*ఐయ్యప్పన్*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
నడయాడేదైవం కంచి పరమాచార్యులు , శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా సన్నిధానం వారి వచనము.
పరబ్రహ్మం ఒక్కటే అదియే శివునిగానూ విష్ణువుగానూ రూపముదాల్చుచున్నది. శివునిగా యుండు జ్ఞానమూర్తి యగు చున్నది. నారాయణునిగా యుండు నపుడు లోక సంరక్షణము చేయుచున్నది. ఇలా చెప్పుటవలన శివకేశవులు వేరు వేరనియో , లేక వృత్తిని బట్టికాస్త వ్యత్యాసముగా గోచరించుట వలన శివునికి పరిపాలనా శక్తిలేదనియో , విష్ణుమూర్తికి జ్ఞాన శక్తిలేదనియో అర్థంకాదు. వారిరువురూ ముఖ్యంగా చేసెడి అనుగ్రహమునే అలా సూచించారు.
వటవృక్షము క్రింద లేక మంచుకొండలమీదనో శివుడు కూర్చుంటాడు. ఒడలెల్లా భస్మంపూసుకొని , పులిచర్మమును నడుముకు కట్టుకొని , గజచర్మమును పైకి కప్పుకొని యుంటారు. వారి స్వరూపం, అలంకారం , నివాసస్థానం దేన్ని తిలకించినా అది జ్ఞానులు లక్షణంగా యున్నది. వారు తన కరమునందే జ్ఞానముద్ర దాల్చియున్నారు. ఆత్మధ్యానమున అమరియుండువారి సన్నిది యెల్లప్పుడు శాంతం నిండినదై యుండును. పరమ సత్యమును ప్రభోధించు పరమగురువువారే ఆ పరమసత్యము గూడ వారుగాక మరొకటికాదు. ఈ ఉపదేశము చేయుట యన్నది జ్ఞానుల పనియగును.
లోపాలనం అనునది రాజుల కర్తవ్యము. కావుననే శ్రీహరిని వైకుంఠమున కొలువుండువారిని చక్రవర్తిగా ఎంచిధ్యానిస్తున్నాము. పీతాంబరము , కౌస్తుభము , వనమాల , నవరత్న ఖచిత కిరీట , కుండలములు ధరించి , సాక్షాత్ మహాలక్ష్మిని వక్షస్థలమున పెట్టుకొని రాజాధిరాజై కొలువుంటాడు శ్రీమహావిష్ణువు.
ఆచార శీలురైన ఋషీశ్వరులవలె ఈశ్వరునకు ఎపుడు చూసినా స్నానమాడుటలో ప్రీతిఎక్కువ. కావుననే ఉత్తరదేశానగల శివాలయాలలో ఎల్లవేళలా శివుని శిరముపై గంగ (జలము) పడుచుండునట్లు *"ధారాపాత్రను"* కట్టి యుంచుతారు. చక్రవర్తియైన మహావిష్ణువుకేమో అలంకారమునందు ప్రియమెక్కువ. వారిని పట్టు పీతాంబరాలతోను , కనక వైడూర్యాదులతోనూ అలంకరించి ఆనందిస్తాము. *“అలంకారప్రియో విష్ణుః అభిషేక ప్రియోశివః"* అనియే అందురు.
ఈశ్వరుని అందము మనస్సును అదుపులోయుంచగల శాంతస్వభావం నిండినదగును. శ్రీ మన్నారాయణుని సౌందర్య మేమో మనస్సును మోహపరవశమున ముంచెత్తి ఆనందనృత్యము చేయించగల దగును. విష్ణురూపము చూడ చూడముచ్చట గొలిపి రెప్పలాడక అలా చూస్తూనిలబడి మైమరచిపోయేట్లు చేయగల దగును. శ్రీరాముడుగాను , శ్రీకృష్ణుడుగాను అవతరించినపుడు గూడ ఈ జగన్మోహన సౌందర్యం వారినుండి వేరుబడకనే యుండినది.
అట్టివారు *“మోహిని"* యనుయొక స్త్రీ రూపం గైకొనినపుడు ఎంతటి అందచందాలతో యుండియుంటారని ఊహించు కోగలరు. సర్వులను మోహపరవశములో ముంచెత్తి వేయగల సౌందర్య లావణ్యములతో సర్వాలంకార శోభితురాలై అవతరించిన ఆజగన్మోహిని రూపం పరమజ్ఞానియై , తపోనిధియై విరాజిల్లు చుండిన పరమేశ్వరుని మనస్సును సైతం ఆకర్షించి మోహా వేశములో పడదోసినదియని పురాణములు చెప్పు చున్నది.
మోహినిగా రూపొందిన నారాయణుని కారుణ్య లావణ్యమును , పరమేశ్వరుని శాంతజ్ఞానమును ఒకటై కలిసినవేళ యొక మహాతేజస్సు యొక పరంజ్యోతి ఆవిర్భవించెను. ఆ మహా తేజస్సే సాటిలేని ఐయ్యప్పగా రూపం దాల్చినది. పిదప అందరు ఆమహాశక్తిని హరిహర పుత్రుడనియు జగన్మోహన సుందర శాస్త్రాయనియు , 'ఐయ్యనార్' అనియు , భూతనాథుడు అనియు పిలిచునది ఈ అయ్యప్పనే యగును. శైవులు కైలాసనాథుని శివయ్య - శాంబయ్య -రుద్రయ్య అని అయ్యశబ్దముతో పిలిచెదరు. వైష్ణవులు వైకుంఠ పతి వెంకటప్ప నారాయణప్ప - గురువాయూరప్పాయని అప్పశబ్దముతో పిలిచెదరు. ఆరెండు శబ్దములు (అయ్య+అప్పు) కలిసి అయ్యప్ప యను సార్థక నామమైనది. వీరికి అనేకనామము లున్నప్పటికి అయ్యప్ప నామమే లోకప్రసిద్ధి చెందిన నామమై తీరియున్నది.
ఐయ్యన్ అనునది 'ఆర్య' అను పదము నుండి ఏర్పడినది. లేక శబ్దబేధం చెందిన దగును. ఆర్య అనగా గౌరవ నీయుడు , శ్రేష్ఠుడు అని అర్థం. సాక్షాత్ పరమేశ్వరునికినూ నారాయణమూర్తికినూ జన్మించిన శిశువుకన్నా శ్రేష్ఠుడు ఇంకెవరుగలరు ? జ్ఞానము , తపము నిండిన శివుని యొక్క బ్రహ్మ అంశము , కృప , సౌందర్యము నిండిన విష్ణువు యొక్క క్షాత్ర అంశము ఈ రెండునూ మనము ఉద్ధరింపబడుటకు (ముక్తినొందుటకు మిక్కిలి అవశ్యకమగును. హరిహరపుత్రుడైన అయ్యప్ప వద్ద ఈ రెండుశక్తులు యెకటై కలిసియున్నందున వీరిని ఆరాధించువారికి జ్ఞాన మోక్షాదులతో బాటు వైరాగ్యము సిద్ధించును. అందుకే కాబోలు పరమేశ్వరుని తక్కిన రెండు పుత్రులను *'పిళ్ళయార్' 'కుమారస్వామి'* యని పసిబాలురును సంబోధించే పేర్లతో పిలిచెదరు. కాని వారిమూడవ పుత్రుడైన శాస్తావారిని మాత్రం శ్రేష్ఠులుగా - ఆర్యప్పగా - ఐయ్యనార్ (పెద్ద వారిగా సంబోధించి పిలిచి ఆరాధిస్తున్నాము.
శబరిమల సమీపానగల యొక ప్రదేశమును *'అర్యనా కావు'* అని ఆర్యుని వనంగానే చెప్పుకొందురు. లోకములో ఎన్నో దైవములు యుండినను శాస్తా వారికి తప్ప మరొక్కరిని ఆర్య శబ్దముతోగల నామములు లేదు. తమిళనాట వీర్ని గ్రామరక్షక దేవునిగా ఐయ్యనార్ అనుపేర ఊరిపొలిమేరులో యుంచి ఆరాధించెదరు. తమిళ నాడులో ఐయ్యనార్ స్వామి ఆలయంలేని గ్రామములేదనియే చెప్పు కొనవచ్చును. కేరళలో గ్రామదేవతగా కాక వేరే విధంగా అయ్యప్ప ఆరాధన ఇంటింట సలుపబడుచున్నది. మరి మన ఆంధ్ర దేశమున వీరిని ఇష్టదైవమై *“పేదలదేవుడు అయ్యప్ప"* *"అందరిదేవుడు అయ్యప్ప"* యని అందరిచే పిలువబడి ఆరాధింప బడుచున్నాడు. వీరుమనలను కాపలా కాచేదైవము. భూత , ప్రేత , పిశాచాదులు , చేతబడి వంటి క్షుద్రశక్తుల బారినుండి అందరిని కాపాడే వారు వీరే. ఇంతకన్నా మిన్నగా శ్రీమన్నారాయణుని వద్ద నుండి పొందిన దివ్యశక్తితో మనజీవితమునే పరిపాలించ గలవారు వీరేయగుదురు. మనకు విమోచనము (ముక్తి) కలిగించే జ్ఞానమును ప్రసాదించగల శక్తిని పొందినవారుగూడ వీరేయగుదురు.
నిరీశ్వరవాదం ప్రబలి దైవ ఆరాధనలు క్షీణించుచుండు నేటికాల పరిధిలో సత్యధర్మాదులను ప్రభోధించి , ప్రజలను సన్మార్గమున నడిపించే వ్రతనియమాదులతో గూడిన అయ్యప్ప దీక్ష జాతి , మత , కుల , వర్ణవివక్షతలకతీతమై దినదినాభివృద్ధి చెందు చున్నది. కేరళ దేశమున అల్లంత దూరాన శబరిమలపై యుండే అయ్యప్ప ఆరాధన నేడు అల్లనల్లనపాకి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర యని దేశ మంతట తన సామ్రాజ్యమును విస్తరిస్తు పోతున్నాడు స్వామి అయ్యప్ప. ఇది సంతసించవలసిన అంశమే. నిరీశ్వర వాదులు సైతం కోరుకునే శరీర ఆరోగ్యం ఈ దీక్షలోయున్నది గనుక రానున్న రోజులలో ప్రపంచములోని వారందరూ ఈ వ్రతమును అనుష్ఠించి శబరికొండకు వచ్చినా ఆశ్చర్యపడనవసరంలేదు. అంతటి మహి మాన్వితమైన అయ్యప్ప దీక్షను గైకొని ఆతనికరుణను కోరి అందులకు పాత్రులై జీవించ గలిగినచో మనము , మన దేశము ఈలోకమంతయు శ్రేష్ఠమైనదిగా వెలిగిపోవుట తథ్యము. నారాయణ స్మృతి.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*