శ్రీ రాఘవేంద్ర కల్ప వృక్షము 8 వ భాగము

P Madhav Kumar


సన్న్యాసాశ్రమ స్వీకారము:

 

ఈ విషయ మంతయు తంజావూరు రాజాస్థానము నకు తెలిసెను.  శ్రీసుధీంద్ర తీర్థులు  తన పీఠమును మహాభాష్యా చార్యులు పరిమళాచార్యులు నైన శ్రీ వెంకన్నా చార్యులకు నొసంగుచున్నారని తెలిసికొని తంజావూరు ప్రభువు అత్యంత  ఆనంద భరితుడై తన రాణులతో సకల పరివారముతో ఆ మహోత్సవమును గాంచుటకేతెంచెను. శ్రీ సుధీంద్రతీర్థులధిష్ఠించిన పీఠమునే సర్వజ్ఞ పీఠమం      దురు. దుర్మతినామ సంవత్సర ఫాల్గుణ శుద్ధవిదియ (1621 AD) శుభ ముహూర్తముగా నిర్ణయింపబడినది. అపుడు శ్రీ వెంకన్నా చార్యుడు ఇరువదిమూడు వత్సరముల వాడు. 


ఆ మహోత్సవమునకు సుదూర ప్రాంతముల నుండి అనేకభక్తులు, రాజ్యాధినేతలు అసంఖ్యాకముగ నరుదెంచిరి. ఆశ్రమ మంతయు అలంకరింప బడెను, అత్యున్నతముగ సభావేదికను ఆయత్త పరచిరి. ఆదినమున శ్రీ వెంకన్నా చార్యులు గురుదేవుని అనుజ్ఞగైకొని ఆత్మశ్రాద్ధమును  ఒన రించెను. సన్న్యాసాశ్రమ స్వీకారమునకు చేయవల సిన విధుల నొనరించి కాషాయాంబరధారియై సభా మధ్యమున ఉన్నతాసనాసీనుడై యున్న తన గురు దేవుని చరణములపై వ్రాలెను. ఆ సభలో రాజులు, జ్ఞానులు, ఋషులు, యోగులు, భక్తులు, ప్రజలు, ఆసీనులై మహోత్సవమును తిలకింప నారంభించిరి.


తన చరణముల నాశ్రయించిన శ్రీ వెంకన్నా చార్యుని లేవ నెత్తి ఆలింగన మొనరించుకొని    అర్దాసన మొసంగి శ్రీసుధీంద్ర తీర్థులు మూలరామవిగ్రహమును, సాలగ్రామాదులను తన శిష్యుని శిరముపై నుంచి కనకాభిషేకము జలాభిషేక ము మొదలగు శుభ కార్యములు సంపన్నమొన రించెను. మంగళ వాద్యములు మార్మోగు చుండగ ఆ మహాజన సభామధ్యమున తన శిష్యుని శిరముపై దక్షిణహస్తము నుంచి సర్వజ్ఞ పీఠాధిపత్యము నొసగి శ్రీ రాఘవేంద్రతీర్ధ  స్వామి అని దీక్షా నామమునొసగి  ఆశీర్వ దించిరి.  


అప్పటినుండి శ్రీరాఘ వేంద్రతీర్థ స్వామి శ్రీ మూలరాముల ఉపాసనలో నుండగా ఆయన సమక్షమున విషణ్ణ వదనముతో ఒకభూతము గోచరించెను. తన వియోగమును భరింపలేక తన భార్య అపరిమిత దుఃఖముతో ఆత్మార్పణ మొనరించి భూత మైనదని గ్రహించి శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి ఆమెకు ముక్తిని ప్రసాదింప వలసినదిగ శ్రీహరిని, శ్రీరాముని, శ్రీవాయుదేవుని స్మరించెను. శ్రీహరి పూజాక్షతలును దీసికొని ఆ యాకారముపై జల్లగ అది భూతయోనిని వీడి దివ్య రూపమును దాల్చి శ్రీహరినామ సంకీర్తన మొనరించుచు దివ్య పరంధామమునకు వెడలి పోయెను.


ఆ తరువాత కాలములో శ్రీ సుధీంద్రతీర్థులు దివ్య పరంధామమునకు జనిరి. తీర్థయాత్రలు సల్పుచున్న శ్రీయాదవేంద్ర తీర్థులవారికి శ్రీ వెంకన్నా చార్యులు సర్వజ్ఞ పీఠము నధిష్టించి శ్రీ రాఘవేంద్ర తీర్థుల య్యెనను వార్త దెలిసి పరమానంద భరితు డయ్యెను.  తనగురు దేవులు పరంధామ మునకఱగిరని దెలిసికొని చింత నొంది, ఆ క్షణముననె తీర్థయాత్రలు ముగించుకొని ఆశ్రమము నకు ప్రయాణ మయ్యెను. శ్రీయాదవేంద్ర తీర్థులు  కుంభకోణమును జేరినా రని దెలిసికొని శ్రీరాఘవేంద్ర తీర్థులు పాదచారులై ఆశ్రమవాసులతో గూడి కుంభకోణమున కఱగి శ్రీయాదవేంద్ర తీర్థులకు స్వాగతముబల్కి సాష్టాంగ దండ ప్రణామముల నర్పించెను. తనపాదముల నంటిన భాగవతోత్తముని లేవ నెత్తి ఆలింగన మొనరించుకొని శ్రీయాద వేంద్రతీర్థులు పరమానంద భరితులైరి. శ్రీయాదవేంద్ర తీర్థుల వారిని అఖండ స్వాగతసత్కారములతో తోడ్కొని శ్రీరాఘవేంద్ర స్వామి ఆశ్రమమును జేరిరి.


ఆశ్రమములో శ్రీ యాదవేంద్ర తీర్ధునకు ఉన్నతాసన మొసంగి శ్రీరాఘవేంద్రతీర్థు లిట్లు బల్కిరి. “మహాభాగా నీవు నాకు ఆశ్రమజ్యేష్ఠుడవు. మన గురుదేవులు ప్రప్రథమమున మీకే సన్న్యాసాశ్రమమును ప్రసాదించిరి. మీరు తీర్థయాత్రలకు వెడలిన తరువాత గురుదేవులు వార్ధక్య కారణమున  అప్పుడు శ్రీ మూలరామా రాధన మొనరింపలేక పోయిరి. శ్రీ శ్రీ మూలరామారాధనము అవిచ్ఛిన్నముగ కొనసాగ వలెనని వారు సంకల్పించి నాకా బాధ్యత నప్పగించిరి. యతీంద్రా! నాకు పీఠాధిపతి పదవియందెట్టి  ఆకాంక్ష యును లేదు. ఈపీఠము శ్రీమూల రామారాధనము మీ  సొంతములే. మహానుభావా!  ఈ యాశ్రమ కర్తవ్యములను తాము స్వీకరించి నాకు అఖండ హరినామసంకీర్తన మొనరించుకొనెడు అవకాశమును ప్రసా దింపుడు.


శ్రీయాదవేంద్ర తీర్థులు రాఘవేంద్రతీర్థుల నిష్కామత్వమును

గాంచి ఆశ్చర్యచకితులై ఆయన గొప్పతనమును, భావమును శ్రీహరిభక్తిని వేనోళ్ళ బొగడిరి. ఆయన ఆనంద బాష్పపూర్ణ నయనుడై సభామధ్యము న నిట్లు బల్కెను.


రాఘవేంద్రతీర్థా! నీజన్మము నిజముగా సఫలమైనది. హరిభక్తి దక్క అన్యములు కాంక్షింపని నీవు జీవన్ముక్తుడవు. నీకు ఆశ్రమ జ్యేష్ఠుడినైన మాత్రముననే నేను నిశ్చయముగ ఈభవ సాగరము దాటిపోగలను అని ఆశీర్వదించారు. 


భక్తునిపాట _ భగవంతునిఆట:


శ్రీరాఘవేంద్రతీర్ధ స్వామి సన్న్యాసాశ్రమమును స్వీకరించి బ్రహ్మ కరార్చితు డైన శ్రీ మూల రాము నారాధించుచు ఆశ్రమాధి పతులై విరాజిల్లుచుండిరి. ప్రతిదినము మధ్యాహ్న సమయమున శ్రీస్వామి ఆశ్రమములో నున్న మూల రామ మూర్తులను ఆరాధించెడివారు.


ఆదివ్య మూర్తులలో ఈ మూర్తులు ప్రధానము లైనవి.


బ్రహ్మచే ఆరాధింపబడిన శ్రీమూలరామమూర్తులు. 

సర్వజ్ఞులచే ఆరాధింపబడిన దశావతార పీఠ దిగ్విజయ శ్రీరామచంద్రుడు. 

శ్రీకృష్ణద్వైపాయన వేద వ్యాసమహర్షి శ్రీ ఆనందతీర్థ స్వామి కనుగ్రహించిన వ్యాసముష్టి .

నీలాదేవి యారాధించిన వైకుంఠ వాసుదేవుడు.

బలమురి శంఖము అనగా దక్షిణావర్త  శంఖము.

శ్రీజయతీర్థస్వామి ఆరాధించిన శ్రీజయరామమూర్తి. 

శ్రీకృష్ణపరమాత్మ స్వరూపమైన సాలగ్రామము.

శ్రీవ్యాసరాయతీర్ధ కరార్చిత శ్రీ వేణుగోవాలస్వామి,


ఒకొక్కమూర్తిని ఆరాధించు చున్నపుడు శ్రీజగన్నాథుడు ఆ రూపమున సాక్షాత్క రించి స్వామి సేవలను గ్రహించెడివాడు. శ్రీకృష్ణ పరమాత్మ యనిన శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామికి అనన్యభక్తి. భగవంతునిపై శ్రీవారు అసంఖ్యాకముగ కీర్తనలను రచించి వీణావాదన మొనరించు చు మధురాతి మధురము గ గానము చేసెడివారు.  ఆ కీర్తనల భావములు ఇలా ఉండేవి. 


గోవిందా ఈ క్షణము నందే నీ పాదారవిందములను నాకు జూపుము. ముకుందా, మందర పర్వతము నెత్తినవాడా! నందగోపకునికుమారుడా! శ్రీమహలక్ష్మీరమణుడా! గోవిందుడా! గోకులానందుడా !

(అనుపల్లవి)

భవబంధనముల జిక్కి బాధపడుచున్నాను. ముందుదారి గానక యీ జగములో కృశించి పోవు చున్నాను. మన్మథుని తండ్రీ! నేను నీ కుమారుడనే, జనకా! నేనొనరించిన అపరాధము లను లెక్కింపక నన్ను కాపాడుము. 


శ్రీహరీ! నేను మూఢుడను. అధైర్యముతో జీవించుచు నీ యెడల దృఢమగు భక్తిని ఒనరింపలేక పోవుచున్నాను. దేవా! నేను నీదర్శనము చేసి యెఱుగను. నీమహిమ లను పాడి యెఱుగను. పార్థసారథీ! కృష్ణా! నిన్ను నేను వేడుకొను చున్నాను. 


ఈ భూమికి భారమై నేను జీవించుచున్నాను. దుర్మా ర్గులతో  స్నేహ మొనరిం చుచు హద్దులు లేక ప్రవర్తించుచున్నాను. నన్ను కాపాడువారెవ్వరును లేరు. ధీర వేణుగోపాలా! నే నొనరించిన యపరాధము లన్నియు నీకు విదితమే. స్వామి! వేగమే నన్ను కాపాడుము. 


ఇట్లు శ్రీకృష్ణుని స్తుతించు చు దివ్యస్వరములతో వీణను పలికించుచు శ్రీ శ్రీ స్వామివారు తన్మయుల య్యెదరు, అపుడు గజ్జ లందియలు ఘల్లుఘల్లు మనిపించుచు శ్రీ బాల గోపాల కృష్ణుడు ప్రత్యక్షమై నృత్య మొనరిం చెడివాడు.


క్షామ నివారణము:


కుంభకోణము తంజావూరు రాజ్యములో నుండెను. ఆరాజ్యమునకు విజయ రాఘవుడు ప్రభువు. అనావృష్టిచే రాజ్యములో కరవు తాండవింప నారంభించెను. ప్రజಲ యెడల ప్రేమ కల్గిన ఆరాజు అన్నసత్రముల నేర్పరచి అన్నార్తుల నాదరింప నారంభించెను. లక్షలకొలది ప్రజలు ఆహారము కొఱకై అన్నసత్రముల చెంత గుమికూడ సాగిరి. ధాన్యాగారము లన్నియు క్రమక్రమముగ తరిగి పోయెను. ఇక ఒక్క రోజునకు మాత్రమే గ్రాసము కలదు; తదనంతరము రాజ పరివారము కూడ పస్తులు ఉండవలసివచ్చును. ఈ విపత్సమయములో రక్షించువారెవ్వరని విజయరాఘవుడు పెద్దలతో సమాలోచన 

మొనరించెను.  ఘటనాఘటన సమర్థుడైన శ్రీరాఘవేంద్ర తీర్థస్వామియే రక్షకుడని తెలిసికొని విజయరాఘవుడు కుంభ కోణమునకు జని శ్రీవారి పాదారవిందములను ఆశ్రయించెను. ఆశ్రితజన వత్సలుడైన శ్రీవారు ప్రజలయెడల రాజునకు గల ఆదరాభిమానముల కెంతయో సంతసించెను. శ్రీస్వామి తంజావూరున కరుదెంచి ధాన్యాగారముపై శ్రీబీజము నుంచి శ్రీ ధాన్య లక్ష్మిని స్తుతించెను. ఆ ధాన్యాగారము అక్షయ  మయ్యెను.    అన్నార్తులు 

అందరికి ఆహారము లభించెను.


వర్షములు కురియుటకు శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి సుదర్శన హోమమొనరిం చుటకు సంకల్పించిరి. హోమము ప్రారంభ మయ్యెను. రాజగు విజయ రాఘవుడు  అన్ని యేర్పాట్లుచేసి కానుకగ ఒక అమూల్యరత్న హార మును శ్రీస్వామి వారి కర్పించెను. కాంతాకనకము లయెడల వీతరాగుడైన శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి అందరు  చూచుచుండగ ఆ రత్నహారమును యజ్ఞేశ్వరార్పణముగ యజ్ఞకుండమున బడ వైచెను. అమూల్యమైన ఆ రత్నహారము అగ్గిపాలగుట గాంచి రాజు, ప్రజలు, ఆశ్చర్యచకితులై మనస్సులో శ్రీవారిని శంకింపనారంభించిరి. అదిగమనించి శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి మరునాడు  యజ్ఞకుండము నుండి అందఱు చూచుచుండగనే. రాజు సమర్పించిన రత్న హారమును దీసెను. అది తన దివ్య ప్రభలను దిశదిశల ప్రసరింప జేయు చుండెను. అగ్నిపూత మైన ఆదివ్యహారమును శ్రీవారు శ్రీమూల రామచంద్రునకు   అలంకరించిరి.


అదిగాంచి విజయ రాఘ వుడు శ్రీవారి దివ్య మహిమలయెడల పూర్ణ విశ్వాసము కల్గినవాడై తానొనరించిన శంకకు పశ్చాత్తప్త హృదయుడై శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వామి దివ్యచరణార విందము లను స్తుతించెను.



సుదర్శనహోమపూర్ణా హుతి సమయమున ఆకాశమంతయు జలధర ములతో నిండెను. తంజావూరు రాజ్యములో వర్షము ప్రారంభమయ్యెను క్షామము తొలగెను. రాజు, ప్రజలు శ్రీవారి అనుగ్రహ విశేషముచే క్షామవిపత్తు నుండి ముక్తులై రక్షింప బడిరి.


శ్రీ గురు రాఘవేంద్ర

*****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము

8 వ భాగము  

సమాప్తము. **

💥💥💥💥💥💥


🙏 ఓం నమో శ్రీ రాఘవేంద్ర య నమః 🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat