శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః
6. తిరుత్తణి
ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది.
ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు.
తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేరుగాంచిన ఈ క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం.
తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నాడు.
శ్రీవారు వెలసి ఉన్న కొండకు ఇరుప్రక్కలందూ పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడంవల్ల దీనిని ‘బియ్యపుకొండ’ అని పిలుస్తారు.
దక్షిణం వైపునగల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని ‘గానుగ పిండి కొండ’ అని పిలవడం జరుగుతోంది.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసి చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది.
మురుగ పెరుమాళ్ళుగా భక్తుల పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామి, వల్లీదేవిని వివాహమాడిన స్థలం, ఆరుపడైవీడు క్షేత్రాలలో స్వామి యుద్ధానంతరం శాంతిని పొందిన స్థలం, తణిగై (శాంతి) పురిగా పిలువబడే తిరుత్తణి.
ఆరుపడైవీడు క్షేత్రాలలో ఈ క్షేత్రం చివరిది. ఇక్కడ కుమారస్వామి జ్ఞానశక్తి అనే ఈటెను ధరించి, వల్లీ, దేవసేన అమ్మవార్లతో కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు.
ఈ స్వామిని నిర్మలమైన మనస్సుతో, ధర్మబద్ధమైన కోరికలు కోరిన భక్తులకు దర్శించినంత మాత్రం చేతనే వారి కోరికలు క్షణాల్లోనే తీర్చి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు
కనుక ఈ స్వామిని తణికేశన్ స్వామి అంటారు. అంటే క్షణమాత్రంలోనే శాంతిని ప్రసాదించే స్వామి అని అర్థం.
ఈ క్షేత్రాన్ని క్షణికాచలం లేదా తిరుత్తణి అంటారు.
ఇక్కడ స్వామిని వీరమూర్తి, జ్ఞానమూర్తి, ఆచార్యమూర్తి గా కొలుస్తారు. ఈ క్షేత్రానికి పూర్ణగిరి,మూలాద్రి, నీలోత్పల, క్షణికాచలం అనే పేర్లు కూడా ఉన్నాయి.
స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి ‘తణిగై’ లేదా ‘శాంతిపురి’ అనే పేరొచ్చింది.
అలాగే ‘తణిగ’ అనే పదానికి మన్నించుట, లేదా ఓదార్చుట అని అర్థం చెబుతారు.
స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తనికాచలం, తిరుత్తణి అంటారు.
స్వామి చాలా శక్తి కలవాడని, ఒకసారి స్వామిని దర్శించిన భక్తులకు ఇంక ఎలాంటి కష్టాలు వుండవని భక్తుల నమ్మకం.
తారకాసురుడితో యుధ్ధం సమయంలో తారకాసురుడు సుదర్శన చక్రాన్ని సుబ్రహ్మణ్యస్వామి మీదకి విసురుతాడు.
ఆ చక్రం స్వామి ఛాతీ భాగానికి తగిలి కొద్దిగా నొక్కుకు పోయినట్లు అవుతుంది.
తారకాసురుడి దగ్గరనుంచి గెలుచుకున్న శంఖ చక్రాలను శ్రీ మహావిష్ణువుకి ఇస్తాడు స్కందుడు.
చందన విశిష్టత …
ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైనది.
ఇంద్రుడు తన కూతురు వివాహ సమయంలో ఒక గంధం తీసే రాయినికూడా ఇస్తాడు. దీనిమీద తీసిన గంధాన్ని స్వామికి పూస్తారు.
ఈ గంధం చాలా ఔషధ గుణాలు కలిగి వుంటుందంటారు.
ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో వేసి సేవిస్తే అన్ని జబ్బులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అయితే పర్వదినాల్లో మాత్రమే ఈ చందనాన్ని పంపిణీ చేస్తారు.
త్రేతా యుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధిస్తాడు.
అక్కడ, ఈశ్వరుడి ఆనతి మేరకు, శ్రీ రాముడు ఈ తిరుత్తణి క్షేత్రము దర్శించాడు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది.
ద్వాపర యుగములో, మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ, ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచాడు.
శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు, చక్రములను తిరిగి పొందినాడు. (అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహా విష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు).
చతుర్ముఖ బ్రహ్మ ప్రణవ అర్ధమును చెప్పలేక పోవడం వలన, మన ముద్దులొలికే సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి, ఆయన సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు. ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మ తీర్థములో కార్తికేయుని పూజించి, ఆయన తిరిగి శక్తి సామర్ధ్యములను పొందాడు.
దేవేంద్రుడు ఈ క్షేత్రములోనే, ఇంద్ర తీర్థములో, “ కరున్ కువలై ” అనే అరుదైన పూల మొక్కను నాటి, ప్రతి రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడు. ఆ తర్వాతనే, ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న “ సంఘనీతి, పద్మనీతి, చింతామణి ” మొదలైన దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడు
నాగరాజు వాసుకి సముద్ర మధనంలో తనకైన గాయాలనుంచీ ఈ స్వామిని సేవించటంవల్ల ఉపశమనం పొంది ఆరోగ్యవంతుడయ్యాడు.
అగస్త్యుడు ఈ స్వామిని ప్రార్ధించి తమిళ భాషా పాండిత్యం వరంగా పొందాడు.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్టచేసి సేవించాడట.
కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి ‘జ్ఞానశక్తి’ అనే ‘ఈటె’ను అనుగ్రహించాడట. ఆ కారణాన ఈ స్వామికి "జ్ఞానశక్తి ధరుడు" అనే పేరొచ్చింది.
ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. కుమారస్వామి, శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు.
సూరపద్ముడి సంహారం అనంతరం స్వామి తిరుత్తణిలోని కొండపై విశ్రాంతి తీసుకుని, శ్రీవల్లిని ఇక్కడే వివాహం చేసుకున్నారు.
అందుకే అన్ని మురుగన్ ఆలయాల్లో జరిపే స్కంద షష్టిని ఇక్కడ నిర్వహించరు.
దీనికి బదులుగా యుద్ధ ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున వేయి కిలోల పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తారు.
ఇక్కడ స్వామివారి వాహనంగా మయూరం స్థానంలో ఏనుగు ఉంటుంది.
దీనికి సంబంధించి ఒక పురాణగాథ ప్రచారంలో వుంది.
సుబ్రహ్మణ్యస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవయానిని ఇచ్చి వివాహం జరిపించి ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడు. అందుకే ఐరావతం విగ్రహ రూపంలో ఇక్కడ ఉంటుంది.
ఐరావతం ఇంద్రలోకం నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచీ, ఇంద్రుని సంపదలు తరిగిపోసాగాయి. అది గమనించిన కుమారస్వామి ఇంద్రునికి ఐరావతాన్ని తిరిగి ఇచ్చెయ్యబోతాడు.
కానీ ఇంద్రుడు అల్లుడుకిచ్చిన కానుకను తిరిగి తీసుకోవటానికి అంగీకరించక ఐరావతాన్ని ఇంద్రలోకం వైపు తిరిగి వుండేటట్లు వుంచమని మాత్రం కోరతాడు. దానితో ఇంద్రలోకం తిరిగి కళకళలాడుతుంది. దీనికి ప్రతీకగా ఇక్కడవున్న ఏనుగు తూర్పు దిక్కుకి తిరిగి వుంటుంది.
ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసి ఉంటాడు. ఇవి నాలుగు వేదాల పరిరక్షణకే అని తెలుస్తోంది. భైరవుడి పీఠం ముందు మూడు శునకాలు, వెనుక భాగంలో మరో శునకం ఉంటాయి. ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది నమ్మకం.
స్వామి మహిమలు …
అరుణగిరినాథర్ అనే మహాభక్తుడు ఇక్కడే స్వామివారిని కొలుస్తూ పరమపదించాడు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఒకసారి ఇక్కడకు వచ్చారు. మెట్లు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని దీక్షతులకు ఇచ్చారు.
ఆ ప్రసాదాన్ని నోటిలో వేసుకొనగానే ముత్తుస్వామి నోరు పవిత్రమైంది. ఆశుధారగా గానం చేశారు. అమృతప్రాయమైన ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామికి ఇవ్వడం భగవద్ లీలావినోదం.
ఆలయ విశేషాలు …
ఈ ఆలయం 1600 సంవత్సరాలకన్నా పురాతనమైనదంటారు. క్రీ.శ. 875-893లో అపరాజిత వర్మ అనే రాజు శాసనంలోను, క్రీ.శ. 907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడింది.
ఇక్కడ వున్న ఉత్సవ విగ్రహాలపైన వుండే విమానము (స్వామి గర్భగుడి పక్కనే పెద్ద పూజా మందిరంలా వుంటుంది) రుద్రాక్షలతో చేసింది. స్వామి ధరించిన ఆకుపచ్చరంగు షట్కోణ పతకం దేదీప్యమాన కాంతులలో స్వామి మెరిసిపోతుంటాడు.
ఇక్కడ స్వామిని బంగారు బిల్వ పత్రాలమాలతో అలంకరిస్తారు.
ఈ విధంగా ఎంతో మహిమాన్వితమైన, మానవుని ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడే ఈ ఆరుపడైవీడు సుబ్రహ్మణ్య ఆలయాల దర్శనం, స్వామి దయ వలన మనందరికీ కలుగాలని ఆశిస్తున్నాము.
🔱 ఓం శరవణ భవ 🔱
శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏
🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸
🙏 ఓం శరవణ భవ🙏