శ్రీదేవీభాగవతము - 31

P Madhav Kumar


*తృతీయ స్కంధము - 10*

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 31*


*మహాగణేశనిర్భిన్న విఘ్నయంత్రప్రహర్షితా!*

*భండాసురేంద్రనిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*"సుదర్శనుడి కథ"* మొదటిభాగం చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

 *"సుదర్శనుడి కథ"* రెండవ భాగం

 చదువుకుందాం......

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🌈 *సుదర్శనుడి కథ  - 2 వ భాగము* 🌈


*జనమేజయా!* యుధాజిత్తు రణరంగం నుంచి విజయగర్వంతో అయోధ్యాపుర ప్రవేశం చేశాడు. సుదర్శనుడిని కూడా చంపి తన మనుమడి పాలనను అకంటకం చెయ్యాలి అనుకున్నాడు. మనోరమకోసం అంతఃపురమంతా గాలించాడు. పరిచారికలను రొక్కించాడు. జాడ తెలియలేదు. నగరమంతటా అన్వేషించండి, ఎక్కడ ఉన్నా పట్టి తెండి అని భటులకు ఆజ్ఞాపించాడు.


ఒక శుభముహూర్తాన శత్రుజిత్తుకు పట్టాభిషేకం జరిపించాడు. రాజ్యమంతటా ఉత్సవం ప్రకటించాడు. అధికారులకు అనధికారులకు ప్రజలకూ - అందరికీ పెద్ద ఎత్తున కానుకలు పంచి పెట్టించాడు. అందరూ సంతోషించారు. కొత్త రాజు శత్రుజిత్తుకు జై అన్నారు. జై జై అన్నారు.


కొందరు సజ్జమలు మాత్రం ఇళ్ళల్లో నిశ్శబ్దంగా రోదించారు. యోగ్యుడు సుదర్శనుడు ఏమైపోయాడో. మహాసాధ్వి మనోరమ ఏమైపోయిందో. శూరశేనుణ్ణి అన్యాయంగా చంపేశాడు యుధాజిత్తు.  అక్రమంగా సింహాసనం దోచుకుని మనవడికి కట్టబెట్టాడు - అనుకుంటూ లోలోపల కుమిలిపోయారు. అశక్తతను నిందించుకున్నారు.


యుధాజిత్తు కొంతకాలంపాటు అయోధ్యలోనే ఉండి, మనవడి పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీచేసి, తన ఉజ్జయినికి చేరుకున్నాడు. 


మనోరమ సుదర్శనుడూ భరద్వాజుడి ఆశ్రమంలో ఉన్నారని చారులు సమాచారం అందించారు. ఆశ్రమంలోనే వారిని కడతేరుస్తానంటూ వెంటనే బయలుదేరాడు. శృంగబేరపురాధిపతి దుర్దర్శుడు అనే కోయరాజును కలుసుకున్నాడు. భరద్వాజాశ్రమం ఈ శృంగబేరానికి దగ్గరలోనే ఉంది.


యుధాజిత్తు ససైన్యంగా వచ్చి శృంగబేరంలో విడిది చేశాడనే వార్త మునిబాలకుల ద్వారా మనోరమకు తెలిసింది. సుదర్శనుణ్ణి చంపడానికే వచ్చి ఉంటాడని గ్రహించింది. గజగజలాడింది. మహర్షి దగ్గరకు పరుగెత్తింది. ఇప్పుడు ఏమి చెయ్యను, ఎక్కడికి పోను ? యుధాజిత్తు వచ్చాడు. నా తండ్రిని సంహరించాడు. తన మనుమడిని రాజును చేశాడు. ఇప్పుడింక నా కొడుకును చంపడానికి వచ్చాడు. సందేహం లేదు. 


*మహర్షీ !* గతకాలపు గాథలు చాలా జ్ఞాపకం వస్తున్నాయి. ఒకప్పుడు జయద్రథుడు ఇలాగే ఆశ్రమానికి వచ్చి, అక్కడ అరణ్యవాసంలో తలదాచుకుంటున్న ద్రౌపదిని ఒంటిపాటున అవమానించాడు. ఎవ్వరినీ నమ్మడానికి లేదు. నమ్మామో కన్నీట మునిగామన్నమాటే.


బలిచక్రవర్తి ఏమయ్యాడు! ధర్మాత్ముడు, మహాదాత, తొంభైతొమ్మిది యజ్ఞాలు చేసినవాడు. ప్రహ్లాదుడికి సాక్షాత్తు పౌత్రుడు. అయితేనేమి మోసానికి గురి అయ్యాడు. మోసం చేసింది మాత్రం సామాన్యుడా ! సాక్షాత్తు విష్ణుమూర్తి. సత్యస్వరూపుడూ వేదగమ్యుడూ, యోగి సేవ్యుడూను. దేవకార్యసిద్ధికోసం కశ్యపుడికి వామనుడిగా పుట్టి, మూడడుగుల నేల ఇమ్మన్న వంకతో బలిని పాతాళానికి తొక్కేశాడు. ఇంద్రుడి ఇచ్చకం కోసం విష్ణుమూర్తియే ఇలా మోసం చేస్తే, ఇక సామాన్యమానవులమాట చెప్పాలా స్వామి ! అందుచేత ఎవ్వరినీ ఎప్పుడూ నమ్మకూడదు. లోభం మనస్సులో ప్రవేశించిందంటే ఇంక వాడికి పాపభయం కానీ, పరలోకభయం కానీ ఏదీ ఏమాత్రమూ ఉండదు. త్రికరణ శుద్ధిగా పరులసొమ్మును కాజేస్తాడు. ఎంతకైనా దిగజారతాడు.


*భరద్వాజా !* అసలు మనుషుల ఆలోచనల్లోనే ఏదో తేడా ఉందనుకుంటాను.  ధనసమృద్ధి, కలిగించమంటూ దేవతలను ఆరాధిస్తారు. దేవతలేమన్నా తమ చేతుల్లో ఉన్నదని సొమ్ము వెంట అందిస్తారా ? ఎవరి దగ్గరనుంచో తెచ్చి వీరికివ్వాలి. అంటే వ్యాపారమన్నా చెయ్యాలి, చౌర్యమనా చెయ్యాలి. ఎవరితోనో దానమన్నా ఇప్పించాలి. లేదంటే బలప్రయోగం చేసి ఎవడి బుర్రో బద్దలుకొట్టి పట్టుకువచ్చి వీరికి ఇవ్వాలి. అంతేకదా! అమ్మి డబ్బుచేసుకోవడం కోసం ధాన్యవస్త్రాదుల్ని ఉత్పత్తిదారుల నుంచి అధికంగా చౌకగా స్వీకరించిన వైశ్యుడు నాకు ధనసనుృద్ధి అత్యధికంగా కలగాలంటు దేవతల్ని అర్చిస్తున్నాడు. దీని అర్థం ఏమిటి ? తాను కొనేటప్పుడు బాగా తక్కువ ధర, అమ్మేటప్పుడు బాగా ఎక్కువ వెల రావాలనుకోవడం సబబేనా మరి ?


*మహర్షి !* ప్రాణులంతా పరాయి సొమ్ముకి ఆశపడేవారే. ఎవరిని నమ్మేది ? తీర్థయాత్రలూ దానధర్మాలు చదువుసంధ్యలూ అన్నీ వ్యర్థం. లోభులకు ఎవరు ఏది చేసినా అది చెయ్యనట్టే. *(లోభమోహవృతానాం వై కృతం తదకృతం భవేత్ - 55).* అందుచేత ఓ మహానుభావా ! దయచేసి ఈ యుధాజిత్తు తక్షణం ఇక్కడనుంచి వెళ్ళిపోయేట్టు చూడు. నేను సీతాదేవిలాగా, నీ ఆశ్రమంలో కొడుకుని పెట్టుకుని క్షేమంగా ఉంటాము.


మనోరమ అభ్యర్థనకు భరద్వాజుడు సమ్మతించాడు. హుటాహుటిన యుధాజిత్తు దగ్గరికి వెళ్ళాడు. తక్షణం ఆ ప్రాంతం విడిచి పెట్టి ఇంటికి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. యుధాజిత్తు బతిమాలుకుంటున్న ధోరణిలో మాట్లాడారు.


*భరద్వాజర్షీ !* ఇదేమి అన్యాయం. నేను మీ ఆశ్రమంలోకి రాలేదు. దుర్దర్శుడి నగరంలో ఉన్నాను. మీరింత హఠం చేస్తే ఎలాగ! పోనీలెండి. మీరన్నట్టే వెళ్ళిపోతాను. మనోరమను విడిచి పెట్టండి. అందాకా నేను కదలను. బలవంతంగానైనా తీసుకుపోతాను. ఇది మాత్రం నిజం - అన్నాడు యుధాజిత్తు.


ఓయీ ! క్షత్రియోత్తమా ! తీసుకువెళ్ళు నీకు చేతనైతే. విశ్వామిత్రుడు వసిష్ఠుడి ఆశ్రమంనుంచి నందినీ ధేనువును తీసుకువెళ్ళినట్టు, నువ్వూ ఆశ్రమం నుంచి మనోరమను బలాత్కారంగా తీసుకువెళ్ళు. అదీ చూస్తాను - అంటూ భరద్వాజుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు. 


*(అధ్యాయం - 16, శ్లోకాలు - 60)*


యుధాజిత్తు తన వృద్ధ మంత్రి సుబుద్ధితో సంప్రదించాడు. సుబుద్ధీ ! ఇప్పుడు ఏమి చెయ్యాలో బాగా ఆలోచించి చెప్పు. నాకయితే మనోరమను కొడుకుతో సహా బలవంతంగానైనా సరే లాక్కురావాలని ఉంది. శత్రువు చిన్నపిల్లవాడే కదా అని ఉపేక్షించడం శ్రేయస్కరం కాదు. అది క్షయలాగా పెరిగి చివరికి ప్రాణం తీస్తుంది. ఇక్కడ సైన్యం ఉన్నదా, యోధులున్నారా? నన్ను అడ్డగించేవాళ్ళు ఎవరు ? సుదర్శనుణ్ణి ఒక్కవేటుకి చం పేస్తాను. మనవడి రాజ్యాన్ని అకంటకం చేస్తాను. ఇక నిశ్చింత. ఇక నిర్భయం.


ఈ సాహసోక్తులకు సుబుద్ధి ఆశ్చర్యపోయాడు. సాలోచనగా తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా ! సాహసానికి ఇది చోటు కాదు. ముని మాటలు విన్నావుకదా ! విశ్వామిత్రుడి దృష్టాంతం చెప్పాడు. ఆ కథ నీకు తెలీదనుకుంటాను. టూకీగా మనవి చేస్తాను. విను.


వెనకటికి విశ్వామిత్రుడనే క్షత్రియుడొకడున్నాడు. గాధి పుత్రుడు. మహాపరాక్రమశాలి. శస్త్ర కోవిదుడు. అపార సైన్యంతో ఒకసారి, అడవిలో తిరుగుతూ తిరుగుతూ వశిష్టాశ్రమానికి వెళ్ళాడు. పరస్పరం అతిథిమర్యాదలు అయ్యాయి. వశిష్ఠుడు సైన్యంతో సహా అందరికీ గొప్ప విందు ఇచ్చాడు. కామధేనువు సంతానమైన నందినీ ధేనువు అనుగ్రహంతో భక్ష్యభోజ్యాదులన్నీ అందరికీ పుష్కలంగా అందాయి.


విశ్వామిత్రుడి కళ్ళు నందినీ ధేనువు మీద పడ్డాయి. ఆ ధేనువును తనకు ఇమ్మని అడిగాడు. దానికి బదులుగా కోటిగోవులను ఇస్తానన్నాడు. అయినా వసిష్ఠుడు తిరస్కరించాడు. ఇది హోమధేనువు. దీనిని ఇవ్వనుగాక congratulations. కోటికాదు పదికోట్ల గోవులను ఇచ్చినాసరే దీనిని ఇచ్చేది లేదు - అని ఖండితంగా చెప్పాడు. అయితే బలాత్కారంగా తీసుకుపోతానన్నాడు విశ్వామిత్రుడు. నీ ఇష్టం, ప్రయత్నించు అన్నాడు వసిష్ఠుడు.


విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందినీ ధేనువును కట్టువిప్పి లాక్కువచ్చారు. అది వసిష్ఠుడివైపు దీనంగా చూస్తూ - మహర్షీ ! నేనేమి తప్పుచేశాను ? నన్ను ఎందుకని వీళ్ళకి ఇచ్చేస్తున్నావు? అని అడిగింది. అమ్మా ! నేను ఇవ్వడం లేదు. వీళ్ళే బలవంతంగా లాక్కుపోతున్నారు. నేనేమి చేసేది ! అసహాయుణ్ణి. పైగా విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి - అన్నాడు వసిష్ఠుడు.


నందినీ ధేనువుకి తనువంతా క్రోధం ఆవేశించింది. క్రూరంగా భీకరంగా అంభారావం చేసింది. రెప్పపాటుకాలంలో ధేనువు రోమకూపాలనుంచి కోట్ల సంఖ్యలో సాయుధులూ సకవచులూ అయిన రాక్షసులు ఆవిర్భవించి విశ్వామిత్రుడి సైన్యాన్ని నిరవశేషంగా నాశనం చేశారు. దిక్కుతోచని విశ్వామిత్రుడు ఒక్కడూ ఒంటరిగా బతుకుజీవుడా అని బయటపడ్డాడు. తనను తాను నిందించుకున్నాడు. క్షాత్రబలం అసలు బలమేకాదు. బ్రహ్మబలమే బలం అని ఒక నిశ్చయానికి వచ్చి కారడవులలో ఘోరతపస్సులు చేశాడు. క్షాత్రాన్ని వదిలించుకుని కట్టకడపటికి బ్రహ్మర్షి అయ్యాడు.


ఇదీ విశ్వామిత్రుడి ఇతిహాసం, యుధాజిన్నరేంద్రా ! ఇతణ్ణి దృష్టాంతంగా చెప్పడంలో భరద్వాజుడి ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలిసిందా ? అందుచేత సాహసం చెయ్యకు. క్షాత్రపౌరుషాలు మహర్షుల దగ్గర చెల్లవు. కాదని బలప్రదర్శన చేశావో వంశనాశనం అవుతుంది. త్వరగా బయలుదేరు. ముందు భరద్వాజుణ్ణి ప్రసన్నుడ్లి చేసుకో, కిమ్మనకుండా మన దారిన మనం క్షేమంగా ఉజ్జయినికి చేరుకుందాం. సుదర్శనుణ్ణి ఇలాగే ఈ ఆశ్రమంలో ఉండనీ. బాలుడు. పైగా నిర్ధనుడు. ఇతడు నీకు చెయ్యగలిగిన అపకారం ఏముంది కనక ! అనాథ దుర్బల శిశువులపట్ల వైరం వహించడం శుద్ధ దండుగ. ఎవరైనా విన్నా హర్షించరు. రాజేంద్రా ! ఈ జగత్తు అంతా దైవాధీనం. మనం సర్వత్రా దయామయులమై ఉండాలి. ఈర్ష్యపడకు. పడీ, చెయ్యగలిగింది లేదు. ఏది జరగాలనుంటే అది జరుగుతుంది.


దైవయోగం కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గడ్డిపరక అవుతుంది. కలిసివస్తే గడ్డిపరకయినా వజ్రాయుధమవుతుంది. కాలం కలిసివస్తే కుందేలు పిల్ల బెబ్బులిని చంపుతుంది. గడ్డిదోమ ఏనుగును చంపుతుంది. అందుచేత, ఓ మేధావీ! సాహసం చెయ్యకు. నామాట విను.


హితం చెప్పాను. జనమేజయా! సుబుద్ధి చేసిన ఈ ఉపదేశంతో యుధాజిత్తు కళ్ళు తెరిచాడు. బుద్ధిగా వెళ్ళి భరద్వాజుడికి సాష్టాంగ నమస్కారం చేసి, సెలవు తీసుకుని ఉజ్జయినికి తరలిపోయాడు. మనోరమ మనస్సు కుదటపడింది.


సుదర్శనుడు మునిబాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ క్రీడిస్తూ విద్య లభ్యసిస్తూ దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. ఒకరోజున ఒక మునిబాలకుడు ఆటల సందడిలో విదల్లుణ్ణి చూసి “క్లీబా'! అని (నపుంసకా) గట్టిగా అరిచి సంబోధించాడు. అతణ్ణి పిలవాలనిగానీ అవమానించాలనిగానీ ఏదో పని చెప్పాలని గానీ మునిబాలకుడి ఉద్దేశం కాదు. ఆటలో ఆటగా, మనిషి కనపడ్డాడు గదా అని అరిచాడంతే. విదల్లుడి కదలికల్లో కనిపించే సుకుమారత బహుశ మునిబాలకులకు ఈ చనువు ఇచ్చి ఉంటుంది.


సుదర్శనుడు ఈ పదం విన్నాడు (క్లీబ). అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారం చేర్చి ధారణ చేశాడు. మళ్ళీ మళ్ళీ అదే అదే మనస్సులో జపించాడు. అది మంత్రబీజం. మహారాజకామరాజాఖ్య బీజాక్షరం. భావియోగమో బాల్యచాపల్యమో సుదర్శనుడు తదేకదీక్షగా జపించాడు. జపిస్తూనే క్రీడిస్తున్నాడు. జపిస్తూనే నిద్రిస్తున్నాడు. సర్వకాల సర్వావస్థలలోనూ క్లీం బీజాక్షర మహాజపం కొనసాగిస్తున్నాడు. అది మంత్రసారమనిగానీ బీక్షరమనిగానీ తెలీదు. మనసులో పడింది. ఎందుకు పడిందో. అలా జపిస్తున్నాడంతే. ఆ మంత్ర జపానికిఋషిలేడు, ఛందస్సు లేదు, ధ్యానం లేదు, న్యాసం లేదు. ఏమీ లేదు. అప్రయత్నంగా నిరంతరంగా జపం సాగిపోతోంది.


రాకుమారుడికి పదకొండేళ్ళ వయస్సు వచ్చింది. మునులు అందరూ కలిసి ఉపనయం జరిపించారు. వేదాభ్యాసం చేయించారు. ధనుర్వేదం నేర్పారు. నీతిశాస్త్రం నేర్పారు. ఇంకా చాలా శాస్త్రాలు చెప్పారు. అతడికి అన్నీ క్షణంలో కరతలామలకం అవుతున్నాయి. మంత్రాక్షరబలం అటువంటిది.


ఒకరోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమయ్యింది. రక్తాంబరధారిణి. రక్తవర్ణ. రక్తసర్వాంగ భూషణ. గరుడవాహనం మీద వైష్ణవీశక్తిగా దర్శనం అనుగ్రహించింది. సుదర్శనుడు ప్రసన్నవదనుడయ్యాడు. పేరు సార్థకమయ్యింది.


*రక్తాంబరాం రక్తవర్ణాం రక్త పర్వాంగ భూషణామ్ |*

*గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతామ్ ||* (17 - 43) 


యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమప్రాంతాలలో త్రికూట గిరిశిఖరాలపై లోయలలో గుహలలో సెలయేరులలో నదీతీరంలో క్రీడిస్తూ సంచరిస్తున్నాడు.


ఆ సర్వవిద్యార్థ తత్త్వవేత్తకు ఒక రోజున నది ఒడ్డున ఒక దివ్య ధనుస్సు దొరికింది. రత్నాలలా మెరిసిపోతున్న ములుకులతో శిలాకఠినమైన బాణాలున్న తూణీరమూ (అంబులపొది) దొరికింది. వజ్రకవచమూ దొరికింది. ఇవన్నీ ఆ యువకుడికి దేవీప్రసాదాలు.


*(రేపు శశికళా సుదర్శనుల పరిచయం)*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నద

🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat