నవగ్రహ పురాణం - 94 వ అధ్యాయం - శుక్రగ్రహ చరిత్ర - 6

P Madhav Kumar


*శుక్రగ్రహ చరిత్ర - 6*


శుక్రుడిలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఎవరో వస్తున్నారన్నట్టు అందెల సవ్వడి వినవస్తోంది. శుక్రుడు అటు వైపు తిరిగి చూశాడు. సన్నటి కాలిబాట ! తను తపస్సు కోసం వచ్చినప్పుడు కాలిబాట లేదు ! ఎవరో రోజుల తరబడి తిరగడం వల్ల ఏర్పడిన నూతన పాద పథం !


అందెల రంగా , తనకు దగ్గరగా వస్తోంది ! అందెల చప్పుడు తటాలున ఆగింది. శుక్రుడు ఆశ్చర్యంగా చూశాడు. అందెల సవ్వడి ఆగిన చోట ఆమె ఆగి ఉంది.


ఆమె... అప్పుడే సచేల స్నానం చేసి వచ్చిన సౌందర్యరాశి ! మంచు తెర వెనుక నుంచి కనిపిస్తున్న అగ్ని జ్వాలలా ఉందామె. తడిసిన వస్త్రాలలోంచి ఆమె నిలుచున్న కాలిబాట పక్కనే ఉన్న చెట్టును అల్లుకున్న తీగ వయ్యారంలో ఆమె శరీర లతికతో వోడిపోయినట్టు వాడిపోయి కనిపిస్తోంది !


నల్లటి శిరోజాలు , నల్లటి తెరలా ఆమె పిక్కలదాకా వేళ్ళాడుతున్నాయి. శిరోజాల కొసల్లోంచి నీటి ముత్యాలు జారుతున్నాయి. దిక్ చక్రాన్నంతనీ ఒకేసారి , ఒక్క చూపులో చూసి వేయడానికా అన్నట్టు ఆమె విశాల నేత్రాలు తామర రేకుల్లా చెవులను అందుకునేలా వ్యాపించి ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద కళ్ళు తన వైపు ఆశగా , ఆరాధనగా , నిర్భయంగా చూస్తున్నట్టు గమనించాడు శుక్రుడు. ఆమె చేతుల్లో తామరాకు దొన్నె ఉంది.


ఆమె మీద నుంచీ చూపుల్ని మరల్చుకోలేకపోతున్నాడు, శుక్రుడు. ఆమె అందంలో ఏదో బలమైన ఆకర్షణ ఉంది. కనురెప్పల్ని కదలనివ్వకుండా ఆపి , చూపుల్ని గొలుసులతో కట్టిలాగుతున్నట్టు లాగే ఆకర్షణ అది. ఆమె సౌందర్యం సాధారణ సౌందర్యం కాదు ! అది అలౌకిక సౌందర్యం.


ఎవరి అందాలరాశి ? శుక్రుడిలో మళ్ళీ ఉదయించిందీ ప్రశ్న. అందుకు సమాధానంగా అందెలు మ్రోగాయి ! ఆమె ఆయన వైపు అడుగులు వేస్తోంది. ఆమె నడక శరీరంలోని ఆకర్షక అవయవ భాగాలను సమ్మోహన కరంగా చలింపజేస్తోంది.


అందెల సందడి ఆగింది. ఆమె శుక్రుడి ముందు ఆగింది. ఆయన ముఖంలోకే చూస్తున్న పెద్ద పెద్ద కళ్ళ మీదికి నెమ్మదిగా వాలుతూ , అందమైన కనురెప్పలు ఆమె సిగ్గును కళ్ళకి కట్టాయి.


ఆమె తటాలున కిందికి వొంగింది. తామర దొన్నెలోని నీళ్ళను శుక్రుడి పాదాల మీద నెమ్మదిగా పోసింది. పాద ప్రక్షాళన జలాన్ని కుడిచేతి వేళ్ళతో తన శిరస్సు మీద చల్లుకుంది. మెల్లగా లేచి ఆయన ముఖంలోకి చూసింది.


*"సుందరీ... ఎవరు నువ్వు ?"* శుక్రుడు ప్రశ్నించాడు.


ఎర్రగా మగ్గిన దొండపళ్ళలా ఉన్న ఆమె పెదవులు కదిలాయి. వాటి వెనక దానిమ్మ గింజల్లాంటి చక్కటి పలువరుస....


*"జయంతి..."* అందామె క్లుప్తంగా. శుక్రుడు ప్రశ్నార్థకంగా చూశాడు.


*"తల్లి శచీదేవి , తండ్రి ఇంద్రుడు..."* జయంతి తానెవరో పూర్తిగా తెలియజేస్తూ అంది.


శుక్రుడు ఆశ్చర్యంగా చూశాడు. ఆయన నోరు కొద్దిగా తెరుచుకుంది. *"ఇంద్రపుత్రిక..."*


*"ఔను ! మీ తపస్సు భంగం చేయడానికి మహేంద్రులు నన్ను పంపించారు.... మిమ్మల్ని దర్శించాను. నా హృదయం మీకు మోకరిల్లింది. నా శరీరం అందుకు సమ్మతించింది. మనసూ , తనువూ , ఏకోన్ముఖంగా మీ పరిచర్యే చేశాయి. చేస్తూనే ఉంటాయి !"* జయంతి , మనసు విప్పి చెప్పి , మౌనాన్ని ఆశ్రయించింది.


*"నీ సేవలు అందుకుని , నీకు రుణపడ్డాను. ఏదైనా వరం కోరుకో , జయంతీ !"* శుక్రుడు సంతోషంగా అన్నాడు. ఇంద్రపుత్రిక తనకు సేవలు అందించింది. అది తన పరోక్ష విజయం


*"నన్ను... నన్ను... ధర్మపత్నిగా స్వీకరించండి !"* జయంతి ఆయన కళ్ళల్లోకే చూస్తూ అడిగింది.


శుక్రుడు క్షణకాలం ఆమెను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. తను పులోమ పుత్రుడు... రాక్షసుల గురువు ! తనకు కొన్ని నియమాలూ , నిబంధనలూ ఉన్నాయి. అవి తనకు తాను రూపొందించుకున్నవే ! తాను జయంతిని 'ధర్మపత్నిగా స్వీకరించలేడు ! వరమిస్తానని పలికి , ఇప్పుడు వాగ్దానభంగమూ చేయలేడు !


నియమ నిబంధనలలాగే తాను ఒక నీతినీ రూపొందించాడు ! ఆపద్ధర్మాన్ని అధికారికం చేసే అద్భుతమైన నీతి అది ! అది... అది 'శుక్రనీతి' ! శుక్రనీతిని అనుసరించి తను 'శక్రకన్య'ను స్వీకరిస్తాడు !


శుక్రుడు జయంతి వైపు చిరునవ్వు చిందించాడు. *"నిన్ను ధర్మ - పత్నిగా పరిగ్రహించలేను ! పత్నిగా స్వీకరిస్తాను..."*


*“స్వామీ...!”*


*"పది సంవత్సరాల పాటు నువ్వూ , నేనూ భార్యాభర్తలుగా సుఖసంతోషాలు అనుభవిస్తాం. మనం భార్యాభర్తలుగా జీవించినంత కాలమూ - అజ్ఞాతంగా ఉంటాం. దేవతలకూ , దానవులకూ - ఎవ్వరికీ కనిపించకుండా ఏకాంతంలో విహరిస్తాం. నీకు సమ్మతమైతే ఈ ప్రాతిపదిక మీద తాత్కాలిక పత్నిగా నిన్ను స్వీకరిస్తాను !"*


జయంతి రెప్పలెత్తి శుక్రుణ్ణి ప్రణయావేశంతో చూసింది. *"నేను మిమ్మల్ని వరించాను. మీ తపస్సు ఫలించాలనీ , మీరు నన్ను స్వీకరించాలనీ ప్రార్థిస్తూ సేవలు చేశాను. మీ నిబంధనను వ్యతిరేకించలేను. నన్ను... స్వీకరించండి !"*



శుక్రుడి ముఖం మీద చిరునవ్వు తాండవించింది. మెప్పుగా తల పంకించాడు. రెండు చేతుల్నీ ఎడంగా చాచాడు , ఆహ్వాన సూచకంగా. జయంతి మొదటిసారిగా సముద్రంలో కలుస్తున్న నదీ కన్యలా శుక్రుడి చేతుల మధ్య చేరి , ఆయన కంఠాన్ని తన చేతులతో కౌగిలించింది. శుక్రుడి పొడుగాటి చేతులు జయంతిని పొదివి పట్టుకొన్నాయి. సచేల స్నానం చేసి వచ్చిన జయంతి శరీరం చలువలో వేడిలాగా ఆయన శరీరాన్ని వెచ్చబరుస్తోంది.


మరుక్షణం ఇద్దరూ ఒక్కటిగా అంతర్ధానమయ్యారు.



*"మహేంద్రా ! జయంతి జయించింది ! ఒకరి చేతులలో ఒకరు ఇమిడిపోయారు. మరుక్షణం ఇద్దరూ అదృశ్యమయ్యారు ! పది సంవత్సరాల పాటు ఇద్దరూ ఎవ్వరికీ కనిపించరు. అజ్ఞాత దాంపత్యం. జ్ఞాననేత్రంతో నేను చూడగలిగిన మొదటి దృశ్యం , అంతిమ దృశ్యం ఇదే !"* బృహస్పతి అన్నాడు.


*"అయితే శుక్రుడి తపస్సు భగ్నమైనట్టేనా గురుదేవా ?"* ఇంద్రుడు ఆతృతగా అడిగాడు.


*"ఆ విధంగా అనుకోవడం సత్యదూరం కాకపోవచ్చు. జయంతి జయించకపోతే శుక్రుడు ఆమెను చేరదీయడు కదా ! ఇక మనం నిశ్చింతగా ఉండవచ్చు !"* బృహస్పతి తృప్తిగా అన్నాడు.


*"మరి మా పుత్రిక భవిత ఏమిటి, గురుదేవా ?"* శచీదేవి ప్రశ్నించింది.


*"శుక్రుడు మీ పుత్రికను స్వీకరించాడన్నది నిజం ! ఇద్దరూ ఒక్కటిగా అంతర్థాన మవడం కళ్ళారా చూశాను. తమ గర్భశత్రువైన ఇంద్రుడి కుమార్తెను గురువు స్వీకరించాడని తెలిస్తే అసురులు క్షోభిస్తారు గద ! అందుకే , రాక్షస శిష్యులకు కనిపించకుండా రహస్య దాంపత్యం నెరపడానికి నిర్ణయించుకుని , మీ పుత్రికతో అదృశ్యమయ్యాడని నా ప్రగాఢ విశ్వాసం !"* బృహస్పతి నిష్కర్షగా చెప్పాడు.


ఇంద్రుడు సతీమణి వైపు చిరునవ్వుతో చూశాడు. *"నిర్భయంగా ఉండు శచీ ! నీ గారాల కూతురు శుక్రుడిని అల్లుడిగా నీ ముందుకు పట్టి తెస్తుంది !”*


శచీదేవి చిరునవ్వు నవ్వి , లేచి మందిరం లోపలకి వెళ్ళిపోయింది. ఇంద్రుడు ఏదో చెప్పబోతూ బృహస్పతి వైపు చూశాడు. బృహస్పతి అర్ధనిమీలిత నేత్రాలతో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. కొన్ని క్షణాల అనంతరం బృహస్పతి రెప్పలెత్తి ఇంద్రుడి వైపు చూశాడు.


*"దేవరాజా ! శుక్రుడూ , జయంతీ పదేళ్ళపాటు అజ్ఞాతంలో ఉంటారు. అంటే అన్నేళ్ళ పాటు అసురులకు గురువు ఉండడు. అసురులకు అది బలహీన సమయం. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి”* బృహస్పతి ఉత్సాహంగా అన్నాడు.


*" యుద్ధం చేద్దామా , గురుదేవా ?”* ఇంద్రుడు ఆశగా అడిగాడు.


*"శుక్రుడు ఉన్నా లేకపోయినా , పులోమా భృగువులు సజీవంగా ఉన్నంతకాలం శ్రీమహావిష్ణువు సహాయం అందించినా సరే - మనం రాక్షసులు మీద విజయం సాధించలేమని తేలిపోయింది కదా , మహేంద్రా !"* బృహస్పతి నవ్వుతూ అన్నాడు.


*"ఔనౌను...మరిచాను !”* ఇంద్రుడు సిగ్గు పడ్డాడు.


*"ఇప్పుడు - గురు సహాయం లేని అసురులతో మనం చేయాల్సింది - అస్త్ర యుద్ధం కాదు, మేధో యుద్ధం !"* బృహస్పతి గంభీరంగా అన్నాడు.


ఇంద్రుడు ప్రశ్నార్థకంగా చూశాడు *“అంటే...?”*


*"శుక్రుడు అసురులకు అనునిత్యమూ దేవతల పట్ల అసూయాద్వేషాలను రగిలిస్తూ ప్రబోధిస్తాడు కద ! దానికి విరుగుడుగా పథకం నడపాలి !"* బృహస్పతి చిరునవ్వు నవ్వాడు.


*“వివరంగా చెప్పండి !"* ఇంద్రుడు అడిగాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat