⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
తిరుమల తిరుపతి అంటే చాలు ఏడుకొండలు…సప్తగిరి అని ఠక్కున గుర్తుకువస్తుంది. అయితే అసలు ఏడుకొండలు అనే పేరు ఎలా వచ్చింది దీని వెనుక శాస్త్ర మర్మం ఏమిటి అనే విశేషాలను తెలుసుకుందాం….
ఏడుకొండలు మీద వెంకటేశ్వరుడెందుకున్నాడంటే దానికొక ఆధ్యాత్మిక రహస్యాన్ని చెబుతారు. శరీరంలో ఏడు చక్రాలున్నాయి. అవి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, అజ్ఞ, సహస్రారం … అధోముఖమైన కుండలినీ శక్తిని యోగాభ్యాసంతో సహస్రానికి పంపించడం పరమాత్మ సాక్షాత్కారానికి మార్గం.
ఏడు కొండలకు ఉన్న పేర్లు ఇవే …
అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి.
అంజనాద్రి అనే పేరు ఎందుకొచ్చిందంటే …
త్రేతాయుగంలో అంజనాదేవి పుత్ర సంతానం కోసం మాతంగ మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది. వాయుదేవుని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన హనుమంతుని కుమారునిగా పొందింది. అంజనాదేవి తపమాచరించిన పర్వతం కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది.
వృషభాద్రి - కృతయుగంలో వృషభాసురుడనే రాక్షసుడు మహావిష్ణువు భక్తుడు, అయితే శ్రీహరితో యుద్ధాన్ని కోరుకున్నాడు. విష్ణువు వృషహాసురినితో యుద్ధం చేసాడు. ఎంతటీ వృషభుడు చనిపోక పోయేసరికి చివరకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శునుని మహిమ తెలిసిన వృషభాసురుడు ఇక్కడ వెలసిన కొండకు తన పేరు వచ్చేలా వరాన్ని కోరాడు. మహావిష్ణువు వృషభుడు కోరిన వరాన్ని యిచ్చి వధించాడు. అందువల్ల ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది.
నీలాద్రి … ఏడు కొండలలో ఒక కొండ అయిన నీలాద్రి మీద క్రూరజంతువుల సంచారం విపరీతంగా ఉండేది. దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసున్ని వేడుకుంటుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూరజంతువులను వేటాడి అలసి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా, నుదుటిపై కొంతభాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అది పెద్దా లోపంగా ఆమె భావిస్తుంది. తన కురులలో కొంతభాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది. వెంటనే శీనివాసునికి నిద్రాభంగం అయి మెలకువ వస్తుంది. ఎదురుగా ఉండే నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండడు వచ్చిన భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికి చేరుతయనే వరమిచ్చాడు. ఆ కారణం వల్లే కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది.
శేషాద్రి… మహావిష్ణువు ఆదేశానుసారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించడం వల్ల దీనికి శేషాచలం అనే పేరువచ్చింది. శ్రీహరి వాయువుకు, శేషునికి పందెం పెడతాడు. శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటాడు. వాయువు మహావేగంతో వీస్తాడు. శేషుడు స్వర్ణముఖి తీరం వరకూ వెళతాడు. మహావిష్ణువు ఆజ్ఞతో వెంకటాద్రి విడివడుతుంది. శేషుడు అక్కడే తపస్సు చేయడం వల్ల శేషాద్రి అనే పేరు వచ్చింది.
గరుడాద్రి దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు) ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.
ఈ కొండను గరుడాద్రి అని కూడా అంటారు. శ్వేత వరాహకల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మంతుడు శ్రీవైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకుని రావడం వల్ల ఈ కొండకు గరుడాద్రి అనే పేరువచ్చింది.
నారాయణాద్రి … సాక్షాత్ నారాయణుడే నివసించడంవల్ల నారాయణాద్రి అనే పేరు వచ్చింది. అంతేగాదు, శ్రీమన్నారాయణుడు మొట్టమొదట ఈ గిరి మీద పాదాలు మోపడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. అదే గాకుండా నారాయణుడే భక్తుడు తపమాచరించి నారాయణుని సాక్షాత్కారం పొందడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. అలాగే నారాయణుడనే బ్రాహ్మణుని ప్రార్థన మన్నించి శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల కూడా నారాయణాద్రి అనే పేరు వచ్చింది.
వెంకటాద్రి … 'వేం'కారానికి అమృతమని అర్థం 'కటం' అంటే ఐశ్వర్యం, నమ్మి కొలిచేవారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని అర్థం. అలాగే పాపాలకు 'వేం' అనే అర్థం ఉంది. ఆ పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది. వెంకటాద్రి అనే పేరు రావడానికి ఇంకొక కథ కూడా ప్రచారం ఉంది. పూర్వం శ్రీకాళహస్తిలో పురందరుడు అనే శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉండేవాడు. పుత్రసంతానం లేక బాధపడి అనేక వ్రతాలు చేసాడు. చివరకు ముసలితనంలో మాధవుడనే పుత్రుణ్ణి కన్నాడు. మాధవుడు వేదవేదాంగాది సకల విద్యలను నేర్చుకుని మహాపండితుడయ్యాడు. యుక్తవయస్సు వచ్చింది. చంద్రలేఖ అనే కన్యను పెళ్ళి చేసుకున్నాడు.