🔱 *కుమారచరిత్ర* -6 🔱

P Madhav Kumar


*శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః* 


*బృహస్పతి హితోపదేశం*


"పాకశాసనా! పార్వతీదేవి సతి అవతారం అనేది పరమశివునికి తెలీదా? కానీ, అతడు అంత సులభంగా స్త్రీవ్యామోహాన్ని పొందేవాడా? అక్కడ పార్వతీదేవి ఆయన్నే వివాహ మాడగోరి, సాన్నిధ్యాన వసిస్తూ, ఆయన అనుగ్రహం కోసం వేచి ఉంది. ఆవిడపై ఆయనకు ప్రీతి కలిగితేనే కదా - కార్యం సఫలమయ్యేది. 
ఇందుకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని తనయుడు పూనుకుంటే తప్ప ఫలితం సిద్ధించదు. కనుక అతడ్ని రప్పించి, ఏదో రీతిన అర్ధించి అయినా సరే!...కార్యం ఫలవంతం అయ్యేలా చూడు! అప్పుడే బ్రహ్మవాక్కు ఫలించేది" అని దేవగురువు తన హితోపదేశంతో దేవేంద్రునికి కర్తవ్యబోధ చేశాడు.


మీనకేతనుడ్ని మనసారా తలుచుకున్నాడు - దేవేంద్రుడు. సుందరీమణుల కనుబొమలను పోలిన విల్లు ధరించి, చిగురాకులు గొడుగు పట్టగా, మలయా నిల పరివేష్టితుడై, చంద్ర వసంతులనే చెలికాళ్లను వెంటనిడుకొని రాజశుక రథాన్నెక్కి అక్కడికొచ్చాడు వలరేడు.
తలచినదే తడవు, ఆ రీతిన వేంచేసిన రతిపతిని, శచీపతి సాదరంగా ఆహ్వానించాడు.

తన వల్ల ఏదో ముల్లోకాలకూ ఉపకరించే పనిపడందే, దేవేంద్రుడు పిలువనంపడని ఆ క్షణమే అర్ధమై పోయింది కందర్పుడికి.

ఒకవేళ దేవేంద్ర పదవి నాశించి ఎవరైనా ఘోరతపస్సు చేస్తున్నారేమో! అందుకే ఇంద్రుడు కలవరపడి, తపోభంగ నిమిత్తం తనను రప్పించాడా?..ఆలోచిస్తున్నాడు మన్మధుడు. ఒక్క నిమిషం ఆగి, ఆవిషయమే అడిగేశాడు కూడా!

"ఇంకెక్కడి పదవి మన్మధా! అదెన్నడో తారకాసురుడి పాలైంది! పదవే వుంటే, దేవ సభలో ఉండక ఈ రహస్య స్థావరంలో దేనికి ఉంటాం?" నీరసంగా అన్నాడు ఇంద్రుడు.

"అయ్యో! అలాగా! నాకీ సంగతి తెలీదే!"

" సరే మన్మధా! నువ్వు నిత్యసంతోషివి.." అంటూ జరిగిన సంగతి యావత్తూ మదనుడికి వివరించాడు దేవేంద్రుడు.

" నావల్ల దేవగణానికంతటికీ ఎలాంటి మేలు జరుగుతుందని నీవు ఆశిస్తున్నావో - దానికి నేనేం చెయ్యగలనో చెప్పు! శక్తి వంచన లేకుండా చేస్తాను" అని హామీ ఇచ్చాడు మీనధ్వజుడు.

కానీ..." ఇంచుక సంశయం చేత ఆగాడు శచీపతి.

"సంకోచమేల? సవివరంగా చెప్పు సురపతీ!

"అదే! ఆ విషయానికే వస్తున్నాను. నీ సుమశర ప్రయోగాలు సాంబశివుని మీద సాగాలి!"

"ఏమీ! సాంబశివుని పైనా?"

"భయమా?"

స్వాతిశయంతో కాస్త బింకంగా పైకి కనిపించినప్పటికీ, మన్మధునికి మనస్సులో భయమే కలిగింది. అయినా , గుంభనగానే ఉన్నాడు మారుడు.

పెద్దపెట్టున నవ్వేస్తూ "నాకు భయమేల? ఆ సంగతి నీ వెరుగవా? నేను అందరికీ అజాతశత్రువును కదా! నన్ను మిత్రులుగా భావించనివారు ఈ ముల్లోకాల్లోనూ (స్వర్గ, మర్త్య, పాతళ) ఉన్నారా?" అని గంభీరంగా ప్రశ్నించాడు


"ప్రస్తుతం సదాశివుడు హిమవన్నగాలపై నున్న 'ఓషథీప్రస్థం' అనే ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు."

దాక్షాయణి ప్రస్తుతం హిమవంతుని బిడ్డగా పుట్టి పార్వతిగా పెరుగుతున్నది. యౌవనవతి అయిన తన కుమార్తెను హిమవంతుడు, సపర్యలు చేసే నిమిత్తం అతడే స్వయముగా శివుని సన్నిధిని విడిచివచ్చాడు."

"మేలు!మేలు! వారిరువురూ భార్యభర్త లయ్యేందుకు మంచి అవకాశమే లభించాలి కధా!"

"మనసిజా! ఆ పని అంత సులభసాధ్యం కాదు! అందులో నీ ప్రమేయం ఆవశ్యం! అతని హృదయమున ప్రేమ రేకెత్తాలంటే, నీ సుమశర ప్రతాపం రుచి చూపించాలి! తద్వారా వారిరువురికీ ప్రణయం అంకురించి, అది పరిణయంగా పరిణమిస్తేనే, తారకాసురవధ అనే కథ జరగ్గలదు! ఆ కార్యక్రమ నిర్వహణకే నిన్నాహ్వానించింది.."

మొదట సంకోచించినా మునిజన, దేవతాగణాల హితం కోసం కనుక, నెమ్మదిగా తలూపిన సుమశరుడు అందరికీ సమ్మేదం చేకూర్చాడు.

తన పరివారంతో సహా పెద్దల ఆశీస్సులు తీసుకొని అటనుండి కదిలిపోయాడు.

దేవతల ఆశీస్సులు దండిగా అందుకున్న మదనుడు "సర్వ ప్రపంచాన్నీ సమ్మోహపరచగల నేను, సాక్షాత్ శర్వుడినే చలింపచేస్తేనే కదా! నా సత్తా లోకానికి వెల్లడయ్యేది" అనే పట్టుదలతో కూడా, శివుడు తపమాచరిస్తున్న తావుకు చేరువైనాడు.

ఇంకేమున్నదీ....అకాలంలో వసంతఋతు సూచన లారంభమైనాయి. కాలం కాని కాలంలో వసంతాగమనం తపోదీక్షాపరులకు ప్రతికూలవర్తి.అశోకాది వృక్షాలు పూచాయి, మామిళ్లు విరగకాచాయి. తుమ్మెదల ఝుంకారం - కీర శుక పికాల కలకలారావం అధికమైంది.ఈ మధుమాసపు అలజడీ - మదనుడి సందడీ దేవలోకం నుండి హిమాలయ విహారాలకొచ్చిన కిన్నెర కింపురుష గంధర్వాదులకు మదనకేళికి సమాయత్తపరిచేలా ఉండగా, మహేశ్వరుని మనస్సును అణుమాత్రము సంచలింప చేయకుండెను.

పరోక్షమున కాకుండ, ప్రత్యక్షమున తన ప్రతాపాన్ని చూపించాలనుకున్నాడు. అతడి ప్రయత్నానికి సహకరిస్తోందా అన్నట్లు పార్వతి కూడా, శివ పరిచర్యార్ధం ఆ సమీపంలోనే సంచరిస్తున్నది

మదనుడికి మంచి పట్టు దొరికినట్లయింది.
తరుణాబ్జముఖి - పర్వతరాజపుత్రి, చంద్రశేఖరుని సమీపించి అంజలి ఘటించి నిలిచింది.

సరిగ్గా అదే సమయంలో శివుడు ధ్యాన నిష్ఠలోంచి కళ్లు తెరిచి తన ఎదుటనున్న పార్వతిని హసన్ముఖుడై చూశాడు.

అదే అదనుగా భావించిన మదనుడు 'హర్హణ' మనే శరాన్ని ప్రయోగించాడు - క్షణం కూడా ఆలస్యం చేయకూండా. వెంట వెంటనే 'సమ్మోహ'నాస్త్రం సంధించాడు.

ఇంకేమున్నదీ?.. ఆ లతాంతాయుధ ప్రభావంవల్ల

- చంద్రోదయవేళ సముద్రం ఉప్పొంగిన రీతిన నిమేషకాలం ఈశ్వరుని చిత్తం చలించింది.

కాని...
అంతలోనే శివుడు అప్రమత్తుడైనాడు. తనకు కలిగిన వికారానికి కారణం తెలియడం కోసం చుట్టూ చూశాడు.
శివుడు తననే వెతుకుతున్నాడని అర్ధం అయింది మదనుడికి. తప్పించుకొని పారిపోయేలోగానే గిరీశుని దృష్టికి దొరికిపోయాడు.

తక్షణం, తీక్షణమైన తన మూడో కంటిని తెరిచాడు - త్రిలోచనుడు.

ఆయన మూడో కన్ను అసలే అగ్నికీలలకు ఆలవాలం కదా! ఓ మహోగ్రజ్వాల వెలువడింది. నిటలాక్షుడి నయనంలోంచి. అంతే! మన్మథుడు భగ్గున మండిపోయాడు. తిరిగి చూస్తే ఇంకే ముందక్కడ? బూడిదకుప్ప తప్ప.

ఆ మహావిషాదకర దృశ్యాన్ని చూసిన దేవ, మునులంతా హాహాకారం చేశారు. మన్మధుని రక్షించాలనే ఆత్రంతో వస్తున్నవారందరూ ఇంకా అంతదూరాన ఉండగానే, వారి కళ్ల ఎదుటే జరిగిపోయిందీ దారుణం!

హటాత్తుగా ఆవనిలో విరసిన ఆమని అంతర్ధానమైంది.
మన్మధపత్ని రతీదేవి కీవార్త క్షణాలమీద తెలిసింది. ఆమె శోకవిచలిత అయిమూర్చల్లింది. పరిచర్యలతో తిరిగిలేచి దీర్ఘశోకంలో మునిగింది.

దేవతలంతా ఏకమై, తన పతిదేవుడిని బూడిదగా మిగిల్చారని పలురీతుల వాపోయింది. తన పతిలేని బ్రతుకిక వృధా అని తలచి, అగ్ని ప్రవేశానికి సిద్ధపడింది.
అంతలో ఆకాశవాణి రతీదేవి నుద్దేశించి ఇలా పలికింది.
"మన్మధసతీ! సాహసమువలదు. నీకు అతిస్వల్ప సమయములోనే శుభము జరుగనున్నది. ఏది కర్మరీత్యా జరుగనున్నదో, అది జరుగక మానదు. అంతేకాదు! నీ భర్తకు బ్రహ్మశాపము గలదు. నీ జననమునకు పూర్వమే జరిగిన, ఆ శాపగాథ నీకు తెలియకపోతే పోనిమ్ము!
గర్వాంధత చేత నీల కంఠునికే మదనతాపము పుట్టించు దుస్సాహసము నీ భర్తది. ఆ భస్మము జాగ్రత్తగా కొంగున మూట కట్టుకో! ఎప్పుడైతే పార్వతీ పశుపతుల కళ్యాణం జరుగుతుందో - ఆనాడు అంబికాదేవి కోరిక మేరకు, శివుడు కరుణాంతరంగుడై మన్మధుని తిరిగి బ్రతికించగలడు".
అశరీరవాణి చెప్పిన ఈ మాటలకి రతీదేవి కొంతూరట చెందింది. వారి కళ్యాణం ఎప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూడ సాగింది.

పార్వతీదేవికి వైనం అంతా తెలిసి, ఎంతో విచారించింది. తాను ఒక వంక భర్తకోసం తపిస్తూ వుంటే, అన్యాయంగా - తన కారణంగా తాను ఇంకోవనితను భర్తకు దూరం చేయడం జరిగిందేమిటీ...అని ఎంతో ఖేదపడింది.

ఎప్పుడైతే, మన్మధ దహనకాండ జరిగిందో, ఇక అక్కడ తాను ఉండజాలనంటూ శివుడు అంతర్హితుడయ్యాడు అక్కడనుంచి.

పార్వతి పరి పరివిధాల పరితపించుచు, తన శివు నెందును కానరాక ఉంటుచుండగా, నందికేశ్వరుడు - తదితర మనీశ్వరులు ఆ పర్వతరాజపుత్రిని ఊరడించి, తిరిగి ఆమెను హిమవంతుని సన్నిధిన చేర్చి, జరిగిన సంగతంతా వివరించారు.

తన పుత్రికకు జరిగిన ఆశాభంగానికి హిమవంతుడు కూడా ఎంతో చింతించాడు.

ఇంకొక ప్రక్క దుఃఖాగ్ని తప్తయైన తన కూతురును ఓదారుస్తూ "తల్లీ! ఇక మన ప్రాప్తమింతే! ఊరడిల్లు" మని చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేయసాగాడు. మేనకాదేవి భర్త ననుసరించింది.


*నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,*

*తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |*
*శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప* ,
*వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 3 ‖* 

  🔱   *ఓం శరవణ భవ* 🔱

శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏
🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸

🙏 ఓం శరవణభవ 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat