అయ్యప్ప సర్వస్వం - 20

P Madhav Kumar


*గురు ఉపదేశం పొందుటకు కావలసిన అర్హతలు - 3*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*1. స్పర్శదీక్ష*


*యదావక్రీ స్వపోఅఖ్యాల శిశూన్ ఉద్దరతే శనైః |*


*స్పర్శదీక్షోప దేశశ్చ తాదృశః కథ తంప్రియే ॥*


*"హేప్రియే పార్వతే ! ఏవిధంగా పక్షులు తనరెక్కలతో తన పిల్లలను కప్పి రక్షిస్తూ పెద్ద వానినిగా చేస్తుందో అలాగే గురుదేవుడు తనవరద హస్తమును శిష్యుని శిరస్సు నందుంచి ఆశీర్వదించి , అతనిని రక్షించి , అతని జ్ఞాన వృద్ధికి దోహదం చేయును. "*


*2. దృగ్ దీక్ష*


*స్వాపత్యాని యథా మత్స్యోవీక్షణేనై వపోషయేత్ |*


*దృగ్భాం దీక్షోప శశ్చతాదృశః పరమేశ్వరీ ||*


*'హే పరమేశ్వరీ ! ఏవిధంగా చేపతన పిల్లలను దూరం నుండి చూస్తూనే వాటి సంరక్షణ - పాలన - పోషణ చేస్తుందో అట్లేసద్గురువు కూడ శిష్యుని తన వద్ద కూర్చుండ బెట్టు కొని తన దివ్య దృష్టితో అనగా తన శిష్యుని కండ్లతో తన కండ్లను కలుపుతూ శిష్యుని యందు తన చూపుతోనే శాస్త్రజ్ఞాన సంచారము చేయును. అనగా శిష్యుని కండ్లలోకి చూచినంత మాత్రమున అతని యందు తన జ్ఞాన శక్తిని ప్రవేశింపజేయును."*


*3. వేద దీక్ష*


*యథాకూర్మః స్వతన యాన్ ధ్యాన మాత్రేణ పోషయేత్ |*


*వేదదీక్షా పదేశశ్చమానుషస్యతతా విధిః ||*


*ఏ విధంగా తాబేలు తన పిల్లలను కేవలము జ్ఞాపకము చేసుకొన్నంత మాత్రమున పాలన - పోషణ చేస్తుందో అట్లే శ్రీగురు దేవుడు ధ్యానమాత్రమునే శిష్యుని యందు తన శక్తిని ప్రతిష్ఠింపచేసి వాని కృతార్థుని జేయును. అనగా అతనికి శుభముల నిచ్చును ఈ దీక్ష ఇచ్చిన వెంటనే శిష్యుడు జీవన్ముక్తుడగును. ఈ దీక్షలో శ్రీ గురుదేవుని పరమకృప అట్లే శిష్యుని యొక్క కర్మ సామ్యము రెండును సమకూరును.*


*4. క్రియాదీక్ష*


*క్రియా దీక్షాష్టధా ప్రోక్తాకుల మండపపూర్వికా |*


*కలసాది సమాయుక్తా కర్తవ్యా గురుణావహిః ॥*


*క్రియాదీక్ష ఎనిమిది విధములుగా చెప్పబడినది. సంక్షిప్తంగా చెప్పాలంటే ముందుగా విధి విధాన పూర్వకంగా షడ్ ద్వశోధన చేయబడుతుంది. తదుపరి గురువు తన శరీరము నుండి బ్రహ్మరంధ్ర మధ్యమందుండు చితశక్తిని క్రమక్రమంగా వెలుపలికి తెచ్చి శిష్యుని యొక్క అంతర్ హృదయ మందు దానిని ప్రవేశపెట్టుటయే క్రియాదీక్ష అనబడును.*


*5. వర్ణదీక్ష*


*వర్ణాదీక్షా త్రిథా ప్రోక్తాద్విచత్వారింశతత్తరైః |*


*పంచా సద్వర్ణ కైర్దేవి ద్విషష్ట లిపిభిస్తువై ||*


*శిష్యుని శరీరంపై మాతృకారూపిణి భగవతి యొక్క 42 వర్ణములతోగాని , 50 అక్షరములతోగాని , 62 భూతలిపులతో గాని అతని యందు వ్యాసం ద్వారా దేవతా భావమునుత్పన్నము చేయుట అనగా మాతృకా న్యాసం మరియు ఇతర ఇష్టమంత్రన్యాసం ద్వారా శిష్యుని శరీరమందు దేవత్వావరణ చేయుట వర్ణదీక్ష యనబడును.*


*6. శాంభవీ దీక్ష*


*గురోరాలోకమాత్రేణ భూషణాత్ స్పర్శనాదపి |*


*సద్యః సంజాయతే జ్ఞానం సాదీక్షా శాంభవీస్మృతా॥*


*గురుదేవుని కృపాకటాక్ష వీక్షణములతో లేక సంభాషణలతో అట్లే గురువు శిష్యుని ప్రేమ పూర్వకంగా ముట్టుకొనినంత మాత్రమున ఆశిష్యుని యొక్క హృదయమునందు తత్కాలంలో జ్ఞానోత్పత్తి కల్గును. దీనినే శాంబవీదీక్ష అంటారు.*


*7. వాగ్ధాక్ష*


*మనోర్థీక్షాద్విదాప్రోక్తా తామ్రత్ ప్రతిమాపిచ|* 

*పాపముక్తః క్షణాత్ శిష్యః  చ్ఛిన్న ప్రాశస్తథా భవేత్ ||*


*బ్రహ్మనాసార నిర్ముక్తో భూమౌవతతి క్షణాత్ |* 

*సాక్షాత్ దివ్య భావో సౌసర్వం జానాతి శాంభవీ ॥*


*ఓం శాంభవీ ! నోటిమాటల ద్వారా యేదీక్ష యీయ బడు తుందో దానిని వాగ్ధాక్ష అందురు. ఇది తీవ్రా , తీవ్రతమా అనిరెండు విధ ములగును.*


*8. తీవ్రతరదీక్ష*


*వాగ్దాక్ష యొక్క ద్వితీయ బేధమునే తీవ్రతరదీక్ష అందురు.*


తత్వజ్ఞానియైన గురుదేవుడు శిష్యునియొక్క జాను , నాభి , హృదయాది షట్ స్థానములయందు భువన , తత్వ , కళా , వర్ణ , పద , మంత్రార్ధములను స్మరించి గురూపదిష్ట మార్గములో వేధచేసి మంత్రముల నిచ్చే సమయంలో ఆశిష్యుడు సమస్త పాపముల నుండి విముక్తుడై , పాశరహితుడై , భూమిమీద పడిపోవును. అప్పుడు తనకి దివ్య భావము ప్రాప్తించును. వేధద్వారా దీక్షిత , వేదక్రియద్వారా వాగ్దేక్షతో దీక్షితుడైన శిష్యుడు సాక్షాత్తు శివరూపుడగుచున్నాడు. వానికి పునర్జన్మ లేదని ఈ క్రింది ప్రమాణం నిరూపిస్తుంది.


*వేదాబ్దిః శివః సాక్షాత్ న పునర్జన్మ విద్యతే ||*


*ఏ షాం తీవ్రతరాదీక్షా భవబంధ వియోచనీ ॥*


పై అష్ట విధదీక్షలతోనే దీక్షా విధిపూర్తి కాలేదు. ఇంకా *'క్రమదీక్షా' , 'మేధా', మహామేధ* మొదలైన దీక్షలు కూడా వున్నవి. వీటి అంతర్గతంలో *‘‘శాక్తాభిషేకం”, “పూర్ణాభిషేకం"* మొదలగు అష్టవిధ అభిషేకములు వున్నవి. వీటిలో *"కౌలాచారము"* సర్వోత్తమమైనది. ఈ ఏడు *'ఆచారములందు “పశుభావము" , "వీరభావము" , "దివ్యభావము"* అను మూడు భావములు అంతర్గతంగా వచ్చును. ఇలా గురు ఉపదేశమన్నది పలు విధములా శిష్యులకు ఉపయోగపడుతుంది.


*"నగురోరధికం విద్యా నగురోరధికం తపః"* గురువు కన్న మిన్నగు విద్య , తపమో లేదనుట ఆర్యోక్తి. శబరిమలకు భక్తులను యాత్ర గావించు వారెల్లరూ గురుస్వాములే. వారందరూ సద్గురువులు కావాలి. ఈ యాత్రలోని సూక్ష్మార్థ మంత గురుశిష్యుల అన్యోన్యతలోనే గోచరించును. *నీ గురువునకు నీవు నమస్కరించి , సేవచేస్తేనే నీశిష్యులు నీకునమస్కరిస్తారు. సేవచేస్తారు. నీవు చక్కని మార్గము తెలుసుకొంటేనే , నీ శిష్యులకు సరియైన మార్గము చూపగలవు. నీవు సరియైన మార్గము తెలుసుకోవాలంటే నీ యొక్క సద్గురు చెంతచేరి సేవచేసి , గురు ఉపదేశం పొంది , ఆ మంత్ర జప ఉపాసనతో మాత్రమే సన్మార్గము నెరుంగ గలవు. లోకాన్ని పాలించే దేవతలు గూడ తనను సద్గురువుగానే చూపించు కొనుటకు ఇష్టపడుచున్నారు.* గీతాచార్యుడగు కృష్ణ భగవానుని 


*వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్థనం ।*

*దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం |*

అని అజ్ఞాన నిర్మూలనంచేసే జగద్గురువుగా దలచి నమస్కరించు చున్నాము. వటవృక్షము క్రింద జ్ఞానముద్రచూపించి అమరియుండు సదాశివుని


*గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం |*


*నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః ॥*


అన్ని విద్యలన్నిటికి విధిగా సర్వలోక గురువుగా దలచి నమస్కరించుచున్నాము.


*ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం |*


*మంత్ర మూలం గురో ర్వాక్యం సిద్ధిమూలం గురోఃకృపా ||*


గురురూపమును మనస్సులో నిలిపి ధ్యానించుట వలన గురువు యొక్క తేజస్సు , పూజలు చేయడం వలన గురుపద కమల స్పర్శము , గురు వాక్యమునే వేదవాక్కుగా ఎంచి మననము (ఉపాసన) చేయుటవలన వాక్ శుద్దియు వారి సిద్ధాంతాలను , ఆదేశాలను చాటి చెప్పడం వలన గురుకృపయు సిద్ధించును.


*గురుమహత్మ్యమెంతటి గొప్పదో , గురువు స్థానమెంతటి ఔన్నత్యము కలిగినదో , గురు ఉపదేశము ఎంతటి ఆవశ్యకమో మనగురు స్వాములు గ్రహింతురు గాక ! ముందే తెలిపినట్లు పరుగులు తీసే నేటికాల పరిధిలో సర్వవిద్యా సంపన్నులైన గురువర్యులను చూచుటయే కష్ట సాధ్యముగా యున్నది. అయినను తనకు లభించిన గురు స్వాములలోనే సర్వజ్ఞాన సంపన్నులైన ఉత్తమ గురుస్వాములను దర్శించి , భక్తి చూపినా ఆసర్వేశ్వరుడైన ఆదిగురువు సంతసించి అనుగ్రహిస్తాడు. తన గురు స్వామిలో యుండు సద్గుణములను మాత్రము హంసక్షీర న్యాయములో స్వీకరించి గురు శిష్యమైత్రీ భావనలో శబరిమల యాత్ర చేసే ప్రతి బృందమును గురు విన్ గురువగు శబరి నాథుడు తప్పక తన కడగంటి చూపుతో అజ్ఞాన నిర్మూలము గావించి జ్ఞాన ప్రబోధ కల్గిస్తాడనుటలో సందేహము లేదు. "సద్గురునాథనే శరణమయ్యప్పా".*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌸🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat