💠 ఏడుకొండలు, ఆ గిరులపై తిరుమల శ్రీవారిని పోలిన విగ్రహం, అలిపిరి మండపం తరహాలోనే పాద్దాల మండపం, పుష్కరిణి... ఇలా అన్నింటా తిరుమల దివ్యక్షేత్రాన్ని పోలి ఉండే పుణ్యక్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి శ్రీనివాసుడి ఆలయం.
💠 ఇక్కడి ఏడుకొండలపై కాంచనగుహలో వెలసిన శ్రీనివాసుడు సాక్షాత్తు తిరుమల వేంకటేశుడేనని భక్తుల విశ్వాసం. కురుమూర్తి ఆలయం సిద్ధ రుషి క్షేత్రం అని స్కాంధపురాణం చెబుతోంది.
👉 స్థలపురాణం ప్రకారం... అప్పు తీర్చమని కుబేరుడు చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక శ్రీనివాసుడు సతీసమేతంగా తిరుమల వీడి, అక్కణ్నుంచి బయలుదేరి కృష్ణా తీరం చేరుకున్నారు.
అక్కడి ప్రకృతికి పరవశులయ్యారు. ఆకాశగంగను తలపించే జలపాతంలో ఇద్దరూ జలక్రీడలాడారు. ఆ ప్రదేశమే నేడు, మహబూబ్‌నగర్ ఆత్మకూరు సమీపంలోని గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందింది.
💠 కృష్ణానదిలో స్నానం చేసి ఉత్తర దిశగా ప్రయాణమవుతుండగా ఆ కృష్ణమ్మ వేంకటేశుడికి పాదరక్షలు బహూకరించిందట.
💠 తిరుపతి నుంచి ఇక్కడికి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో…అక్కడా ఏడుకొండలు కనిపించాయి. పచ్చదనం తివాచీ పరిచి వేంకటపతికి స్వాగతం పలికింది. కొండెక్కాడు స్వామి.
💠 సుగంధభరిత నానాఫల వృక్షాలతో అలరారుతున్న ఆ అచలంపై అచంచలమైన ఆనందం ఉందనిపించింది లక్ష్మీదేవికి. ‘స్వామీ! కాసేపు ఇక్కడే ఉండిపోదాం’ అన్నది.
రమా రమణి కోరడమూ శ్రీనివాసుడు కాదనడమూనా! ‘అలాగే’ అన్నాడు వెంకన్న. అలా కురుమూర్తి కొండలపై బడలిక తీరేదాకా విశ్రమించారిద్దరూ. తిరుగు ప్రయాణమవుతూ తమ ప్రతిరూపాలను అక్కడే వదిలి వెళ్లారట. అలా, తిరుమలేశుడు ఇక్కడ ‘కురుమూర్తి స్వామి’గా వెలిశాడని స్థల పురాణం.
అదే ‘కురుమూర్తి’ క్షేత్రమైంది.
కురుమూర్తి విగ్రహం తిరుమలేశుడి మూర్తిని పోలి ఉంటుంది.
💠 ఆ సందర్భంలోనే శ్రీవారు కురుమూర్తిలోని సప్తగిరులపై కాంచనగుహలో స్వయంభువై వెలిశారని స్థలపురాణం.
🔆 స్వామి వెలసిన కాంచన గుహకు ఆ పేరు ఎట్లా వచ్చింది?
⚜ కాంచన గుహ ⚜
💠 కార్తీకశుక్ల పంచమి, శుక్రవారం ధనుర్లగ్నంలో చంద్రగురువులు కూడిన శుభ సమయంలో వేంకటేశ్వరుడు లక్ష్మీ సమేతుడై గట్టు మీద గుహను చేరుతాడు. లక్ష్మీకేశవులు తమ నివాస యోగ్యంగా ఎంచుకున్న గుహకు సమీపంలో దేవకాంచన వృక్షం ఉండేది. కాబట్టే దేవదేవుడు వెలసిన గుహ కాంచన గుహగా ప్రసిద్ధి పొందింది.
💠 అలనాడు కృష్ణవేణి స్వామికి సమర్పించినట్టుగా చెప్పే పాదుకలనే కాకతీయుల కాలం నుంచి ఏటా ఉద్దాల పేరుతో ఊరేగిస్తున్నారని చరిత్ర చెబుతోంది.
💠 ఉత్సవాలు:
ఏటా కార్తీక పౌర్ణమికి ముందు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో స్వామివారికి జరిపించే కల్యాణోత్సవం, విలువైన వజ్రవైడూర్యాలతో చేసే అలంకారోత్సవం, కీలక ఘట్టమైన ఉద్దాల ఉరేగింపు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఉద్దాల అంటే పాదుకలు.
💠 రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్యమైన ఆవు తోలుతో ఇక్కడి వడ్డెమాన్ గ్రామస్థులు పాదుకలను తయారు చేస్తారు. ఇందుకుగాను దీపావళి అమావాస్య నియమనిష్ఠలతో ఉపవాస దీక్ష పాటిస్తారు.
పూజానంతరం ఆ పాదుకలను ఊరేగింపుగా కాంచన గుహలో కొలువై ఉన్న శ్రీనివాసుడి సన్నిధికి తీసుకెళ్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకే దాదాపు రెండు లక్షల పైచిలుకు భక్త జనం హాజరవుతారు. స్వామి సన్నిధిలో పూజించిన తర్వాత ఆ పాదుకలను ఉద్దాల మండపానికి తీసుకొస్తారు. ఆ పాదుకలకు నమస్కరించి వాటితో వీపుపై కొట్టించుకుంటే చేసిన పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
💠 ఉద్దాల మండపంలో దళితులే అర్చకులు కావడం విశేషం.
ఇక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే... భక్తులు స్వామికి మట్టికుండలో అన్నం వండి, పచ్చిపులుసుతో కలిపి నైవేద్యం పెడతారు.
ఈ నైవేద్యాన్ని 'దాసంగం' అంటారు.
⚜ తిరుమలతో పోలిక ⚜
తిరుమలలో శ్రీవారు కొలువైన వేంకటాద్రిని ఆనందగిరి అని కూడా అంటారు. కురుమూర్తి కొండలు కూడా మేరు పర్వత పుత్రుడైన ఆ ఆనందగిరిలో భాగమేనని స్థలపురాణం చెబుతోంది. కురుమూర్తిలో శ్రీనివాసుడు వెలసిన గిరిని దేవతాద్రి అంటారు.
💠 తిరుపతిలోలానే ఇక్కడా వేంకటేశ్వరుడు ఏడుకొండల నడుమ కొలువై ఉన్నాడు.
ఆ కొండల వివరాలు…
1. శేతాద్రి (బొల్లిగట్టు)
2. ఏకాద్రి (బంటి గట్టు)
3.దుర్గాద్రి( కోట గట్టు)
4. ఘనాద్రి (పెద్ద గట్టు)
5. భల్లూకాద్రి (ఎలు గులగట్టు)
6. పతకాద్రి (చీపుర్లగట్టు)
7. దైవతాద్రి (దేవరగట్టు)… అనే ఏడు కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టపైనే కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్నారు
💠 తిరుమల శ్రీవారి తరహాలోనే ఇక్కడా స్వామి వీరస్థానక భంగిమలో కొలువై ఉన్నాడు. తిరుమల మెట్లమార్గంలోని శ్రీపాద చిహ్నాలు ఇక్కడా ఉన్నాయి. ఇన్ని పోలికలు ఉన్నాయి కాబట్టే ఈ కురుమూర్తి క్షేత్రాన్ని పాలమూరు తిరుపతిగా వ్యవహరించడం కద్దు.
💠 మహబూబ్ నగర్ నుండి కురుమూర్తి గ్రామం 50 కి.మీ