శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 3 వ భాగము

P Madhav Kumar

 

శ్రీవ్యాసరాయలచే విజయ నగరములో ప్రతిష్ఠింప బడిన ఆంజనేయ స్వామి నారాధించి ఆ భక్తాగ్రణి కృపకు పాత్రుడైన  శ్రీ కనకాచల భట్టు  కుటుంబము ఉండెను. సంతానము లేకపోవుటచే శ్రీ కనకాచలభట్టు సత్పుత్రుని కొరకు ఎన్నియో వ్రతముల నాచరించి తీర్థయాత్రల నొనరించెను. వారికి వయసు మళ్ళిన తరుణములో భగవత్కృప వలన సత్పుత్రుడు కలిగినాడు.


శ్రీ ఆంజనేయానుగ్రహమున  జన్మించిన ఆ శిశువునకు తిమ్మన్నభట్టు అని నామకరణ మొనరించి అల్లారుముద్దుగ పెంచ నారంభించెను. శ్రీకనకా చలభట్టు తన కుమారు నకు ద్వైత సిద్ధాంతమును బాగుగ బోధించి మహా విద్వాంసునిగనొనరించెను. తిమ్మన్నభట్టు తండ్రి చెంతనే కర్ణాటక సంగీతమును వీణావాదన ము నభ్యసించి తండ్రిని మించిన తనయుడు అయ్యెను. కాలక్రమమున ఆయన శీలవతి, సౌందర్య వతి, సద్గుణవతియైన గోపమ్మ యనెడు కన్యను  వివాహమాడి గృహస్థా శ్రమమును స్వీకరించెను. గోపమ్మ శ్రీహరి పరమ భక్తురాలు, క్షమాశీల, మహాపతివ్రత. ఆ దంపతులకు క్రమముగ నిర్వురు సంతానము కల్గిరి. ప్రధమసంతానము కుమార్తె, ఆమె నామధేయ ము వెంకమాంబ. ద్వితీయ సంతానము కుమారుడు. కుమారునకు గురురాజు అనినామకరణ మొనరించి ఆదంపతులు సుఖముగ జీవింప నారంభించిరి. రాజాశ్రయములో సుఖ జీవన మొనరించుచున్న తిమ్మన్న భట్టారకునకు దుర్దినములుదాపురించెను. ఆ కాలములో శ్రీ కృష్ణదేవ రాయల వారి జామాత యైన శ్రీఅళియరామ రాయలు రాజ్యపరిపాలన భారము వహించుచుండిరి. విజయనగర సామ్రాజ్యము ను పతన మొనరింప వలెనని బహమనీ సుల్తానులు కుట్రపన్ని తమలోగల పరస్పర విరోధములను విస్మరించి యొకటియై అసంఖ్యాక సైన్యములతో “రక్షసి- తంగడి” యనుగ్రామముల మధ్య క్రీ. శ. 1565 సం॥లో రామరాయల సైన్యములను ముట్టడించి ఘోరముగ నోడించిరి. దీనికే తళ్ళికోటయుద్ధమని ప్రఖ్యాతనామము కలదు. నాటితో విజయనగర సామ్రాజ్య ప్రాభవమంత రించెను. మహమ్మదీ యులు ద్వేషముతో, కక్షతో  నెలలపర్యంతము భారత వర్షమునకు ధనాగారమైన విజయనగర సామ్రాజ్యము ను కొల్లగొట్టిరి.


జాతి విద్వేషముచే వారు విజయనగర సౌధములను ఆలయములను నేలమట్ట మొనరించి అడ్డువచ్చిన వారిని వధించుచు స్త్రీలను చెరబట్టి, బాలికలను సహితము చెఱచుచు రాత్రియనక, పగలనక ఘోరకలి యొనరించిరి. విజయనగర పౌరులీ హింసాకాండను సహింప లేక ప్రాణములను  అరచేత బట్టుకొని నగరములను వీడి పారిపోయిరి. ఇట్లు తన రాజాశ్రయము విచ్ఛిన్నము కాగా తిమ్మన్నభట్టు తన భార్యనుబిడ్డలను తోడ్కొని పూర్వీకులు రాజాశ్రయ మున సముపార్జించిన ధనమును మోయగల్గి నంత తీసికొని హిందూ రాజ్యమైన తంజావూరు రాష్ట్రమునకు వలస వచ్చెను.


తంజావూరు రాష్ట్రములో కాంచీనగరమునకు చేరువ లో నున్న భువనగిరి యనెడు  కుగ్రామములో కుటుంబముతో నివసింప నారంభించెను. కాని  ఆ కుగ్రామములో సంపాదన కెట్టి యవకాశము లేనందున తిమ్మన్నభట్టు తన కుటుంబ పోషణార్ధమై విజయనగరమునుండి గొనివచ్చిన తన పూర్వీకుల సంపదలను క్రమముగ వెచ్చింప నారం భించెను. ఇట్లు పది సంవత్సరములు గడచిన అనంతరము యుక్తవయ  స్సులోనున్న తనపుత్రికను మధురానగరవాసి యైన శ్రీలక్ష్మీనృసింహాచార్యుడను విద్వాంసునకిచ్చి ఘనము గ వివాహ మొనరించెను.



 ఈ వివాహమువలన తిమ్మన్నభట్టు చెంతగల ధనమంతయు వ్యయ మయ్యెను. శ్రీవెంకమాంబ తనభర్త ననుసరించి మథురకు వెడలిపోగా గృహములో బాలకుడైన గురురాజు ఒంటరిగా మిగిలిపోయెను. 


దినములు గడచు చున్నకొలది దారిద్య్రము భట్టారకుని గృహము నావరించెను. కొందఱు విద్యార్థులకు సంగీత పాఠములు జెప్పుకొనుచు ఎంతయోకష్టముతో భట్టు జీవితమును సాగించు చుండెను. గురురాజు ఉపనయన సంస్కారము  బొంది విద్యార్ధియై గురుకులమునకు వెడలి పోయెను. గురురాజు తరువాత ఆ దంపతులకు సంతానము లేనందున వారిగృహము సంతోష శూన్యమయ్యెను. ఆ దంపతులు భాగవతోత్త ముడైన పుత్రుని బడయ వలెనని యెన్నియో వ్రతముల నాచరించిరి. కాని వారి పూజలు ఫలింపలేదు. ఈ కలి యుగములో ఆశ్రితుల సకలాభీష్టములను తీర్చు టకు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఏడు కొండలపై శ్రీవేంకటేశ్వరునిగ వేంచేసి యున్నాడని అందఱకు విదితమే. సత్పుత్రుని బడయుటకు ఆ శ్రీనివాసుని సేవింప వలెనని సంకల్పించి తిమ్మన్న భట్టారకుడు ధర్మపత్నితో గూడి తిరుపతిని జేరుకొనిరి. ఆదంపతులు జితేంద్రి యులై భగవద్భక్తుడైన పుత్రుని కొఱకు ఒక సంవత్సరకాలము శ్రీ వేంకటేశ్వరస్వామిని      అనన్య భక్తితో ఆరాధించిరి.


ఒకదినమున బ్రహ్మ ముహూర్తమున తిమ్మన్న భట్టారకునకు స్వప్నమందు శ్రీశ్రీనివాసుడు సాక్షాత్క రించెను. ఆ జగన్నాథుని దివ్యమంగళ విగ్రహమును వర్ణించుట  ఎవరి తరము? చతుర్ముఖుడైన బ్రహ్మ యైనను పంచముఖములు గల్గిన పరమేశ్వరుడైనను, సహస్రముఖములు గల్గిన అనంతుడైనను స్వామి దివ్య రూపమును వర్ణింప జాలరు. శ్రీ వేంకటేశ్వరుని వక్షఃస్థలముపై శ్రీదేవి భూదేవి విరాజిల్లు చుండిరి. స్వామిశిరముపై తులసిని ధరించి యుండెను. ఆయన పాదాగ్రముల నుండి పవిత్ర గంగాభవాని ప్రవహించు చుండెను. నాభినుండి ఉద్భవించిన కమలమున జగద్విధాత యగు బ్రహ్మ విరాజమానుడైయుండెను. సూర్యచంద్రులే ఆయన నేత్రములు. ధ్వజముపై గరుత్మంతు డుండెను. అఖండ తపోతేజముచే ప్రభువు ప్రకాశించు చుండెను.


నాసాపుటము లందు శ్రీవాయుదేవుడు విరాజిల్లి యుండెను. సకల పుణ్యనదులు ఆయన శిరోజములైనవి, దేవతా గణములు  ఆయన రోమములైరి, అనంతకోటి సూర్యులను మించి ప్రకాశించుచున్న ఆయన తేజము భక్తులకు శరచ్చంద్రుని వెన్నెల వలె చల్లగ నుండెను. కలిత లక్ష్మీశుడు, సర్వజగన్నివా సుడు విమల రవికోటి సంకాశుడునగు వేంకటే శ్వరునిగాంచి తిమ్మన్న భట్టారకుడు పులకిత గాత్రుడయ్యెను. స్వామి దివ్యపాదములు బ్రహ్మ కడిగిన పాదములు, స్వామి నడుమున గజ్జలందియలు అలంక రింప బడియుండెను. లక్ష్మీపతి పీతాంబరధారి యై కుండలములు కరముల నలంకరింపబడి ఒకహస్తముచే తన పాదములను జూపుచు, మరియొక హస్తముచే నభయము నొసంగుచు, రెండుహస్తముల శంఖు చక్రములను ధరించి సరసన అలివేలు మంగమ్మ అలరారుచుండ దివ్యరత్న మకుట ధారియై వక్షఃస్థలముపై తిరుమణి శోభింపగ మకరకుండ లములు కర్ణముల నలంకరింపబడి ప్రకాశిం చుచుండ ఆ  లక్ష్మీశుడు, సర్వ జగన్నివాసుడు, విమలరవికోటి సంకాశుడు తిమ్మనార్యునకు దివ్య సందర్శన మొసంగెను. ఆహా! ఆ భాగవతోత్తముని జన్మమేజన్మము, జీవనమే జీవనము, అదృష్టమే అదృష్టము. కోటానుకోట్ల పూర్వజన్మల సముపార్జిత   అఖండ పుణ్యవిశేషముచే తిమ్మన్న భట్టారకునకు శ్రీనివాసుడు  తన దివ్య దర్శన మొసంగెను.


స్వామిసచ్చిదానంద విగ్రహ దర్శనముచే తిమ్మన్న భట్టారకుడు ముకుళిత హస్తములతో అశ్రుపూర్ణ నయనుడై “మాధవా! గోవిందా! వామనా! ప్రద్యుమ్నా! మధుసూ దనా! అచ్యుతా! వాసుదేవా! త్రివిక్రమా! పద్మనాభా!  జనార్దనా! హృషీకేశా! నారసింహా! శ్రీ నివాసా! వేంకటాచలపతీ! పాహి" యని అనేక విధముల స్తుతించెను. తిమ్మన్న భట్టారకు   డొనరించిన స్తోత్రమున కత్యంత ప్రసన్నుడై వేంకటాచలపతి మధుర వాత్సల్యభరిత వచన ములతో ఇట్లనుగ్ర హించెను. “బ్రాహ్మణోత్తమా నీభక్తి సేవారాధనలకు  అత్యంత  ప్రసన్నుడ నైతిని. నీమనోభీష్టము పరిపూర్ణ మగుగాక. నాపార్షదుడే నీగృహములో భవరోగ పీడితమానవ సమాజ ఉద్ధరణమునకు  అవతరింపగలడు.


అతడు  సకల వేద వేదాంగ పారంగతుడై, సకలశాస్త్ర విశారదుడై సకల ధర్మ కోవిదుడై నా అనన్య భక్తుడై  నీ పూర్వీకులను, రాబోవు వంశము వారలను ఉద్ధరించుటయేగాక, సమ మానవ సమాజమును భవసాగరమును తరింప జేయును. నా భక్తిని, నా శక్తిని జగమునందంతట ప్రచార మొనరించి నావలెనే భక్తులచే పూజింపబడును. తిమ్మన్న భట్టారకా! ఈభాగవతో త్తముని పుత్రునిగ బడసిన నీకు భవబంధములు తొలగిపోవును. గోలోక ప్రాప్తియగును. కావున నిశ్చింతుడవై స్వస్థలము నకుపొమ్ము" స్వామి యిట్లనుగ్రహించి అంతర్థాన

మయ్యెను. ఇంతలో తిమ్మన్నభట్టు నిద్ర మేల్కాంచి స్వప్నములో నా జగన్నాథుడే తన్నను గ్రహించెనని గ్రహించి పరమానందభరితుడై స్వప్న వృత్తాంతమంతయు తన    అర్థాంగియగు గోపమ్మకు వివరింపగా ఆసాధ్వి ఆశ్రితజన మందారుడైన వేంకటేశ్వర స్వామిని  అనేక విధముల స్తుతించెను.


శ్రీ రాఘవేంద్ర గురు సంభవము:


ఆ దంపతులిర్వురు శ్రీనివాసుని  అనేక  విధములుగా  పూజించి, అనేక సాష్టాంగ దండ ప్రణామము లర్పించి భువనగిరికి మఱలి వచ్చిరి. జగన్నాథుని అనుగ్రహానుసారముగ గోపమ్మ గర్భమును ధరించి నవమాసములు నిండగనే  శాలివాహన శకము 1518, మన్మధనామ సంవత్సర  ఫాల్గుణ శుద్ధసప్తమి గురువారమున (1598 లో) ఒక దివ్య శిశువును ప్రసవించినది. ఆబాలుని నవ అవయముల నుండి బయల్వెడలిన తేజము ఆ గృహము నంతటినిముంచి వైచెను. ఆముహూర్తమున గ్రహములన్నియు ప్రసన్న ముగ నుండెను. సూర్యోదయం కాలమున చల్లని పిల్లగాలులు వీచుచుండగ దేవతలు కుసుమములను వర్షించుచున్నారా యనునటుల వర్షము ప్రారంభ మయ్యెను. ఆ ముహూర్తమున నదులు ప్రసన్నములై యుండెను. సముద్రము శాంతముగ నుండెను. శంఖుకర్ణుడే   పీడిత మానవాళికి హరి  భక్తి నొసంగుటకు, హరిసేవ లను ప్రదర్శించుటకు మూలరాముని తనివిదీర ఆరాధించుటకు దివినుండి భువికి దిగివచ్చెను. సూర్యకాంతితో ప్రకాశిం చుచున్న తనకుమారుని ముఖారవిందమును గాంచి తిమ్మన్న భట్టారకుడు పరమానందభరితుడై హరి నామసంకీర్తన మొనరిం చుచు నృత్య మొనరిం చెను. శ్రీ వేంకటేశ్వర స్వామి కరుణవలన గల్గిన తనపుత్రునకు తిమ్మన్న భట్టారకుడు వేంకటేశ్వరు డని నామకరణ మొనరించెను. హరి నామ సంకీర్తన మొనరింపనిదే ఆ శిశువు కన్నెత్తి యైనను చూడడు. శ్రీహరి దివ్య చరితములను వర్ణింపనిదే పాలు త్రాగడు. రామచంద్ర మూర్తిని సరసన యుంచనిచో  నిదుర పోడు.   ఈభాగవతశిశువు కారణముగ తిమ్మన్న భట్టారకుని గృహము అహర్నిశములు శ్రీహరి నామ సంకీర్తనతో ప్రతిధ్వనింపసాగెను. 


ఆబాలుడు ఉదయాద్రిపై నుదయించు సూర్యునివలె దినదిన ప్రవర్ధమానుడై పెరుగ నారంభించెను.


ఇట్లుకొంత కాలము గతింపగా విద్యాభ్యాస మునకై గురుకులమునకు వెడలిన గురురాజు విద్యాభ్యాసమును ముగించుకొని యౌవన వంతుడై గృహమునకు మఱలివచ్చెను. తిమ్మన్న భట్టు గురురాజునకు ఒక శీలవతితో వివాహ మొనరించెను. తదనంత రము తిమ్మన్నభట్టు తన కనిష్ఠ కుమారుడైన వేంకటేశ్వరుని జ్యేష్ఠ పుత్రుని సంరక్షణలో నుంచి అర్థాంగియగు గోపమ్మతో కలసి భౌతిక దేహమును విసర్జించి దివ్యవిమానా రూఢుడై గోలోకమును జేరెను. గురురాజు పిన్న వయసులోనే సంసార భారమును వహింపవలసి వచ్చెను. గృహములో నెట్టిసంపదలేదు, గురు రాజునకు సంపాదన కెట్టిమార్గమును గాన రాలేదు.


తన భార్య, తనతమ్మునితో ఆయన కడు దారిద్య్రమనుభవింప వలసి వచ్చెను. ప్రియసోదరుని విద్యాభ్యా సార్థమై తనబావగారైన శ్రీలక్ష్మీ నృసింహాచార్యుల కడకు పంపెను.  శ్రీలక్ష్మీ నృసింహాచార్యులు బ్రహ్మ తేజముతో ప్రకాశించు చున్న వేంకటేశ్వరుని గాంచి పరమానంద భరితుడై వానిని తోడ్కొని మధురకు వెడలిపోయెను.



విద్యాభ్యాసము:


తిమ్మన్న భట్టారకుడే శ్రీ వేంకటేశునకు ఉపనయన మొనరించి కన్నడభాషలో ప్రాథమికవిద్యను గఱపెను. వేంకటేశుని ఐదవ సంవత్సరము వయస్సు లోనే భట్టారకుడు గోలోకమునకు వెడలెను. లక్ష్మీనృసింహా చార్యులు బాల వేంకటేశుని వెంటనిడుకొని మధురకు జేరెను. తన చిన్నారి సోదరుని గాంచి వెంకమాంబ యెంతయో సంతోషించి వేంకటేశుని తనపుత్రుల కన్న మిన్నగ ప్రేమతో పోషింప నారంభించెను. లక్ష్మీనృసింహా చార్యులే స్వయముగ వేంకటేశునకు గురువై సంస్కృతభాష లో శిక్షణనొసంగెను. ఆ బాలుడు  మహామేధావి, ఏకసంథాగ్రాహి. కావున కొలది కాలములోనే వ్యాకరణము, కావ్యము, మీమాంస, తర్కము, అర్థశాస్త్రము మొదలగు శాస్త్రములలో విద్వాంసు డయ్యెను. చిన్న నాటి నుండి వేంకటేశుడు సాంసారిక విషయము లందు శ్రద్ధవహింపక ఎల్లప్పుడు హరినామ స్మరణమునందే నిమగ్నుడై యుండెడివాడు. ఈ బాలుని వైరాగ్యభావము ను గాంచి లక్ష్మీనృసింహా చార్యులు, గోపమ్మ పరమాశ్చర్య చకితులైరి. బాలుడు  సామాన్యుడు కాడని అసమాన ప్రతిభా సంపన్నుడని  బావగారు గ్రహించి తాను నేర్చిన విద్యల నన్నింటిని వెంకన్నకు (వేంకటేశున కు) నేర్పి తృప్తి నొందక తన బావమరదికి మధ్వాచార్య సిద్ధాంతమైన ద్వైతమతములో, శ్రీ న్యాయసుధలో ఉన్నత విద్యాభ్యాస మొనరింప వలెనని సంకల్పించెను.


శ్రీ గురు రాఘవేంద్ర

*****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము

3 వ భాగము  

సమాప్తము**

💥💥💥💥💥💥


🙏 ఓం శ్రీ గురు రాఘవేంద్ర య నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat