*గురు ఉపదేశం పొందుటకు కావలసిన అర్హతలు - 1*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
స్వామి భక్తులైయుండాలి. సత్యధర్మాదులను ఆచరించువారై యుండాలి. పెద్దల యెడ గౌరవ మర్యాదలు గలవారై యుండాలి. గురు భక్తి నిండినవారైయుండాలి. గురు సేవ చేసి నియమ నిష్టలతో దీక్ష వహించి తన గురువుగారి ఆధ్వర్యమున ఆ శబరీవనము నందు (పెద్ద పాదం) మూడు పర్యాయములైన యాత్ర చేసినవారై యుండాలి. మండలకాల దీక్షపట్లను , ఆ దివ్య పదునెట్టాంబడి దేవతలమీదను , అతీత విశ్వాసము నిండిన వారై యుండాలి.
అంగవిహీనులు (వికలాంగులు) , అన్యాయంగా ఇతరుల సొమ్మును అపహరించువారు , జీవహింసచేయువారు , ఎల్ల వేళలా దుర్భాషలాడువారు , కోపిష్టి , అసహన శీలి , దైవ విశ్వాసం లేని నాస్థికుడు , పెద్దల యెడ గౌరవమర్యాదలు లేని వారు , సర్వదా ఆత్మ స్తుతి , పరనింద చేయువారు , దుర్వ్యసన పూరితులు , వ్రత నిష్టలపట్ల నమ్మకంలేనివారు , దురాశపరులు , పరకాంతా వ్యామోహము కలవారు , జూదరి , హంతకుడు , స్త్రీలను హింసించు వాడు , స్నేహము లేనివాడు , మిత్రద్రోహి మొదలగు దోషములు గలవారిని గురువు తనకు శిష్యులుగా చేర్చుకొనరాదు. ఒకవేళ గురువు ఇట్టి మనుజుల యందు దయతలచిగాని , స్నేహ భావముతోగాని , ధనాదుల వాంఛ వలన గాని , అధికార ఒత్తిడుల వలన గాని లొంగిపోయి , మంత్రదీక్ష (గురు ఉపదేశం ఇచ్చిన యెడల ఆ గురు శిష్యులిరువురికి , పితృకోపము , దేవతా శాపము ఏర్పడుతుందన్నది ఆర్యోక్తి. ఏవిధంగా దుష్టుడైన మంత్రియొక్క దోషములను రాజు అనుభవించివలసి యుండునో అదే విధంగా చెడ్డ శిష్యుని దోషములు , అపచారములను గూడా ఉపదేశమిచ్చిన గురువు భరించవలసి యుండును.
గురూపదేశం మూలాన పరిపక్వమైన గురుస్వాములు ఆ ఉపదేశమ మంత్రోపాసనవలన వాక్ శుద్ధి పొందడముతో బాటు , కర్తవ్యబోధ , ఆత్మస్థైర్యము పొందుతారు. తన్మూలాన తనదరి చేరిన శిష్యుల మనోగత మెరింగి వారి సంశయాలను తీర్చి , వారిని చక్కని మార్గములో నడిపించగల సమర్థులైతీరుతారు. గురు ఉపదేశము పొందిన వారు శిష్యులకు శబరిమల దీక్షామాలను ప్రసాదించువేళ ఈ యాత్రలోనిపరమార్థ తత్వములను తెలిపివేయడముతో బాటు వ్రతకాలములో ఆచరించవలసిన దాన్ని ఆచరిస్తూ , ఆచరించ కూడని దాన్ని వదలి పెడుతానని దైవ సన్నిధిలో సత్య ప్రమాణము చేయించుకొన్న పిమ్మటే ముద్రమాలను ప్రసాదిస్తారు. అలా సత్య ప్రమాణం చేసి ముద్రమాలను స్వీకరించినవారు , వ్రతవిధానాదులలో పొరబాటు జరగక శ్రద్ధవహించి శబరి యాత్ర జేసి శ్రీ స్వామి అయ్యప్ప అనుగ్రహము పొందుతారు. అలా తాము పొందిన అనుగ్రహములో కొంతభాగాన్ని తనకు ఇలాంటి సదవకాశం లభించుటకు కారకుడైన గురుస్వామిగారి దక్షిణ తాంబూలాదుల రూపంలో సమర్పించి ఋణము తీర్చుకొంటారు.
అలా భగవంతుని సన్నిధిలో గురుసమక్షమున ప్రమాణం చేసి ముద్రమాలను స్వీకరించిన పిదప వ్రత నియమాలలో పొరబాటు చేసి కష్టాలు కొని తెచ్చుకొనినచో ఆ కష్టములో అతని గురుస్వామికి భాగము వుండదు. ముందు గానే ఇందులోని తప్పు ఒప్పులను సంపూర్ణముగా శిష్యునికి తెలిపి బాధ్యతగా దీక్ష చేయమని తెలిపి గూడ పాటించక పోయిన శిష్యుడే తన తప్పువలన పొందిన కష్టములన్నిటిని అనుభవించవలసి వచ్చును. దారి తెలియక అనేకులు పెడదారిన నడుస్తున్నారు. సరియైన దారి తెలిసి గూడ తప్పుదారి నడిచే వారిని ఆ భగవంతుడు గూడ రక్షింపజాలడు అని శాస్త్రములో యొక ప్రమాణవచనముగలదు.
అది ఏమనగా *“దైవాపచారము వాటిల్లినచో గురువు సిఫార్సు మూలాన భగవంతుని వద్ద క్షమాపణ పొందుటకు మార్గము కలదు. కాని ఏకారణము చేతనైనా గురువు అలిగి ఆగ్రహిస్తే ఇక రక్షించువారే లేరు."* గురు శిష్యు బంధ మహిమలను గూర్చి వ్యాఖ్యానించని పురాణమో , ఇతి హాసమో లేదనియే చెప్పవచ్చును. ప్రతిఫలాపేక్ష నాశించక గురు సేవచేసి సద్గతి నొందిన వారనేకులున్నారు. గురు సేవ చేసేటప్పుడు త్రికరణ శుద్ధిగా చేయవలెను. గురుసేవలో యుండగా ప్రాణమున కన్న మిన్నయగు ఆత్మాభిమానాన్ని పోగొట్టుకొనే పరిస్థితి ఎదురైనను వెనుకాడరాదు. తన సర్వస్వమును గురు పదకమలములో యుంచి ప్రాణేంద్రియములను కేంద్రీకరించి గురువు వద్ద పరిపూర్ణ శరణాగతి పొందువారికి అఖండ జ్ఞానోదయం సులువుగా సిద్ధించు నంటారు. క్రింద వివరించబడిన ఉదాహరణపై చెప్పినదాన్ని ద్రువీకరిస్తూంది.
సీతాదేవి యొక్క తండ్రి యగు జనకమహారాజుకు యొక కల వచ్చిందట. ఆ కలలో నిరుపేదస్థితిలో చినిగిపోయిన దుస్తులతో జనకుడు వీధులలో తిరుగుచున్నారు. ఆకలి మించిపోయి యాచకముచేయుచున్నారు. కాసిని బియ్యం లభించింది. మట్టి కలశము సేకరించి ఒక చెట్టు క్రింద చేరి అన్నము వండు కొన్నారు. ఆ పేద స్థితిలోను ఆచార అనుష్ఠానములను వదలక ఆచరించి భోజనానికి కూర్చున్నారు. అపుడు ఎచ్చట నుంచో రెండు కోడెద్దులు పోట్లాడుకొని అచ్చటికి పరుగిడివచ్చెను. జనకుడు సర్దుకొని లేచే లోపు ఎద్దులు అన్నము నిండిన భాండమును తన్ని వెడలెను. ఎద్దు కాళ్లు తగలడము వలన మట్టి భాండము విరిగి అన్నము నేలయంతా చెదరి పోయెను. మట్టిలో కలసిపోయిన అన్నాన్ని , పరుగిడి పోతున్న ఎద్దును గుడ్లర్పక చూస్తున్న జనకునికి గతంలో తన రాజ భోగాలను.
ప్రస్తుత తన పరిస్థితియు తలచి మిక్కిలి వ్యధ చెంది. ఇంతేనా ఈ జీవితం. ఇందులకొరకేనా ఇన్ని పోరాటాలు. నేనింకెలా జీవించ గలను ? దేవుడా ఏమిటీ పరీక్ష , నీ పరీక్షలు ఇంత భయానకంగా యుంటుందా ! అని గట్టిగా కేక పెట్టేశాడు. కలచెదిరింది. యదాస్థితికి వచ్చాడు. అరే ఇదంత కలయా ? ఏమిటి ఈ ఆశ్చర్యము అని అనుకొనినాడు.
తన కలగూర్చి అస్థాన కవులందరితోను అర్థమడిగాడు , కాని ఎవ్వరు ఆరాజుగారి అనుమానం తీర్చలేక పోయారు. రోజులు గడిచెను. కలలోని దరిద్రస్థితియు నిజములో అనుభవించే సుఖ భోగములను ఒకదాని కొకటి సరితూచి చంచలపడి పోయాడు. ఏది అసలైన జీవితం అని తెలుసుకొనలేక బాధపడి పోయాడు. కహోటక మహర్షులవారి పుత్రులు అష్టావక్రులవారు , వారి శరీరం పుట్టుకతోనే ఎనిమిది వంకరలుగా యుండుటవలన అష్టావక్రులని నామధేయము పొందినవారు. నిండు జ్ఞాని. నైష్టిక బ్రహ్మచారి. అట్టి వారు ఒకసారి మిథిలకు విచ్చేసినారు. జనక మహారాజు వారికి స్వాగతం పలికి తన కలలోని సందేహాన్ని నివర్తింపకోరెను. వారి రూపాన్ని తిలకించిన సభా సీనులు , వీరా ! వీరెక్కడ రాజు గారి అనుమానాన్ని తీర్చగల సమర్థులు" అని హేళన భావనలో నవ్విరి. అష్టావక్రుల వారు రాజును , సభాశీనులను ఓమారు క్షుణ్ణముగా తిలకించి జనకుని చూసి వెటకారముగా భయంకర శబ్ధముతో నవ్వెను. అదిగాంచిన జనకుడు *"స్వామీ ! మీ ఆకారాన్ని చూసిన సభాశీనులు హేళనగా నవ్వారంటే కొంచమైన అర్థముంది. కాని సర్వమెరింగిన మీరు ఇలా నవ్వడానికి కారణం తెలుసుకోలేక పోవుచున్నాను."* అనెను. అందులకు మునీశ్వరులు *" నా యొక్క బాహ్యాకారాన్ని మాత్రము చూసి నా యోగ్యతాంశములను నిర్ణయించు ఈ మందబుద్ధులను పెట్టుకొని ఎలా నీవు రాజ్యభారం నిర్వహిస్తున్నావో అని ఆలోచించాను. నవ్వువచ్చేసింది అంతే"* అనెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