Part - 32
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
‘బలిహరణం' అనగా శ్రీవారికి నివేదించిన మహాహవిస్సును (శుద్దాన్నము) ఆలయంలోని ద్వార దేవతలకు, అన్ని ద్వారముల-ద్వారపాలకులకు,అష్టదిక్పాలకులకు, పరివార-ఉప ఆలయ దేవతా మూర్తులకు నివేద సమర్పించటం అని అర్థం.
ఇది యాత్రాసనంలో భాగంగా నిర్వహించబడుతుంది.
వైఖానసాగమంలో, బలిహరణ కైంకర్యం నిర్వహించేటపుడు శ్రీవారి బలిబేరం,
శ్రీ కొలువు శ్రీనివాసమూర్తివారు బలి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, పరివారదేవతలకు నైవేద్యమును అనుగ్రహిస్తూ యాత్రాసన ఉత్సవం నిర్వహించాలని చెప్పబడింది.
ఒక వేళ బలిబేరమును ఉత్సవంగా త్రిప్పటం వీలుకాకపోతే, శ్రీవారి పంచాయుధాలలో ఒక్కటైన శ్రీసుదర్శనచక్రమును ఉత్సవంగా తీసుకువెళ్ళి బలిసమర్పణ చేయాలి. అదికూడా వీలుపడని పక్షంలో, అర్చకస్వామి బలిపాత్రలో నివేదిత అన్నము తీసుకుని ఆలయాశ్రిత దేవతలకు నివేదన గావించాలి.
తిరుమల దివ్యదేశము ఆచారం ప్రకారం, బలి బేరమును ఒక్క కొలువు సేవకు మాత్రవేు, ఉత్సవంగా తీసుకు వస్తారు.
బ్రహ్మోత్సవసమయంలో మాత్రం బలిహరణ సమర్పణకు శ్రీ సుదర్శన చక్రమును పల్లకీలో వేంచేపుచేసి తిరువీధి ఉత్సవంగా, అష్టదిక్పాలురకు బలిసమర్పణ, అర్చకస్వామిచే సమర్పించబడుతుంది.
శ్రీవారి సాన్నిధ్యశక్తి బలిబేరంనుండి ఒక భాగం అర్చకునిలో కూడా ఆవాహన చేయబడినందువలన, తిరుమల శ్రీవారి ఆలయంలో, నిత్యార్చన తర్వాత, నిర్వహించే బలిసమర్పణలో వైఖానస అర్చకస్వామి, షరిషద్దేవతలకు శ్రీవారి తరపున నివేదన అందిస్తారు.
ప్రతినిత్యం మొదటి ఘంటతర్వాత, రెండవ ఘంట మరియు రాత్రి ఘంట తర్వాత, నిత్యార్చనలో భాగంగా, ఆలయాశ్రిత దేవతలకు బలి సమర్పణ విధిగా జరుగుతుంది.
ఈ వైదిక క్రియలో భాగంగా, అర్చకులు పోటువారు తెచ్చిన బలిప్రసాదం తీసుకుని, శ్రీవారికి యాత్రాసనం సమర్పించి, నివేదనం చేసి, మణికాది ద్వారపాలకులకు, విమాన పాలక దేవతలకు, లోకపాలకులకు, అనపాయినులకు, ఆలయగత బలిని (అన్నాన్ని) కాంక్షించే సమస్త ఇతర దేవతలకున్నూ, ప్రణవంతో ఆ యా దేవతామూర్తుల నామోచ్చారణతో ‘చతురుపాయములు’ - అనగా నాలుగు ఉపచారములైన ‘తోయం పుష్పం బలి తోయం సమర్పయామి’ అని పైన పేర్కొనిన దేవతలందరకూ ఘంటానాద సహితంగా బలి అన్నం సమర్పిస్తారు. (తోయం -తీర్ధం,బలి-అన్నం)
గర్భాలయ ద్వారమునందు- మణిక సంధ్యలకు;
ముఖమంటప ద్వార దక్షిణ-ఉత్తర దిక్కులందు-తాపస సిద్దులకు;
అంతరాళమందు - న్యక్షునికి-ఇంద్రునికి;
ప్రథమ ప్రాకార ద్వార దక్షిణ ఉత్తరములందు - కిష్కింధుడు-తీర్థులకు;
సోపాన ధ్వజదండ మధ్యలో - శ్రీభూత, గరుడులకు;
ధ్వజస్తంభ- మహాబలిపీఠం మధ్యలో ఉన్న ఐదు చిన్న బలిపీఠములలో చక్ర- శంఖ- ధ్వజ-యూథాధిప-అక్షహంత్రులకు;
ఆగ్నేయమూలలో ఉన్న రెండు బలిపీఠములు - హవిరక్షక, అగ్నులకు,
శ్రీ వరదరాజస్వామివారికి,
శ్రీ పోటుతాయారువారికి నివేదన, దివ్యదేశ పరివారం అనంత గరుడ, విష్వక్సేన, ఆంజనేయ, సుగ్రీవ, అంగదులవారికి నివేదన;
దక్షిణదిక్కులో రెండు బలిపీఠములకు - వివస్వత, యములకు;
నైఋతిదిక్కున రెండు బలిపీఠములకు - బలిరక్షక, నిర్‍ఋతిలకు;
పశ్చిమదిక్కులో - మిత్ర, వరుణులకు;
వాయవ్యదిక్కులో - పుష్పరక్షక, వాయువులకు;
ఉత్తరదిక్కులో - క్షత్రునికి,కుబేరునికి
శ్రీ విష్వక్సేనులవారికి, శ్రీ యోగ నరసింహ స్వామివారికి నివేదన;
ఈశాన్యదిక్కులో - భాస్కర, ఈశ్వరులకు.
తర్వాత అర్చక స్వామి వెండివాకిలి దాటి,పడిపోటులోని పోటుతాయార్ల వారికి మరియు యమునోత్తరైలోని శ్రీవేణుగోపాలస్వామివారికి నివేదనచేసి,ధ్వజస్థంభమునకు ఈశాన్యదిక్కులో ఉన్న ‘క్షేత్రపాలక శిల’ అనే బలిపీఠమునకు బలి అన్నం సమర్పిస్తారు.
తిరుమల క్షేత్రానికి రుద్రుడు క్షేత్రపాలకుడు.
ద్వితీయ ప్రాకార ద్వార దక్షిణ ఉత్తరములందు -నాగరాజ,గణేశులకు బలి సమర్పించి,
ఆలయానికి అభిముకంగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి వారికి నివేదన సమర్పించి,తిరిగి ఆలయంలోని ధ్వజస్థంభంవద్ద అవిఘ్న, ఆమోద, ప్రమోద, ప్రముఖ, దుర్ముఖులకు, విఘ్నకర్తకు బలి సమర్పించి బలిపాత్రలో మిగిలిన అన్నం,తీర్థం(శేషమును),మహాబలిపీఠం పై భాగం నందు భూత, యక్ష, పిశాచ, రాక్షస, నాగ గణములకు సమర్పించటంతో బలియాత్ర సమాప్తి అవుతుంది.
ఓం నమో వేంకటేశాయ.
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️