🔱 *కుమారచరిత్ర* -8 🔱

P Madhav Kumar


*శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః* 

*పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం*

🍁🍁🍁🍁🍁

సప్తర్షులను తన 
మనస్సులో తల్చుకున్నాడు ..శంకరుడు..
వారంతా వెంటనే శివసంకల్పమైనదని సంతసించి, విహాయస వీధుల వడివడిగా బయల్దేరి, అనతి కాలములో ఫాలలోచనుని ముంగిట ప్రణతులిడుతూ నిలబడ్డారు.

ఆ విధంగా తన ఎదుట నిలిచిన భరద్వాజ, అత్రి, గౌతమ, విశ్వామిత్ర, జమదగ్ని, అరుంధతీ సహిత వశిష్ఠులను గాంచి శంకరుడు హసన్ముఖుడైనాడు.

వారికి ఉచిత మర్యాదలు సలిపి "సప్తర్షులారా!తమవల్ల కాగల కార్యమొకటి ఉండుటచే 
మిమ్ములను రావించితి" నన్నాడు చంద్రశేఖరుడు.

"మహాదేవా! తమ ఆజ్ఞ శిరసావహించుటకంటే వేరే మాకు కార్యమేమియులేదు. సవిస్తరంగా ఆనతీయ వలసింది" అని కోరారు అందరూ.

"పర్వతరాజు పుత్రి పార్వతి, గత జన్మమునందు దాక్షాయణి అని మీకు తెలిసినదే! నేను పార్వతిని వివాహమాడ దలచితి! పెండ్లి పెద్దలుగా మీరు నా తరుపున వ్యవహరించాలి!" అన్నాడు శూలి.

"జగదానందకరమైన ఇంతటి దివ్యకార్యము, మా భుజ స్కంధములపై నుంచిన మహాదేవా! నీకు వేన వేల కృతజ్ఞతలు. నీ కృపవల్ల మా పుణ్యము ద్విగుణీకృతమైనది. ఈ కార్యనిర్వహణ ద్వారా మేము అందరికంటె మిన్నగా సత్కరించబడ్డ వాళ్లమైనాము"...అని పరిపరి విధముల సంస్తుతించి హిమవంతుని కడకేగి పెండ్లిముహుర్తము నిశ్చయించుకొను ప్రయత్నమున పడ్డారు.

తనను సందర్శింప వచ్చిన సప్తర్షులను, అసమాన గౌరవంతో - అగణిత మర్యాదతో చూసిన హిమవంతుడు తానే ముందు ప్రస్తావించాడు.

అప్పుడు అందరూ ముక్తకంఠంతో "పర్వతరాజా! నీకు శుభమగుగాక! నీవు అసామాన్యుడివి! పౌరాణిక శ్రేష్ఠులు నిన్ను విష్ణువని స్తుతిస్తారు. సప్తపాతాళ భువన గోళాలకు నీవు మూలాధార భూతుడవు! అట్టి నీ పుత్రిక సాక్షాత్తు అంబ. పరమేశ్వరి. అఖిలాండేశ్వరి. యోగీశ హృదయ మందారుడైన చంద్రశేఖరుడు నీ పుత్రికను పెండ్లాడగోరి, మమ్ము పెళ్లి పెద్దలుగా పంపించాడు. నీవు కన్యాదాతవు. మేము వివాహ సంధాతలం! ఇదీ జగత్కల్యాణ కారకం!" అని వివరించారు.

సప్తర్షుల సందేశాన్ని శ్రద్ధగా విన్నాక, మేనకాహిమవంతుల ఆనందానికి అవధిలేకపోయింది.
అందరూ పార్వతీదేవిని ఆశీర్వదించారు. నాటికి నాలుగవ రోజున ఒక గొప్ప ముహూర్తాన్ని నిర్ణయించి, హిమవంతుని వీడ్కోలు తీసుకొని సప్తర్షులు వెళ్లిపోయారు

.ఆ క్షణం నుంచే పెండ్లి ఏర్పాట్లలో పడినాడు హిమవంతుడు.సమస్త లోకాలూ ఎదురు చూస్తున్న వివాహవేళ రానే వచ్చింది.

గర్గమహాముని ఆచార్యత్వంలో వివాహవేడుక లారంభమయ్యాయి.సుముహూర్తవేళ..
మంగళ స్వరాలు, మంగళ స్వరాల మధ్య కన్యాదానం జరుగుతోంది. తంతు ప్రకారం ఈశ్వరుడి ప్రవర చెప్పించాల్సి ఉంది.

హిమవంతుడు ఈశ్వరుని ప్రవర అడగ్గా, వినీ విననట్లూరుకున్నాడు అతడు.
ఆ మౌనం బైటపడనీయకుండా, నారద మహర్షి అదేపనిగా వీణ మీటసాగాడు. ఎవరు చెప్పినా నారదుడు ఆపలేదు.

