వినాయకచవితికి వాడవాడలా గణేశ విగ్రహాలను నిలబెట్టి ఘనంగా ఉత్సవాలను జరుపుకుంటాం. అసలు ఈ ఉత్సవాలు మొదట ప్రారంభించింది ఎవరో తెలుసా?
భారతదేశంలో వినాయకచవితిని ఎంతో వేడుకగా జరుపుకుంటాం. వాడవాడలా వినాయక విగ్రహాలు నిలబెట్టి పది రోజులు ఉత్సవాలు జరుపుకుంటాం. వీటికి పునాది వేసిన వ్యక్తి ఎవరో తెలుసా? భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ పెద్ద ఎత్తున గణేశ్ ఉత్సవం జరుపుకోవడానికి పునాది వేసినట్లు చెబుతారు.
1890 వ దశకంలో స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్ని ఎలా సంఘటితం చేయాలని తిలక్ ఆలోచిస్తూ ఉండేవారట. అందరూ కలిసి గణపతి పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గమని ఆయన భావించారట. మహారాష్ట్రలో పీష్వాలు గణపతిని పూజించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఇళ్లలోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో గణపతి ఉత్సవాలు ఎందుకు జరపకూడదన్న తిలక్ ఆలోచనల్లోంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 1893 లో ఈ గొప్ప వేడుకలకు పునాది పడింది. మండపాలలో గణేశుడి పటాలు, పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినే మొదటి వ్యక్తిగా తిలక్ గుర్తింపు పొందారు. 10వ రోజున భారీ గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసే సంప్రదాయాన్ని కూడా ఆయనే ప్రారంభించారని చెబుతారు.
తిలక్ గణేశ్ ఉత్సవాలను ప్రారంభించినప్పుడు చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చిందట. లాలా లజపత్ రాయ్, బిపిన్‌చంద్ర పాల్, అరబిందో ఘోష్, రాజనారాయణ్ బోస్,అశ్విని కుమార్ దత్‌లలో నుంచి ఆయనకు మద్దతు దొరకడంతో గణేశ్ ఉత్సవాలు ప్రారంభించారట. అలా ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు 20 వ శతాబ్దంలో మరింతగా ప్రాచుర్యం పొందాయి. గణశ్ ఉత్సవాలు పేరుతో ప్రజలంతా ఒక చోట చేరడంతో అప్పట్లో అదో ఉద్యమంగా మారిందట. ముఖ్యంగా వార్ధా, నాగ్‌పూర్ , అమరావతి వంటి మహారాష్ట్ర నగరాల్లో గణేశోత్సవాన్ని బహిరంగంగా జరుపుకోవడం పట్ల బ్రిటిష్ వారు భయభ్రాంతులకు గురయ్యారట. ఈ ఉత్సవాల్లో బ్రిటీష్ పాలనను నిరసిస్తూ యువకులు పాటలు పాడటం పట్ల రౌలత్ కమిటీ నివేదిక ఆందోళనకు గురి చేసిందట. అలా గణేశ్ ఉత్సవం అప్పట్లో అలజడిని సృష్టించింది. బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడటానికి ఈ వేడుక ఎంతగానో ఉపయోగపడింది. కులమత బేధాలు లేకుండా అందరినీ ఒక చోటకు చేర్చి దేశభక్తిని రగిలించింది.
గణేశ్ చతుర్థి వేడుకలు 271 BC నుంచి 1190 AD వరకు పాలించిన శాతవాహన, రాష్ట్ర కూట, చాళుక్య రాజవంశాల పాలన నాటివని కొందరు చరిత్రకారులు చెబుతారు. చత్రపతి శివాజీ ఈ వేడుకలను ప్రోత్సహించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1905 తర్వాత దేశమంతటా గణేశ్ ఉత్సవాలు జరపడం మొదలుపెట్టారు.