💠 రక్షా బంధణం లేదా రాఖీ పౌర్ణమి అనేది ఒక గొప్ప పండుగలాగా జరుపుకుంటున్నారు భారతీయులు.
ఈ పండుగలో, సోదరీమణులు తమ సోదరుల మణికట్టుపై రక్షా సూత్రాన్ని కడతారు.
దానినే రాఖీ అని పిలుస్తారు.
అంటే తమ అక్క చెల్లెల కష్ట సుఖాల్లో వారు వారిని రక్షిస్తారని వాగ్దానం చేస్తారు. సోదరులు వారికి బహుమతులు ఇచ్చి ,ఆశీస్సులు కూడా పొందుతారు.
ఇది సోదరులు మరియు సోదరీమణుల మధ్య ప్రేమ మరియు బంధాన్ని జరుపుకునే ముఖ్యమైన కుటుంబ పండుగ.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి విహారయాత్రకు కూడా వెళ్లవచ్చు.
కొంతమంది తమ కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకి లేదా తమకు దగ్గరగా ఉన్న ఆలయ దర్శనానికి వెళ్తూ ఉంటారు...
💠 భారతదేశంలో దాదాపు అందరూ ఇలానే చేస్తూ ఉంటారు.... కుటుంబ సభ్యులతో ముఖ్యంగా సోదరి సోదరీమణులతో కలిసి అన్నదమ్ములు రాఖీ పండగ రోజున భారతదేశంలో ఏ ఆలయానికైనా వెళ్లవచ్చు కేవలం ఒక్క ఆలయానికి తప్ప....ఎందుకంటే
ఈ ఆలయంలో సోదరులు మరియు సోదరీమణులు కలిసి రాఖీ పండగ రోజున పూజించడంపై నిషేధం ఉంది.
మీరు రక్షా బంధన్ శుభ సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించాలని అనుకుంటే, పొరపాటున కూడా సోదరులు మరియు సోదరీమణులు కలిసి ఈ ఆలయంలోకి ప్రవేశించకూడదు. ఈ గుడిలోకి అన్నయ్య, చెల్లితో వెళ్లకుండా ఎందుకు నిషేధం ఉందో తెలుసా.
వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం.
💠 ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లా పరిధిలోని మహానది ఒడ్డున పురాతన ఆలయం ఉంది. దీనిని నారాయణపూర్ అనే గ్రామం పేరుతో పిలుస్తారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ గొప్ప పురాతన శివాలయం.
ఛత్తీస్‌గఢ్‌లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన రక్షిత స్మారక కట్టడాలలో ఈ ఆలయం ఒకటి.
🔅 స్థల పురాణం 🔅
💠 ఇక్కడ ప్రధాన ఆకర్షణ అద్భుతమైన పురాతన శివాలయం ఉంది. దాదాపు 6 నెలల పాటు నిరంతరాయంగా ఈ ఆలయ నిర్మాణం రాత్రిపూట జరిగినట్లు ఈ ప్రాంత పెద్దలు చెబుతున్నారు.
ఈ ఆలయాన్ని నిర్మించినది గిరిజన సమాజానికి చెందిన గ్రామీణ నారాయణ్ అనే ప్రధాన వాస్తుశిల్పి.
ఆయన పేరు మీదుగా ఈ గ్రామానికి నారాయణపుర్ పేరు వచ్చిందని చెబుతారు.
💠 స్థానిక సమాచారం ప్రకారం, ఆ ప్రముఖ శిల్పి నారాయణ్ ఏ ఆలయం నిర్మించినా రాత్రిపూట మాత్రమే పూర్తిగా ఆలయ నిర్మాణంలో పని చేసేవాడు.
ఆలయ నిర్మాణంలో పరిపూర్ణంగా మనస్సును లగ్నం చేసే కారణంగా ఆలయ నిర్మాణ సమయంలో బాహ్య ప్రపంచంపై కానీ కనీసం తన వంటిపై కూడా శ్రద్ధ లేకుండా సంకల్ప దీక్షతో ఆలయ నిర్మాణం చేస్తూ వచ్చేవాడు.
బాహ్య ప్రపంచంతో సంబంధం లేనంత దీక్షతో ఆలయ నిర్మాణం చేస్తూ ఉండడం వల్ల తన శరీరంపై ఉండే వస్త్రాలు జారిపోయి తను నగ్నంగా మారిపోయి ఆలయ నిర్మాణం చేస్తున్న సంగతి కూడా గుర్తించలేనంత తాధ్యాత్మిక దీక్షతో ఆలయ నిర్మాణం చేసేవాడు
💠 ఈ శిల్పి ఇదే రాష్ట్రంలో దేవబలుదా అనే ప్రాంతంలో గల మహాదేవ ఆలయం నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
ఆ ఆలయ నిర్మాణంలో కూడా శిల్పి తనదైన లోకంలో ఉంటూ నిర్మాణ పనులు చేసేవాడు...
ఆ ఆలయ నిర్మాణ సమయంలో అతని భార్య ప్రతిరోజు ఆహారంతో నిర్మాణ ప్రాంతానికి వచ్చేది.
ఆలయ శిఖర నిర్మాణానికి సమయం రాగానే, ఒకరోజు అతని భార్యకు బదులుగా, అతని సోదరి భోజనంతో వచ్చింది. ఇది చూసిన నారాయణ్ నగ్నంగా తనను చెల్లి చూసింది అనే సిగ్గుతో తల వంచుకుని గుడిపై నుండి కంగారుగా కిందకు వచ్చి అక్కడికి దగ్గరలోని ఒక కొలనులో దూకి తన ప్రాణాలను వదిలాడు.
ఆ సంఘటన చూసి బాధతో తన సోదరి కూడా అదే కొలనులో దూకి ప్రాణాలు తీసుకుంది.
💠 నారాయణ అనే ఆ ప్రముఖ శిల్పి ఈ ప్రాంతం వాడు కావడం, మరియు ఆ రోజు రాఖీ పౌర్ణమి కావున తన అన్నకి రక్షాబంధనం చేయడానికి సోదరి ఆహారం తీసుకుని వెళ్లడం, అదే రోజు ఈ దుర్ఘటన జరిగి సోదర సోదరీమణులు ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనల దృష్ట్యా ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ఆలయానికి సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలు రాఖీ పండగ కలిసి వెళ్తే ప్రాణాలు పోతాయి అని అపనమ్మకం తో కలిసి దర్శనానికి వెళ్లరు.
💠 ఇక్కడ ఉన్న శివాలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 7 నుండి 8 వ శతాబ్దం మధ్య కల్చూరి రాజు నిర్మించాడు.
ఈ ఆలయం 13 వ - 14 వ శతాబ్దం సమయంలో పునర్నిoచబడింది .
💠 తూర్పు ముఖంగా ఉన్న ఈ శివాలయం ఎరుపు మరియు నల్ల ఇసుకరాయితో నిర్మించబడింది.
ఈ ఆలయం పెద్ద వేదికపై 16 స్తంభాలపై ఉంది. ఆలయ గర్భగుడిలో పురాతన శివలింగం ఉంది. ఇది ఆలయ శిఖరంలా కనిపిస్తుంది.
గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద గంగా & యమునా నదీ దేవతలను చూడవచ్చు. శ్రీమహావిష్ణువు యొక్క వివిధ అవతారాలను గర్భగుడి బయటి గోడలలో చూడవచ్చు. ఆలయ గోడలపై యక్షులు, గంధర్వులు, జంతు పక్షి మరియు శృంగార శిల్పాలు చూడవచ్చు.
💠 శ్రావణ మాసం సందర్భంగా నారాయణపూర్‌లోని ఈ ఆలయంలో ఉదయం నుంచి భక్తులు పోటెతుత్తారు.
మహాశివరాత్రి ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తారు.
భక్తులు వచ్చి తమ కోర్కెలు తీర్చమని కోరుతారు.
💠 ఈ ఆలయం రాయపూర్ నుండి 113 కి.మీ దూరం.
© Santosh Kumar