*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 24*

P Madhav Kumar


ముహూర్తము యింక యెంతో దూరములో లేదు. అందుచే శ్రీనివాసుడు వకుళతో మాతా! మరి నా పెండ్లి ముహూర్తము దగ్గరపడుతున్నది. బంధువులకు ముందు తెలియజేయడమనేది ఉంటుంది కదా! మరి మనము ఎవరికి తెలియజేయాలి?’


 అనగా వకుళ నవ్వి ‘‘నాయనా! నీకు బంధువులు కానివారెవ్వరు? పదునాల్గు లోకములలో ఉండే యావన్మందీ నీ బంధువులే కదా! అందుచేత సర్వలోకాల వారినీ రప్పించుము’ అన్నది. మాతృవాక్య పరిపాలకుడైన శ్రీనివాసుడు ‘సరే’ నని వారూ, వీరూ అనే తేడాపాడాలు లేకుండా సర్వలోకాల వారికీ శుభలేఖలు వ్రాశాడు. తనకు నమ్మినబంటూ, ఆత్మీయుడూ అయిన గరుత్మంతుని తలచుకున్నాడు. తక్షణమే వచ్చి వాలాడు తార్యుడు. 


ఏమి ఆజ్ఞ’ అన్నాడు గరుత్మంతుడు. ‘‘నీవు వెంటనే వెళ్ళి నా వివాహానికి సంబంధించిన యీ శుభలేఖలన్నీ యేలోకము వారిని వారికి అందజేయాలి’’ అన్ని చెప్పాడు. గరుత్మంతుడు ఆనందముతో ఎగిరిపోయాడు. ఎవరి శుభలేఖలు వారికి జాగ్రత్తగా అందించాడు.


శేషాచలానికి పెళ్ళివారి రాక ప్రారంభమయినది, బ్రహ్మ,సరస్వతి, పార్వతి, ఈశ్వరుడు, శచి, ఇంద్రుడు, తార, బృహస్పతి అందరూ విచ్చేశారు. యముడు, వాయువు, వరుణుడు, సూర్యుడు, చంద్రుడు, కుబేరుడూ వారి వారి భార్యా పరివారాల సహితముగా వచ్చారు. సంగీతశాస్త్ర ప్రవీణులయిన నారద తుంబురులు, మహామునులయిన వశిష్ఠుడు, అత్రీ, భరద్వాజుడు, జమదగ్ని, గౌతముడు, భృగువు, మొదలగు మహాజ్ఞాను లందరూ వారి వారి శిష్య సమూహములతో వచ్చారు. వందలూ, వేలూ కాదు లక్షలమంది బ్రాహ్మణోత్తములు ఆగమించారు శేషాచలానికి. 


అందాల రాసులు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలయిన దేవకాంతలూ వచ్చారు. గరుడ గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుషాదులయిన సర్వలోకవాసులున్నూ చక్కగా అలంకరించుకొని శేషాచలానికి వచ్చారు. వారివారి కేర్పరచిన విడుదుల్లో వచ్చిన వారున్నారు.


 శ్రీనివాసుని వివాహ విషయాలలో అందరూ తలకొక విధముగానూ సహకరించారు. 


అగ్నిదేవుడు వచ్చిన వారందరకూ దివ్యమైన భోజనాలు పెట్టాడు. కుబేరుడు బట్టలూ, నగలూ పెట్టాడు. వాయుదేవుడు సుగంధ ద్రవ్యాలూ పుష్పాలూ మున్నగునవి అందించాడు.


ఇంక అసలు మొత్తము మీద పెత్తనము చెలాయించే వారెవ్వరయ్యా అంటే ఆయన ఇంద్రుడాయె! 


పురోహితుడు యెవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి! ఈ విధముగా నిర్ణయించు కొన్నాక పెండ్లి సన్నాహాలు ప్రారంభించి, పనులు చురుకుగా కొనసాగిస్తున్నారు.


వకుళాదేవీ, పార్వతి, అరుంధతి, మున్నగు పుణ్యస్ర్తీలు శ్రీనివాసుని మంగళ స్నానానికి చెందిన ఏర్పాట్లు చేసారు. పరిమాళాలు వెదజల్లే పన్నీటి జలశాలలు సిద్దము చేయించారు. ఒక రత్నపీఠముపై శ్రీనివాసుని ఆసీనునిగ జేసి మంగళవాయిద్యాలు ధ్వనిస్తుండగా, ముత్తయిదువులు మంగళహారతులు పాడసాగారు. 


అలా పాడుతూనే సుగంధ భరతమయిన తైలము వ్రాసి పన్నీట జాలకమాడించారు. నుదుట కస్తూరికా తిలకము పెట్టారు. బుగ్గకు కాటుకల చుక్క పెట్టారు. పట్టు పీతాంబరాన్ని కట్టించారు. ప్రయాణ ముహూర్తము దగ్గరవుతున్నదనగా వారందరూ పంచభక్ష్య, పరమాన్నాలు సుష్ఠుగా భుజించారు. కర్పూర మిళిత పరిమళ తాంబూలాలు సేవించి వివాహానికై ప్రయాణ సన్నాహములో వున్నారు.


ఎవరి వాహనాలు వార సిద్ధము చేసుకోసాగారు. శ్రీనివాసుడు గరుడ వాహనాన్ని అధిష్ఠించాడు. బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని చెరొకవైపున నుండిరి. ఇంద్రుడూ మొదలైనవారు వారి వారి వాహనాలు అధిరోహించారు. ముత్తయిదువులూ మహర్షులు పల్లకీల నెక్కిరి. శ్రీనివాసుడున్నూ, వారందరున్నూ శేషాచలం నుండి క్రిందవైపునకు దిగుతూ నారాయణపురానికి ప్రయాణము చేయసాగారు.


మార్గమధ్యములోని పద్మతీర్థములోనే శుకముని యొక్క ఆశ్రమము ఉన్నది. శుకముని శ్రీనివాసుడూ పెండ్లివారూ తన ఆశ్రమ సమీపానికి వస్తున్నారన్న విషయం గమనించి యెదురేగి శ్రీనివాసుని కలుసుకొన్నాడు.


 ‘శ్రీనివాసా! నీవు ఆదిదేవుడవు ఇప్పుడు నీవు నాకు గల ఒక కోరిక తీర్చవలసియున్నది’’ అన్నాడు. తప్పక తీర్చగల వాడను చెప్పుము స్వామీ’’ అన్నాడు శ్రీనివాసుడు. ‘‘శ్రీనివాసా కొన్ని క్షణాల కాలమయినా నీవు మా ఆశ్రమములో ఉండి నేనిచ్చే విందును స్వీకరించమని కోరుచున్నాను’’ అన్నాడు శుకుడు. 


శ్రీనివాసుడు ‘‘మునీంద్రా! నా వెంట నా వివాహ సందర్శనముపై ఎందరో వచ్చుచున్నారు కదా! అందునా మూడు లోకాలకు చెందినవారున్నారు. వారందరకూ విందును నీవు భరించగలవా?’’ అన్నాడు. 


శుకముని నవ్వుతూ ‘‘శ్రీనివాసా! నీ కరుణా కటాక్షవీక్షణాలు కొన్ని క్షణాలు నాపైన నున్నచాలును. అందునా పదునాలుగు లోకాలూ నీ ఉదరమునందే ఇమిడించుకొని వుంటివి కదా! వారు వేరే ఎక్కడే లేరుకదా! అందరూ నీలోనే వున్నారుకదా! అందువలన నీవొక్కడవు సంతృప్తిగాంచితే వారంతా సంతృప్తి చెందినట్లే. నీ కొక్కనికీ చేస్తే వారందరికీ విందు చేసినట్లే’’ అనెను.


శ్రీమన్నారాయణుడు కూడా చిరునవ్వు నవ్వుచూ సరే! అన్నాడు. 


శకుడు తన పర్ణశాలలో ఒక ఉచితాసనముపై శ్రీనివాసుని ఆశీనుని చేసినాడు. తీయని రకరాల ఫలాలు ఆరగించి శ్రీనివాసుడు పర్ణశాల బయటికి వచ్చాడు. వచ్చి ‘బ్రేవు’ మని త్రేన్చాడు.ఆయన సంతృప్తి చెందడము వలన బయటనున్న పెండ్లి వారందరూ తాము విందారగించిన అనుభూతి కలిగి తామున్నూ సంతృప్తి చెందినారు. సర్వలోకాల పెద్దలూ శుకమునికి నమస్కరించి శలవు గైకొని బయలుదేరారు.


ఆకాశరాజు తన రాజధాని నారాయణ పురాన్ని సర్వవిధాలా అలంకరింప జేశాడు. చలువ పందిళ్ళతో ముచ్చటయిన తోరణాలతో, ముత్యాల ముగ్గులతో నగరముయావత్తూ శోభలు వెలార్చుతూ వున్నది.


 శ్రీనివాసుడు వస్తున్నాడనే వార్త ఆకాశరాజునకు తెలిసింది. కళకళలాడే పద్మావతిని పట్టపుటేనుగుపై అధిరోహింపజేశాడు. మంగళ వాద్యాలతో, పెద్దలతో ఎదురేగి ఆకాశరాజు శ్రీనివాసునకూ, మగపెండ్లివారికీ స్వాగతము యిచ్చి తీసుకొని వచ్చాడు. అందరికీ విడిది ఏర్పాటు చేసి రాత్రికి వారందరికీ పంచభక్ష్య పరమాన్నములతో భోజనాలు పెట్టాడు. దైవజ్ఞడయిన వశిష్ఠునితో సంప్రదించి కల్యాణమునకు కావలసిన సరంజామా ఒకచోట జేర్పించాడు.


*జనార్థన మూర్తి గోవిందా, జగత్ పతీ హరి గోవిందా,* *అభిషేక ప్రియ గోవిందా, ఆపన్నివారణ గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా,* *వేంకట రమణా గోవిందా. |* |24||

 

శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలలలో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వేంకటేశాయ*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat