ఆకాశరాజు జాగ్రత్తగా ఆలోచించాడు, తనకు గురువర్యుడయిన శుకయోగితో సంప్రదించినట్లయితే చాలా బాగుంటుందని తలచి శుకయోగినీ పిలిపించాడు. ఉచితాసనా సీనుని జేసి తగురీతిని పూజించాడు. తరువాత పద్మావతీ శ్రీనివాసుల ప్రేమ వృత్తాంతము చెప్పి శేషాచలముపై నివసించే శ్రీనివాసునికి తన కుమార్తెను యిచ్చి పెండ్లి చేయవచ్చునా? అనీ శుకయోగిని అడిగాడు.
వెంటనే శుకయోగి, ‘‘ఆకాశరాజా! నీవు చాలా అదృష్టవంతుడవు. ఆ శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాడు. అతడు పదునాలుగు లోకాలూ పాలిస్తూన్న శ్రీమన్నారాయణమూర్తియే. పద్మావతిని శ్రీనివాసునకిచ్చి వివాహము చేయడమే లోక కళ్యాణానికి కారణమవుతుంది. నీ జన్మ చరితార్ధమవుతుంది’’. అని సుకముని అనగా, ఆ విధముగానే చేసెదనన్నాడు ఆకాశరాజు, శుకయోగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
ఆకాశరాజు బృహస్పతిని రప్పించుట,
శ్రీనివాసునకు శుభలేఖ పంపుట,
అనంతరము ఆకాశరాజు బృహస్పతిని ఆహ్వానించి, గౌరవించి, జరిగిన విషయాలన్నీ చెప్పాడు. ‘‘ఆర్యా! తాము మా గురువులు, మీరు మా పద్మావతికి పెండ్లి ముహూర్తమును నిశ్చయించగోరుచున్నాను. నిశ్చయించడమే కాదు. తామే శుభలేఖను కూడా వ్రాయవలసిదనది’’ అని వేసినాడు, బృహస్పతి ఆనందముతో అంగీకరించినాడు.
శ్రీనివాసుని జాతకము, పద్మావతి జాతకము తీసుకొని గణన చేసినాడు. లగ్నశుద్ది కూడా చేశాడు.
వైశాఖ శుద్ద దశమీ శుక్రవార శుభదినమునాడే ముహూర్తమును నిర్ణయించినాడు. ముహూర్తమును నిశ్చయించడం అయ్యాక యధావిధిగా లగ్నపత్రిక నిచ్చాడు.
ఆకాశరాజు శుఖలేఖను శుకయోగీంద్రులకు అందించి గురువర్యా! శ్రీనివాసునకు ఈ శుభలేఖ అందజేయుటకు తామే తగినవారు కనుక మీరు శ్రమ అనుకొనక శేషాచలమునకు వెళ్ళి ఈ శుభలేఖను శ్రీనివాసునకు యిచ్చి అంగీకార పత్రము కూడా తేవలసినది’’ అని ప్రార్ధించెను. ’’అంతకన్న కావలసినది నాకేమున్న’’దని శ్రీ శుకయోగి శేషాచలమునకు బయలుదేరాడు.
శ్రీ శుకయోగి శేషాచలం చేరి శ్రీనివాసుని దర్శించాడు. ఆ మహామునీంద్రుని చూడడముతోనే శ్రీనివాసుని సంతోషము అధికమయినది. భక్తిశ్రద్ధలతో ఆయనకు పాదపూజ చేశాడు.
పిమ్మట వకుళాదేవి నూతన అతిధివర్యునకై ఏరి కోరి తీయతీయనిపండ్లు కొనిరాగా మౌని భుజించెను. అనంతరము శ్రీనివాసుడు మునిశ్రేష్ఠునితో ‘‘మునీంద్రా తమ ఆగమనమునకు కారణమేదయినా వున్నదా? శలవీయు’’డనెను.
శుకయోగి సంతోషముతో శ్రీనివాసుని ‘‘కల్యాణమస్తు శుభమస్తు అని ఆశీర్వచనము చేసెను. తెచ్చిన లగ్నపత్రికను శ్రీనివాసుని చేతిలో పెట్టెను శ్రీనివాసుడు దానిని విప్పి చదివినాడు.
శ్రీనివాసుడు సగౌరవంగా వ్రాసిన ప్రత్యుత్తరాన్ని శ్రీశుకయోగి తీసుకొని వెడలి ఆకాశరాజునకు యిచ్చెను. ఆకాశరాజు శ్రీనివాసుని అంగీకార లేఖకు ఆనందించాడు.
పద్మావతిని యిచ్చి శ్రీనివాసునకు వివాహము జరుగనున్నదనే శుభవార్త సర్వలోకాలకీ ప్రాకినది. ఆ వార్త విని నారదుడు శేషాచలానికి బయలుదేరాడు. శ్రీనివాసుడు నారదుని యధోచితముగ గౌరవించాడు. పిదప తన వివాహ ప్రాస్తావన తీసుకొని వచ్చినాడు.
శ్రీనివాసుడు యిప్పుడు శ్రీ (శిరి) లేని నివాసుడయినాడు గదా! అందువలన నారదునితో ‘‘నారదమునీ! వివాహము జరగడమంటే యెంత తతంగము వుంటుంది? దానికి యెంతో డబ్బు కావాలి కదా! అందువలన తగినంత ధనము దొరికే విధానము ఆలోచించండి’’ అని అన్నాడు.
‘‘నారాయణా! ఆదిపురుషుడవైన నీవు చెప్పగా నేను కాదందునా? అట్లే చేసెదను’’ అన్నాడు నారదుడు.
నారదుడు లోక కళ్యాణము జరగాలని కోరుకొనే వాళ్ళలో ప్రధముడు కదా! అట్టివారు పద్మావతీ శ్రీనివాసుల కల్యాణము జరగాలని కోరుకోవడము సహజము.
నారదుడు బ్రహ్మరుద్రాదులను, అగ్ని, కుబేరుడు, ఇంద్రుడు మున్నవారలను, సూర్యుడూ మొదలైన నవగ్రహాలను శేషాద్రికి రప్పించాడు. వారుందరూ వచ్చాక ఒక సభ జరిగింది.
అప్పుడు నారదుడు ‘‘ధనపతీ! కుబేరా! నీవు స్పష్టిలో ఉన్నవారందరి లోనూ భాగ్యవంతుడవు. ధనరాసులు నీవద్ద తెగ మూలుగుతూ వుంటవి. ధనవంతులు బీదవారలను సమయము వచ్చినప్పుడు ఆదుకొనుచుండుట న్యాయము కదా! లక్ష్మి తన చెంతలేక శ్రీనివాసుడు బాధపడుతున్నాడే కాని లేకపోతే అతనికి అసలు బాధపడ వలసిన అవసరము లేకపోయేది. వివాహము అంటే మాటలా! బోలెడు ధనము వ్యయపరచ వలసి వుంటుంది. వైశాఖశుద్ధ దశమినాడు వివాహ ముహూర్తము కూడా పెట్టడము జరిగినది. కనుక శ్రీనివాసుని వివాహ సందర్భమున వ్యయమునకై కొంతధనమునుయిమ్ము. అతడు మరల వడ్డీతో దానిని తీర్చును’ అన్నాడు. కుబేరుడు ‘‘నారాదా! సర్వవిధ సంపదలకు ఆలవాలమైన వైకుంఠములో వుండే శ్రీమన్నారాయణునకు సహకరించడము కన్న ఎక్కువయిన దేముంటుంది? స్థితికారకుని పరిస్థితి నాకు తెలిసినది కనుక ఆయన కోరినంత ధనాన్ని యివ్వగలవాడను’’ అన్నాడు. శ్రీనివాసుడు కుబేరుని నుండి ఒక కోటీ పదునాలు లక్షల రామనిస్కములు తీసుకొన్నాడు. అంత ధనము ముట్టినట్లు ఒక ఋణ పత్రమును వ్రాసి కుబేరునకందజేశాడు. ఈశ్వరుడూ, అశ్వత్థమూ సాక్షి సంతకాలు చేశారు.
నివాసుడు విశ్వకర్మను రప్పించాడు. ఇతడు సుందరమైన మందిరాలూ ఆ మందిరములలో శిల్ప సౌందర్యము ఉట్టిపడే గదులూ, బ్రహ్మాండమైన విద్యుద్దీప గోళాలు, ఆశ్చర్యము కలిగించే జల యంత్రాలు - ఒకటేమిటి సర్వవిధ నిర్మాణాలూ జరిపించాడు.శ్రీమహావిష్ణువు భూలోకములో నివసిద్దామనే తలంపుతో రెండవ స్వర్గాన్ని నిర్మించాడా! అనుకొనే విదముగా వెలిగిపోతోంది శేషాచలం! కన్నుల వైకుంఠముగా తయారయినది శేషాచలము.
*నిత్య కళ్యాణ గోవిందా,*
*నీరజనాభా గోవిందా, హతీరామప్రియ గోవిందా, హరిసర్వోత్తమ గోవిందా*
*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. |* |23||
శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలలలో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.
*జై శ్రీమన్నారాయణ*
*ఓం నమో వెంకటేశాయ*