Part -31
తిరుపతి రైల్వే స్టేషన్ నుండి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది కోదండరామస్వామి ఆలయం.
తిరుమల కలియుగ వైకుంఠం. ఈ దివ్య క్షేత్రంలో వెలసిన ''స్వామి పుష్కరిణి'' అన్ని యుగాల్లోనూ ఉందని పూరాణాలు తెలియజేస్తున్నాయి. అంటే కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో కూడా తిరుమల క్షేత్రం దివ్యత్వం పొందింది. ఆయా కాలాల్లోని పుణ్యమూర్తులు ''స్వామి పుష్కరిణి''ని దర్శించుకున్నారు. సీతాన్వేషణ సఫలం కావాలని కోరుకుంటూ శ్రీరాముడు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసినట్లు భవిష్యోత్తరపురాణంలో లిఖితమైఉంది.ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వ కాలాల్లో ఒక గుహ ఉండేదట. అందులోంచి వస్తోన్న తేజస్సు గురించి వానరులు ప్రశ్నించగా, తాను శ్రీహరి రూపం అని చెప్పకుండా, ''అదంతా ఈ పవిత్ర స్థల ప్రభావం. అందుకే తేజోవంతంగా ఉంది'' అని చెప్పాడు శ్రీరాముడు.
శ్రీరాముడు అక్కడికి వచ్చిన గుర్తుగా సీతారామ లక్ష్మణుల మూర్తులతో ఈ కోదండరామస్వామి ఆలయం ప్రతిష్ఠించబడింది. కోదండరామస్వామి దేవాలయంలోని మూర్తులను జాంబవంతుడు ప్రతిష్టించగా జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించాడు.
స్థానిక గోవిందరాజస్వామి ఆలయంలోని ''కూరత్తాళ్వాన్ మండపం'' ఉత్తరగోడ లోపలి భాగంలో లభ్యమైన శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని ''శక సంవత్సరం 1402 (క్రీస్తుశకం 1480)లోశఠగోపదాసర్ నరసింహ మొదలియార్ ''నరసింహ ఉడయ్యార్'' కాలంనాటి సంస్కృతి, సంప్రదాయాల చిహ్నంగా, ''రఘునాథుడి పేరుతో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. కీ.శే. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ఉద్దేశం ప్రకారం ఈ నరసింహ ఉడయ్యార్ గారె సాళువ నరసింహరాయలు. ఈ స్వామిని స్థానికులు ''వరప్రసాది''గా కొలుస్తారు. ఇదే ఈ క్షేత్ర పురాణ స్థల ప్రాశస్త్యం.
స్వామివారి ఆలయం నిర్మించినపుడే తిరుచానూరు సభయ్యర్ శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయాన్ని నిర్మించినట్లు శాసనముల ద్వారా తెలుస్తోంది.
ఆలయ నిర్మాణ విశేషాలు
ఆగమశాస్త్రానుసారం నిర్మించిన ఈ దేవాలయం చాలావరకూ తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలిఉంది. ఈ ఆలయంలోని శిల్పకళ విజయనగర కాలంనాటిదిగా గుర్తించవచ్చు. ప్రతి స్థంభంపై అనేక భాగవత ఘట్టాలు, రామాయణ ఘట్టాలు, దేవతామూర్తులు దర్శనమిస్తాయి. యంత్ర రూపంగా భక్తుల మనోభావాలను పునీతం చేస్తాయి.
గర్భగుడి విశేషాలు
శయన మందిరం నుంచి స్వామిని అతిచేరువ నుంచి దర్శించవచ్చు. శ్రీ కోదండరామస్వామికి దక్షిణభాగంలో సీతామహాలక్ష్మి, వామభాగంలో లక్ష్మణుడు ఉన్నారు.ఇలా దక్షిణభాగంలో అమ్మవారు ఉండటం వైఖానస ఆగమశాస్త్ర నిర్ణయంగా అర్చకులు వివరిస్తారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలోని సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాల అమరిక ఇలానే ఉంటుంది.
దక్షిణభాగంలో (కుడిపక్కన) అమ్మవారు ఉండేలా దర్శించడంవల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని, వామభాగంలో (ఎడమపక్కన) అమ్మవారు ఉండేలా దర్శిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని పెద్దల నమ్మకం. శ్రీరంగంలోని శ్రీ కోదండరామాలయంలోని సీతారామలక్ష్మణుల అమరిక ఇలానే ఉంది అక్కడివారు అలాంటి అమరికను కల్యాణరామునిగా కొలవడం విశేషం.
కోదండరామస్వామి, శ్రీవేంకటేశ్వర స్వామివారి వలె దర్శనమిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి వక్షస్థలాన శ్రీమహాలక్ష్మి సీతామాత వలెనూ, స్వామివారి నాగాభరణాలు శ్రీలక్ష్మణస్వామివారి వలెనూ, మధ్యనున్న కోదండస్వామి శ్రీవారి వలెనూ అవతరించగా వైకుంఠ ద్వారాలను తలపింపచేసేలా సువర్ణమయమైన ఈ గర్భగుడి ద్వారముల ముందు జయవిజయులు ద్వారపాలకులై సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ ఆదిశేషుని సమేతుడైన శ్రీహరిని తలపించేలా ఉంది.
వరప్రసాది అయిన ఈ స్వామికి భక్తులు మొక్కుబడుల రూపంలో ప్రసాదాల నివేదన చేయడం ఆచారంగా వస్తోంది. అర్చనలు, సహస్రనామార్చనలు, ఉత్సవంలో ఉభయులు జరిపించడం, అభిషేకాది పూజలకు రుసుము చెల్లించడం, అమావాస్యనాడు పూలంగిసేవ చేయించడం, ఆపదమొక్కులుగా కాసుల పేర్లు చేయించడం, హుండీలో సొమ్ములు వేయడం, శ్రీవారికి కళ్యాణోత్సవం, ఊంజల సేవలు చేయించడం వల్ల కోరిన కోరికలు సఫలమై సంపదలు సమకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఓం నమో వేంకటేశాయ .
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️