*శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః*
పార్వతి తన అందాన్ని తానే నిందించుకుంది. సౌందర్యముతో సాధించలేనిది తపస్సుతో సాధిస్తానని శివుని కొరకై వ్రతము పూనింది. ముత్యాలహారాలు తీసి రుద్రాక్షమాలలు ధరించింది. ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో కమండలము పట్టి,
రెండు చేతులు పైకెత్తినమస్కార భంగిమతో తపస్సు ప్రారంభించెను.
కొంతకాలము ఆకులు, అలములు తింటూ తపస్సు చేసింది. చివరకు ఆకులు, అలములు తినటం మానివేసింది. పంచాగ్ని మధ్యములో ఒంటి కాలిపై నిలిచి తపస్సు చేస్తూఉంటే,
దేవతలు ఆమెను "అపర్ణా, అపర్ణా" అంటూ పిలిచారు.
పర్ణము అంటే ఆకు, పర్ణము కూడా తినలేదు కాబట్టి అపర్ణ అన్నారు. (అప గత ఋణ అపర్ణ అనగా ఋణములను పోగట్టునది)
ఇదంతా పైనుంచి చూస్తూనే ఉన్నారు దేవతలు.ఇంద్రుడు, పార్వతికి ధైర్యం చెప్పి రమ్మని నారదుని పంపించాడు.
దేవతలందరి సంక్షేమార్ధం, ఇంద్రుడి ఆలోచన అనుసరణీయం అని, అవశ్యమే హిమరాజు సన్నిధికి బయల్దేరాడు నారదుడు.
ముందుగా హిమవంతుడ్ని కలుసుకున్నాడు. అతడికి ధైర్యం చెప్పాడు.
ఆ తరువాత పార్వతి దగ్గర కొచ్చి "తల్లీ! నీవు అంబవు. ఆదిపరాశక్తి అపరావతారానివి. నీకు చెప్పదగినంత వాడిని కానుగాని, కాలచక్రరీత్యా చెప్పాల్సివస్తున్నది.
సదాశివుడు తపస్సాధ్యుడు. భక్తవరదుడు. ఆయనను బాహ్యసౌందర్యంతో ఆకట్టుకోవాలనుకోవడం మన భ్రమ. దానికాయన లొంగడు. అంతః సౌందర్యంతోనే ఆయన సులభ సాధ్యుడు.
కనుక నువ్వాయోగమూర్తి నిమిత్తం తపోదీక్ష పూనడం ఉత్తమం" అంటూ శివపంచాక్షరీ మంత్రం ఉపదేశించి, సెలవు పుచ్చుకున్నాడు నారదుడు.
ఆ క్షణమే పార్వతి తపస్సమాధికి పూనుకొన్నది
హంసతూలికా తల్పాలపై శయనించే పార్వతి కటికనేలపై పరుండి, ప్రాతః సంధ్యలోనే మేల్కాంచి నిత్య శివదీక్షాపరురాలైంది.
ఇంద్రాది దేవతలు సదాశివుని ప్రార్ధించి, పార్వతిని పరిణయ మాడి ప్రపంచాన్ని కాపాడమని వేడుకున్నారు.
పార్వతియందు కుమారుడిని కని తారకుని పీడ తొలగించమని అభ్యర్ధించారు.
వారిని కరుణించి, అట్లే జరుగుతుందని అభయం ఇచ్చి పంపేశాడు శివుడు.సప్తర్షుల ద్వారా పార్వతి తపోగ్రత తెలిసినా, తానొకపరి, ఆమె మనోనిశ్చయాన్ని పరీక్షించ దలిచాడు శూలి.
నటన బ్రహ్మచారీ - నగరాజపుత్రీ ముఖాముఖి:
ఒకనాటి మధ్యాహ్న సమయాన, పార్వతి యధోచితమున నియమనిష్ఠలతో తపమాచరించు చుండగా అచ్చటికి ఒక బ్రహ్మచారి వచ్చాడు.
సూర్యతేజంతో వెలుగుతున్న అతడు కృష్ణాజినము, జపమాల ధరించాడు. త్రిపుండ్రాంకితమైన అతని లలాటాన్ని చూసి సాక్షాత్తు శివయోగిగా భావించిన పార్వతి నమస్కరించగా, అతడు 'అభీష్ట సిద్ధిరస్తు' అని ధీవించాడు.
కుశల ప్రశ్నలడిగాడు. పార్వతి వంక పరిశీలనగా చూసి, "అమ్మాయీ! ఏదో ఫలాపేక్షతో భీషణ తపమాచరిస్తున్నట్లున్నావు.
నీవుపడుతున్న కష్టం చూస్తూంటే - తీరని కోరిక ఏదో నిన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నట్లే ఉంది.
"ఇదిగో! అమ్మాయీ! నువ్వు చూస్తే కన్యవు. నేనా బ్రహ్మచారిని! మన కిద్దరికీ సరిజోడు కుదురుతుందనే నా నమ్మకం!ఏమంటావు!
పోనీ! నీవు ప్రేమించిన వానికై నా తపస్సులో సగభాగం నీకు ఇప్పుడే ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను"...అని ఆశ చూపించాడు.
ఆ వాగ్వైఖరి నచ్చక, పార్వతి చెలికత్తె వైపు కనుసైగ చేసి చూసింది. ఆమె వివరంగా పార్వతీదేవి ఎవరికోసం తపస్సు చేస్తున్నదో చెప్పింది
అంతా విని గట్టిగా నవ్వాడా బ్రహ్మచారి. "భేషు! చాలా గొప్ప వరుడి కోసమే తపస్సు చేస్తున్నదే మీ రాజపుత్రి" అని మళ్లీ పక పక నవ్వాడు.
ప్రస్తుతం మీ చెలి ఎవర్నయితే వరించ బూనుకొన్నదో అలాంటి వాడు ఈ పధ్నాలుగు లోకాల్లోనూ
ఎక్కడా గాలించి వెతికినా కనబడడు.ఒంటి నిండా బూడిద! మెడలో ఇంతింత కపాలాల మాల, వాటిని పెనవేసుకున్న పాములగోల, కట్టినదేమో జంతుచర్మం. అట్టలు కట్టిన జడలు...ఓహోహో! ఎవరైనా వింటే నవ్విపోతారు.
అంద చందాల్లో గానీ - ఐశ్వర్య భాగాలలో గాని పార్వతీదేవి ఎక్కడ? శ్శశానవాసి సాంబుడెక్కడ? ఐనా ఆవిడ కోరుకోదలిస్తే, దేవలోకంలో దేవతలు ఎంతమంది లేరు? భూలోకంలో రాజపుత్రు లెంతమంది లేరు? పోనీ!..అవన్నీ వదిలేయ్ ! మీ
సఖికి నేను తగనా? కాస్త చెప్పిచూడు!
దీంతో చెలికెత్తె క్కూడా కోపం వచ్చింది. అయినా, బ్రాహ్మణులపై కోపం తగదని తెలిసిన ఇంగితజ్ఞురాలు కనుక - "అయ్యా!తాప సోత్తములకు తగని పలుకులను, మీ నోటి వెంట వినాల్సి వస్తున్నందుకు విచారంగా ఉంది. తాము ఎవర్ని కోరుతున్నారో, కాస్త ఆలోచించడం మంచిది" అన్నది కాస్త కటువుగానే
."ఓహో! అదా సంగతి! అమ్మా! పార్వతీదేవి చెలీ! మీ సఖి పర్వతరాజు కూతురని నేను మర్చిపోయాననుకున్నావా? ఇలా ఎవరైనా మాట్లాడారంటే - ఉరితీయించేస్తారు! అంతేకదా..
"అయ్యో! అది కాదయ్యా విప్రకుమారా! ఈమె ఏనాడో పరమ శివుని సొత్తు అయిపోయింది. ఇతరులీమెను ఆశించడం మహాపాపం!" అంది -
ఇంకేం అనాలో తోచక."బాగుందమ్మా - ఈ వైనం! మనస్సును పరమశివునికి అంకితం చేసింది, సరే! ఆయనగా రీవిడ మానసాన్ని అంగీకరించాలా? వద్దా?""
అతడు అంగికరిస్తాడో - లేదో నీకెందుకయ్యా ఆ సంగతి?"
"ఓహోహో! అంగీకరించేవాడే అయితే - ఇంత జాగు చేయనేల? నేటికీమె తపమాచరించుట మొదలి
డి ఎన్నాళ్లుగడిచింది? నిజంగా ఈమెపై ప్రేమే ఉంటే, ఈ సుందరి ఈ రీతిన తపశ్చర్యలో నలిగిపోతూంటే, చూసి ఓర్చుకోగలడా? ఆ శివుడో పాషాణ
హృదయుడు లయకారకుడు. ప్రేమ ఉంటుందని ఎలా భావించగలం?
రంగురంగుల వస్త్రాలున్నాయా? కస్తూరి సుగంధికారి లేపనాలున్నాయా? రత్నా భరణాలున్నాయా? ముసలెద్దు తప్ప సరైన వాహనమైనా లేదే! అవన్నీ అలా ఉంచు! మీ సఖి శివుడ్ని పెళ్లాడిందనుకో! దగ్గరగా నిలబడ్డప్పుడు ముఖం మీద పాము బుస్సన్న కోసమా ఈ తపస్సంతా?" అని పెద్ద పెట్టిన నవ్వేస్తూ, నోటి కొచ్చినట్టల్లా వాగాడతడు.
అంతవరకు శాంతచిత్తురాలై ఉన్న పార్వతి ఇంక సహించ లేకపోయింది."చెలీ! ఈ శివ దూషణను ఇక భరించడం నావల్ల గాదు. ఈతడిట్లు శివనింద చేయువాడని తెలియక గౌరవించాను. ఇట్టి శివద్వేషిని తక్షణం ఇటనుండి వెడలిపొమ్మని చెప్పు!" అని ముఖం అటు తిప్పుకోబోయింది.
ఆ తిరగడంలో ఆమె కళ్లకు చంద్రశేఖర రూపం సాక్షాత్కరించింది. అంతవరకు నటన వేషధారిగా, బ్రహ్మచర్యదీక్షా పరుడిగా కనిపించిన ఆ వటువే ఈ శివుడని తెలిసి ఆమె సిగ్గులమొగ్గ అయింది.
ఆమె చెలి కూడా ఆశ్చర్యపోయి; ఆవలకు తప్పుకున్నది.
"దేవాధిదేవా! ఈ దీనురాలిపై ఇంతకాలానిక్కాని తమకు దయ కలగలేదన్నమాట!" అని గబగబా దగ్గరకొచ్చి నిష్ఠురమాడింది – ప్రేమా స్పదమైన పార్వతి అలుకకు చిరునవ్వే శివుని సమాధానం!
"ఏదయితేనేం! నేటికి నేను ధన్యురాలినైనాను. తల్లిదండ్రుల చాటు పిల్లని కదా! ఎంతగా మిమ్ములను ప్రేమించినా, లోకాచారరీత్యా తాము, మా పితృవరేణ్యులను అర్ధించి నన్ను అనుగ్రహించేందుకు తోడ్పడవలసింది" అని కోరింది పార్వతి.
"సరే! నే నేరీతిన అర్ధించాలో అదీ నువ్వే చెప్పు!" అన్నాడు సాంబశివుడు. "తమకు తెలియని రీతులా? సమస్త విషయగ్రహణ పారీణులు తాము" అంటూనే శలవు పుచ్చుకొని పార్వతి గృహోన్ముఖంగా కదిలింది. శివుడచటినుంచి అంతర్హితుడయ్యాడు
*క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,*
*పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే* |
*శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,*
*వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 4 ‖*
🔱 *ఓం శరవణ భవ* 🔱
శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏
🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸
🙏 ఓం శరవణభవ🙏