అయ్యప్ప సర్వస్వం - 32

P Madhav Kumar


*దీక్షలో ఎన్నిసార్లు శరణుఘోష చేయాలి - 2*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


జపమనగా సర్వేశ్వరుని మంత్రమునో , భగవన్నామమునో జపించుట. జపించుట యనగా మంత్రమునో , నామమునో మరల మరల మనస్సున చింతించుట. ఈ జపము చేయు విధానములు మూడు విధములు. అవి వాచికము , ఉపాంశువు. మానసికము అని *“వాచిక మనగా మంత్రము తన చెంతనుండు వారికి - వినిపించునటుల ఉచ్చరించుట.


ఉపాంశువు అనగా - దగ్గరనుండు వారికి మంత్రోచ్ఛారణ శబ్దము వినరాక , కేవలము పెదవులు మాత్రమే కదలించుచూ చేయుజపము.


*"మానసికమనగా - పెదవులు , నాలిక కదలక మంత్రము మనోధ్యానములో మునిగి యుండుట మరియు మంత్ర మహిమార్ధములను మననము చేసికొని జపించుట. వాచిక జయజ్ఞము కన్నను నూరు రెట్లు అధికముగా ఉపాంశు జపయజ్ఞమున కలుగును. దీనికి వేయిరెట్లు అధికముగా మానసిక జపయజ్ఞమున ఫలసిద్ధి చెప్పబడినది. అందులో ఈ మూటిలో మానసిక జపము శ్రేష్టమైనది.


స్తోత్రము కోటి పూజలకు సమానము. జవము కోటి స్తోత్రములకు సమానము. ధ్యానము కోటి జపములకు సమానము. అందువలన దీక్షా కాలములో జపము చేయుటవలన హృదయము పవిత్రమై , పాపము నిర్మూలమై , మనసు నిశ్చలముగ నుండి. భవబంధములను త్రుంచివేసి , భగవత్ సాన్నిధ్యము చేర్చి , శాశ్వతమైన పరిపూర్ణానందము నొసంగును.


ప్రార్థనలో సాధకుడు తన ఇష్టదైవమునకు తన కోరికను స్పష్టముగా తెలుపు అభిప్రాయమగును , మన పరిపక్వ దశ ననుసరించి , భగవంతుడు మన ప్రార్థనను స్వీకరించ వచ్చును. లేక నిరాకరింపవచ్చును. ఇందుకు సాధకుని అర్హత , దీక్ష , విశ్వాసము , కార్యదక్షత ఇవి ముఖ్యం.


కాని మంత్రజపమునందట్లు గాదు. మంత్రమునకు దేవతవశపర్తియై యుండును. కానఫలము నిశ్చయము. *“దైవాధీనం జగత్సర్వమ్ , మంత్రధీనంతు దైవతం"* అనినారు. ప్రార్ధనవలె మంత్రములు సాధారణ భాషాభిప్రాయము లేక నివేదనము కాదు శక్తి కల్గిన శబ్దవాచ్యమే మంత్రము శబ్ద బ్రహ్మమే మంత్రమగును. దేవతా స్వరూపము మంత్రమయము. జీవుని శరీరములో నుండు ముఖ్య ప్రాణశక్తి యొక్క సూక్ష్మరూపమే మంత్రము. మంత్రము శబ్ద తరంగ పూర్వకము. వస్తుతః అక్షరరూపమే నొంది యుండినను మంత్రము అక్షరపరబ్రహ్మము యొక్క యంత్రముగా వెలయుచున్నది. దేవత వాచశక్తి మంత్రము వాచక శక్తి - అను రెండు శక్తులు మంత్రమున నుండి ఈ రెండు శక్తులను గలిసి , దైవికశక్తిగా మారి , దేవతా కార్యముల జేయును. అందువలన మంత్రము యొక్క అర్ధమైన దేవత ఏ సాధకుని మననముచే , భక్తిచే , వాని మనసు పరిశుద్ధమగునో లేక ప్రకాశించునో వానికి ఆ దేవతదర్శన మిచ్చును. సాధకుడపుడు ఫలసిద్ధిని తప్పక కాంచనగును.


దీక్షధారణకు మంత్రజపమునకు మాలలు అవసరము. దీక్షధారణకు ధరించు ముద్రమాలకు గానీ , జపమాలకుగానీ , 108, 54, లేక 27 అను సంఖ్యలో పూసలుండి , ఇవిగాక , ఒక పెద్ద పూస మేరువుగా నుండవలయును. మేరుపు లెక్కలోనికిరాదు. ముఖముతో ముఖము , పుచ్చముతో పుచ్చము కలియునట్లు ఒకేదారముతో గ్రుచ్ఛవలయును. దేవికి పట్టుదారము ప్రీతి. మాలలను ఇతరులకు కనబడకుండునట్లు దాచవలయను. మాలలో కరమాల , అక్షమాల , మణిమాలలని మూడు విధములు.


అనామిక మధ్య కణుపుసందారంభించి కనిష్టాదిగా తర్జనీ మూలము వరకుగల పదికణుపులయందు , ప్రదక్షిణముగా జపించినచో “కరమాల” చే జపించినట్లగును. మాతృకావర్ణములో , మొదట చివరనుండు రెండు అక్షరములను, అనగా , 'అ' 'క్ష' లను కలిపి 'అక్షమాల' యనిరి. రుద్రాక్షలు , శంఖములు , పద్మబీజములు , ముత్యములు , స్పటికములు , పగడములు , తులసిమాలలు , మాలలకుప యోగించునవి మణులనబడును. అందుకే వీనిని "మణిమాల" లందురు.


జపమాలలు వివిధరకములు గలవు. అందులో 


(1) తులసిమాల అక్షయ ఫలము 

(2) శంఖమాల - లక్ష్మిప్రదం , 

(3) స్పటికమాల - మోక్షపదము 

(4) పగడాల మాల ధనప్రదము 

(5) ముత్యముమాల - సౌమాంగల్యప్రదము 

(6) కుశమాల - పాపక్షయము 

(7) బంగారు లేక వెండిమాల - ఇష్టార్ధ ప్రదము , నొసంగును. రుద్రాక్షమాల అనంత ఫలములనొసగును. అందువలననే ఎక్కువగా సాధకులు , దీక్షా ధారణకు , జపమునకు ఎక్కువగా తులసిమాలలు , రుద్రాక్ష మాలలు వినియోగించెదరు.


జపమాలలతో జపము చేయు పద్దతియేగాక , శాస్త్రములు వేరొక శక్తివంతమైన పద్ధతిని తెలుపుచున్నవి. అది లిఖిత జపము. ప్రతిదినము వ్రాత పుస్తకములోని ఒక పేజీలోగాని , అంతకు మించిగాని భక్తి శ్రద్ధలచో వ్రాసినచో సాధనయగును. ఇందు సాధకుని చిత్తము తెల్లకాగితమును బోలి స్వచ్ఛమైన స్థితిని పొందుటకు వీలగును. ఇది అనుభవైక్యము అట్లు శుద్ధినందిన చిత్తముతో *"శ్రీరామ , అయ్యప్ప , శివ , సాయి , ఇత్యాదినామములు లిఖింపబడియున్నట్లు సాధకుడు అనుభూతి గడించును.* ఇట్లు నియమిత కాలములో , (ఒక సంవత్సరము లేదా అంతకు పైగా) వేయి , లక్ష , కోటి , మున్నగు సంఖ్యాపరిమితిలో లిఖించి తన యభీష్ట సిద్దిని బడయవచ్చును. భగవత్సాక్షాత్కారము నందవచ్చును. ఇట్టి నియమమున బద్దుడైన భక్తునికి కొన్ని సద్గుణములుండవలయును. సత్యశాంతి దయాది సచ్చీలములలపరచు కొనవలయును.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat