదమస్తకం తిలకించాక, ఆ దేవ మునీంద్రుడు చిరు మందహాసంతో, అప్రయత్నంగా చేతులు జోడించడంతో, పర్వతేంద్రుడు ఆశ్చర్యపోయాడు.
"హిమవద్రాజా! నీవు మహా అదృష్టవంతుడివి!" అన్నాడు.
ఆశ్చర్యపోయి చూస్తున్న పర్వతరాజుని భుజం తట్టి "అవునయ్యా! ఈమె సామాన్యురాలు కాదు! సమస్త దేవతారాధ్యుడైన ఆ సదాశివునికే పత్ని కాగలదు. కృతార్ధుడివి నీవు!" అన్నాడు .
"శివుడా? ఆయన నిత్య తపోనిధి. పైగా పరతత్త్వుడు. ఆయన ఈ ప్రపంచ సుఖాల నాశించునా? కొంతకాలం దాక్షాయణితో కాపురం చేసిన వాడాయె! అమె నిర్యాణానంతరం కఠోరతపస్సుకు పూనుకొన్న వాడెట్లు కల్యాణవేదిక చెంతకు రాగలడు?"....ఇవీ హిమవంతునికి అంతుచిక్కని ప్రశ్నలు.
ఓ పక్క నారదులవారి జోస్యం ఆనందం కలిగించినా, శివుని సన్నిధిన పార్వతిని నిలుపుటే రీతిని జరుగుట?.. అనే చింత పట్టుకుందిప్పుడు.
సెలవు తీసుకొని నారదుడు వెళ్లిపోయాడు.
ఈలోగానే - శివుడు సపరివార సమేతుడై, తన గిరి శిఖరాలలో ఒక శిఖరాన తపోదీక్ష కొచ్చిన వర్తమానం విని పరమానంధ భరితుడైనాడు పర్వతుడు.
కాగల కార్యం గంధర్వులే తీర్చుటన్న ఇదియే కదా! అని సంతసించాడు.
తన కుమార్తె యైనను, చిన్ననాటినుండి శివారాధనే నిత్య కృత్యంగా ఎంచే పార్వతిని, సాక్షాత్తు ఆయన సన్నిధిన ప్రవేశపెట్టడానికి నిశ్చయించాడాయన.
ఒక శుభదినాన కూతుర్ని వెంట నిడుకొని శివదర్శనార్ధియై బయల్దేరాడు.
పార్వతి శివ సందర్శనాభిలాష:
పశుపతిని పరామర్శించిన అనంతరం "స్వామీ! తామిపుడు,మా భూములను పావనంచేయరావడం మాకెంతో ముదావహం!
తపస్సు కోసమే వచ్చినప్పటికీ మీరు మాకు ఇప్పుడు అతిధులు కనుక, మీరు పూనిన కార్యము ఫలవంతమగు వరకు తోడ్పడుట మా విధి!" అన్నాడు పర్వతరాజు.
సుహృద్భావ స్ఫోరకములైన ఆ పలుకులకు శివుడెంతో ఆనందించి, తనకక్కడ ఎట్టి లోటుపాట్లు జరగడంలేదనీ, అంతా దివ్యంగానే ఉందనీ సంతృప్తి ప్రకటించాడు.
గిరిజను చూపి ఈమె నాపుత్రి! తాము అనుమతీయ ప్రార్ధన! తమ సేవార్ధం ఈమెనిక్కడ విడిచి పెట్టదల్చుకున్నాను... అన్నాడు హిమవంతుడు.
కానీ...నా దొక్క చిన్నమనవి! తమ సపర్యలమూలమున, నా పుత్రిక ధన్యురాలు కాగోరుచున్నది.మందహాసం చేశాడు. శివుడు. నిమిషం ఆలోచించాక సమ్మతించాడు.
పరమ నిర్లిప్తుడూ, పావన వరితుడూ అయిన పరమ శివునిధోరణికి ప్రమధ గణాలు విస్మయ చకితులైనవి.
హిమవంతుడు పెద్దలతో యోచించి, ఒక దివ్యముహుర్తాన, తన కూతురు కాళిచేత శ్రీకంఠుని సేవలను ఆరంభింపజేశాడు.
కాళి సేవలను శివుడు ఆమోదించడం - తృప్తిగా తలూపడం తప్ప ఒక్కసారైనా ఆమెను సమ్మోహదృష్టితో చూడలేదు. సర్వప్రపంచాన్నే సమ్మేహపరచగల సౌందర్యం ఉండి కూడా - అది తాను శివునికి సమర్పించుకొనే ఇచ్చ ఉండి కూడా శివుడు స్థాణువువలె ఉండడం ఆమెకు కష్టంగానే తోచేది.
సర్వాంతర్యామి కదా! శివుడికి ఆమె అంతరంగంలో చెలరేగే సంఘర్షణ తెలీదా? తెలుసు! అయినప్పటికీ, ఆమె అహం, అందం వెనుక దాగి ఉన్నదని - అది కరిగాక ఆదరిద్దామని మిన్నకున్నాడాయన.పరమశివుడు అందరిలాంటి కాముకుడు కాడు.
వైరాగ్యమే ఆయన స్వరూపము. అది కూడా సతీదేవి నిర్యాణానంతరం మరింతగా హెచ్చింది.
అప్పటికీ - ఎందరెందరో మహామహులు తమ తమ కూతుళ్లను ఇవ్వడానికి వచ్చారు.
అందరినీ నిరాకరించిన వాడాయె! అటువంటి ఈశ్వరుని మనస్సు ఒక కన్య మీద లగ్నం అవుతుందా?...
*తారకాసుర హంతారం*
*మయూరాసన సంస్థితం*
*శక్తిపాణిం చ దేవేశం*
*స్కందం వందే శివాత్మజం*
🔱 *ఓం శరవణ భవ* 🔱
శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
🙏 ఓం నమశ్శివాయ 🙏