గరిక గడ్డి అంటే గణపయ్యకు ఎందుకంత ఇష్టం..? గరికకు గణేశుడికి ఏంటి సంబంధం..? రెండు పోచలున్న దూర్వారాన్ని ఎందుకు గణపతికి సమర్పిస్తారు..? గడ్డిపోచకు..గణనాథుడికి ఎలా బంధం ఏర్పడింది..?
వినాయక చవితి పూజలో గణనాథుడికి ఎన్నో రకాల పత్రులతో పూజలు చేస్తారు. ప్రధానంగా 21 రకాల పత్రులతో పూజ చేస్తారు. ఆ పత్రుల్లో ‘గరిక గడ్డి’ కూడా ఒకటి. గడ్డిపోచ కూడా వినాయకుడి పూజలు పాలుపంచుకోవటం విశేషం. ఆ గరిక గడ్డి అంటూ గణపయ్యకు చాలా ఇష్టమట. గరిక గడ్డి అంటే గణపయ్యకు ఎందుకంత ఇష్టం..? గరికకు గణేశుడికి ఏంటి సంబంధం..? అనే విషయాన్ని ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుసుకుందాం..
దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పిస్తారు. ఈ గడ్డిపోచకు..గణనాథుడికి ఎలా బంధం ఏర్పడిందనేదానికి పురాణ కథ ఒకటుంది. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకున్నారట. అప్పుడు వినాయకుడకి కోపం వచ్చిన అనలాసురుణ్ని అమాంతం మింగేశాడట. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ని మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడిపోయడట. ఆ వేడిని తగ్గించటానికి కైలాసంలో గణాలు ఎంతో ప్రయత్నించినా వేడి తగ్గలేదట.
దేవతలంతా తరలి వచ్చి ఎన్నో రకాలుగా ప్రయత్నించినా వేడి తగ్గలేదు. చల్లదనం కోసం కలువపూలను వినాయకుడిని కప్పేశారు. పువ్వులతో నింపేశారు. ఏకంగా చల్లదానికి మారుపేరు అనే చంద్రుడ్ని కూడా తీసుకొచ్చి వినాయకుడి తలపై పెట్టారట. అయినా వేడి తగ్గలేదట. దీంతో పరమ శివుడు రంగంలోకి దిగాడు. కొడుకు తాపం తగ్గించటానికి గరికే పరమ ఔషధం అని గరికను తీసుకొచ్చి వినాయకుడి శిరస్సుపై పెట్టాడట. దాంతో గణపయ్య తాపం తగ్గింది. అలా వినాయకుడికి గడ్డిపోచకు సంబంధం ఏర్పడింది. తన తాపాన్ని తగ్గించిన గరిక అంటే వినాయకుడకి చాలా ఇష్టమ ఏర్పడింది. నా పూజలో నీకు భాగం ఉంటుందని వరమిచ్చాడట.
దుర్వా అంటే గరిక. వీటిలో మూడు రకాలు ఉన్నాయి. నీల దూర్వా,(నల్ల గరిక) గండ దూర్వా (గండాలి), శ్వేత దూర్వా (తెల్ల గరిక) అని మూడు రకాలున్నాయి. సంస్కృతంలో శతవీర్యా అని, నీల దూర్వా (నల్ల గరిక)కు బుర్రం సహస్రవీర్యా అని పేర్లున్నాయి.