చివరకు కన్యాదాత జోక్యంతో వీణానాదం ఆపిన నారదుడు ఇలా అన్నాడు.
"ఓ మంచుకొండల రేడా! బ్రహ్మ - విష్ణువులకే అంతుపట్టని రుద్రుడి కుల గోత్రాలతో ప్రవర చెప్పడం మనతరమా? 
ఎవరు పర బ్రహ్మమో, ఎవరు నిర్గుణులో, ఎవరు నిరాకారులో, ఎవరు ప్రకృతికి అతీతులో, ఎవరు సమస్తమూ తానే అయినవారో ఆయన పేరూ - గోత్రమూ - ప్రవరా కావాలా? మీ పుణ్యవశాన అల్లుడైన ఆ జగన్మంగళ మూర్తిని అడగాల్సిన మాటా ఇది?" అని హిమవంతునికి బుద్ధిగరపి "అయినప్పటికీ చెప్తున్నాను - విను! 
నాదం శివమయం. శివుడు నాదమయుడు. ఇక నాదానికి కులం గోత్రం ఏం వుంటాయ్ ? కనుకనే నీ ప్రశ్నకు జవాబుగా నేను వీణావాదన సూచ్యంగా చేశాను. అది నీకు అర్థం కాలేదు. 
ఇప్పుడిలా వాచ్యంగా చెప్పాల్సివచ్చింది" అనడంతో అందరికీ శివతత్వం కాస్త అవగతమైంది.

పూర్తిగా అర్ధమయిందని 
ఎవరైనాఅనుకుంటే, అది మళ్లీ పొరపాటే అవుతుంది.కన్యాదానం జరిగిన వెంటనే మిగతా తంతులన్నీ మహావెడుకగా జరిపించాడు బ్రహ్మ.

తదనంతరం భవానీ భర్గులిద్దరూ భక్తి భావంతో బ్రహ్మాసనా సీనుడైన పితామహునికి ప్రణామాలు ఆచరించారు.

వధూవరులపై అమృతాక్షతలు చల్లి ఆశీస్సులందజేశాడు ఆయన.

మన్మధుని పునర్జీవితుని చేయుట:


సరిగ్గా అదే సమయమని భావించిన దేవతలందరూ, శివుని పరిపరి విధముల కైవారము చేసి, రతీదేవిని అక్కడ ప్రవేశపెట్టారు.


రతీదేవి, తన కొంగున కట్టిన మన్మధుని బూడిదను, శివదేవుని చరణసన్నిధిన ఉంచి "సదాశివా! ఇదేనా నీ కరుణ? పార్వతిని పెండ్లాడ్డానికి - దేవతా ప్రేరితుడై కదా...నా పతి నీకు పరోక్షంగా సహకరించాడు. అది తమ కోపావేశాలకు కారణభూతమై..
ఇదిగో! నా పతిదేవుని ఇలా పిడికెడు బుగ్గిగా మిగిల్చింది! అమ్మా! పార్వతీ! కొత్త పెళ్లికూతురివి! భర్త లేనిదే భార్యకు ఎన్ని సంపదలున్నా వృధా అని తెలిసి - తపమాచరించి మరి భర్తను పొందిన దానివి! నా బాధ అర్ధం చేసుకోగలవు కద తల్లీ!" అంటూఇరువురినీ వినయ - భక్తి తత్పరతలతో వేడుకున్నది.

పతిదేవుని పట్ల రతీదేవికి ఉన్న అనురగానికి, ఆ నూతన దంపతులు ( సనాతన దంపతులైన ఆది దేవుడూ - అంబ ) అచ్చెరు వొందారు. ఆమె జీవితంపట్ల జాలిపడి అయినా సరే, మన్మధుని బ్రతికించాల్సిందిగా బ్రహ్మది దేవతలు సైతం అభ్యర్ధించారు.

కరుణాంతరంగుడైన కాలకంఠుడు, మదన కుమారుడి భస్మాన్ని తన అమృతమయ వీక్షణాలతో ఒక్కసారి అవలోకించాడు. అంతే! సమస్త చిహ్న, లాంచన, రూప, యవ్వన సంపత్సహితంగా పునరావిర్భావం చెందాడు మన్మధుడు. రతీదేవి పతి సమేతంగా శివదంపతులకు నమస్కరించింది. పెళ్ళికళకే కొత్త కళలు వచ్చి చేరినట్లయింది కందర్పాగమనం.

కైలాసవాసిగా గౌరీశుడు

తన ఎడమచేతి చిటికెను వ్రేలు పట్టుకొని నునులేతసిగ్గుతో, కొత్త పెళ్లుకూతురైన కొండరాచూలిని వెంట బెట్టుకొని తన నిజనివాసమైన కైలాసపురిని చేరుకున్నాడు కృత్తివాసుడు.

అనంతరం అంగజు కేళికి సమాయత్తమైనారా నూతన వధూవరులు
 
"పుణ్యాతిపుణ్య విభవన్మునిశ్రేష్ఠులారా! సమస్త పాపహరణమూ అయిన పార్వతీఖండమందు ఈ కల్యాణ ఘట్టము మీకు గల ఆసక్తి చేత వినిపించితిని. మనమందరమూ ఈ కల్యాణ మననం ద్వారా ధన్యులమైతిమి" అని ఆనాటికి పురాణ శ్రవణం ముగించాడు రోమహర్షణుడు.

  దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,*
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 5 ‖

     
  🔱   *ఓం శరవణ భవ* 🔱

శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏

🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸

🙏 ఓం శరవణ భవ 🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat