సత్యలోకమునుండి బ్రహ్మ దేవుని ఆదేశానుసారముగ భువికి దిగివచ్చిన శ్రీ శంఖుకర్ణుడు హిరణ్య కశిపునకు పుత్రునిగా జన్మించి ప్రహ్లాదుడను నామమున జగద్విఖ్యాతి గాంచెను. ప్రహ్లాదుడు క్రూరుడైన రాక్షసునకు పుత్రుడుగ జన్మించినను పూర్వజ్ఞానముచే శ్రీహరి యందు అనన్యభక్తుడై యుండెను.
జన్మించినది మొదలు ప్రహ్లాదుడు శ్రీహరి దివ్య నామ సంకీర్తనమనెడు అపారశక్తి సమన్వితుడై శ్రీహరికి బద్ధవిరోధి యైన తనతండ్రి నిరంకుశత్వము నెదిరించి శ్రీహరిశక్తిని ప్రకటించెను.
ముక్కు పచ్చలారని ఈ బాలుడు చేయు శ్రీహరి దివ్యనామ సంకీర్తన ప్రచారముచే ధరాతల మందు గల సకలజీవులు పరమ వైష్ణవులైరి. ప్రహ్లాదుని వాక్యములను సత్య మొనరించుటకే శ్రీహరి శ్రీ నరసింహస్వామి రూపమున స్తంభము నుండి బయల్వెడలి అసురుని సంహరించి తన అనన్యభక్తుడైన ప్రహ్లాదుని అనుగ్రహించెను. శ్రీహరియే స్వయముగ సింహాసనము నధిష్ఠించి దైత్యుని పాపకర్మలవలన దాని నావరించిన కల్మషములను హరించివైచెను. తదనంత రము ఆ పవిత్ర సింహాసనముపై పరమ భాగవతాగ్రణియగు శ్రీ ప్రహ్లాదుని అధిష్ఠింపజేసి ఆయనను అభిల భూమండలమునకు ఏకఛత్రాధిపతిగ నభిషేకించెను. శ్రీహరి పరమభక్తుడైన శ్రీ ప్రహ్లాదచక్రవర్తి ఆయన ఆదేశానుసారముగ ఈ ధరాతలమును చాలకాలము పరిపాలించెను.
తన రాజ్యకాలములో ప్రహ్లాదుడు అఖండ హరినామసంకీర్తన, భక్తి సేవాదులచే అఖండ పుణ్యమును, రాజోచిత ధర్మములైన యజ్ఞయాగాది క్రతువులచే పుణ్యములను సముపార్జించెను.
ప్రాణి అనిష్ట పుణ్యమును అనుభవింపనిదే ముక్తిని పొందలేడు. ఈ యనిష్ట పుణ్యము కేవలము భౌతిక సుఖముల ననుభవించు టకే దోహదము కాగలదు కాని ముక్తికి నిష్ప్రయోజన మగును.
కావున వైకుంఠమును జేరినప్రహ్లాదుడు తన అనిష్ట పుణ్య విశేషముచే మరల త్రేతాయుగమున విభీషణునిగా జన్మించెను. ఈ జన్మములో మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామ చంద్రు నారాధించి ఆయన కరుణకు పాత్రుడై బ్రహ్మచే ఆరాధింపబడిన మూల రామ మూర్తులను పొంది చిరకాలము రాక్షస సామ్రాజ్యమునకు చక్రవర్తియై యజ్ఞయాగాది కర్మల నాచరించి తన అనిష్ట పుణ్యమును మరల వృద్ధి చేసికొనెను.
ద్వాపరయుగములో శ్రీ మూలరామ మూర్తులను సేవించుటకు ఆయన బాహ్లిక చక్రవర్తిగా జన్మించెను. కళింగ దేశము నకు సామ్రాట్టు అయిన బాహ్లికుడు కూడ శ్రీమన్నారాయణుని యందు అనన్య భక్తిగల వాడై వైష్ణవశిరోమణిగ ప్రసిద్ధి గాంచెను.
మూలరామ మూర్తులను ఎంతగా ఆరాధించినను ఆ జననాథునకు తృప్తికలుగ లేదు. ఆతడు తన పూర్వజన్మమం దార్జించిన అనిష్ట పుణ్యముల ననుభవింపక విరాగియై, శ్రీహరి భక్తుడై యజ్ఞయాగాదికర్మల నొనరించి మఱల అనిష్ట పుణ్యమును అభివృద్ధిచేసెను.
ప్రహ్లదుడు ఏకారణము వలన దివినుండి భువికి దిగివచ్చెనో ఆ కారణము వలననే బాహ్లికుడు కలియుగములో శ్రీరామ చంద్రుని ఆరాధింప వలెననెడి ప్రగాఢవాంఛతో (క్రీ.శ. 22–4–1447) విజయనగర సామ్రాజ్య మున శ్రీవ్యాసరాయునిగ నవతరించెను.
శ్రీ వ్యాసరాయ తీర్థులు:
విజయనగరసామ్రాజ్యములో శ్రీబ్రహ్మణ్య తీర్ధులను గొప్ప వైష్ణవ యతీంద్రులు విరాజిల్లిరి. వారికాలములో కావేరీ తీరములో బన్నూరను కుగ్రామములో రామాచార్యులను నొక
భక్తుడు నివసించు చుండెను. ఆయన భార్య లక్ష్మీబాయి. ఆయన వృద్ధుడైనను సంతానము బడయజాలక సత్పుత్రుని పొందుటకై మహాత్ముడైన శ్రీబ్రహ్మణ్యతీర్థులను ఆశ్రయించెను.
శ్రీరామాచార్యునకు పుత్ర సంతానము గల్గిన ఆశ్రమమున కర్పింపవలె ననెడి షరతుతో శ్రీబ్రహ్మణ్య తీర్థులవారు “సత్పుత్ర ప్రాప్తిరస్తు” అని ఆశ్రితుని దీవించెను. స్వామి ఆశీర్వాద బలముచే ఆ సంవత్సర ముననే శ్రీరామాచార్యుని గృహమున తేజస్సంపన్ను డైన పుత్రుడుదయించెను. నాటి ప్రహ్లాదుడే నేటి యీ దివ్యశిశువని పాఠక మహాశయులు గ్రహించియే యుందురు.
రామాచార్యులు శ్రీ బ్రహ్మణ్యతీర్థుల కొసంగిన వచనానుసారముగ తన తనయుని ఆశ్రమమున కర్పించి సత్యవాక్పరి పాలన మొనరించెను. ఆ దివ్యశిశువునకు యతిరాజ ని నామకరణ మొనరించి శ్రీ బ్రహ్మణ్య తీర్థులవారే స్వయముగ తన పర్యవేక్షణలో పెంచ నారంభించిరి. బ్రహ్మణ్య తీర్థులు ప్రతి దినము దేవునకర్పించిన పాలు, పండ్లు యతిరాజునకు ఇచ్చెడివారు.
యతిరాజునకు నాల్గవ సంవత్సరములోనే ఉపనయన సంస్కార మొనరించి శ్రీతీర్థులవారు యెనిమిదవ సంవత్సర మున సన్యాసాశ్రమము నొసంగి శ్రీవ్యాసరాయలను నామము నొసంగిరి.
శ్రీబ్రహ్మణ్య తీర్థులవారే స్వయముగ శ్రీ వ్యాస రాయునకు ద్వైత సిద్ధాంతములో శిక్షణ నిచ్చి విద్యాభ్యాసార్థమై శ్రీ శ్రీపాదరాజస్వామి చెంతకు పంపిరి. శ్రీశంఖుకర్ణుని అవతారమైన శ్రీ వ్యాస రాయలు సత్యసంధుడైన తండ్రికి తనయుడై జన్మించి పరమ భాగవతో త్తముడైన శ్రీబ్రహ్మణ్య తీర్థునిచే పెంచబడి శ్రీ శ్రీపాదరాజస్వామిచే సకల ఆధ్యాత్మిక విద్యలను బడసి గొప్ప విద్వాంసుడై ద్వైత సిద్ధాంతములో అసమాన ప్రజ్ఞాధురీణు డయ్యెను. పుట్టుక తోనే మహాకవిగా జన్మించిన శ్రీవ్యాసరాయల వారు గొప్ప తపమాచరించి మహాతపస్వి అయ్యెను.
శ్రీబ్రహ్మణ్యతీర్ధుల వారి అనంతరము (1468 సం॥లో) శ్రీవ్యాసరాయలవారు ఆశ్రమాధిపతులైరి. తదనంతరము ఆయన భారతవర్షమందు గల సమస్త పుణ్య క్షేత్రములలో పర్యటించెను ఆయన పర్యటించిన ప్రదేశముల లోని వారందరిని ద్వైతసిద్ధాంత వాదులుగ మార్చివైచెను. తన అఖండ ప్రతిభా పాండిత్య ములతో శ్రీవ్యాసరాయల వారు ఆశ్రమమున కనేక జాగీరులను, అగ్రహారము లను, ధనకనక వస్తు వాహనములను సముపార్జించిరి.
నాటినుండి ఆ యాశ్రమము శ్రీవ్యాసరాయ మఠమని ప్రసిద్ధి
గాంచెను.
ఆ సమయములో కర్నాట కాంధ్ర సామ్రాజ్యమును శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించుచుండెను. త్వరలో కుహూయోగ సంధికాలము ఆసన్నమగు చున్నదని అపరోక్ష జ్ఞానులు శ్రీకృష్ణదేవరాయ లను హెచ్చరించిరి. 8-1-1521 అనగా విక్రమనామ సంవత్సర పుష్య బహుళ అమావాస్య దినమున కుహూ యోగము సంభవించునని వారు పల్కిరి. ఆ దుష్ట కాలములో రాజ్యాధినేతకు ప్రాణగండము సంభవిం చును. శ్రీకృష్ణదేవరాయలు ఈ కుహూయోగ పరిష్కారార్థము యేమి చేయవలయునని గురు జనులను ప్రశ్నించెను. అందులకు వారు రాజా! సీసర్వస్వమును దైవాంశ సంభూతుడగు యొక మహాత్మున కర్పించి నీవు భృత్యుడవు కావలయును. కుహూ యోగకాల మున్నంతవరకు ఆమహనీయుని సింహాసనాధీశునిగ నుంచ వలయును. ఆదుష్ట కాలము తొలగిపోయిన అనంతరము నీవు మరల నీరాజ్యమును పరిగ్రహింప వచ్చు' నని పలికిరి. శ్రీకృష్ణదేవరాయలు శ్రీ వ్యాసరాయ స్వాముల దివ్య మహిమలను స్వయముగ దర్శించి ఆయనకేనాడో శిష్యుడయ్యెను.
శ్రీకృష్ణ దేవరాయలు తనను కుహూయోగ మృత్యు గండము నుండి రక్షింపవలసినదిగ శ్రీ వ్యాస రాయతీర్థుని చరణముల
నాశ్రయించెను. అందులకు శ్రీవారు సమ్మతించిరి. తక్షణమే శ్రీవ్యాసరాయ తీర్థుని శ్రీవిజయనగర సామ్రాజ్య సింహాసనము పై అధిష్ఠింపజేసి శ్రీరాయలు తన సర్వస్వ మును ధార పోసెను. తాను భృత్యుడై శ్రీ వ్యాస రాయతీర్థుని సేవింప నారంభించెను .
కుహూయోగ సమయమా సన్నమయ్యెను. ఆసమయ ములో శ్రీవ్యాసరాయతీర్థ స్వామి సింహాసనాధీశుడై కొలువు దీరి యుండెను. అపుడు సభామధ్యములో భూమినుండి ఒక అగ్నిజ్వాల బయల్వెడలి సింహాసనము నధిష్టించి యున్న శ్రీవ్యాసరాయ తీర్థులను కబళించుటకు బయలు దేరెను. అపుడు శ్రీవ్యాసరాయ స్వామి తనపై కప్పుకొనియున్న కాషాయ వస్త్రమును దీసి ఆ కాలాగ్నిపై వైచెను. వెంటనే ఆ అగ్ని శాంతించి అంతర్థాన మయ్యెను. కుహూయోగ సంధి కాలములో ఆ దుర్నిమిత్త మును తాను స్వీకరించి శ్రీ వ్యాసరాయ యతీంద్రులు శ్రీకృష్ణ దేవరాయలను కాపాడెను. తదనంతరము కర్నాటకాంధ్ర సామ్రాజ్య మును వైష్ణవ యతీంద్రు నకు సేవకునిగా శ్రీ కృష్ణ దేవరాయలు పరి పాలించెను.
తదనంతరము గురు దేవుని ఆజ్ఞానుసారముగ రాయలు తిరుపతి మహాక్షేత్రమును దర్శించి స్వామి సమక్షమున తన దేవేరులతో సహా విగ్రహములను నిర్మించి దాసానుదాసునిగ తిరుపతి క్షేత్ర ఆలయ ప్రాంగణము లో నిలిపెను. నేటికిని ఆవిగ్రహములను మనము తిరుపతి క్షేత్రమందు దర్శింపవచ్చును. శ్రీ వ్యాస రాయతీర్థులు శ్రీ వేంకటేశా ర్పణముగ విజయనగర సామ్రాజ్యమును స్వీకరించి స్వామి ప్రతినిధిగా మాత్రమే సింహాసనము నధిష్టించెను. కావున శ్రీకృష్ణ దేవరాయలు శ్రీ వేంకటేశ్వరుని దాసుడైన శ్రీ వ్యాసరాయనికి దాసుడై ధన్యుడయ్యెను. ఈవిచిత్ర సంఘటనను ఎందఱో చరిత్రకారులు పరిశీలించి ధ్రువీకరించిరి.
విక్రమసంవత్సర ఫాల్గుణ శుక్ల ఏకాదశిదినమున శ్రీకృష్ణ దేవరాయలు మదనపల్లి తాలూకాలో నున్న వ్యాసముద్ర మను గ్రామమును శ్రీవ్యాస తీర్థునకు శ్రీ గోపాలకృష్ణ స్వామి నామముతో సమర్పించినట్లుగ శాసన ములు కలవు.
శ్రీవ్యాసరాయల వారు పండ్రెండు సంవత్సర ములు శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యసన్నిధిలో నివసించుచు శ్రీవారి నారాధించెను. ఆ కాలము లోనే ఆయన శ్రీనివాసుని నిత్యారాధనలను క్రమబద్ధ మొనరించెను.
తీర్థయాత్ర కాలములో ఆయన తాను సందర్శించిన ప్రతి ప్రదేశములోను శ్రీ ఆంజ నేయస్వామి విగ్రహము లను ప్రతిష్టించెను. దక్షిణ భారత దేశములోనే వివిధ ప్రదేశములలో శ్రీ వ్యాస రాయల వారు షుమారు ఏడువందల ఎనుబది నాలుగు (784) ఆంజనేయస్వామి విగ్రహ ములను ప్రతిష్టించినారని చరిత్ర ధ్రువీకరించు చున్నది.
శ్రీవ్యాసరాయలవారు రాజ గురువైన కారణమున రాజ్యపరిపాలనలో శ్రీకృష్ణ దేవరాయలకు న్యాయ బద్ధములైన సలహాల నొసంగెడివారని చరిత్ర గలదు. వైష్ణవ మఠపీఠాధి పతియైనను శ్రీవ్యాసరాయ స్వామి తుదివరకు శ్రీవిజయనగర సామ్రాజ్య మునకు ధర్మసంరక్షకునిగ నిలచి ప్రజలను రక్షించిరి; తమ తొంబది రెండవ సంవత్సరములో శ్రీవ్యాస రాయలవారు విజయనగర ములో గల హంపీవద్ద పవిత్ర తుంగభద్రానదీ తీరములో పాంచభౌతిక కాయమును పరిత్యజించి దివ్య దేహధారియై వైకుంఠమును జేరెను. తనజీవిత కాలములో ఈమహాత్ముడు ద్వైతమత సిద్ధాంత ప్రతిపాదకము లైన యనేక గ్రంథములను రచించి శ్రీమధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైత వాదమే సత్యమని, ఆ యాచార్యుడు జూపిన మార్గమే భగవంతుని జేరుటకు రాజమార్గమని నిరూపించెను.
శ్రీవ్యాసరాయలవారి ప్రోత్సాహము వలన ఎందఱో కన్నడ కవులు భగవంతుని దివ్య గుణములను కీర్తనలను రచించి బహుళ ప్రచార మొనరించిరి. పుట్టుకతోనే కవీశ్వరునిగ మారిన వ్యాసరాయలవారు, శ్రీహరిపైన, శ్రీవాయువుపైన అనేక గీతములను, భజనలను కన్నడభాషలో రచించి మధురాతి మధురముగ గాన మొనరించెను. శ్రీహరికీర్తనలు రచింపజేసి శ్రీహరి భక్తి ప్రచార మొనరించుటకు శ్రీపురంద రదాసు, శ్రీ కనక దాసు, శ్రీవడిరాజస్వామి మున్నగు హరిదాసులను కలసికొని వ్యాసరాయలవారు వారిని భగవద్గుణ కీర్తనమున ప్రోత్సహించి శ్రీ దాసకోటను స్థాపించెను. శ్రీ వ్యాస రాయలవారు తమ జీవితాంతము శ్రీమూల రామమూర్తిని భక్తితో నారాధించిరి.
ఎంతగా స్వామిని కొలిచినను శ్రీ వ్యాస రాయలవారికి శ్రీరామా
రాధనా తృష్ణ తీర లేదు. స్వామి నారాధించుటకు కోటాను కోట్ల జన్మలైనను స్వల్ప మని తాను శ్రీమూలరామ మూర్తిని
తనివిదీర ఆరాధించుటకు దివినుండి భువికి మఱల దిగివత్తునని తన అవసాన కాలములో ప్రవచించి శ్రీవ్యాస రాయల వారు దివ్య దేహధారియై పరంధామమునకు వెడలి పోయెను.
ఆశంఖుకర్ణుడే శ్రీమూల రామారాధనా కాంక్షతో 1598 వ సంవత్సర ములో మఱల దివినుండి భువికి దిగివచ్చి శ్రీ రాఘవేంద్రస్వామిగా ప్రసిద్ధిగాంచి నేటికిని శ్రీమంత్రాలయ అంతర్గత బృందావనములో సజీవులై విరాజిల్లుచు తన్నాశ్రయిం చిన భక్తుల సర్వాభీష్ట ములను తీర్చు చున్నారు. ప్రతియుగములోను శ్రీ శంఖుకర్ణుడు భవరోగ పీడిత మానవాళి నుద్ధరించుటకై దివినుండి భువికి దిగివచ్చుచునే యున్నాడు. కృతయుగ ములో ప్రహ్లాదునిగ, త్రేతాయుగములో విభీషణునిగ, ద్వాపర యుగములో బాహ్లికునిగ, కలియుగములో శ్రీ వ్యాస రాయునిగ, శ్రీ రాఘవేంద్ర స్వామిగ శ్రీ శంఖుకర్ణుడే అవతరించి శ్రీహరి భక్త్యారాధనలను. ప్రచార
మొనరించి నేటికిని సజీవముగ శ్రీ మంత్రాల యాంతర్గత బృందావన ములో విరాజిల్లి యున్నాడు. తనయవతార ములన్నిటిలో సముపార్జిం చిన యనిష్ట పుణ్యరాసు లను ఆశ్రితభక్తులకు ప్రసాదించుచు తాపత్రయ ములనుండి వారిని రక్షించుచు వారికి నివృత్తి మార్గమును జూపు చుండెను. నేను ఏడు వందల (700) సంవత్సర ములు బృందావనములో వేంచేసియుండి ఆశ్రిత భక్తులను రక్షించి వారి యార్తిని బాపెదనని శ్రీ రాఘవేంద్ర స్వామియే స్వయముగ బల్కిరి.
శ్రీ గురు రాఘవేంద్ర
*****
శ్రీ రాఘవేంద్ర
కల్పవృక్షము
2 వ భాగము
సమాప్తము **
💥💥💥💥💥💥
🙏 ఓం శ్రీ గురు రాఘవేంద్ర య నమః 🙏