అయ్యప్ప సర్వస్వం - 33

P Madhav Kumar


*శరణాగత వత్సలుడే శరణమయ్యప్ప - 1*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


భగవంతుని అనుగ్రహము బడయుటకు శరణాగతి యొక్కటే సరియైన మార్గమనునది మన ఆర్యుల సిద్ధాంతము. భక్తుని నిర్మలమైన , అచంచలమైన , శరణాగతివలన భగవంతుడు సంతుష్టుడై అతన్ని ఏలుకొంటాడు అను నానుడి ప్రకారము మనము పట్టే పాదములు భగవంతునిదిగానే యుండవలెయును. అదియు పట్టువిడవకయుండవలెను. *స్వామి అయ్యప్ప , శరణాగత ప్రియుడు.* అందున ఈ కలికాలములో తనను పిలిచిన వారికి పిలిచిన క్షణమే ప్రసన్నమై అనుగ్రహించి , పాలించే శరణాగత వత్సలుడుడాయన. అటులైనచో విష్ణుమూర్తినో , ఈశ్వరునో శరణంపొందిన చాలదా ? యను ప్రశ్నను.


*జ్ఞానం షడస్సవరదాతకృపైకలభ్యం మోక్షస్తు తార్ క్ష్యవరవాహ కృపైక లభ్యః |*

*జ్ఞానం చ మోక్షమభయంతు వినాశ్రమేణ ప్రాప్యం జనైః హరిహరాత్మజ సత్ప్రసాదాత్ I*


షణ్ముఖుని తండ్రియగు ఈశ్వరుని కృపవలన జ్ఞానము పొందవచ్చును. గరుత్మంతుని వాహనముగా గొనిన శ్రీమన్నారాయణుని దయవలన మోక్షము పొందవచ్చును. జ్ఞానమోక్షకాములు వీరిరువురిని వేరువేరుగా పూజించి , మెప్పించి ఫలితం పొందుట యన్నది అంత సులభసాధ్యము కాదు , కావున వీరిరువురి కలయికలో ఆవిర్భవించిన , *హరిహరపుత్ర , ధర్మశాస్తా వారిని శరణుకోరి మ్రొక్కినచో శ్రమము లేక భక్తజనులు జ్ఞాన మోక్షముతో బాటు వైరాగ్యమును కూడా పొందవచ్చునని జగద్గురువులు శృంగేరి శారదాపీఠాధిపతులు శ్రీశ్రీ పరాతీర్థ స్వాములవారు శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకొనిన తరుణాన ఆదేశించియున్నారు.*


*రుద్రస్యప్రభవోవిష్ణుః విష్ణోస్యప్రభవ శ్శివః*


శివకేశవులకు బేధములేదు. శివుడు విష్ణువు నుండియు విష్ణువు శివుని వద్ద నుండియు ఆవిర్భవించియున్నారు. ఒకే పరబ్రహ్మ తత్వము , లోకములో రెండు రూపములుగా కనిపించి పాలించు చున్నది. వారిరువురి సంగమములో ఆవిర్భవించిన అయ్యప్ప ధర్మశాసితుడై , కలిలోధర్మాన్ని నెలకొల్పుట కొరకై భువిపై అవతరించి నాడని పురాణములు వెల్లడి చేయుచున్నది. పరబ్రహ్మమొక్కటే. ఆ నిర్గుణ పరబ్రహ్మము భక్తుల ఆరాధనా స్థితిగతులకు , ఆశలకు తగినట్లు సరూపిగాను , అరూపిగానూ సగుణ సాకారుడై ఎనలేని దేవతామూర్తులుగాను , నిర్గుణ నిరాకారుడై ఇందుకలదండులేదను రీత్యా సర్వమునందు నిండియున్నవాడై గోచరించుచున్నది. *'స్వామియే శరణం అయ్యప్ప'* ఇదియే శబరిమల యాత్రీకుల తారక మంత్రము. వారి మాటలలోను , ప్రవర్తనలోను , తలంపులోను సర్వకాల సర్వావస్తలలోను ఉచ్చరించి తరించే నామమిదియే . మంత్ర తంత్రములు , పూజావిధులు , భజన పద్ధతులు తెలిసిన వారైనను , ఇవన్నియు తెలియని పామరులైనను మాలధరించినచో యెడతెగక ఉచ్చరించే ఒకే యొక తారకమంత్రము ఈ స్వామి శరణనామ జపమే. పై తారకమంత్రములో అంతమహిమ నిండియున్నదా ? వాటిలోని పరమార్థ తత్వసారమేమిటో తెలుసు కొందాము.


'స్వా' అను అక్షరమును ఉచ్చరించుటకు పెదవి విప్పిన వెంటనే హృదయాంతర్గతముగా యుండు ఆత్మ , ఉసిగొలుపబడి తేజోమయమైన కాంతి ప్రభలను విరజిమ్మును. అనగా అజ్ఞాన మనబడు చీకటి పారిపోవును. *"ఈ ఆత్మయే సర్వహృదయాం తర్గతములోను కోలగొనియున్న మంగళ స్వరూపమగు శివస్వరూపము."* సకల జీవరాసుల యందును జీవమై వెలుగే మంగళ స్వరూపుడైన శివుడు. మాయను అధిష్ఠానముగా గొని పంచభూతాత్మకమైన ఈ సువిశాల సృష్టినిగావించి , త్రిగుణము లనబడు అజ్ఞాన స్వరూపిణియైన ప్రకృతికాంతమాయా వాగురములలో జీవులను ముంచి లేవనివ్వక బ్రష్టబద్దుల గావించు చున్నాడు. అటువంటి త్రిగుణములగు సత్వగుణ , రజోగుణ తమో గుణములను ఆధీనపరచుకొని ప్రకృతి కాంతను శివస్వరూపము లలో ఐక్యముగావించి అజ్ఞానాంధ కారమును తొలగించగలిగినది అనునదియే 'స్వామి' అనుపద ఉచ్ఛారణకు సూక్ష్మార్థము. దీనిని పలుకుటవలన జీవులకు శుభము కలుగుచున్నది.


'శ' అను అక్షరమునకు శత్రు సంహారమని అర్థము. అనగా మనయెడ యుండేటి కామక్రోదాధులనబడు అరిషడ్వర్గములుగు శత్రువులను సంహరింపగలదు. ఈ "శ" అను అక్షరము. 'ర' అను అక్షరమునకు జ్ఞానమును ప్రసాదించగలిగినది అనునదియే సారము. అనగా రాగద్వేషరహితుడు జ్ఞానియగుచున్నాడు. 'ణ' అను అక్షరమునకు శాంతమును ప్రసాదించగలిగినది. అని తాత్పర్యం. అనగా కామక్రోధరహితుడైన జ్ఞానివద్ద ఎల్లవేళల శాంతమునెలకొని యుండును. 'ముద్రా' అనగా భవబాధలను తీర్చగల్గినది అని తాత్పర్యము. అనగా కర్మబంధ ఋణములను తీర్చగలిగినదియు , శ్రీస్వామివారికి మిక్కిలి సంతోషమును కలిగించునది అని సారము. దీనిని వినయముతో మాత్రమే పొందగలము.


కనుక శాస్త్రృముద్రాయని చెప్పబడు *'స్వామిశరణం'* అను వాక్యము ఎవరి వద్ద నుండి వెలువడుచున్నదో వారిముఖము లక్ష్మీకటాక్షము పూరితమై యుండును. వారు విద్యాసంపన్నులై , ధైర్యసాహసము నిండిన వినయశాలులై ప్రవర్తించెదరు. నీటిలో క్షణమైనా నిలకడలేక తిరుగులాడు మత్స్యమువలె ఓలలాడు మనస్తత్వము నిండిన చపల చిత్తులైన ఈ కలికాలపు మానవులు సద్గతిపొందుట కొరకు మహిమోపేతమునిండిన ఈ దివ్యమంత్రమును అలనాటి ఋషిశ్రేష్ఠులు ఉపదేశించియున్న వచనములను మరవక సదా స్వామి శరణనామములను జపిస్తూ శ్రీస్వామి వారిని శరణువేడి సద్గతి పొందుటకు కృషిచేయవలెను. స్వామి శరణం అను తారకమంత్రమును నాభికమలమునుండి బయలుదేరు ప్రాణ వాయువును హృదయ మార్గముగా పయనింపజేసి నాలకపై శబ్దముగా పలుకింపజేయవలెను.


భగవంతుడు సర్వహృదయాంతర్గతామియై నెలకొని , అందరిని నడిపించువాడు అనుటలో సందేహము లేదు. అందువలననే భగవంతుని *'భక్తహృదయకమలవాసి'* యని గూడ అందురు. గుణరహితుడైన భగవంతుని శరణము వేడుచున్నాను. అని ప్రార్థించుకొంటారు. శరణం అనగా ఎవ్వరి అండదండను కోరితే , ఎవ్వరి పదకమలములను పట్టుకొంటే నిర్భయముగా యుండ వచ్చునో , అట్టివాని నీడ చేరి , కోర్కెలను విన్నవించి , ఆతడు మనలను కాపాడుతాడని నిశ్చింతగా యుండుటయే శరణాగతి పొందుట అందురు. మన బాహ్య శత్రువులను గెలుచుటకు బలవంతులను కాని మనలోనే అంతర్గతమై యుండు రాగద్వేషాదులనబడు శత్రువులను ఎవరిసాయముతో గెలువగలము. సర్వ శక్తి సంపన్నుడైన భగవంతుని ఆశ్రయిస్తేనే ఇహమాయలో చిక్కుకొని బాధపడక సద్గతిపొందుట సాధ్య మగును. ఈ తత్వమునే శరణాగతి యని పెద్దలందరు.


మన ఆశక్తతను , భగవంతుని పరిపూర్ణత్వమును గ్రహించి , అహంభావ రహితులై , అంతాభగవదేచ్చయను స్థితికి ఎదిగి భక్తితో సర్వేశ్వరుని నమ్ముకొని యుండునపుడే శరణాగతి పూర్ణత్వము నిండిన తీరును. స్వామియే శరణం అయ్యప్పా యని యెడ తెగక పిలుచుటలో ఆనందము చెంది అయ్యప్పా నీవే శరణము అని యున్నాను. *సర్వకాల సర్వావస్థల యందునూ నిన్నే ఆశ్రయించి యున్నాను. నా సుఖదుఃఖములు , జయాపజయములు అన్నియు నీ అనుగ్రహమువలననే నాకులభించుచున్నవి. నీటముంచినా పాలముంచినా నీదేభారము అయ్యప్పా. నీపదకమలము తప్పనాకు అన్యగతిలేదు. అని మనసావాచా కర్మణా ప్రార్థించి మ్రొక్కుటయే ఇందులోని పరమార్ధము.* 


*అనన్యాశ్చింతయంతో మాంయేజనాః పర్యుపాసతే |*


*తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ॥  - భగవద్గీత*


అను భగవద్వచనమును పూర్వమే గ్రహించినట్లు. పరమాత్మధ్యానమున , లయించి , ఏకాదశి ఉపవాసముండి , ద్వాదశి పారణము చేయు తరుణాన అతిథిగావచ్చియున్న దుర్వాసమునిని సత్కరించుటకు మరచి , భగవధ్యానములో నిమఘ్నమై యుండిన అంబరీషుని మహర్షి శపించెను. తనువు మరచి నన్నే ధ్యానించు చుండిన తరుణాన నాభక్తునికి నీవిచ్చిన శాపము ఆతన్ని కట్టు పరచజాలదు. కావున నేనే ఆ శాపములను స్వీకరించెదనని , ముని

శాపమును స్వీకరించి , మత్స్యకూర్మాదులనబడు దశావతారములను దాల్చి తన శరణాగత తత్వమును లోకులకు చాటి చెప్పియున్నాడు. భగవంతుడు.


తనను శరణాగతి పొందిన విభీషణుడు తనభార్యను అపహరించుకుపోయిన రావణసోదరుడే ఐనను అతనికి గూడ అభయమొసగి కాపాడి శరణాగతి తత్వమును మరింత మెరుగుపరిచినాడు శ్రీరామచంద్రుడు. 


సభామధ్యమున ద్రౌపది యొక్క చీరపట్టి లాగాడు దుశ్శాసనుడు. భరింపరాని అవమానము చెందిన పాంచాలి మానాన్ని కాపాడుకొనుటకు తనరెండు కరములతో చీరను గట్టిగా పట్టుకొనెను. రక్కసుని బలము ముందు అబలయొక్క బలము ఎంత మాత్రం. తనభర్తలను సాయపడమని ప్రాధేయపడినా వారు అశక్తులై కూర్చొని యుండి పోయినది గాంచిన ద్రౌపది శరీరము మనస్సు ఒక సారిగా క్రుంగి కృశించి పోయెను. తన మానము ఈ సభామధ్యమున పోవుట ఖాయమని గ్రహించినపుడు , తాను ఏమియు చేయలేని ఆశక్తురాలని  తెలియగానే కృష్ణుని జ్ఞాపకము వచ్చినది.


*తనను కాపాడకలిగిన పరమాత్మ గుర్తుకు రాగానే నూతన బలము తెచ్చుకొని , తనువు మరచి , పరిసరము మరచి , చీరపట్టు వదలి మానము పోవునన్న సంగతిని గూడ మరచి కరములు పైకి జోడ్చి , కృష్ణా , ఆపద్భాంధవా , అనాథరక్షకా ! నీవేశరణం ! అనన్య "* శరణము నాకు లేదు. ఈ దీనురాలిమానప్రాణములను కాపాడదిగి రావా యని దీనార్తిగా ప్రార్థన చేసెను. మహదాశ్చర్యమును క సభాప్రముఖులు పొందురీత్యా దుశ్శాసనుడు చీరను లాగుతుండగా కొరత లేక అక్షయ వస్త్రము వచ్చుచునే యుండెను. దుశ్శాసనుడు అలసి పోయి క్రిందపడెను. నిండుసభలో ద్రౌపది " మానము పరమాత్మునిచే కాపాడబడెను. భగవంతుడు శరణాగత - వత్సలుడనుటకు ఇంతకన్నా చక్కని తార్కాణము కావలయునా ?


*మరికొంత భాగము రేపు చదువుకుందాము*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat