ఐదవ అధ్యయనం - మొదటి భాగం
గరే బహుతిరే కాలే పద్యాం విశ్య బృహద్రథః
నిరూఢయౌవనాం పుత్రీం విస్మితః పాపశంకయా
కౌముదిం ప్రాహ మహిషీం పద్యోద్వాహేత్ర కం నృపమ్
వరయిష్యామి సుభగే కులశీలగుమన్వితమ్
🌺అర్ధం:
చాలా కాలము పిమ్మట బృహద్రథుడు నవయౌవనము నొందిన తనపుత్రికను చూచి విస్మితుడై వివాహప్రయత్నము చేయక పోవుటచే పాపమును శంకించుచు రాణియగు కౌముదితో ఓ సుందరి! పద్మావతికి యోగ్యుడగు కులశీల సమన్వితుడగు రాజును చూచేనని చెప్పెను.
సా తమాహ పతిం దేవీ శివేన ప్రతిభాషితమ్
విష్ణురస్యాః పతీరితి భవిష్యతి న సంశయః
ఇతి తస్యా వచః శ్రుత్వా రాజా ప్రాహ కదేతి తామ్
విష్ణుః సర్వగుహావాసః పాణిమస్యా గ్రహీప్యతి
🌺అర్ధం:
కౌముది తన భర్తతో శివుడు పరికిన విధముగ విష్ణువు తప్పక పద్మావతికి భర్త కాగలడని చెప్పును. ఆమె మాటలు విని బృహద్రథుడు అందరి హృదయములలో విహరించు విష్ణువు ఎప్పుడు పద్మావతిని పరిణయమాడును? అని ప్రశ్నించెను.
సమే భాగ్యోదయః కశ్చిద్యేన జామాతరం హరిమ్
వరయిష్యామి కన్యార్దే వేదవత్యా మునేర్వథా
ఇమాం స్వయంవరాం పద్యం పద్యామివ మహోదధేః
మథనేది...సురదేవానాం తథా విష్ణుః గ్రహీష్యతి
🌺అర్ధం:
శ్రీమహావిష్ణువును అల్లునిగపొందు భాగ్యము నాకు దక్కునా ? ముని కన్య యగు వేదవతి స్వయంవరసభను ప్రవేశించినట్లు పద్మావతిని కూడ స్వయంవర సభలో ప్రవేశపెట్టెదను. దేవాసురులు సముద్రమథనము చేసినపుడు సాగరమునుండి పుట్టిన లక్ష్మీదేవిని గ్రహించినట్లు స్వయంవరమున పద్మావతిని విష్ణుమూర్తి గ్రహించ గలడు.
ఇతి భూపగణాన్ భూమి సమాహూయ పురస్కృతాన్
గుణశీలవయోరూప విద్యాద్రవిణ సంవృతాన్
స్వయంవరార్ధం పద్మాయాః సింహళే బహుమంగళే
విచార్య కారయామాస స్థానం భూపనివేశనమ్.
🌺అర్ధం:
ఇట్లు ఆలోచించిన బృహద్రథుడు గుణశీల సంపన్నులు విద్యా ధనవంతులగు రాజులను పద్మావతి స్వయంవరమున ఆహ్వనించెను సింహళదేశమున అనేకవిధములగు మంగళకార్యములు జరుగుచుండెను. బృహద్రథుడు స్వయంవరమునకు వచ్చు రాజుల కోటకు యోగ్యనివాసముల ఏర్పాటు చేసెను.