అయ్యప్ప సర్వస్వం - 14

P Madhav Kumar


*గురు - శిష్యులు*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


గురు బ్రహ్మ , గురు విష్ణు , గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవోనమః , బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల సంఘమమే గురువు. గురువు అందులోను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే అని అనాదినుండి యుగ యుగాలుగా మన నమ్మకం. అలాంటి ఉత్తమమైన ఉన్నత స్థానమున వున్న గురువు శిష్యుని హితమునే మనస్సునందు ఉంచుకొని పదేపదే చెప్పుట యందు మనస్తాపము , విసుగు చెందుటలాంటివి తనదరికి రానీయరాదు. శిష్యుడు తనను గురువుగా ఎంచుకొని పూజించునపుడు *గురు స్థానమునందున్న వ్యక్తి మదాందుడై అహంతో నేను సర్వజ్ఞుడను నాకు మించిన జ్ఞానవంతులు ఇక ఈ పుడమిపైన లేనేలేరు అను దురాలోచన మనసులోకి రానీయ కూడదు.*


*నాకంటే సర్వ శాస్త్రములెరిగిన గురువు లెందరో కలరు. వారిముందు నేనెంత నా జ్ఞానమెంత అని తనకు తాను మనస్సులో తగ్గించుకొని తనకు ఆదేవదేవుడు ప్రసాదించిన జ్ఞానముతో తనను ఆశ్రయించిన శిష్యునికి విడమరచి అర్థ మయ్యేటట్లు వివరించు గురువు సద్గురువు.* అలాంటి ఉత్తమ గురువు ప్రతిఫలా పేక్షరహితుడై భక్తిశ్రద్ధలతో శిష్యుడు ఒసంగిన దానిని సంతోషముగా స్వీకరించి తృప్తిపొందుట సద్గురువు యొక్క మహోన్నత గుణం. ఇకపోతే శిష్యుడు అని అనిపించుకున్న వ్యక్తి   మనసా , వాచ గురుదేవుని పూజించి గురుబోధను నిర్మల చిత్తుడై ఆలకించాలి. గురు ముఖతః వాక్యములను విని శిష్యుడు మహాదానంద భరితుడు కావాలి. గురుదేవుని భోదనను ఎప్పుడూ వినాలనే ఆద్రత శిష్యునిలో ఉండాలి. అంతేకాని కొందరు శిష్యుల వలే గురుబోధనను బాధగా స్వీకరించరాదు. ఆగురువు పరమసుత్తి అని గురుబోధను తూలనాడరాదు. ఇలాంటి అతితెలివితో గురువులను హేళన చేయుటకు శిష్యుడు తన అమూల్యమైన తెలివిని , కాలాన్ని వ్యర్థము చేయరాదు.


తరించాలను కుతూహలము ఎప్పుడూ ఏర్పడునో అప్పుడు సలక్షణములన్నీ వాటంతట అవేవచ్చి మనలో చేరును. గురుదేవుని వినయ విధేయతలతో సమీపించి సాష్టాంగ దండ ప్రణామములు చేసి భక్తితో తనకు తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలి. అందుకే శ్రీకృష్ణభగవానుడు గీతలో *“తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యన్తితే జ్ఞానం జ్ఞానిన తత్త్వ దర్శినః"* అని శెలవిచ్చారు. ప్రాణిపాతేన అను పద ప్రయోగముచే ఎంతవినయం భోదింప బడిందో ఇక్కడ చూస్తున్నాము.


పాతము - నాపాతము - ప్రాణిపాతము


పాతము - అనగ పడుట (నిలబడి నమస్కరించుట) నిపాతము - వంగి నమస్కరించుట


ప్రణిపాతము అనగ సాష్టాంగ నమస్కారము ఆచరించుట అని అర్థము. గురువును ఆశ్రయించువారు వ్యక్తిగత అహంభావం విడనాడి తనువు మనస్సు రెండింటిని గురుదేవుని పాదముల చెంత అర్పించు కోవాలని అర్ధము గురుదేవుని వయస్సుతో పనిలేదు. తనకంటే గురుదేవుడు పెద్ద , చిన్న , అనే తేడాలు ఆలోచించకూడదు


*గురువు మనకంటే వయస్సులో చిన్నవాడైన జ్ఞానములో అతను సముద్రముకంటే గొప్పవాడని అనుకోవాలి. నీటిలో మునిగిన వానికి ఎప్పుడెప్పుడు పైకి వచ్చి స్వేచ్చా వాయువును పీల్చుకొందునా అని ఆలోచనత తప్ప ఆసమయమందు మరేది అతని మనస్సులో వుండదు. మండుటెండలో నడిచి వెళ్లి అతనికి చల్లని నీడ అందించే ఒక చెట్టు కనపడితే దాని క్రింద కొద్ది సేపు విశ్రమిస్తాడు. ఆసమయంలో అతని మనస్సుకు ఆ చెట్టునీడ ఎంతో సంతోషం కల్గిస్తుంది. ఎందుకంటే ఎండ తీవ్రతతో బాధపడుతున్న సమయంలో ఆచెట్టు నీడ నాశ్రయించి హాయిని పొందగల్గాడు.*


అలాగే ఈ ఈతబాధలతో సతమతమవుతున్న మనకు గురుకుల హిమబిందువులాగ చల్లగ ప్రశాంతతను ఇస్తాయి. గురుదేవుని కరుణాకటాక్షము పొందిన శిష్యుడు తరించినట్లే అతని అనుగ్రహము చూరగొనుభాగ్యము పొందగల్గినచో బ్రతుకు సఫలము. సంసార భవబందాలచే తల్లడిల్లి ఎప్పుడెప్పుడు ఈ భవబంధాలనుండి తప్పించుకొని ఆధ్యాత్మిక స్వేచ్ఛా వాయువు పీల్చగల్గుదునా అనే తీవ్రతర అభిలాష శిష్యుడికి వుండాలి. సంసారమనె భందనాలకు ఖైదీగ చిక్కిన మన మనస్సు వేరేవిషయాలపై మళ్ళకుండా గురువాక్కులను భక్తి శ్రద్ధలతో విన్నచో అప్పుడు గురుపదేశము సాధ్యమగును అదే సార్ధకము అగును. ఇక్కడ ముఖ్యముగ శిష్యునికి తన గురువుగ ఎంచుకొన్న మహనీయునిపై గాఢ విశ్వాసముండాలి. గురువు సన్మార్గాన్ని చూపుతారు. ఆ మార్గాల్లో ప్రయాణం సుఖకరముగా వుండే ఉపాయం చెపుతాడు. గురుబోధను ఆచరించి. తనమార్గం సుగమంగా మల్చుకోవడం శిష్యుని ఆసక్తి సాధన పట్టుదలపై ఆధారపడి వుంటుంది.


గురువుపై శిష్యునికి అచంచల విశ్వాసముండాలి. ఒక సందర్భములో స్వామి వివేకానందుడు ఏమన్నారంటే FAITH IN OUR SELVES, FAITH IN GOD FAITH IN GURU, "This is the secret of great ness" అనగా తనయందు నమ్మకము , భగవంతుని యందు నమ్మకము , గురువు యందు నమ్మకము , ఇదే మన ఔన్నత్యమునకు సంకేతము. ఇదీ మన ఆధ్యాత్మికపు విజయానికి విజయరహస్యము అని యావత్ ప్రపంచానికి మన హిందూ సత్ సంప్రదాయాన్ని చాటారు ఆ మహనీయుడు. శిష్యుడు తనకు తెలియని విషయాలు గురువును అడిగి తెలుసు కోవాలి అడగనిదే అమ్మయినా పెట్టదని మనసామెత అడగనిదే ఏ గురువు చెప్పరు. ఉదాహరణకు అర్జునుడు ఎల్లవేళలా శ్రీకృష్ణున్ని బావ అనే అప్యాయతతో పిలిచేవాడు అలాగే శ్రీకృష్ణుడికి కూడా అందరికంటే అర్జునునిపై చాలా ప్రేమవుంది. అది సర్వులకు విధితమే. అలాంటప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను విశ్వరూపాన్ని కురుక్షేత్రం దాక ఎందుకు చూపలేదు. కారణం ఒక్కటే. కురుక్షేత్ర సంగ్రామం వరకు అర్జునుడు తన భుజబలంపై నమ్మకం వుంచుకొని శ్రీకృష్ణుడిని కేవలం ఆపద్భాందవుడుగాను శ్రేయోభిలాషి అగు బావగానే ఎంచుకొన్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో నరుడు (అర్జునుడు) నారాయణుని గుర్తించి *"శిష్యస్నేహం శాధిమాంత్వాం ప్రసన్నం"* హే ! ముకుందానన్ను నీ శిష్యుడిగా స్వీకరించి జ్ఞానమును ప్రసాదించుము అని గోవిందుని ప్రసన్నుడవుకమ్ము అని వేడగానే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి కమ్ముకొన్న మాయపొరలను తొలగించి ఎంతో తపస్సు ఫలంతో కాని వీక్షించజాలని ఆ మహానుభావుని విశ్వరూపం చూడగల్గినాడు ఆ సవ్యసాచి. అర్జునుడు ఎప్పుడు తన శక్తి మీద , తనపరాక్రమం మీద నమ్మకం వీడి శ్రీకృష్ణుని శరణు వేడెనో అప్పుడు గీత జనియించింది. *అట్లే మనకుఎంత తెలిసినా ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఆకాంక్ష మనలో వుండాలి. మనం కూడా సద్గురువులను ఆశ్రయించి వారి అమూల్యమైన సందేశం విని తరించాలి.*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat