*శ్రీదేవీభాగవతము - 34*

P Madhav Kumar


*తృతీయ స్కంధము - 13*

                     

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 34*


*హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధిః!*

*శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖపంకజా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*శశికళా సుదర్శనుల పరిచయం* రెండవ భాగం చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

*సుదర్శన-రాజపుత్ర సంవాదము*

 చదువుకుందాం......

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


శశికళ స్వయంవరం గురించి ఆమె తండ్రి,  సుబాహుడి అభిప్రాయం విన్నాక రాకుమారులు మళ్ళీ సమాలోచనలు జరిపారు. ఈసారి మదర్శనుణ్ణి పిలిపించారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు, రాకుమారులు, ప్రశ్నించారు.


ఈరోజు.....


*సుదర్శన - రాజపుత్ర సంవాదం* 


*రాజపుత్రా!* ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అదీ ఒంటరిగా ఎందుకు వచ్చావు నీకు సైన్యం లేదు, సచివులు లేరు, కోశం లేదు. బాహుబలం లేదు. ఏమి చేద్దామని వచ్చావు కన్యామణి కోసం యుద్ధం జరగబోతోంది. మేమంతా సేనాసమేతులమై వచ్చాం. చూస్తున్నావుగా. మరి నీమాట ఏమిటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు. మహాసైన్యంతో వచ్చాడు. అతడికి సహాయంగా తాతగారు యుధాజిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాం. ఇందులో దాపరికం ఏమీ లేదు. తేల్చుకో. ఉంటావో వెడతావో నీ ఇష్టం. నీకా సైన్యం లేదు. ఒంటిగాడివి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి. అదేదో త్వరగా చెప్పు.


*రాకుమారులారా!* నిజమే. మీరన్నట్టు నేను ఒంటిగాడినే. నాకు సైన్యం లేదు. బలం లేదు. కోశం లేదు. మంత్రులు లేరు. సహాయకులు లేరు. ఏదీ లేదు, ఎవ్వరూ లేరు. స్వయంవరం విని చూసి పోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవీ రూపంలో కనిపించి వెళ్ళిరమ్మంది, వచ్చాను. ఇంతకన్నా నాకు ఇక్కడ చెయ్యవలసిన పని ఏదీ జగదీశ్వరి చెప్పలేదు. ఆవిడ ఏమి సంకల్పించిందో అది జరుగుతుంది. జరిగి తీరుతుంది. సందేహం లేదు. రాజపుత్రులారా! ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు. అంతటా జగదంబికనే చూస్తున్నాను. ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏమి చెయ్యాలో ఆ తల్లి చూసుకుంటుంది. నాకుమాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలీదు.  ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చింత ఏమిటి! దేవతలకూ సమస్త ప్రాణికోటికీ శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాతయే. ఆవిడ రాజును చెయ్యదలుచుకుంటే ఎంతటి నిరు పేదనైనా నిర్ధనుడినైనా క్షణంలో అందలం ఎక్కిస్తుంది. దీనికి తిరుగులేదు. నాకు దిగులు ఎందుకు, చింత ఎందుకు! నేనేమీ అసత్యం చెప్పడం లేదు. బడాయికాదు. నిజంగా నేను విశ్వసించినది చెబుతున్నాను. హరిహరాదులైనా ఆ శక్తి అనుగ్రహం లేనిదే అడుగు కదపలేరు. నేను అశక్తుణ్ణో, సశక్తుణ్ణో. ఏదయితే అది. దానికేమి గానీ, నేను ఈ స్వయంవరానికి రావడం మాత్రం కేవలం ఆ జగజ్జనని ఆజ్ఞవల్లనే. ఆవిడ ఏమి చెయ్యాలనుకుంటోందో అది చేస్తుంది. నాకైతే ఏ ఆలోచనా లేదు. ఏ బెంగా లేదు. ఏ ఆశా లేదు.


జయపరాజయాలు రెండూ సమానమే. పొంగను. కుంగను. అణువంతైనా సిగ్గుపడను. మధ్యలో వాకెందుకు ఈ గోల! సిగ్గుపడాల్సివస్తే ఆవిడే పడుతుంది. వేనున్నది ఆవిడ అధీనంలోనే కదా మరి!


ఈ ప్రసంగంతో రాకుమారుల మనస్సులలో ఒక పరివర్తన వచ్చింది. తమలో తాము వితర్కించుకున్నారు. కొంత సేపు చర్చించుకున్నారు. కడపటికి ఇలా అన్నారు.


*సాధుపురుషా!* నువ్వన్నది సత్యం. మేమంతా నీమాట నమ్ముతున్నాం. కానీ యుధాజిత్తు నిన్ను సంహరించాలి అనుకుంటున్నాడు. నీమీద సద్భావంతో ఈ మాట చెబుతున్నాం. అటు పైని నీ ఇష్టం. నీ మనస్సుకి ఏది తోస్తే అది చెయ్యి.


*మిత్రులారా!* నామీద దయతలచి నిజం చెప్పారు. సంతోషం. కానీ, *మృత్యువు అనేది ఎవరికిబడితే వారికి ఎప్పుడుబడితే అప్పుడు ఎవడుబడితే వాడు ఇవ్వగలిగిందీ ఇప్పించగలిగింది కాదు. ఈ జగత్తంతా దైవాధీనం. చావుపుట్టుకలు దైవాధీనాలు. ఏ జీవుడూ తనకుతాను నిర్ణేతకాడు. స్వతంత్రుణ్ణి అనడానికి ఎవరికీ వీలులేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తుంటాయి. తత్త్వం తెలిసిన పండితులు కర్మను మూడువిధాలుగా విభజించారు. సంచితం, వర్తమానం, ప్రారబ్ధమని వాటి పేర్లు. జగత్తు అంతా కాలకర్మ వశంగా నడుస్తోంది. కాలం మూడనిదే దేవుడైనా మానవుణ్ణి చంపలేడు. హతుడూ హంతకుడూ నిమిత్త మాత్రులు. కాలం సనాతనం. అదే కర్త.* 


మా తండ్రిగారిని అడవిలో సింహం చంపింది. అలాగే మా తాతగారిని (శూరసేన మహారాజు) యుధాజిత్తు సంహరించాడు. వీరిద్దరూ నిమిత్తమాత్రులు. కాలమే వారిద్దరినీ తీసుకుపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కాలయోగం కలసిరాకపోతే ఎవడూ బతకడు. కలిసివస్తే ఏ ప్రయత్నమూ లేకపోయినా ఎన్ని ఆపదలు ఎదురైనా వేల సంవత్సరాలు జీవిస్తాడు.


కాబట్టి నేను యుధాజిత్తుకి భయపడేది లేదు. దైవమే పరతత్త్వమనీ సర్వోత్కృష్టమనీ దృఢంగా నమ్మి స్థిరంగా ఉన్నాను. స్తిమితంగా ఉన్నాను. దేవీ నామస్మరణం నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది. ఏది అశుభమో అది తొలగిస్తుంది. సంచిత కర్మం (పూర్వార్జితం) ఏదయినా శుభం కానీ అశుభం కానీ అనుభవించాల్సిందేకదా! అది మనం చేసుకున్నదే. మనం చేసుకున్నదానికి మనం దు:ఖించడమేమిటి! ఒక్కసారి ఆలోచించండి. స్వకర్మఫలంగా దుఃఖాన్ని పొంది, పైకి కనిపించే నిమిత్త కారణంమీద వైరం పెట్టుకోవడం (శత్రుత్వం పెంచుకోవడం) తెలివితక్కువతనం కాదూ! 


అందుచేత, సవయస్కులారా! నాకు వైరమూ దుఃఖమూ భయమూ ఇలాంటివి తెలియవు అందుకే నిర్భయంగా నిశ్శంకంగా మీ మధ్యకు వచ్చాను. స్వయంవరం చూడటానికి ఒంటరిగా వచ్చాను చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను. కానివ్వండి. జరగవలసింది జరుగుతుంది. నాకు ఆ దేవియే ప్రమాణం. మరొకటి ఏదీ నాకు తెలియదు. ఆవిడ సుఖాలు ఇస్తే సుఖాలు, దుఃఖాలు ఇస్తే దుఃఖాలు అంతే, మరోలా జరగదు. యుధాజిత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి. నాకు అతడితో వైరం లేదు. ఒక వేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గఫలం అనుభవిస్తాడు.


*జనమేజయా!* సుదర్శనుడి ప్రసంగానికి రాకుమారులందరూ సంతృప్తి చెందారు. ఎవరి విడిది మందిరాలకు వారు వెళ్ళిపోయారు. మరువాడు శుభముహూర్తాన సుబాహుడు వీరందరినీ స్వయంవర మండపంలోకి ఆహ్వానించాడు. విశాలమైన సభాప్రాంగణం. సర్వాంగసుందరంగా అలంకరించారు. పైని చమ్కీల చాందినీలు. చుట్టూ రకరకాల పూలదండలు. అగరు ధూపాలు. నేల అంతటా విలువైన తివాసీలు. స్వయంవర సభామండవం సుగంధ పరిమళాలతో ఘుమఘుమలాడుతోంది. అటూ ఇటూ సూత్రపట్టినట్టు పరస్పరాభిముఖంగా సముచిత సువర్ణ సింహాసవాలు. వాటిపై మణిఖచిత మహాస్తరణాలు. బాలీసులు. పాదపీఠికలు. ఇరువైపులా రత్నాభరణాల మృదురవాలతో వింజామరలు వీస్తూ సుందరాంగులు. మధ్యలో కంబళీ పరిచిన విశాలమైన నడవ.


రాకుమారులు సర్వాభరణ భూషితులై ఒక్కరొక్కరే ఠీవిగా వస్తున్నారు. ముఖద్వారం దగ్గర చేటీగణపరివృతులై ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. సాదరంగా తోడ్కొని వచ్చి నియతపింహాసనాలను అలంకరింపజేస్తున్నారు.


సింహాసనాలలో రాకుమారులు - దివ్యవిమానాలలో దేవతల్లా విరాజిల్లుతున్నారు. కన్యామణి ఎప్పుడు వస్తుందా, ఎవరిని వరిస్తుందా, భాగ్యశాలి ఎవరా అని ఆశగా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సుదర్శనుడి మెడలోవే కనక దండవేస్తే వివాదం చెలరేగకామానదు, యుద్ధమూ తప్పదు అని మనస్సులలో మల్లగుల్లాలు పడుతున్నారు.


మంగళవాద్యఘోష ఒక్కసారిగా మిన్నుముట్టింది. సఖీజనం వెంటరాగా కాశీ రాజపుత్రి శశికళ - శశికళలాగా వేదిక పైకి వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడింది. అభ్యంగనస్నానం చేసిన కురులు తుమ్మెదరెక్కల్లాగా కదలాడుతున్నాయి. సన్నని మేల్ముసుగులోంచి రత్నాభరణాలు మిలమిలలాడుతున్నాయి. క్షౌమవాసో విరాజిత శరదిందుచంద్రికలా ఉంది. మధూకమాలిక పట్టుకుని నిలబడింది. వివాహోచితమైన అలంకరణతో సాక్షాత్తు క్షీరసముద్రరాజతనయలా ఉంది. రవ్వంత చింతావ్యాకులితచిత్తయై కనిపిస్తోంది. సుబాహుడు మృదుగంభీరంగా పలికాడు.


*సౌభాగ్యవతీ! శశికళా!* మండపమధ్యభాగంలోకి పద. అటూ ఇటూ బారులుతీరి భూపతులు బంగరు గద్దెలపై విరాజమానులై ఉన్నారు. చూడు. మన ఆహ్వానం మన్నించి వివిధ దేశాలనుంచి విచ్చేశారు. అందరూ గుణవంతులు. రూపవంతులు. ఉత్తమ క్షత్రియ వంశాలలో పుట్టినవారు. వీరిలో నీ మనస్సుకి నచ్చిన రాకుమారుణ్ణి వరించు తల్లీ! నీ ఇష్టమే ఇష్టం. ఇది ఇచ్ఛా స్వయంవరం - అన్నాడు.


మితభాషిణియైన శశికళ తండ్రితో లలితంగా సంభాషించింది. 


*తండ్రీ!* ఈ రాకుమారుల దృష్టిపథంలోకి నేను వెళ్ళను. క్షమించు. అది వేశ్యలపని. కాముకులై వీరంతా నన్ను ఆబగా చూడటం నేను భరించలేను. వరుడు కాదగిన వ్యక్తి ఎవరో అతడు ఒక్కడే నన్ను చూడాలి. అందరూ చూసేట్టయితే నా సతీత్వం ఏమవ్వాలి? ఇది ధర్మశాస్త్ర విరుద్ధం కాదా? నన్ను చూసి వీరంతా మనస్సులలో ఏమి సంకల్పించుకుంటారో ఏమేమి ఊహించుకుంటారో మనం గ్రహించలేమా! దండపట్టుకుని స్వయంవర సభా మండపంలోకి కన్యకామణి వెళ్ళింది అంటే ఆ క్షణంలో కులట (వేశ్య) అయిపోయినట్టే. వారస్త్రీ విపణివీథికి వెళ్ళి అక్కడ వేచివున్న పురుషులను పరిశీలించి గుణాగుణాలను ఎలా తెలుసుకుంటుందో ఇదీ అంతే కదా స్థిరచిత్తం లేని వేశ్య కాముకుల్ని చూసినట్టు నేను వీరందరినీ తిలకించనా? 


స్వయంవరం అంటూ ఏ పెద్దలు ఎప్పుడు ఈ ఆచారం పెట్టారోగానీ ఇదినాకు సుతరామూ ఇష్టం లేదు. నేను దీన్నిప్పుడు తిరస్కరిస్తున్నాను. నాకు కావలసింది వేశ్యాత్వం కాదు, పత్నీత్వం.


*తండ్రీ!* నేను సుదర్శనుడికి మనసిచ్చాను. సర్వాత్మనా వరించాను. అతణ్ణి తప్ప మరెవ్వరినీ పరిణయమాడను. నా శుభం కోరేవాడవైతే మంచి ముహూర్తం పెట్టించి వివాహవిధిగా నన్ను అతడికి కన్యాదానం చెయ్యి.


*(అధ్యాయం - 20, శ్లోకాలు -71)*


శశికళా ప్రసంగానికి సుబాహుడు మనస్సులో సంతోషించాడు. యుక్తియుక్తంగా ఉంది అనుకున్నాడు. కానీ, ఇప్పుడు ఏం చెయ్యాలి? రాకుమారులంతా వచ్చి కూర్చున్నారు. మా అమ్మాయి మీ మధ్యకురాదని ప్రకటిస్తే ఊరుకుంటారా? తిరగబడతారు. నన్ను చంపుతారు. అందరూ సేనాసమేతులై వచ్చారు. ఘోరయుద్ధం జరుగుతుంది. నాకా అంతటి సైన్యబలం కానీ దుర్గబలంకానీ లేదు. అందరినీ ఒక్కసారిగా ఎదిరించాలంటే అసంభవం. పోనీ సుదర్శనుడు సహాయపడతాడు అనుకుందామా అంటే అతడు ఒంటరివాడు. అసహాయుడు. నిర్ధనుడు. పైగా పిన్న వయస్సువాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏది దారి? అయ్యో, కోరి కోరి దుఃఖసాగరంలో మునిగానే.


చాలా సేపు మధనపడి మధనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ, ఏదయితే అది అవుతుంది అనుకున్నాడు. ధైర్యం కూడగట్టుకున్నాడు. గట్టిగా గుండెలనిండా గాలి పీల్చుకుని సభామండప మధ్యభాగంలోకి వెళ్ళాడు.


శశికళ ఎంతకీ వేదిక దిగిరాదేమిటా అని ఎదురుచూసి, తండ్రీ కూతుళ్ళు చెవులు కొరుక్కుంటున్నదేమిటో (మంగళవాద్యఘోషలో వినపడక) అర్ధంకాక, నిరీక్షణకు విసిగిపోయి కొందరు రాకుమారులు సహనం కోల్పోతున్నారు. మరికొందరు తమకు తాము సర్దిచెప్పుకుంటున్నారు. వేదిక దిగివచ్చే సుముహూర్తం కోసం వేచి ఉన్నారు కాబోలు అనుకుంటున్నారు.


రాజబృందం మధ్యలోకి వచ్చిన సుబాహుడు అన్నివైపులకూ తిరిగి అందరికీ సవినయంగా శిరసువంచి నమస్కరించాడు. 


*రాకుమారులారా!* ఏం చెయ్యను. సభామండపంలోకి మా అమ్మాయి రానంటోంది. ఎంతచెప్పినా వినడం లేదు. నేను చెప్పాను. తల్లి ఎంతగానో చెప్పింది. అయినాసరే ససేమిరా అంటోంది. క్షమించండి. మనసారా నన్ను క్షమించండి. మీకందరికీ పేరు పేరునా శిరసా పాదాభివందనాలు చేస్తున్నాను. మీ దాసుణ్ణి.


దాసుడి తప్పులు దండంతో సరి. మదర్పిత చందనతాంబూలాది సత్కారాలు ప్రేమతో స్వీకరించి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యండి. రత్నాలూ ఏనుగులూ వస్త్రాలూ పుష్కలంగా సమర్పించుకుంటాను. సంతోషంగా స్వీకరించండి. మరొక్కసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మనసారా మన్నించండి. నాకూతురు నామాట వినడం లేదు.


కాదని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో! అప్పుడింక వా దుఃఖానికి అంతు ఉంటుందా? ఒక్కగానొక్క కూతురు. మీరంతా కరుణావరుణాలయులు. మహానుభావులు. దయచేసి నన్ను అర్ధం చేసుకోండి. కన్నకూతురు ఇంత మొండికేస్తుందని నేననుకోలేదు. మందబుద్ధి. దీనితో ఏమిటిగానీ, మీరంతా పెద్దమనసుతో నన్ను క్షమించండి. మీ పాద దాసుణ్ణి. నా కూతురిని మీ కూతురుగానే భావించండి. దీవించండి. మీ తిరుగుప్రయాణాలు సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను.


సుబాహుడి అభ్యర్థనను భూపతులందరూ అంగీకరించారు. ఇంతకన్నా ఏమి చేస్తాడులే పాపం అనుకున్నారు. సింహాసనాలనుంచి లేచారు. 


ఒక్క యుధాజిత్తు మాత్రం క్రోధ తామ్రాక్షుడు అయ్యాడు. చెట్టంత ఎత్తు లేచాడు.


*మూర్ఖుడా!* ఇంత తప్పుచేసి ఇంకా మాట్లాడతావేమిటి? సంశయంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు? మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు? ఇప్పుడు మాదారిన మేము పోవాలా? ఇంతగా మమ్మల్ని అవమానించి నీ కూతుర్ని సుదర్శనుడికి కట్టబెడతావా? ఏ పనైనా చెయ్యబోయేముందు బాగా ఆలోచించుకోవద్దూ! బుడుగూ బుడుగూ పిలవగానే సరిపోయిందా? ఇప్పుడు మీ అమ్మాయిని సుదర్శనుడికి ఎలా ఇస్తావో చూస్తాను. పాపాత్ముడా! ముందు నిన్ను చంపి సుదర్శనుణ్ణి చంపుతాను. నీ కూతుర్ని నా మనమడు శత్రుజిత్తుకి ఇచ్చి ఇప్పుడే ఇక్కడే తాళికట్టిస్తాను. ఎవడు అడ్డంవస్తాడో చూస్తాను. ఆ పుడుంగిగాడు సుదర్శనుడు ఏపాటి? భరద్వాజాశ్రమంలోనే వీణ్ణి మట్టుపెట్టి ఉందును. ఆవేళ మహర్షి అడ్డం పడ్డాడు కనక బతికిపోయాడు. ఇవ్వేళ ఎలా తప్పించుకుంటాడో చూస్తాను.


నీకు అయిదు నిమిషాలు సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీ భార్యతో మంత్రులతో సంప్రదించు. శశికళను శత్రుజిత్తుకిచ్చి వివాహం జరిపాంచావో సంబంధీకుడవు అవుతావుగనక బతికిపోతావు. లేదంటే - ఇంతే సంగతులు. ఆలోచించుకో. శుభం కోరుకునేవాడెవడైనా తనకంటే గొప్పవారినీ ఉచ్చస్థితిలో ఉన్నవారినీ ఆశ్రయిస్తాడు. బంధుత్వం కలుపుకుంటాడు. అంతేగాని సుదర్శనుడిలాంటి దరిద్రుడికి నిర్ధనుడికి ఏకాకికి రాజ్యహీనుడికి పిల్లనిచ్చి పెళ్ళి చెయ్యడు. చేసి ఏమి బావుకుందా మనుకుంటున్నావు? పిల్ల సుఖపడుతుందా? నువ్వు బలపడతావా? రాజనీతి ఏం చెబుతోంది.? కులం చూడమంది. విత్తం చూడమంది. బలం చూడమంది. రూపం చూడమంది. రాజ్యం చూడమంది. దుర్గం చూడమంది. స్నేహితుల్ని చూడమంది. ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది. లేకపోతే సుఖం ఉండదంది. ఆ శ్లోకం చెబుతాను విను..


*కులం విత్తం బలం రూపం రాజ్యం దుర్గం సుహృజ్జనం |*

*దృష్ట్వా కన్యా ప్రదాతవ్యా నాన్యథా సుఖమృచ్ఛతి ||*


ఇది శాస్త్రం. నీతి శాస్త్రం. రాజనీతి శాస్త్రం. దీనికి తిరుగులేదు. ఆలోచించుకో. ఏది యోగ్యమో అది చెయ్యి. ఊరికే అనవసరంగా దిగులు పడకు. అధైర్యపడకు. మతిమంతుడివి, నాకు మిత్రుడివీ కనక ఇంతగా హితవు చెబుతున్నాను. కటువుగా మాట్లాడాననుకోకు. నీమేలు కోరినవాణ్ణి. వెళ్ళు. తీసుకురా మీ అమ్మాయిని. ఒక్క సుదర్శనుణ్ణి తప్ప ఎవరినైనా వరించమను. నాకు పేచీ లేదు. యుద్ధం లేదు. ఈ రాకుమారులంతా సామాన్యులా! కులీనులు. బలీయులు.


అన్నింటా అందరికీ సమఉజ్జీలు.


వాణ్ణి వరిస్తే వీరితో విరోధం ఎలా ఉంటుందో ఊహించుకో. మనకి విరోధం వద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. లేదంటే శశికళను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను. చూసుకో.


యుధాజిత్తు హెచ్చరికతో సుబాహుడికి చెమటలు పట్టాయి. ఒకవైపు అవమానం. మరొకవైపు బెదిరింపు. ఒకవైపు పుత్రికా ప్రేమ. మరొకవైపు కిం కర్తవ్యత. మానసికంగా నలిగిపోతున్నాడు. దేశవిదేశాలనుంచి వచ్చిన రాకుమారులూ రాజబంధువులూ తన ప్రజలూ ప్రేక్షకులూ - ఇందరి ఎదుట ఇదొక సన్నివేశం. గారాల కూతురి స్వయంవరం అల్లరి అవుతోంది. రేపు తల ఎత్తుకు తిరిగేది ఎలా? రేపటి సంగతి తరవాత చూద్దాం ఇప్పుడు ఈ మరుక్షణంలో ఏం జరుగుతుందో. ఎవరు ఏ సాహసానికి ఒడిగడతారో. యుద్ధమే చెలరేగుతుందేమో. యుధాజిత్తు అన్నంతా చేస్తాడేమో. సుబాహుడు బెంబేలు పడిపోతున్నాడు. ఏమీ తోచడం లేదు. కాలూ చెయ్యీ ఆడటం లేదు. ఎవరిని సలహా అడగడానికి మనసొప్పడం లేదు. అయినా ఏమని అడుగుతాడు. ఎవరు మాత్రం ఏమని చెబుతారు. 

యుధాజిత్తు చివరికి రెండేరెండు దారులు తెరిచి ఉంచాడు. సుదర్శనుణ్ణి తప్ప ఎవరినో ఒకరిని వరించాలి. లేదంటే ఆహవమో, అపహరణమో. మొదటి ఎత్తుగడతో రాకుమారులంతా యుధాజిత్తు వైపు నిలుస్తారు. రెండవది ఏమవుతుందో, ఎటు దారితీస్తుందో. అమ్మాయి చూస్తే సుదర్శనుణ్ణి తప్ప మరెవరివీ వివాహమాడనని ఖండితంగా చెప్పింది. లేదంటే ప్రాణాలు వదిలేస్తానంటోంది. బలవంతం చేసి ఇష్టంలేని పెళ్ళి ఎలా చెయ్యను ? దారీ తెన్నూ తోచలేదు. ఇక ఆలోచించలేకపోయాడు.


పొంగివస్తున్న దుఃఖాన్ని నిలువరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు. భార్యను అభ్యర్థించాడు. యుద్ధం తప్పేటట్టు లేదు. వా ప్రాణాలకే ముప్పు వచ్చేట్టుంది. అమ్మాయిని ఒప్పించమన్నాడు. అంతా నీ చేతిలోనే ఉంది అన్నాడు. నీ దాసుణ్ని, గండం గట్టెక్కించు అన్నాడు.


*(రేపు శశికళా మాతాపితృ సంవాదము)*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


.

🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat