*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 25*

P Madhav Kumar


 *శ్రీనివాసునకూ, పెండ్లివారికి ఆకాశరాజు స్వాగతమిచ్చుట:*


ఆకాశరాజు బంధువులతో సహితము, మంగళవాద్యాలతో సహితము శ్రీనివాసుడున్న విడిది గృహానికి వెడలినాడు. అప్పుడు వశిష్ఠుడు ఆకాశరాజుతో ‘‘రాజా! ఇంక ముహూర్తము సమీపించనున్నదికదా! కనుక మున్ముందుగా మీరిప్పుడు వరుని పూజచేయవలసి ఉన్నదనెను. అట్లే అని ఆకాశరాజూ ధరణీదేవి శ్రీనివాసునకు గంధము, తాంబూలము మొదలైనని యిచ్చీ బట్టలూ, నగలూ యిచ్చి పూలతో ప్రేమతో పూజచేశారు. 


పూజానంతరము శ్రీనివాసుని పట్టపుటేనుగుపై ఆసీనుని చేశారు. బ్రహ్మ, సరస్వతీ, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచి, తక్కిన వారినీ మునులను సర్వవిధ మంగళవాద్యాల మధ్య విడుదలు నుండి తోడుకొని వచ్చి రాజమందిరములో ప్రవేశింపజేశారు. రాజమందిర ద్వారము దగ్గర మత్తయిదువులు శ్రీనివాసునకు హారతి యిచ్చారు. అనంతరము అలంకరింపబడిన కల్యాణమండపములోకి శ్రీనివాసుని రావించి, బంగారముతో చేయబడిన ఒక పీఠముపై కూర్చుండజేశారు. ఎప్పుడు ఏది చేయవలసి ఉన్నదో చెబుతున్నారు.


ఆయన చెప్పగా ఆకాశరాజు స్వామి పుష్కరిణీ తీర్థము నుండి పవిత్రజలాన్ని తెప్పించాడు. భార్య ధరణీదేవి బంగారు కలశముతో ఆ జలమును పోస్తుండగా ఆయన శ్రీనివాసుని పవిత్ర పాదకమలాలను కడిగినాడు. కడిగి ఆ జలబిందువులను తన శిరస్సుపై జల్లుకొని ధరణీదేవి శిరముపైన జల్లినాడు. 


ఆ వివాహ మంత్రాలను చదవడము పని వశిష్ఠునిదీ బృహస్పతిదీను, వారిరువు రునూ సమయోచిత శుభమంత్రాలు పఠిస్తుండగా ఆకాశరాజు పద్మావతి యొక్క హస్తాన్ని పట్టుకొని ధరణీదేవి స్వర్ణ పాత్రతో స్వచ్చ జలము పోస్తుండగా శ్రీనివాసుని చేతిలో ధారవోసినాడు. 


వశిష్ఠుడు ఆ దంపతులకు కంకణాలు కట్టాడు. ఏ శుభముహూర్తమునకు వివాహము జరగవలసి యున్నదో ఆ సుముహూర్తము రానే వచ్చినది. వాద్యాలు వాయించే వారు మరింతగా వాయించసాగారు. మత్తయిదువులు మంగళ సూత్రమును గట్టిగ అలంకరించాడు. దేవతులు ఆనందముతో ఆ సమయములో పుష్పవర్షము కురిపించారు. తరువాత విలువయిన మంచిముత్యాలతో తలంబ్రాలు పోసుకొన్నారు దంపతులు. ఈ విధముగా పద్మావతీ, శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవము జరిగినది.


ఆకాశరాజు యొక్క సంకల్పమునకు వున్న బలము కారణముగా కళ్యాణము సవ్యముగా జరిగినది. కళ్యాణ సందర్భములోనే ఆకాశరాజు అల్లుడైనటువంటి శ్రీనివాసునకు కట్నాలు, కానుకలు బాగానే యిచ్చారు. వందబారువుల స్వర్ణకిరీటము, మణులు పొదగబడిన కంఠహారాలు, ఒక కోటి బంగారు నిష్కములు, మకరకుండలాలు, మాణిక్యాల పతకాలు, సింహలలాట సహితాలైన కంకణాలు, బంగారములో చేయబడిన మొలత్రాడు, రవ్వల ఉంగరాలు, అపరంజి పాదుకలు, రత్నాలు తాపబడిన కంబళములు, భోజనావసరమునకు స్వర్ణపాత్రలు, సహస్రగజాలు, దశ సహస్రగజాలు, దశ సహస్ర అశ్వాలు దాసదాసీ జనాలు మున్నగు అనేక విధాలయిన ఆభరణాలు బహూకరించాడు.


 పద్మావతీదేవి వివాహానికై వచ్చినవారందరినీ ఉచిత మర్యాదలచే గౌరవించడము జరిగినది. లక్షలాది బ్రాహ్మణులకు సంతుష్టిగా సంభావన లిచ్చి పంచభక్ష్య పరమాన్నములతో భోజనములు పెట్టి వారిని ఆనందింపజేశారు. అయిదు రోజుల వివాహమున్నూ అతి వైభవముగా జరిగినది. 


ధరణీదేవి, ఆకాశరాజా క్షీరధారలతో పద్మావతిని శ్రీనివాసుని హస్తములో పెట్టి అప్పగిస్తూ ఆకాశరాజు యీ విధముగా అన్నాడు. 


‘‘శ్రీనివాసా! నీవు సాక్షాత్తు భగవంతుడయిన శ్రీమన్నారాయణుడవే! అని నేను బాగా అర్ధము చేసుకొన్నాను. నీ పవిత్ర పాద కమలాలు జలముతో కడిగి పిల్లనివ్వడము వలన మా వంశానికి వంశమే తరించిందని నేను భావిస్తున్నాను. నీకు సర్వులూ బంధువులే! పిల్ల నిచ్చినవాడి నగుటచే నీకు ఒక చిన్న మనవి చేసుకొనదలంచుకున్నాను. పద్మావతి అతి సుకుమారి, జాగ్రత్తగా యేలుకొనుము. ఈమెను పువ్వులలో పెట్టుకొని జాగ్రత్తగ చూచుకొనుమని తండ్రిగా కోరుచున్నాను’’ అనెను.


ఆకాశరాజు కుమారైవైపు తిరిగి ‘‘అమ్మాయి! పద్మావతీ! చాలా అదృష్టవంతురాలవు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తియే నీకు భర్తగా లభించినాడు. అతనిని నీవు బహుభక్తితో చూచుకొనుచుండుము. స్ర్తీకి భర్తయే దైవము. పతి సన్నిధానమే నీకు పెన్నిధి, నీ మగని బాగా నీ బాగుగా భావించి నడచుకొనుము. పాలూ, నీరూ మాదిరిగా ఆలూ మగలూ వుండాలి, పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తి తీసుకురావలెను. సీత, రుక్మిణి, అనసూయ, సుమతివంటి వారిని ఆదర్శముగా తీసుకొనుము. 


కన్నవారమయిన మమ్ము ఎన్నటికీ మరువకుము’’ అని సూక్తులు చెప్పినాడు. పద్మావతి తనను అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వీడి, భర్తగారింటికి వెళ్ళేముందర మనస్సులో బాధపడినది.


చీరా సారె, నట్రా పెట్టి పద్మావతీదేనిని అత్తవారింటికి వెడలుటకై ప్రయాణము చేశారు. అత్తయ్యకు, మామయ్యకు శలవు చెప్పి శ్రీనివాసుడు పద్మావతీ సమేతుడై గరుడవాహనాన్ని అధిరోహించినవారై పయనమయ్యారు.


మార్గమధ్యములో ఆగస్త్యుని ఆశ్రమము తగిలినది. ఆగస్త్యుడు శ్రీనివాసుని తోడుకొని ఆశ్రమమునకు తీసుకొని వెడలి ఉచిత రీతిని భక్తిశ్రద్దలతో పూజించినాడు. అప్పుడు శ్రీనివాసుడు, దేవతలూ మొదలైన తనతో వచ్చినవారితో ‘‘స్నేహితులారా! మీకొక విషయము చెప్పాలని అనుకొంటున్నాను.అదేమిటంటే, వివాహమయిన భార్యాభర్తలు వివాహానంతరము ఆరు మాసాలవరకూ పర్వతాలు ఎక్కకూడదనే ఒక ధర్మము  వున్నది కదా! అందువలన నేనున్నూ, పద్మావతియూ యీ ఆసస్త్యుని ఆశ్రమములో ఆరునెలలపాటు వుంటాము. తరువాత శేషాచలానికి చేరుకొంటాము అన్నాడు. వారందరూ సరే అన్నారు.


 బ్రహ్మ, ఈశ్వరుడు, అందరున్నూ శ్రీనివాసుని వద్ద శలవు గైకొని వారివారి నెలవులకు వెడలిపోయాడు.


పద్మావతీ, శ్రీనివాసులు హాయిగా ఆగస్త్యుని ఆశ్రమములో నివసించసాగారు.


*రత్న కిరీట గోవిందా, రామానుజనుత గోవిందా,* *స్వయం ప్రకాశ గోవిందా, సర్వ కారణ గోవిందా; |* 


*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. |* |25||


శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలలలో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వేంకటేశాయ*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat