🔱 శబరిమల వనయాత్ర - 76 ⚜️ పంబా ఆరాట్టు ⚜️

P Madhav Kumar

⚜️ పంబా ఆరాట్టు ⚜️

అమృత స్వరూపుడైన అయ్యప్ప సన్నిధి క్రింద ప్రవహిస్తున్న , పరమపావనమైన దక్షిణ

గంగగా ప్రసిద్ధి చెందిన ప్రవాహమే పంబానది. సమున్నతమైన పర్వత శ్రేణుల మధ్య - నిశ్చల తపమాచరిస్తున్న ముని పుంగవుల్లా నిలిచియున్న వృక్ష రాజముల నడుమ నిర్మల నీటి ప్రవాహమే పంబ. పరమ పావనమైన పంబాతీరాన పందళ ప్రభువైన రాజశేఖరునకు దొరికిన ఆణిముత్యమే మన పంబా బాలుడగు మణికంఠుడు. అలలు అలలుగా ప్రవహిస్తున్న పంబపై నుండి వీస్తున్న పిల్లగాలులే నాడు మన మణికంఠబాలునికి సేదదీర్చాయి , లాలించాయి , ఆడించాయి.


అందుకే సంవత్సరాని కొమారు తన జన్మస్థలమైన పంబలో జలకమాడడానికి మన కొండల రాయడు కొండదిగి పంబ కడకు వస్తాడు. ఆ చల్లని నీట స్నానమాడి సేదదీరి శయ నిస్తాడు స్వామి , దీనినే  'పంబా ఆరాటు' అంటారు. ఆరాటు అనగా ఆరాధన అని అర్థం. దీనినే వైష్ణవ సాంప్రదాయమున 'చక్రస్నానమని' శైవ సాంప్రదాయమున *'తీర్థ వారి'* అని పిలుస్తారు. పంబా అనగా పాపములను బాపునది. ఆరాట్టు అనగా దాన్ని ఆరాధించడం అన్నమాట. శబరిమలలో ధ్వజారోహణంతో ప్రారంభమైన స్వామివారి ఉత్సవాలలో పదవరోజున పంబా ఆరాట్టు ఉత్సవం ఉత్తరఫల్గుణినక్షత్ర యుక్త శుభదినము నందు నయనానందకరంగా జరుపబడును. కొండపై కొలువున్న కారుణ్యమూర్తి కొండదిగి అమ్మ ఒడిలో సేద దీరేందుకు వస్తున్నాడు. పంబాతీరం తన జన్మభూమి. *'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి'* - అని కదా ఆర్యోక్తి. అందుకే అయ్యప్ప తన జన్మస్థలాన్ని చూడడానికి బయలుదేరాడు. మోహినీ స్వరూపాన్ని మోహించిన పరమ శివుని కరాగ్రము నుండి జాలువారిన చిన్ని శిశువే మన మణికంఠ ప్రభువు. ఆ సమయాన తుంబుర నారదాది దేవమునులు స్వామిని తమ గానామృతంతో లాలించారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు , శివుడు తన చిటికెన వ్రేలితో నేలపై గీరగా పుట్టినదే మన పావన పంబా నది. పందళ ప్రభువైన రాజశేఖరుని కంటబడినంత వరకు మన అయ్యప్ప ఆలనా పాలనా చూచింది ఈ పంబా మాతయే.అంబ అనగా అమ్మ - పార్వతి అని అర్థాలు. అంబయే పంబగా మారిందేమో ! మరి ముగ్గురమ్మలలో మిగిలినవారు లక్ష్మి . సరస్వతులు - చూస్తూ వూరకే వుంటారా ? వుండరుగా ! అందుకే వారు కల్లారు - కర్కటారు అను నదులుగా అవతరిం

చారు. కల్లారు - కర్కటారు - పంబా

నదులు కలిసిన త్రివేణీ సంగమమే మన పంబా పవిత్ర ప్రవాహము. ఇది గంగా , యమునా , సరస్వతుల కలయిక వంటి పవిత్ర సంగమం. త్రివేణి మొదలు సిరియాన వట్టం వరకుయున్న విశాలమైన ఇసుకబారిన పంబాతీరమే మన అయ్యప్ప భక్తులకు ఆధ్యాత్మిక మందిరంగా మారింది. కొబ్బరి ఆకులతో కప్పిన *‘విరి'* అనబడు చిన్న చిన్న

గుడిసెలే మోక్షగుమ్మాలుగా మారాయి. ప్రతి విరి ఒక అయ్యప్ప గుడి , త్రిగుణాత్మకము - త్రిమూర్త్యాత్మకము ఐన ఈ త్రివేణీ సంగమం ఎరిమేలి నుండి సుమారు 74 కి.మీ. దూరంలో వుంది. పంబ నుండి స్వామి సన్నిధి నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంది. వలియాన తావళం నుండి రెండు కిలోమీటర్ల దూరాన చిరియాన వట్టం మార్గముగా నడచినచో ఈ పురాణ ప్రసిద్ధమైన పంబా తీరమును చేరుకోవచ్చును. ఎరుమేలి నుండి వనయాత్రగా నడచి వచ్చినవారికి మాత్రమే పంబాతీర ఆహ్లాదం అనుభవయోగ్యమౌతుంది. పంబాతీరాన దూరివీచిన గాలి పిల్లనగ్రోవి పాటలా మధురంగా వినిపిస్తుంటుంది. ఇదే వైష్ణవాంశ సేవ. పంబా ప్రవాహపు గలగలలు నటరాజు కాలి అందియల మ్రోతగా స్వామికి శైవాంశ సేవలను అందిస్తుంటాయి. శివకేశవ సంభూతుడైన స్వామికి పంబా పరిసరాలు పవళింపు సేవను అందించాయి. *“హరివరాసనం స్వామి విశ్వమోహనం* *హరితదీశ్వరా స్వామి ఆరాద్యపాదుకం"* - అని పవళింపు సేవాగానం సుమధుర సంగీత వాహినిలా నేటికీ పాడుతోంది పంబ. ఎరిమేలి నుండి వనయాత్ర చేసి వచ్చిన స్వాములకు అలసట దీర్చి ఆనందాన్ని అందిస్తూ అలా అలలు అలలుగా పారుతూనే వుంది. అందుకే గంధర్వ గాయకులు జేసుదాసుగారు “అంతటి అలసట  ఎటుపోయెనో పంబాస్నానము చేయగ". అంటూ మోహనంగా ఆలపించి ఆరాధించారు పంబను. అంతటి పవిత్ర పంబలో స్నానంచేయడానికి స్వామివారు గూడ సంవత్సరానికి ఒక్కసారి స్వర్ణమందిరం నుండి బయలుదేరి వస్తారు. స్వామివారి ఉత్సవమూర్తితో తాంత్రివర్యులు పదునెనిమిది మెట్ల మీదుగా పంబకు బయలుదేరారు. బాలభానుని లేత కిరణాలు ప్రకృతి అంతటా పరచుకొంటున్నాయి.


లేత వెలుగుల కాంతిలో అలంకారమూర్తి అయ్యప్ప అందాలు ఆకాశంలో హరివిల్లులా ప్రకాశిస్తున్నాడు. ఫల్గుణ మాసపు చలిగాలులు స్వామివారికి వింజామర సేవలు అందిస్తున్నాయి. చలికాలపు తొలి మబ్బులు స్వామికి ఛత్రసేవ చేస్తుండగా మంగళ వాయిద్యాలు - పంచవాద్యాలు - మ్రోగుచుండ , ప్రధాన తంత్రి - మేల్ శాంతి -వారి అనుచరులు - దేవస్వం బోర్డు అధికారులు - రక్షకభటులు మరియు వేలాది అయ్యప్ప భక్తులు వెంటరాగా వెడలెను పట్టాంబరధారి పంబా ఆరాట్టుకు. దారి పొడవునా అయ్యప్ప స్వాములు ఐక్య శరణాలతో మామిడి తోరణాలు కట్టారా అన్నట్లు ఆహ్వానం పలికారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ పంబాతల్లి తన బిడ్డ రాకకోసం ఆశగా ఎదురుచూస్తోంది.


ఆమె ఆశలు అలలుగా అల్లల్లాడుతున్నాయి. ఆప్యాయతగా అమ్మను చూడ బయలుదేరిన అయ్యప్ప దారిలో ఎదురైన రాముడు , ఆంజనేయుడు , మాతపార్వతీ మరియు , అన్న గణపతులను ఆప్యాయంగా పలకరించాడు. గణపతి సన్నిధిలో శరణాలు మారుమ్రోగాయి. కదలిన కరుణామయుడు పంబాతీరానికి చేరాడు. శరణు ఘోషలు మిన్నుముట్టాయి. పంచవాద్యాలు ప్రకృతిని పరవశింపజేశాయి. పంబమ్మ స్వామిని అలలు హస్తాలతో ఆప్యాయంగా నిమిరింది. తనచల్లని నీటితో స్వామిని తనివితీరా తాకింది , స్వామి ఆరాట్టు వేళ - స్వామి తనువును తాకిన ఆ పవిత్ర పంబా నీటిలో ఆదేసమయాన తామూ స్నానం చేయాలని ఆతృతగా అయ్యప్పలు వేలకొలది పంబలో దిగారు.  *ఓం స్వామియే శరణమయ్యప్పా - ఓం పంబానదియే శరణం అయ్యప్పా ! ఓం పంబావాసనే శరణమయ్యప్ప - ఓం పంబానదియే శరణం అయ్యప్పా  - ఓం పంబావాసనే శరణమయ్యప్ప - ఓం* *పంబా స్నానమే శరణమయ్యప్పా !* అను శరణాల ధ్వనులు స్వామి చరణాలను తాకుచుండ , స్వామిని తాకిన నదీజలాలు తమ శరీరాలను శుభ్రపరుస్తుండ , పరితప్త హృదయాలతో తన్మయులయ్యారు స్వామి భక్తకోటి. ఆరాట్టు పూర్తి అవుతుంది.


🙏💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప💐🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat